చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Wednesday, September 9, 2009

శ్రీశైలం



ఆకులో ఆకునై ,
పూవులో పూవునై ,
నునులేత కొమ్మనై ,
ఈ అడవి సాగిపోనా ,
ఎటులైనా ఇచటనే ఆగిపోనా .

శనివారం రాత్రి 9 .30 కి మావారు ఫోన్ చేసి ,రమణ రేపు ఉదయము శ్రీశైలం వెళుదామంటున్నాడు వెళ్దామా ? అని అడిగారు .నేను సరే ఆన్నాను. పొద్దున్నే 7 గంటలకి మా వారు, నేను , మా వారి ఫ్రెండ్ రమణ గారూ , ఆయన భార్య రమ , వారమ్మాయి స్నేహ శ్రీశైలం కి కార్ లో బయిలుదేరాము. పది సంవత్సరాల క్రితం ,మా అబ్బాయి అత్తగారు, మామగారు ,క్రిష్ణవేణి గారు, రమణారావు గార్ల తో మొదటి సారి శ్రీశైలం వెళ్ళాము. ఆ తరువాత మా ఫ్రెండ్స్ తో కలిసి ఓ కార్తీక మాసము లో వెళ్ళాము. ఇది మూడోసారి. శ్రీశైలం ఒక సారి వెళ్ళినవారు మూడు సార్లు తప్పక వెళుతారట !

శ్రీశైలం దగ్గరికి చేరుతుండగా మావారు ,మనము ఎలాగూ 12 గంటల దర్షనానికి చేరుకోలేము ,ఇటువైపు ఉమామహేశ్వర దేవాలయం వుంది వెళుదామా అన్నారు. అది చాలా పురాతన మైన దేవాలయం. కొద్దిగా గుహలోకి వుంటుంది. పార్వతి దేవి ఇక్కడ మహేషునికై తపస్సు చేసిందిట. ఇది శ్రీశైలం కి ఉత్తరద్వారమట. లోపల అమ్మవారి గుడి , పక్కన శివుడి గుడి వున్నాయి.మేము రుద్రాభిషేకం చేయించాము. అమ్మవారి గుడి లో ఒక ఆవిడ కాషాయ వస్త్రాలు ధరించి పద్మాసనం లో కూర్చోని ధ్యానం చేసుకుంటోంది.మేము అక్కడ కుంకుమ పూజ చేయించేప్పుడు కాని , భక్తులు దర్షనానికి వచ్చినప్పుడు కాని ఆవిడ కళ్ళు తెరచి చూడలేదు. అంత రెష్ లో ,అంత ఏకాగ్రత ఎలా కుదిరిందో అనుకున్నాను.
ఆ దేవాలయము దగ్గరనుండి ఘాట్ రోడ్ మొదలైంది. దారంతా పచ్చనిచెట్లు ,లోయలు , మేకల గుంపులు , కోతుల అల్లరి చాలా ఆహ్లాదం గా వుండింది. ఈ అడవిలోనే వుండిపోవాలనిపించింది ! అన్నట్లు గుడి దగ్గర స్నేహ చేతులోనించి చిప్స్ పాకెట్ గుంజుకు పోయి ,టకటకా ఓ స్తంభం ఎక్కేసీ ఓ కోతమ్మ వాటిని లాగించేసింది. హి హి హి.

దారిలోనే అభయారణ్యం అని పులల బొమ్మలేసి , బోర్డ్ కనిపించింది. లోపలికి తీసుకెళుతారా అంటే ఓయస్ 500 రుపీస్ కట్టండి అన్నారు. మరి పులులు కనిపిస్తాయా అంటే ఆప్ కా కిష్మత్ అన్నాడు సరె ఏం కిష్మత్ తో చూద్దామని వెళ్ళాము. ఎంత కళ్ళు విప్పుకొని చూసినా దూరంగా ఓ నెమలి , ఇంకొంచం దూరం లో ఓనాలుగు జింకలు తప్ప ఏం కనపడలే ! మరే నువ్వొస్తున్నావని అక్కడ ఎదురుగా కూర్చోనివుంటాయ్ అవి అని మావారు జోక్స్. టైగర్ వాలీ మటుకు చాలా మనోహరం గా వుంది. ఎంతసేపైనా కదలాలనిపించలేదు. ఎలాగు పులులు కనిపించలేదు, పాము పుట్ట నైనా ఫొటో తీసుకుందామనుకున్నాను. ఫొటో తీసుకోవాలన్న భయమే 1 స్నేహ మీరు పుట్ట పక్కన నిలబడండి ఆంటీ ఫొటో తీస్తాను అంది.అమ్మో అందులోని పాము ,ముస్తాబై ఫొటో కోసం నా పక్కన వచ్చి ఫొజ్ ఇస్తే ! అప్పుడే గైడ్ చెప్పాడు ,అక్కడ 700 రకాల పాములున్నాయట ! వద్దులేమ్మా అని నేనే దూరం నుంచి ఓ ఫొటో తీసుకున్నాను.

శ్రీశైలం లో పాతాళేశ్వర నిలయం లో రూం తీసుకొని, కాసేపు విశ్రాంతి తీసుకొని ,సాయంకాలము రోప్ వేలో వెళ్ళాము. అక్కడి నుండి ఓ మోటర్ బోట్ 500 రుపీస్ కి అద్దెకు తీసుకొని కొద్ది సేపు కృష్ణమ్మ లో విహరించాము. మావారికి బుట్ట దొన్నె లో వెళ్ళాలని వుండింది కాని ఇప్పుడు పోనీయటము లేదు అన్నారు.
12 జ్యోతిర్లిగాల లో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామికి ,18 శక్తి పీఠాలలో ఒకరైన భ్రమరాంబా దేవికి ఆలవాలం శ్రీశైలం .ఇది కర్నూల్ జిల్లా లో ,ఆత్మకూర్ తాలూకాలో వున్న నల్లమల అడువులలోని పర్వతశ్రేణి లో వుంది. ఇది సకల సంపదలతో ,మహర్షుల తపోవనాల తో లతలు అనంతమైన ఓషదుల తో నిండి వున్న చెట్ల తో విరాజిల్లుతుతోంది.
ఇప్పటికీ లోపలి వైపున వున్న చెంచు గూడెముల లోమూలికా వైద్యము చేసే చెంచులు వున్నారట. వారిలో మల్లన్న అనే అతను చాలా వృద్దుడు వున్నాడట. కాని నాగరికులను ఎవరినీ లోపలికి రానివ్వరట. గైడ్ అన్నాడు . నాకు చెంచు గూడెం లో కి వెళ్ళాలని చాలా వుండింది !

మరునాడు తెల్లవారుఝామున 5 గంటల కు రుద్రాభిషేకం , భ్రమరాంబకు కుంకుమ పూజ చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. తిరిగి వచ్చేప్పుడు కూడా అదేభావన ,ఆకులో ఆకునై ,పూవులో పూవునై ఈ అడివి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా !
శ్రీశైలా మల్లయ్యా దైవమే నీవయ్యా