చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Tuesday, December 28, 2010

హైదరాబాద్ లో పూరీజగన్నాథుడు

































ఈ మద్య మావారు అలా అలా జూబిలీ హిల్స్ లో కార్ లో నన్ను షికారు తిప్పుతూ వుండగా దూరం నుంచి మట్టిరంగులో ఓ గుడి గోపురం కనిపించింది . అరే ఇదేదో ఒరిస్సా గుడి గోపురం లావుందే అనుకొని , మావారిని అడిగాను . ఆయన ఇంతకు ముందు గమనిచలేదుట . పోనీ ఇప్పుడు వెళుదామా అనుకుంటే రాత్రి పదైంది . ఆ సమయము లో గుడి తలుపులు తీసి వుండవులే అనుకొని , ఆ గుడి ఎక్కడుందో వెతకకుండానే వచ్చేసాము . అప్పటి నుంచి ఆ గుడి చూడాలి అనుకుంటూ వున్నాను . కాని కుదరలేదు . ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు . ఆమెను ఎక్కడికైన తీసుకెళ్ళాలి అనుకున్నాను . ఈ రోజు సాయంకాలం వరంగల్ కు , ఓ పెళ్ళి కి వెళుతున్నాను . అందుకని నిన్ననే , వేరే ఎక్కడికో ఎందుకు ఆ గుడికే వెళితే బాగుంటుంది అనుకున్నాను . మా డ్రైవర్ ను ఆ గుడి గురించి అడుగుతే , ఆ గుడి కడుతుండగా చూసాను మేడం .ఒరిస్సా వాళ్ళు కట్టరట అన్నాడు . అవునూ మన లక్ష్మిగారు వుండగా ఇలా ఎక్కడా ఎక్కడా అని వెతుకులాట ఎందుకు అనుకొని లక్ష్మి గారి కి ఫోన్ చేసాను . అంతే వివరాలు తెలిసిపోయాయి !

జూబిలీ హిల్స్ లో , బసవతారక రామ కాన్సర్ హాస్పెటల్ దగ్గర , ఒరిస్సా వారు , పూరీజగ్నాదుని గుడి కట్టించారు . అసలు కట్టించింది ఎవరో తెలుసుకుందామనుకున్నాను కాని ఒరిస్సావాళ్ళు అన్నారు కాని ఎవరో చెప్పలేకపోయారు . కృష్ణ , సుభద్ర , బలరామ విగ్రహాలు అచ్చం పూరీ లో వున్నట్లుగానే స్తాపించారు . గుడి గోపురము , గుడి అంతా పూరిలో వున్నట్లుగానే కట్టారు. పూజారులు కూడా ఎక్కువగా అక్కడి వారే . గుడి ప్రాంగణం మధ్యలో జగన్నాధుడు , నాలుగువైపులలో ఓ పక్క , మా విమల , ఓ పక్క మహాలక్ష్మి . జగన్నాధ గుడి ద్వారము పక్క మారుతి , వెనుక చివర వినాయకుడు వున్నారు . వినాయకుని ముందు మూషికుడు కూడా వున్నాడు .

ఆలయము గోడల మీద భక్తుల చరిత్రలు చిత్రించారు . ఆలయము లోపల పైనంతా బాంగారు రంగులో చక్కటి చిత్రాలు వున్నాయి . ఎత్తైన గోపురము , ద్వజస్తంభము కనులకింపుగా ఠీవిగా వున్నాయి . చాలా ప్రశాంతముగా వున్నది . మేము 12 గంటల వరకూ వుంటుంది అనుకొని కొంచము ఆలశ్యం గా వెళ్ళాము . మేము వెళ్ళేసరికి పావుదక్కువ పదకొండు అయ్యింది . అందువలన ఎక్కువ సేపు దర్శనం చేసుకోలేక పోయాము . కాని ఆలయప్రాంగణం లో చాలాసేపే కూర్చున్నాము .
తప్పక చూడవలసిన దేవాలయము ఇది .


అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు .

Monday, November 29, 2010

ఔరంగాబాద్ - ఎల్లోరా



మావారు పని వుంది నేను రాలేను , నువ్వే వెళ్ళి చూసిరా అన్నారు . ముందు ఒక్క దాన్నే తెలియని ప్లేస్ లో వెళ్ళేందుకు సంశయించాను . కాని ధైర్యే సాహసే లక్ష్మీ అనుకొని డ్రైవర్ బంటి గైడెన్స్ లో ఔరంగాబాద్ చూసేందుకు బయిలుదేరాను . ఔరంగాబాద్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ . కట్టడాలు అవి ఎక్కువగా నవాబుల కల్చర్లోనే వున్నాయి . ఇక్కడ ముఖ్యం గా చూడవలసినవి , ' పంచక్కి ' , ' బీబీ - కా - మక్బారా ' , ' ఔరంగాబాద్ కేవ్స్ ' . ' పంచక్కి ' , ' ఔరంగాబాద్ గుహలు ' చూడలేకపోయాను .
1679 లో , ఔరంగజీబ్ తన భార్య ' రబియా - ఉద్ - దుర్రానీ ' జ్ఞాపకార్ధము కట్టించిన , ఆమె సమాధి . దీని ని తన తండ్రి షాజహాన్ , ఆగ్రా లో కట్టించిన ' తాజ్ మహల్ ' నమూనా లో కట్టించాడు . కాని అంత బాగా ఐతే లేదు :) తాజ్ మహల్ తో పోల్చకుండా చూస్తే బాగానే వుంటుంది . లోపల హాల్ లో రబియా ఉద్ దుర్రాని సమాధి వుంటుంది . నాలుగు పక్కలా పాలరాతి మీద చెక్కిన శిల్పాలు వున్నాయి . పైన డోం కూడా చక్కని నగిషీ పనితో వుంది . (' రాజుల సొమ్ము రాళ్ళపాలు ' అని నానుడి . ఈ మొగలు చక్రవర్తుల పుణ్యమా అని సమాధుల పాలు అయ్యాయి .)
అందులోనే ఓ పక్క గా హైదరాబాద్ నవాబు , ' నమాజ్ ' చేసుకునేందుకు ఒక పెద్ద హాల్ కట్టించాడు .

పైన ఫొటో లో వున్నటువంటి దర్వాజా లు ఔరంగాబాద్ లో ఏడువున్నాయట.

ఆ కమాన్ దాటి ముందుకు వెళ్ళగానే , పెద్ద మజీద్ వుంది . ఆ రోజు రంజాన్ మూలము గా అక్కడ చాలా రష్ గా వుండింది .



మరునాడు ఎల్లోరా చూద్దామని వెళ్ళాము . ఎల్లోరా కు వెళ్ళే దారి లోనే ' దౌలతాబాద్ కోట ' వస్తుంది . అది ఎక్కాలంటే నడిచి వెళ్ళాలసిందే ! అంత ఎత్తు ఎక్క లేక కింద నుంచే చూసి తృప్తి చెందాము :) అక్కడ అమ్ము తున్న జామకాయలు బహు పసందుగా వున్నాయి . వానలు వచ్చి నప్పుడు , అప్పుడప్పుడు ఆ చుట్టు పక్కల దొరుకుతాయని , కొన్ని నాణాలు చూపించారు . అవి అమ్ముతారట కూడా .

కొంచము ముందుకు వెళ్ళి , వూరి లోపలికి వెళుతే ఔరంగజీబు సమాధి వుంది . భార్య సమాధి ఎంత ఆడంబరము గా కట్టించాడో , ఆయన సమాధి , ఆయన జీవన విధానములా అంత నిరాడంబరము గా వుంది !



ఎల్లోరా గుహలు అనగానే , గుహల లోపలి కి వెళ్ళాలేమో నని ముందు భయపడ్డాను :) బంటి ని , పక్కవాళ్ళను అడిగి , గుహలు అంటే అంతర్ భాగం ఏమీ కాదని , చాలా వరకు ఓపెన్ ప్లేసే నని నిర్ధారించుకొని ముందడుగు వేసాను . ఐనా అక్కడి కివెళ్ళేవరకు , గుండెలు పీచు పీచు మంటూనే వున్నాయి . మరి అంత భయపడుతూ వెళ్ళటమెందుకయ్యా అంటే , ఇంత దూరం వచ్చి చూడకుండా వెళ్ళేందుకు మనసు ఒప్పదు . పైగా చూడకుండా వచ్చాను అంటే అందరూ నవ్వరూ ?

ఎల్లోరా గుహలు 500 - 700 ఏ .డి లలో నిర్మించినవి . మొత్తం 34 గుహలు వున్నాయి . అందులో 1 నుండి , 12 వరకు బౌద్ద మతమునకు , ఆ తరువాతి 16 హిందూ మతమునకు , 30 నుంచి 34 వరకు జైన మతమునకు సంబంధించినవి . అవి వారి వారి నమ్మకము ప్రకారము నిర్మించుకున్నారు . అన్ని గుహలూ ఒకే రోజు చూడాలంటే నాలాంటి ఓపికలేనివారికి కష్టమే ! కారు ఆగగానే ముందుగా 16 వ నంబర్ గుహ కనిపించింది . అది కైలాసము లా గా నిర్మించారు . హిందూ మతమునకు సంబంధించిన వాటిలో అన్నీ శివ పార్వతుల వే వున్నాయి . బుధ్ధుని ప్రతిమ వున్న గుహలో ఓ భౌద్ధ సన్యాసి ధ్యానము లో కనిపించాడు . అన్ని గుహలూ చూడలేము అంటే , అక్కడి గైడ్ , 5 , 10 , 15 , 16 , 21, 29 , 32 చూడమని సలహా ఇచ్చాడు . అంతవరకే చూడగలిగాము . కొండలను తొలిచి , అంత పెద్ద పెద్ద రాళ్ళను , అద్భుతమైన శిల్పాలుగా మలిచారు అంటే , చూసి తీరాల్సిందేకాని వర్ణింప నా తరమా ?



ఔరంగాబాద్ లో నాకు భోజనాని కి ఇబ్బంది కాలేదు . మేము వున్న ' లాడ్ లీ ' హోటల్ లో శాఖాహారము , అదీను వెల్లులిపాయ , మసాల లేకుండా శుభ్రము గా , రుచి గా వున్నది . అది నాకు చాలా విచిత్రము గా , సంతోషం గా అనిపించింది . హోటల్ రూం కూడా శుభ్రం గా వుంది . ధర కూడా ఎక్కువ లేదు . అందుకే వారము రోజులు హాయిగా వుండగలిగాను . వంట పని లేదు . చక్కగా బాలకనీ లో కూర్చొని నవల చదువుకుంటూ, ఆకలేసినప్పుడు బెల్ కొట్టి ఏదో వకటి తెప్పించుకొని తింటూ అహా ఏమి నా భాగ్యమూ అనుకుంటూ హాపిగా వారం గడిపేసాను . ఎంత హాపీ ఐనా ఇంటి కి తిరిగి రాక తప్పదుకదా :)

Thursday, November 25, 2010

కార్తీకమాసము లో హరిహరుల దర్శనం - నల్లగొండ , పానగల్లు , పిల్లలమర్రి



కార్తీక మాసం లో శివుని దర్శించుకొని , గుడి ప్రాంగణము లో దీపాలు వెలిగిస్తే చాలా పుణ్యం అంటారు . ఆ పుణ్యమేదో కాస్త సంపాదించుకుందామనుకొని , psm .లక్ష్మి గారు , మా అమ్మ , నేను , నల్లగొండ జిల్లా లోని కొన్ని పురాతనమైన శివాలయాలు దర్శించుకుందామని ఓ శుభోదయాన బయిలు దేరాము . psm.లక్ష్మి గారు , వాటిని ఇంతకు ముందు చూసి వుండటము వలన మాకు వాటి ప్రాశస్త్యము గురించి వివరము గా చెప్పారు .
ముందుగా , నల్లగొండ లోని , రామగిరి రామాలయాని కి వెళ్ళాము . అక్కడ శ్రీరామచంద్రుడు , సీతాదేవి , లక్ష్మణ , భరత , శతృగ్నలు , ఆంజనేయ స్వామి సహితము గా పట్టాబిషక్తుడైన పట్టాభిరాముని గా వెలిసాడు . హైదరాబాద్ నవాబు గారి భార్యకు నయము కాని జబ్బు రాగా , నల్లగొండ లో నున్న వక ఆయుర్వేదవైద్యుడు , ఆవిడ ముంజేతి కి పురికొస కట్టించి , ఆ పురికొస రెండో చివర సహాయముతో , బేగం గారి నాడి పరీక్షించి మందు ఇచ్చి , ఆ జబ్బును నయం చేసారట. అప్పుడు నవాబు గారు సంతసించి , ఆ వైద్యుని ఏమి కావాలో కోరుకోమంటే , తనకు స్వప్న ములో కనిపించిన , పట్టాభిరాముని ఆలయ నిర్మాణము కొరకు భూమి అడిగాడట . నవాబు ఇచ్చిన స్తలము లో ,ఆలయమును నిర్మించి , కాపరాల గుట్ట కింద భూస్తాపితం ఐన విగ్రహాలను వెలికితీసి ఈ ఆలయము లో ప్రతిష్టించారట . ఇది 400 సంవత్సరాల పురాతనమైన ఆలయము అని అక్కడి పూజారులు చెప్పారు . శ్రీరామచంద్రుని దర్శించుకున్న తరువాత , గుడి వెనకవైపు వున్న ఉసిరిక చెట్టు కింద దీపాలను వెలిగించుకొన్నాము .


పచ్చలసోమేశ్వరుడు -పానగల్లు


నల్లగొండ కుదగ్గర లోనే వున్న , పానగల్లు లో పచ్చలసోమేశ్వరలయాము ను , కాకతీయ రాజులకు సామంతులైన కందూరు చోళ రాజులు క్రీ. శ. 11 - 12 శతాబ్దం లో నిర్మించారు . ఈ దేవాలయము కింద ఇంకోక శివాలయము వుందని , దానికి బంగారు తలుపులు వున్నాయని , కాని కాలక్రమములో భూమిలోపలికి వుండిపోయిందని , అక్కడి పూజారిణి చెప్పింది . శివుని ఎడమ వైపున రాజరాజేశ్వరీ దేవి , ఎదురుగా నందీసుడు , నందీసుని కి ఎదురుగా వినాయకుడు కొలువై వున్నారు . శివును ఎదురుగా దీపాలను వెలిగించాము . పూజారిణి వాటిని లింగము ఎదురుగా వుంచింది .
పక్కనే వున్న రాజరాజేశ్వరీ దేవి కి పసుపుకుంకుమ సమర్పించాము . అమ్మవారు పవళించివున్న శివుని మీద హాయిగా కూర్చొని వున్నారు . ఇలా ఏ దేవాలయము లోనూ చూడలేదు .
వినాయకుని దగ్గర కూడా దీపాలు వెలిగించుకున్నాము .
మండపము లోని నంది , స్తంబాలు చక్కని శిల్పకళ తో వున్నాయి . ఆలయము బయట కూడా విరగగొట్టి పడవేసిన శిల్పాలు చాలా వున్నాయి . వాటిని చూస్తుంటే ఎంత బాధ కలిగిందో చెప్పలేను .

చాయాసోమేశ్వరుడు




పచ్చలసోమేశ్వరుని దగ్గర నుండి , అక్కడికి దగ్గరలోనే పొలాలలో కొలువైన చాయాసోమేశ్వరుని దర్షించుకోవటానికి వెళ్ళాము . అక్కడ , శివలింగము వెనుక వైపు ఓ స్తంబము లా నీడ వుంటుంది . ఆ నీడ ఎక్కడినుంచి వస్తోందో ఇంతవరకు , ఎవరూ కనిపెట్టలేక పోయారట ! ఆ నీడ వుండటము వలననే చాయాసోమేశ్వరుడు అని పేరు వచ్చిందట . ఆ నీడ కెమేరాకు కూడా చిక్కలేదు !
మా నాన్నగారు , నల్లగొండ లోనే చదువుకున్నారు . నాగార్జునసాగర్ కెనాల్ లో పని చేసేటప్పుడు , దాని తో పాటే నల్లగొండ వరకూ వచ్చారు . ఆ సమయములో మా అమ్మ , నాన్నగారు , చాయాసోమేశుని చాలాసారులు దర్శించుకున్నారట . మా అమ్మ ఆ సంగతులన్నీ తలుచుకుంది .

చాయాసోశ్వర దేవాలయము లోని నీడ గురించి న సమాచారము ఇక్కడ వుంది . ఈ లింక్ ఇచ్చిన ఆవకాయ గారు థాంక్స్ అండి .
ఆ ఈశుని పూజించుకున్న తరువాత , అక్కడే కూర్చొని , మేము తెచ్చుకున్న పులిహోర , పెరుగన్నం తిన్నాము :)

ఉదయసముద్రము



పానగల్లుకు ఉత్తరాన , ఉదయ చోడుడు ప్రజల అవసరార్ధం 11 వ శతాబ్ధం లో చెరువును తవ్వించాదు . అది ఈ రోజు కూ ప్రజల అవసరాలను తీరుస్తూనే వుంది . కాసేపు ఆ చెరువు గట్టున , ఆ చెరువు అందాన్ని ఆస్వాదిస్తూ తిరిగాము .

పిల్లలమర్రి



నల్లగొండ నుండి హైద్రాబాద్ కు వచ్చే దారి లో , సూర్యాపేట కు దగ్గర లో వుంది , పిల్లలమర్రి . మేన్ రోడ్ నుండి పక్కకు వెళ్ళాలి . ఆ తిరిగే ముందు , మేన్ రోడ్ లో నున్న ధాభా లో వేడి వేడి అలూ బజ్జీలు , చిక్కని కాఫీ ఇప్పించారు లక్ష్మి గారు .
పిల్లలమర్రి లో నామేశ్వరాలయం , ముక్తేశ్వరాలయం , ఎరకేశ్వరాలయం అని మూడు శివాలయాలు , చెన్నకేశవస్వామి దేవాలయము వున్నాయి . ముందుగా వూరి మొదట్లో వున్న నామేశ్వరాలయము నకు వెళ్ళాము . సాయంకాలము ఆరు కూడా కాకుండానే పూజారి గుడి తలుపులు మూసివేసి వెళ్ళిపోయాడు . అక్కడే వున్న పిల్లలు వెళ్ళి ఆయనను పిలుచుకొని వచ్చారు ! శీతాకాలపు పొద్దు . త్వరగా చీకటి పడిపోయింది . గుడి లో సరైన దీపాలు కూడా లేవు . ఆలయమును కాకతీయ రాజులు నిర్మించారు అని మటుకే చెప్పగలిగారు పూజారి ! మండపము లోని స్తంబాలు అద్భుతమైన శిల్పకళ తో వున్నాయి . ప్రతి స్తంబమూ , మీటితే , సప్తరాగాలను పలికిస్తోంది . స్తంబాలను ఒక్కొక్క చోట కొట్టి చూపించాడు పూజారి , అదీనూ లక్ష్మి గారు అడుగుతే ! స్తంబాల మీద శిల్పాలు ఎంత నాజూకుగా వున్నాయంటే , వాటిలో నుంచి సన్నటి దారము దూర్చవచ్చు. అదీ లక్ష్మి గారు అడుగుతే చూపించారు !
చెన్నకేశవస్వామి దేవాలయము మూసివేసారు . లో చాలా చీకటి గా వుండింది . ముక్తేశ్వరాలయము లో దీపాలు సరిగ్గా లేవు . చాలా చీకటి గా వుండినది . స్వామి ని దర్శించుకొని వచ్చేసాము . ఎరకేశ్వరాలయము లో ఆ మాత్రము కూడా దీపాలు లేక పోవటము వలన చూడలేక పోయాము .పక్కగా బ్రహ్మ , సరస్వతి ల విగ్రహాలు వున్నాయట . కాని చీకటి మూలము గా చూడలేక పోయాము .
కవి పిల్లలమర్రి చినవీరభద్రుడు ఈ వూరి వాడే నా అన్నదానికి ఎవరూ సమాధానము చెప్పలేకపోయారు . చిన్న వూరు . వచ్చేవారు లేరు . ఇక శ్రద్ధ ఎవరికి వుంటుంది ? లక్ష్మి గారు , ఇదివరకు చూసి వున్నందువలన మమ్మలిని తీసుకెళ్ళ గలిగారు . ఆవిడ చెప్పేవరకూ అక్కడ సప్తరాగాలు పలికించే స్తంబాలు వున్నాయని నాకు తెలీదు . ఇప్పటి వరకూ ఒక హంపీ లోనే వున్నాయనుకున్నాను , ఇలా చిన్న చిన్న వూళ్ళ లో మనకు తెలియని అద్భుతాలు ఇంకెన్ని వున్నాయో కదా అనుకున్నాను .


మేము మా కార్ లోనే , పొద్దున 6 గంటలకు బయిలుదేరాము . లంచ్ , స్నాక్స్ , కాఫీ పాక్ చేసుకొని వెళ్ళాము . అన్నీ తిరిగి చూసుకొని వచ్చేసరికి , రాత్రి 11 అయ్యింది . మాకు ఆ రోజు పొద్దున సిటీ ఔట్ స్కర్ట్స్ లో ట్రాఫిక్ మూలంగా ఆలశ్యం అయ్యింది . అందుకే తిరిగి రావటాని కి ఆలశ్యం అయ్యింది .

నల్లగొండ రామాలయము ఉదయము 11 గంటలకే మూసేస్తారు . ఇక్కడ పూజారి వుంటాడు . మనకు కావలసిన పూజ చేయించుకోవచ్చు . అందువల్ల ఆ సమయానికల్లా అక్కడి కి చేరుకునేటట్లు ప్లాన్ చేసుకుంటే చాలు . చాయాసోమేశ్వరాలయము లో పూజారి వుండడు , తలుపులు వుండవు .పూజరి పొద్దున్నే వచ్చి వెళ్ళిపోతాడట. ఇక్కడ మనమే పూజ చేసుకోవచ్చు . పచ్చలసొమేశుని దగ్గర గుడి మూసినా , కట కటా లలో నుండి చూడవచ్చు . ఇహ పిల్లలమర్రి కే కొంచం పొద్దు వుండగా వెళితే మంచిది . అక్కడ ఈశ్వరాలయము లో స్తంబాలను పరిశీలనగా చూడవచ్చు .


. లక్ష్మి గారు , కార్తీకమాసము లో ఇంత మంచి శివాలయాలను చూపించినందుకు మీకు చాలా ధన్యవాదాలండి .

Friday, September 17, 2010

శివయ్య సన్నిధి లో మా వినాయకచవితి




శివ
శివ మూర్తివి గణనాథా
నువు శివుని కొమరుడవు గణనాథా

మద్య హైదరాబాద్ లో కాలనీ లలో పెట్టిన వినాయకుని దగ్గర మనము పూజ చేసుకునేందుకు , పూజారిని, పూజ చేసుకొనే వీలు కల్పిస్తున్నారు . అలా ఔరంగాబాద్ లో ఏమైనా వీలుందా అని మావారు వెతికారు . కాని లేదట. సరే అనుకొని , ఔరంగాబాద్ కు 30 మైళ్ళ దూరము లో నున్న , ఎల్లోరా వద్ద , వేరూళ్ గ్రామం దగ్గర , శివాలయ్ అనే తీర్థ స్తానం లో ఘృష్ణేశ్వరుని దివ్య జ్యోతిర్లింగం వుంది . అక్కడకు వెళుదామనుకొని , వినాయకచవితి రోజు ఉదయమే 6.30 కు కార్ లో బయలు దేరి వెళ్ళాము .ఎల్లోరా దగ్గరకు వెళ్ళగానే అక్కడే మేన్ రోడ్ మీద " గరికపాటి రెస్టారెంట్ " తెలుగు వారిచే నడపబడుతున్నది కనిపించింది . అక్కడ ఆగి , ఘృష్ణేశ్వర స్వామి దగ్గర , సరిగ్గా పూజ చేయించేవారు , సరైన పూజారి వున్నారా అంటే సింగ్డే అని , ఒక పూజారి వున్నాడని , ఆయన శ్రద్దగా చేయిస్తాడని చెప్పారు . గుడి దగ్గర ఆయనను సంప్రదించాము . ' పూర్ణరుద్రాభిషేకం ' చేయిస్తాన్నారు . మావారికి కావలసింది అదే . 2001 రూపాయల తో అభిషేకం టికెట్ కొనుక్కొని , గుడి లోకి వెళ్ళాము . రోజు , శ్రావణమాసమంతా ధీక్ష చేసినవారు ఉద్యాపన చేసుకుంటున్నారు . అక్కడ ఉద్యాపనగా శివుడికి అభిషేకం చేయుంచుకున్నాక , ఇంట్లో వినాయకుని స్థాపిస్తారట. అందువలన గుడిలో రెష్ గా నేవుంది . మేము వేట్ చేస్తున్న సమయములో సింగ్డే , అక్కడి స్థల మహిమ ఇలా చెప్పారు

కైలాసం లో శివ పార్వతులు చదరంగం ఆడుతున్నారు . ఆటలో పార్వతి గెలిచింది . దాని తో శంకరునికి కోపం వచ్చి, ధక్షణానికి వెళ్ళి సహ్యాద్రి పర్వతాల మీద నివసించసాగాడు . శంకరుని వెతుకుతూ , పార్వతి కూడా అక్కడికి భిల్లురూపం లో వచ్చి శంకరుని మనసు దోచుకుంది . ఇద్దరూ ప్రదేశము లో వున్నారు . ఒకసారి పార్వతికి దాహం వేసిందిఅప్పుడు శంకరుడు భూమి లోకి త్రిశూలం గుచ్చి , పాతాళం నుండి భోగావతి నీటిని పైకి తప్పించాడు . దానికి శివ తీర్థంఅని , వనాన్ని కామ్యకవనం అని పరు వచ్చింది . ఒక రోజు పార్వతి , పాపిట లో అలంకరించుకునేందుకు , ఎడమచేతిలో కుంకుమ ,కేసరి లో శివాలయం నీరు కలిపింది . కలుపుతుండగా చేతిలో కుంకుమ తో శివలింగం తయారైంది . లింగము నుండి దివ్య జ్యోతి ఉద్భవించింది . అప్పుడు , ఆశ్చర్యముతో చూస్తున్న పార్వతి తో శివుడు ఇలా అన్నాడు ,
" లింగం పాతాళపు అడుగున వుండేది . ఇది త్రిశూలం నుంచి వచ్చింది . అప్పుడు భూతలం ఒకసారి ఎగిసిపడింది , నీటి ఉడుకులాగా " ( కాశీ ఖండం )
పార్వతి దివ్య జ్యోతిర్లింగాన్ని , ఒక రాతి లింగము లో వుంచి , విశ్వ కళ్యాణార్ధం లింగ మూర్తిని ఇక్కడ ప్రతిష్టించింది .
ఈ జ్యోతిర్లింగము ను కుంకుమేశ్వరుడు అని , ఘృష్ణేశ్వరుడు అని నామములతో పిలుస్తారు .
పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది చివరిది .

గుడి లోపలికి వెళ్ళగానే నాకు చాలా ఉక్కిరిబిక్కిరి గా అనిపించింది . అందులోనూ చాలా మంది వున్నారు . గుడిద్వారము కూడా చిన్నగా వుంది . నేను చూసినంతవరకు , శివాలయాల లో గర్భ గుడి లోని లింగానికే సొంతముగాఅభిషేకము చేయనిస్తారు . కాకపోతే ఇక్కడ దంపతుల తో చేయిస్తున్నారు . సంకల్పము కాగానే , నేను బయటకు వెళ్ళికూర్చుంటాను అని మావారి తో అన్నాను . నీ ఇష్టం , కావాలంటే ఇప్పుడైనా వెళ్ళిపో అన్నారు కాని , అందరూదంపతులు చేస్తుంటే , ఆయనను ఒక్కరిని వదిలి వెళ్ళాలనిపించలేదు . అలాగే వంతు వచ్చేవరకు నిలుచున్నాను . మేము పూజ మొదలు పెట్టాక బయటకు వెళ్దామనుకున్నది మర్చి పోయి పూజలో మునిగి పోయాను . విచిత్రముగా మా పూజ మొదలయ్యే సరికి దాదాపు అందరూ అభిషేకాలు ముగించుకొని వెళ్ళి పోయారు మహారుద్రాభిషేకము గంటపైనే పట్టింది . తరువాత , జ్యోతిర్లింగానికి ఎదురుగా వున్న పార్వతీ అమ్మవారి కి కుంకుమ పూజ చేసాము . అలా వినాయకచవితి రోజున , విఘ్నేషుని అమ్మా నాన్నలను పూజించాము . చాలా గొప్పగా ఐంది కదూ . చూశావా నిన్ను ఆయన బయటకువెళ్ళనీయలేదు అన్నారు మావారు . మరే ఆయన తన డైమండ్ నెక్లెస్ ను పంపి మరీ పిలిపించుకున్నాడు కదా అన్నానునేను .

తరువాత దగ్గర లోనే వున్న అష్టవినాయకుని గుడి కి వెళ్ళాము . గుడి విశేషము ;
" మొదట ఇక్కడ నాగజాతి ఆదివాసులుండేవారు . నాగుల స్థానం ' బాంబీ ' అంటే పాముల పుట్టలు . వీటిని ' వారుళ్ ' అంటారు . అదే కాలక్రమేనా ' వేరుళ్ ' గా మారింది . అది ' యేరుళ్ ' గ్రామం గా పేరు పొందింది . దీనిని ' యెల ' అనే రాజుపాలిస్తూ వుండేవాడు . ఒకసారి యెల రాజు వేటకు వెళ్ళి , వేటలో మునులుండే ఆశ్రమాలకు చెందిన జంతువులనుకూడా చంపివేసాడు . అది చూసి మునులు , రాజును సర్వాంగాలు పురుగులు పట్టాలని శపించారు .

విధం గా రాజు అడవుల వెంట తిరగ సాగాడు . దాహం తో గొంతు ఎండి పోసాగింది . ఎక్కడా నీరే లభించలేదు . చివరకు ఒక చోట ఆవు డెక్కల తో చేయ బడిన గుంట లలో కొద్దిగా నీరు కనిపించింది . నీరు రాజు నోట పోసుకోగానే , ఒక అద్భుతం జరిగింది . రాజు శరీరానికి పట్టిన పురుగులన్నీ మటు మాయం అయ్యాయి . అప్పుడు రాజు ప్రదేశం లోతపస్సు చేసాడు . బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు . అక్కడ అష్ట తీర్థాలను ప్రతిష్టాపించాడు . దగ్గర లోనే ఒక సువిశాలమూ , పవిత్రమూ అయిన సరోవరాన్ని నెలకొల్పాడు . ఇక్కడే అష్ట వినాయకులు వున్నారు .

అటు నుంచి , గరికపాటివారి హోటల్ లో భోజనము చేసి , ఎల్లోరా గుహలను చూసి ( ఎల్లోరా విశేషాలు ఇంకో పోస్ట్ లో ) , తిరుగు ప్రయాణము లో ఖుల్దాబాద్ దగ్గర ' బద్ర మారుతి ' ని దర్షించుకున్నాము . ఆలయము చాలా పురాతనమైనదికాకపోతే మద్యనే అందరి కీ ఎక్కువగా దీని గురించి తెలిసింది . ఇక్కడ హనుమంతుడు శయనించి వుంటాడు .
ఔరంగాబాద్ వచ్చేసరికి , సాయంకాలమైంది . మాకు ఊరి మొదట్లోనే వినాయకుడు రకరకాల రూపాలతో , కొలువైయేందుకు వెళుతూ దర్షనమిచ్చాడు .
13 తారీకున మావారి పుట్టిన రోజు . రోజు ఆయన పని నుండి వచ్చాక , ఒక ఆటో మాట్లాడుకొని , మీ వూరి లో ఏమిచూపిస్తావో చూపించు అన్నాము . అతను వినాయకులను చూపిస్తాను అని , చిన్న చిన్న సందుల లోకి తీసుకెళ్ళి మరీచూపించాడు . చాలా మటుకు పెద్ద పెద్ద విగ్రహాలే . అవన్ని ఎప్పటికీ అలాగే వుంటాయట . పక్కన చిన్న విగ్రహం వుందిదానిని నిమజ్జనము చేస్తారట. ఒక చోట , మేము హైద్రాబాద్ నుండి వచ్చామని తెలుసుకొని , అక్కడి నిర్వాహకులు ,రోజు లోకల్ న్యూస్ లో ఖైరతాబాద్ వినాయకుని చూపించారని చెప్పారు . ఇంకో చోట రావి చెట్టు చుట్టూ హిమాలయాలలాగా ఏర్పరిచి , దాని మీద పన్నెండు జ్యోత్ర్లింగాలను పెడుతున్నామని చెప్పి మావారి దగ్గర చందా వసూలు చేసారు . చీకటిలో కనిపిస్తున్నాడే పాలరాతి వినాయకుడు , ఆయన ' వరద వినాయకుడు ' అట. వి . . పి వినాయకుడుట . పెద్దపెద్ద వాళ్ళు దర్షించుకుంటారుట . మేమెళ్ళేసరికి తలుపులు వేసేసారు . బయట నుండే దండం పెట్టు కొని వచ్చేసాము . ఇలా ఊళ్ళోని ముఖ్యమైన వినాయకులను చూపించి , ఊరి చివర హోటల్ లో భోజనము పెట్టించి , మా హోటల్ దగ్గరదింపి 450 రూపాయలు వసూలుచేసాడు ఆటో డ్రైవర్ గారు ! 100రూపాయలో అవుతుంది , పైనుంచి ఇంకో వంద భక్షీష్ఇద్దామనుకున్నారు మావారు పాపం . అక్కడికీ ఆటో డ్రైవర్ గారు మీటర్ ప్రకారమే చార్జ్ చేసారట. కాకపోతే అక్కడ , మీటర్ లో ఒక రూపాయైతే , పది రూపాయలట. పది రూపాయలైతే వందరూపాయలట . అదేమి లెక్కో నాకైతే అర్ధం కాలేదు . 45 రూపాయలు మీటరులో వుంటే 450 తీసుకున్నాడు !!!

సారి వెరైటీగా వినాయకునికి మహరాష్ట్ర ప్రసాదము ' మోదక్ ' చేద్దామనుకున్నాను . కాని మహరాష్ట్ర ప్రసాదమైతేచేయలేదు కాని , మహారాష్ట్రా లో ఇలా వినాయకచవితి చేసుకున్నాము .

చివర ఫొటో లో వున్న వినాయకుడు , మా మనవరాలు మేఘ చేసిన , మా ఇంటి వినాయకుడు .

Friday, August 13, 2010

సికింద్రాబాద్




హైదరాబాద్ లో నవాబుల సంస్కృతి ఎక్కువగా వుంటే , సికందరాబాద్ బ్రిటిష్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది . బ్రిటిష్ వాళ్ళు తమ స్తావరం కోసం , కంటోన్మెంట్ ఏరియా నిర్మించారు . అక్కడ చాలావరకు వారు నిర్మించిన భవంతులే వున్నాయి . ఒకొప్పుడు , సికిందరాబాద్ లో మిలిటరీ ఆఫీసులూ , వాళ్ళ కాలినీసే ఎక్కువగా వుండేవి . మావారు పని చేసిన ఈ .యం . ఈ వారివి , కాలేజ్ , సెంటర్ , స్టేషన్ వర్క్ షాప్ ఇక్కడే వున్నాయి . కాబట్టి ఈ .యం . ఈ లో పని చేసినవారు ,దాదాపు అందరూ ఏదో ఒక పోస్టింగ్ కో , ట్రైనింగ్ కో ఇక్కడి కి వస్తారు . ఒకసారి ఇక్కడకు వచ్చిన వారు , ఇక్కడి వాతావరణము , స్తలము అన్నీ నచ్చి , చాలామంది రిటైర్మెంట్ తరువాత ఇక్కడే స్తిరపడటము కూడా సాధారణము . అలా ఆర్మీ ఆఫీసర్స్ కోసం ఏర్పడ్డవే , సైనిక్ పురి , వాయుపురి , గన్ రాక్ , ఆర్మీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కాలనీ మొదలైన కాలనీలు .

మావారు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో డిస్కంటిన్యూ చేసి చైనా వార్ లో షార్ట్ సర్వీస్ ఆఫీసర్ గా చేరారు . ఐదు సంవత్సరాల తరువాత పర్మినెంట్ ఆఫీసర్ అయ్యాక , 1 1/2 ఇయర్ పూనా లో , 1 1/2 ఇయర్ సికిందరాబాద్ యం . సి యం ఇ కాలేజ్ లో ఏ యమై కోర్స్ చేసారు . అప్పుడు మేము మొదటిసారిగా సికింద్రాబాద్ లో అడుగు పెట్టాము . అప్పుడే మా అమ్మాయి పుట్టటమూ , నేను కాలేజీ లో బి .యే సెకండ్ ఇయర్ లో చేరటము తో , మేము బర్కత్ పురా లో , మా అత్తవారింట్లోనే వుండే వాళ్ళము . మా వారు మటుకు పొద్దున్నే 5 గంటలకు సికింద్రాబాద్ వచ్చి , రాత్రి 10 గంటలకు ఇల్లు చేరే వారు . మా అమ్మాయి పుట్టినప్పుడు , ఒక పార్టీ లో అందరినీ అమ్మాయిల పేరు లు ఏమైనా చెప్పమని అడిగారుట . అప్పుడు మిసెస్ . ధర్మాధికారి చెప్పిన పేరు ' సంజ్యోత్ ' మా వారికి నచ్చేసి అదే పెట్టారు . మా సంజు మొదటి పుట్టిన రోజున , బంగ్లాదేశ్ వార్ మూలము గా ఎమర్జెన్సీ వుండింది . 24 గంటలూ యూనిఫాం లో వుండాల్సి వచ్చేది . అందుకని అందరూ పాపం పార్టీ కి యూనీఫాం లోనే వచ్చారు !

ఆ తరువాత ఇంకోసారి సిలిగురి నుండి షార్ట్ కోర్స్ మీద వచ్చాము . అప్పుడు మావారు వాలీబాల్ ఆడుతుండగా కాలు మెలికపడి మోకాలు దగ్గర దెబ్బ తగిలింది . కోర్స్ వద్దు ఏం వద్దు అని , కాలికి పట్టీ కట్టి మిలిటరీ హాస్పెటల్ లో ఓనెల రోజులుంచి , సిలిగురి వాపసు పంపించేసారు . పాపం కదా ! ఎంత దిగులుగా కూర్చున్నారో చూడండి . హాస్పిటల్ లో వున్నప్పుడు మద్య లో ఓరోజు ఇంటి కొచ్చారులెండి . అప్పుడు తీసాను ఈ ఫొటో . ఇది బ్లాగ్ లో పెట్టానని తెలుస్తే చంపేస్తారు నన్ను . ఎవ్వరూ చెప్పకండి ప్లీజ్ .

ఇహ ముచ్చటగా మూడోసారి సికింద్రాబాద్ వచ్చిన విధమెట్టిదనగా ;;;; ఓ చీకటి రాత్రి , సిలిగురి లో పిల్లలిద్దరికీ జ్వరాలు రావటము తో , నేను పార్టీ కెళ్ళ కుండా ఇంట్లోనే వుండి పోయాను . పార్టీ తరువాత జనరల్ కుమార్ మావారి తో పాటు మాయింటి కి వచ్చారు . ఎర్ర గులాబీ పూల బుకే పెద్దది ,డిల్లీ స్పెషల్ మిఠాయి పాకెట్ తెసుకొని మరీ వచ్చాడాయన . వస్తే ఏముంది , పెద్ద సోఫాలో పిల్లలిద్దరి నీ పెట్టుకొని శోక దేవతలా కూర్చొని వున్నాను . పాపం ఆయన మనసు కరిగి పోయింది . మాలా మీ పోస్టింగ్ డ్యూ కదా సింకిద్రాబాద్ చేయించమంటవా అని అడిగారు . ఒక్క సారే గుండెల్లో రాయి పడింది . ఇప్పుడే సికింద్రాబాద్ నుండి వచ్చాము , మళ్ళినా ?? ఎంచక్కా ఏదైనా కొత్త వూరైతే చూడొచ్చుకదా అనుకుంటూ మావారి వైపు చూసాను . ఆయనేదో సైగ చేస్తున్నారు . హుం ఈయనకు సికింద్రబాద్ వెళ్ళాలని వుందేమో ఖర్మ , ఇప్పుడు నేను వద్దంటే ఆ తరువాత బుర్ర వాచేంత క్లాస్ పీకుతారు అనుకొని , మనసులో ఏడ్చుకుంటూ పైకి సరే అన్నాను . ఇదేమిటి ఈయనగారు నన్ను గుర్రున చూస్తున్నారు ? అనుకునంతా ఐయింది , అటు జనరల్ కుమార్ వెళ్ళటము , ఇటు నాకు క్లాస్ మొదలు కావటము . వద్దని చెప్పమని సైగ చేస్తే సికింద్రాబాద్ కావాలని అడుగుతావా ? ఇప్పుడేగా అక్కడినుండి వచ్చాము , ఆ మాత్రం పిల్లలను పెంచలేవా ? ఇంకో పదేళ్ళ తరువాత రిటర్మెంట్ తీసుకుందామనుకుంటున్నామా , అప్పుడు లాస్ట్ పోస్టింగ్ హోం స్టేషన్ అవుతే బాగుంటుందని నేను ప్లాన్ చేస్తుంటే అంతా చెడ గొట్టావు ఢాం ఢూమ్మ్ . . . . .
వా ((( . . . సరిగ్గ సైగ చేయొచ్చుకదండీ అని ఓ ఏడుపు .
నీ మొహం ఏదీ అర్ధమైచావదు . . .
వా ((( * * *
అలా జనరల్ కుమార్ గారి అభిమానం తగలెయ్య , గోడకు కొట్టిన బంతిలా సికింద్రాబాద్ వచ్చి పడ్డాము .

రాగానె క్వాటర్ దొరకలేదు . ఈ సారి మూడు సంవత్సరాలూ వుండాలి కనుక హైద్రాబాద్ లో వుండేందుకు వీలుకాదు . బొలారం లో సెంట్ . ఆన్స్ స్కూల్ లో సంజును చేర్చాము . అక్కడే మెస్ లో టెంపరరీ క్వాటర్ లో మూడు నెలలు వున్నాక సైనిక్ పురి లో ఇల్లు ఎలాటైంది . నెక్స్ట్ ఇయర్ స్కూల్ మొదలైనప్పుడు , సంజు పేరు క్లాస్ లిస్ట్ లో లేదని ఇంటి కి పంపించేసారు . సంజ్యొత్ అంటే అబ్బాయను కున్నారట పేరు తీసేసారట !హాయిగా పాటలు పాడుకుంటూ , డాన్స్ చేసుకుంటూ వచ్చేస్తుంటే , మా ఇంటి దగ్గరి షాప్ అతను చూసి , గుర్తుపట్టి ఇంటికి తీసుకొచాడు . ఇప్పటికీ తలుచుకుంటే , వాళ్ళు అలా ఎలా పంపేసారో అర్ధం కాదు . బొలారం నుండి సైనిక్ పురి కి పిల్ల క్షేమం గా చేరిందంటే ఆ భగవంతుడి దయే . ఆ దెబ్బకి పిల్లలిద్దరినీ ఇంటికి దగ్గరగా వున్న రామకృష్ణా విద్యాలయ లో చేర్పించాము . మా అబ్బాయి బిపు కు స్కూల్ కెళ్ళటము అస్సలిష్టం వుండేది కాదు . స్కూటర్ వెనుక కూర్చొని , నా వైపు చూస్తూ ఏడుస్తూ వెళ్ళేవాడు . వాడు వెళ్ళి పోయాడుకాని , మీరిక ఏడుపాపి , ఇంట్లోకెళ్ళండి అని ఎదురింటి మిసెస్ .శ్రీరాములు అన్నపుడు చూసుకుంటే నా కళ్ళూ నీళ్ళతో నిండి బుగ్గల మీద నీళ్ళు ధారగా కారుతుండేవి పాపం ! ఎందుకొచ్చిన చదువులురా బాబూ అనిపించేది హుం .

మావారేమో పొద్దున్నే ఐదింటి కి డ్రిల్లు , ఎనిమిది నుండి వంటి గంట వరకు ఆఫీస్ , నాలుగు నుండి గేంస్ వగైరా తో బిజీ గా వుంటే నేనేమో పిల్లలూ , మాజాంగ్ , కార్డ్స్ , లేడీస్ క్లబ్ , వెల్ఫేర్ సెంటర్ , ఓపెన్ ఏయిర్ తియేటర్ ల లో వారాని కి రెండు సినిమాలూ , ఎంత బిజీ గా వుండేద్దాన్నంటే ఓ డైరీ లో రోజు వారీ ప్రోగ్రాములు రాసుకోవలసి వచ్చేది . నిజం .సచ్చీ . పెద్ద సెంటర్ కావటము వలన జవాన్ల భార్యలు చాలా మంది వుండేవారు . వాళ్ళ కోసం వారాని కోసారి వెల్ఫేర్ సెంటర్ నిర్వహించే వాళ్ళము . ఎక్కువగా పంజాబీ వాళ్ళు వుండేవాళ్ళు . స్వెట్టర్ లు అల్లటము , ఎంబ్రాయిడరీ చేయటము , ఫ్రాక్స్ , డ్రెస్ లు కుట్టటము చేసేవారు . వాళ్ళు చేసినవవి , దివాలీ మేలా లో అమ్మి , ఆ మనీని వాళ్ళకు కొంత , ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కు కొంత ఇచ్చేవాళ్ళము . పర్సనల్ గా ఎవరికైనా కావాలన్నా కుట్టించి ఇచ్చేవాళ్ళము . ఆ రకముగా వాళ్ళకూ కొంత ఆదాయము సమకూరేది . ఎక్కువగా వెల్ఫేర్ సెంటర్ లో జరిగే ఆక్టివిటీస్ అన్ని నేనే ఆర్గనైజ్ చేసేదానిని . మాలా దీదీ అంటూ జవానుల భార్యలంతా , నాతో చాలా చనువు గా వుండేవారు . అందుకే మాఫ్రెండ్స్ నన్ను ముద్దుగా యం .సి ( మాస్టర్ ఆఫ్ సెర్మొనీ ) అని పిలిచేవారు . అదేమిటో , ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ కూడా ఈవెంట్ మానేజర్ ను చేసేసారు . ఆగస్ట్ పదిహేను న , జనవరి ఇరవైఆరున , ఆర్మీ డే రోజున ఇలా అప్పుడప్పుడు ఆఫీసర్స్ , జావాన్ల కుటుంబాల తో కలిసి బరాఖానా వుండేది . మా మెస్ పార్టీలు సరేసరి . న్యూ ఇయర్ నాడు , రాత్రి పది నుండి వుదయము 5 వరకు , సికింద్రాబాద్ క్లబ్ లో డాన్స్ చేసీ చేసీ , అలసి పోయి , అక్కడే బ్రేక్ ఫాస్ట్ కూడా తినేసి ఇళ్ళకు చేరేవాళ్ళము .

సైనిక్ పురి , అమ్ముగుడ తెగ తిరిగేవాళ్ళము . క్వాటర్ గార్డ్ ముందునుండి వెళుతుంటే సావధాన్ అని విని పించేది . ఓరినీ , వీడి దుంపతెగ , ప్రతిరోజు ఇటు నుండి వెళ్ళే వాళ్ళమే కదా సావధాన్ అని అరుస్తాడు . ఎప్పుడో ఓసారి మనల్ని క్వాటర్ గార్డ్ లో వేసేయరు కదా అని , నేనూ , మా ఫ్రెండ్ దేవి తెగ భయపడేవాళ్ళము . తరువాత తెలిసింది , రోజూ వాళ్ళకు అది లంచ్ టైం అని అందుకే ఆ గార్డ్ అందరినీ అలా ఎలర్ట్ చేస్తున్నాడనీనూ .

ఒక సంవత్సరము మా యూనిట్ ఆర్మీ స్కూల్ , మావారి ఆధీనములో వుండింది . ఆప్పుడు ఆగస్ట్ పదిహేనున ఆ స్కూల్ లో నన్ను జండా ఎగురవేసేందుకు ఆహ్వానించారు . చిన్న స్కూల్ , ఇరవై మందే పిల్లలు . ఐతేనేమి , ఓ జే. సి . వో వెంట వెళ్ళి జండా ఎగురవేసి , పిల్లలకు చాక్లెట్స్ పంచి రావటము నేనైతే గొప్పగానే ఫీల్ అయ్యాను . అప్పుడే మావారు పెరేడ్ గ్రౌండ్ లో పెరేడ్ ను కమాండ్ చేసారు . ఆ ఫొటోలు అవే.

అనుకున్నాము కాని మూడు సంవత్సరాలు చిటికెలో ఐపోయాయి . చంటి పిల్ల ల తో వచ్చి బడికి వెళ్ళే పిల్లలతో జబల్ పూర్ వెళ్ళాము . మేము జబల్ పూర్ వెళ్ళేముందు , యు .యస్ నుండి , మా మరిది ఫ్రెండ్ డాక్టర్ .నాథ్ వచ్చారు . మేము బయిలుదేరుతుండగా మా నలుగురి కలర్ ఫొటో తీసాడు . అదే మా మొదటి కలర్ ఫొటో !

ఆ చివరి ఫొటో మావారు వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకొని సికంద్రాబాద్ వచ్చినప్పటి రిటైర్మెంట్ ఫొటో అన్నమాట .

అందరికీ ముందుగా స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు .

కృష్ణ సినిమాలలో నాకు నచ్చిన సినిమా పాట ఇది .



Monday, August 9, 2010

విజయవాడ - 2 ( కొండపల్లి - ద్వారకా తిరుమల - కీసర )





మేము సెటిల్ అయ్యాక భాస్కర్ కి ఫోన్ చేసి ఇలా వచ్చామని చెప్పాము . మేము హోటల్ లో దిగినందుకు నొచ్చుకున్నాడు . మరునాడు సీత కూడా డిల్లీ నుండి వచ్చేసింది. నలుగురము , మా చిన్న తమ్ముడి కొడుకు , జస్వంత్ , విజయవాడ అంతా చుట్టాము . ముందుగా కొండపల్లి కోట చూడటానికి వెళ్ళాము . ఏ కోట చూసినా మనసు ఒక విచిత్రమైన భావన కు గురవుతుంది . ఎక్కడి కక్కడ కూలిపోయి స్చప్ . . . ఏమిటో మనసంతా భారమై పోతుంది . నేను కొండను సునాయసంగా ఎక్కుతుంటే అందరూ ఆశ్చర్య పోయారు . కోట కింద కొండపల్లి బొమ్మలు చేసే వారి దగ్గర కొన్ని బొమ్మలు కొన్నాము . చెట్టు బెరడు తో అంత అద్భుతమైన బొమ్మలు చేయటము అబ్బురమే . అక్కడి నుండి భవానిపురం ఐలాండ్ కు వెళ్ళాము . కృష్ణమ్మ లో బోట్ ప్రయాణము చాలా ఆహ్లాదముగా జరిగింది . అక్కడ లంక లో కూడా పార్క్ లాగా బాగా చేసారు . భవానిపురం నుండి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు స్తాపించిన , మరకత రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్ళాము . అమ్మవారు చాలా కళగా వున్నారు . రాత్రికి సీత వాళ్ళింట్లో భోజనం చేసి మా విడిది కి తిరిగి వచ్చాము .

మరునాడు ద్వారకా తిరుమల లో వెంకటేశ్వర స్వామిని దర్షించుకున్నాము . విజయవాడ తిరిగి వచ్చేసరికి సాయంకాలమైంది .వస్తూ దారి లో గణపతి సచ్చిదానంద స్వామి వారి చే స్తాపించ బడిన , మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయానికి వెళ్ళాము . ఆలయము , ఆలయము లోని అమ్మవారు చాలా కళగా వున్నారు . ఆ తరువాత దుర్గ గుడి కివెళ్ళాము . ఆ సంద్యాసమయము లో దుర్గ గుడి నుండి కృష్ణ ను చూడటము ఎంత అందమైన దృశ్యమో . ఆ తరువాత ప్రకాశంబ్రిడ్జ్ పైన కాసేపు నడిచాము . మా మరిది గారు శంకర్ బలవంతము తో రాత్రికి హోటల్ నుండి సీత ఇంటికి మారాము . మరునాడు బందర్ పాండురగని గుడి బాగుంటుందని వెళుదామని సీత ప్లాన్ చేసింది . ఇంతలో మాడ్రైవర్ , మురళి కి ఇంటి నుండి రమ్మని ఫోన్ రావటము తో , మరునాడు తిరుగు ప్రయాణం కావలసి వచ్చింది . పొద్దున్నే , సీతా వాళ్ళ ఇంటికి దగ్గర లో వున్న కృష్ణ లో స్నానం చేసి , ఎన్ని ఏళ్ళుగానో , వెళ్ళాలి అనుకుంటున్న బాబాయ్ హోటల్ కు వెళ్ళాము . మనం అడగక ముందే , ముందుగా ఇడ్లీ ఇచ్చారు . ఆ పైన అక్కడి స్పెషలైన మినపట్టు తిన్నాము . నిజం గానే ఆ ఇడ్లీ రుచే వేరుగా వుంది .

మా మురళి పుణ్యమా అని ఇంకో రెండు రోజులుందామనుకున్న వాళ్ళము తిరుగు ప్రయాణం అయ్యాము . దారి లోనే నందిగామ కనుక , సీత , భాస్కర్ అక్కడి వరకూ మాతో వచ్చారు . దారి లో వున్న కీసర దగ్గర కాసేపు ఆగాము . నా చిన్నప్పుడు , మేము చింతలపాడు రావాలంటే కీసర దగ్గర బస్ దిగేవాళ్ళము . అక్కడికి మా తాతగారు బండి పంపేవారు . అమ్మమ్మ అన్మ్మం , కంది పచ్చడి , గోంగూర పచ్చడి , మూట కట్టి పంపేది . ఆ వాగు దగ్గర కూర్చొని , తిని వెళ్ళేవాళ్ళము . మద్యాహ్నం బండి ఎక్కుతే రాత్రి అయ్యేది , ఇంటికి చేరుకునేసరికి . ముక్యం గా , వెన్నెల రాత్రుల లో ఆ ప్రయాణం చాలా బాగుండేది . చిన్న దానినైనా , ఇసుకలో , బండి ప్రయాణం , ఆ వెన్నెల , మొగలి పొదల పక్క నుండి వెళుతుంటే వచ్చే మొగలిపూల సువాసనా , కీచురాళ్ళ ద్వనులు అన్నీ గుర్తే . తుమ్మ డొంకలొస్తున్నాయంటే వూరు దగ్గర పడిందని సూచన. వూరి మొదట్లోనే నూకాళమ్మ గుడి . అప్పుడు నేనొక్క దాన్నే చిన్న పిల్లని కాబట్టి అందరూ ఎంతో ముద్దు చేసేవారు . మా తాతగారు , వెనుక కొట్టము లో నా కోసం ఓ బొమ్మరిల్లు కట్టించారు . అక్కడ నేను ఆడుకుంటూ వుంటే , అమ్మమ్మ , మజ్జిగ , కవ్వం తో తిప్పుతూ బోలెడు పాటలు పాడేది . మా అమ్మమ్మ చాలా బాగా పాడేది . ఆ కవ్వ తిప్పటము నాకు చాలా నచ్చేది . నేనెంత ప్రయతించినా తిప్పలేక పోయేదానిని . ఇంతింత వెన్న ముద్దలు తీసి నాకు పెట్టేది కాని అదేమిటో నా కస్సలు తినాలని పించేది కాదు . తినవే అమ్మడూ అని తెగ బతిమిలాడేది . ఊమ్హూ అస్సలంటే అస్సలు నోరు తెరిచేదాన్ని కాదు . చెక్క పెట్టెలో నుండి తీసిన గడ్డ పెరుగు తో , అన్నం కలిపి పిన్ని పెడుతుంటే మటుకు గుటుకూ గుటుకు న ఎంత తినే దాని నో ! ఎంతైనా ఇంట్లో మొదటి మనవరాలు పుట్టినందుకు బోలెడు ముద్దులూ , మురిపాలు పొందాను . అవన్ని నేను చెపుతుంటే మా చెల్లెళ్ళు , తమ్ముడు చెవులు దోరవిడుచుకొని విన్నారు .నాకు అనుమానం కాస్త కుళ్ళు కున్నారేమో నని !

అక్కడ ఆ బాల్య సృతులలో వుండగానే , సెల్ కు నేను జవాబివ్వలేదని , మురళి సెల్ కు , మా వారు ఫోన్ చేసారు బయలు దేరారా అని . ఎక్కడ సార్ మేడం అసలు కదలటం లేదు అని నామీద ఆయనకు కంప్లైంట్ చేసాడు మురళి . అతని బాధ అతనిది , అతని పెళ్ళికి ముహూర్తాలు పెట్టు కోవటానికి మరునాడు పిల్లా వాళ్ళూ వస్తున్నారని కబురందింది మరి .
నందిగామ లో , మా చిన్న మామయ్య ఇంట్లో , ఇంకాసిని గుంటూరు , విజయవాడ స్మృతులను తలుచుకొని , హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైనాము నేనూ , జయా, మురళి . ఈ ప్రయాణము లో విజయవాడలో తిరుగుతునంతసేపూ , జస్వంత్ ను , నువ్వు చాలా ముద్దుగా వున్నావురా , నిన్ను నేను తీసుకెళుతానురా అని జయ వాడిని తెగ ఏడిపించేసింది . పాపం పసివాడు , వాడూ నిజం గానే జయత్త వాడిని తీసుకెళుతుందని భయపడ్డాడు . ఇంతకీ అనుకున్న హంసలదీవి , బందరు పాండురంగడుని చూడనే లేదు . మమ్మలిని ఆదరించి , ఎంతో ఆప్యాయము గా గౌరవం గా చూసుకున్న ఆదరించిన , మా మరిది గారు శంకర్ , ఈ మద్యనే , ఆయన 50 వ ఏట , అకస్మికంగా , గుండె పోటుతో మరణించటము మరువలేని విషాదము .

Sunday, August 8, 2010

విజయవాడ - 3 ( బందర్ - మొవ్వ - శ్రీకాకుళం )



మా పిన్ని తిరుపతి నుండి వచ్చి , సీత దగ్గర , విజయవాడ లో వున్నదని తెలిసి , మా అమ్మ చెల్లెలిని చూసేందుకు విజయవాడ వెళుదామనుకున్నది . నేనూ , జయ కూడా అమ్మ తో పాటు బయిలుదేరాము . ఇంతకు ముందు వెళ్ళినప్పుడు , హంసలదీవి చూడలేదు . భావన తెగ ఊరిస్తున్న , బందరు పాండురంగని చూద్దామనుకున్నాము , వెళ్ళ లేక పోయాము . ఓ అల్ల నెప్పుడో , ఆంధ్ర మహావిష్ణువు ఆలయం వుందను కొని , విజయనగరం దగ్గర వున్న శ్రీకాకుళం వెళ్ళి , అది కాదని , ఈ శ్రీకాకుళం విజయవాడ దగ్గరే వుందని తెలుసుకొని అప్పటి నుండి వెళ్దామని అనుకుంటుంటే ఇప్పటి దాకా వీలవలేదు . మరి అదీ చూడాలి . అందుకే అమ్మకు , మావారి కి మస్కా కొట్టి అమ్మతో బయిలుదేరాను . నా తోపాటు జయా తయారు .

ఒక పూటంతా కబుర్ల తోనే సరి పోయింది . మరునాడు ఉదయమే , అమ్మా , పిన్నీ , నేనూ , జయ మా కారు లో బందరు బయలు దేరాము . పండరీపురం లో , నల్లగా , నిగ నిగ మెరిసి పోతూ , రెండు చేతులనూ ఇరుపక్కలా మడిచి పెట్టు కొని వున్న పండరినాథుని చూసినప్పుడే చాలా భావోద్వేగాని కి గురైనాను . మళ్ళీ మళ్ళీ చూడాలని పించేంతటి సుందరమూర్తి . అప్పటి నుండి మళ్ళీ ఒకసారి పండరిపురం వెళ్ళాలి అని అనుకుంటూ వున్నాను . పోయినసారి విజయవాడ వచ్చినప్పుడు , సీత చాలా గొప్పగా చెప్పింది , బందరు గుడి గురించి . అపుడే భావన కూడా చాలాసారులు ప్రమదావనం లో చెప్పింది . ఆంతవరకు , బందరు అంటే , గోల్డ్ కవరింగ్ నగలకి , బందరు లడ్డూల కు మాత్రమే ప్రశిద్ధి అనుకున్నాను . మా పెళ్ళప్పుడు , మా అమ్మ , ఉమా గోల్డ్ కవరింగ్ నగల వాళ్ళ అడ్వర్టైజ్ మెంట్ లో చూసి ,' హంసలపతకం ' గొలుసు , నాకు చేయించింది . అది ఎంత హిట్ అయ్యిందంటే ఆ తరువాత చాలా మంది నా గొలుసు చూపించి చేయించుకున్నారు ! అంతగా ఎదురు చూసిన పండరినాథుని ఆలయాని కి చేరుకున్నాము . అక్కడ ఆ గోపాలును చూస్తూ వుంటే , పండరి పురం లో లాగే వున్నడని , నన్ను నిరాశ పరచలేదని చాలా సంతోష పడి పోయాను . పండరిపురము లో చాలా రెష్ మూలము గా ఎక్కువ సేపు స్వామి సన్నిధి లో వుండలేక పోయాము . కాని ఇక్కడ ఎక్కువ రష్ లేదు . పైగా ఆయన ముందు ఎంత సేపు నిలబడినా , పాదాల చెంత తల ఆనించి , చాలాసేపు ప్రార్ధించినా ఎవ్వరూ పక్కకు నెట్టి వేయలేదు . కాక పోతే వెనుక వాళ్ళకు కూడా అవకాశము ఇవ్వాలిగా ! మంటపము లో చాలా సేపు కూర్చొని , స్వామిని చూస్తూ తన్మయం చెందాను . ఆ తరువాత పక్కనే వున్న శివాలయము లోనికి వెళ్ళాము . అక్కడ ఎవరికి వారు శివలింగము ప్రతిష్టించుకొని పూజించుకో వచ్చుట . పెద్ద లింగం చుట్టూ గుడి అంతా చిన్న చిన్న శివలింగాలు వరుసగా ప్రతిష్టించి వున్నాయి . కోనేటి దగ్గర చాలా సేపు కూర్చున్నాము . అక్కడ ఎంతసేపు వున్నా తనివి తీరలేదు . నేనైతే , మళ్ళీ మళ్ళీ ఆ గోపాలుని దర్షించుకొని వదల లేక వదల లేక వదిలి వచ్చాను .

అక్కడే వున్న గోల్డ్ కవరింగ్ షాపు లో మా మనవరాళ్ళిద్దరికీ చెరొక గొలుసు కొన్నాను . బస్ స్టాప్ దగ్గర , బందరు లడ్డూలు కొన్నాను . కాని ఎక్కడా సరైన భోజనము దొరకలేదు . ఐనా తిరిగేటప్పుడు భోజనం గురించి ఆలోచన రాదు . బందరు బీచ్ మటుకు చాలా నిరాశ పరిచింది . అబ్బ ఎంత చండాలం గా వున్నదంటే , మేమసలు కార్ లోనుండి కిదికి దిగలేదు . కొంచం దూరం కార్ లోనే వెళ్ళాము . బీచ్ కు దగ్గరిలోనే స్నాన ఘట్టము లాంటిది వుంది . అక్కడ కొన్ని భావులు వున్నాయి . ఎన్నో గుర్తు లేదు . వాటి ల్లో అన్ని నదుల నీరు వస్తుందిట .ఆ నీటి తో స్నానం చేస్తే ఆ నదుల లో స్నానం చేసినంత పుణ్యం అట . అప్పుడే వాన కూడా మొదలైంది . ఆ వాన లో తడుస్తూనే , మా పిన్నీ , జయా మా డ్రైవర్ మహేష్ వెళ్ళి ఒక్కొక్క భావి లో నీరు చేదు కొని తలపై చల్లు కున్నారు . నాకూ మా అమ్మ కోసం సీసాలో తీసు కొచ్చారు . అలా వాన లో తడుస్తూ , భావి లోనుండి నీరు తోడుకుంటూ , తల పైన చల్లు కోవటము బాగుంటుంది . కాని ఆరోగ్యం సహకరించనప్పుడు అలాంటి సరదాల జోలికి వెళ్ళ క పోవట మే మంచి కదా అని నా అభిప్రాయం .

శ్రీకాకుళం దారి అడుగుతూ బయలుదేరాము . ఇంతలో ' మువ్వ ' అని పేరు కనిపించింది . అరే ఇదేమైనా క్షెత్రయ్య పదాలు రాసిన మువ్వ నా అనుకొని , దాని దారి చూసుకుంటూ వెళ్ళాము . అప్పటికే సాయం కాలము 5 గంటలైంది . గుడి తలుపులు తీస్తూ వున్నారు . అది క్షేత్రయ పదాలు రాసిన మువ్వ గోపాలుని ఆలయమే . పక్కనే చిన్నగా క్షేత్రయ్య పదాలు వినిపిస్తూ , గుడి చాలా ప్రశాంతము గా వుంది . గోపాలుని విగ్రహము కిందుగా క్షేత్రయ్య విగ్రహము కూడా వుంది . అనుకోకుండా లభించిన దర్షనము .

కృష్ణ దేవరాయుని గురించి చదివినప్పుడు , శ్రీకాకుళము లో ' ఆంధ్ర మహా విష్ణువు ' గుడి కట్టించాడని , అక్కడ తరుచుగా పూజలు చేసే వాడని చదువుకున్నాము . కృష్ణదేవరాయుని మీద అభిమానము తో ఆ గుడి వెతుక్కుంటూ వెళ్ళాము . శ్రీకాకుళము చాలా చిన్న వూరిలా అనిపించింది . మేము అక్కడికి చేరుకునే సరికి చీకటి పడి పోయింది . లైట్ లు కూడా గుడ్డిగా వున్నాయి . గుడి ముందు అంతా కడుతున్నారు . చిన్నగా ఎక్కడ పడి పోతామో అని భయము తో తడుముకుంటూ లోపలికి వెళ్ళాము . చాలాసేపు గుడిలో వుండి , కృష్ణదేవరాయుని చే ప్రతిష్టింప బడి పూజించబడిన , ఆంధ్ర మహావిష్ణువును చూస్తూ నిలబడ్డాము . నాకు చిన్నప్పుడు చూసిన ' మహా మంత్రి తిమ్మరుసు ' సినిమా , అందులోని ,' చరిత్ర ఎరుగని మహా పాతకం ఈ దేశానికి పట్టినదా , ఆంధ్రదేవా వెంకటేస్వరా ఈ విధి రాయలే చేసెనా ' పాట గుర్తొచ్చింది ! అప్పుడు ఆ సినిమా చూసి , చివరలో ఈ పాట అప్పుడు చాలా ఏడ్చాను . ఇప్పుడు ఇక్కడా మనసంతా భారమైపోయింది . చెప్పుడు మాటలకు ఎంత శక్తి వుంటుందో , కృష్ణ దేవరాయులు , తిమ్మరుసుల కథే చెప్పుతుంది . ఆ ఘోరానికి సాక్షి ఈ ఆంధ్రమహా విష్ణువే కదా అనిపించింది . శ్రీకృష్ణ దేవరాయుని విగ్రహం దగ్గర అమ్మా , పిన్నీ ఆముక్తమాల్యద లోని పద్యాలు చదువుకుంటూ కూర్చున్నారు . జయ ఏవో కూనిరాగాలు తీస్తూ , నేనేమో ' దేశ భాషలందు తెలుగు లెస్స ' అని పొగిడిన రాయలు , తిమ్మరుసుల చరిత్ర నెమరువేసుకుంటూ , ఆ చీకట్లో , ఆ నిశబ్ధ వాతావరణము లో చాలా సేపు , పూజారి వచ్చి హారతి ఇస్తున్నాము అని పిలిచేవరకూ కూర్చున్నాము .

విజయవాడ చేరే సరికి రాత్రి 11 గంటలైంది . మరునాడు పొద్దున్నే , దుర్గను దర్షించుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైనాము . మావారు రెండు రోజల కోసం మాత్రమే కారు ఇవ్వటము వలన , ఈ సారి కూడా హంసలదీవి చూడకుండా నే వెనుతిర్గాల్సి వచ్చింది . మరి హంసలదీవి ప్రాప్తం ఎప్పుడో !

Thursday, August 5, 2010

గుంటూరు - నాగార్జున సాగర్ - విజయవాడ -1




గుంటూరు నేను పుట్టిన వూరు . కాని , నేను పి . యు . సి లో చేరేవరకు ఎప్పుడూ గుంటూర్ వెళ్ళిన గుర్తు లేదు . గుంటూర్ ఉమెన్స్ కాలేజ్ లో , పి .యు . సి లో చేరాను . ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ లో వుండేదానిని . మా రూం లో ఏడుగురము వుండే వాళ్ళము . అందులో మణి , నేను ఒకే గ్రూప్ , ఒకే సెక్షన్ . ఇద్దరమూ మొదటిసారి ఇంటి నుండి దూరం గా వుండటము . దాని తో ఇద్దరమూ మంచి ఫ్రెండ్స్ మి అయ్యాము . హేమ , మాకన్నా సీనియర్ . కాని మాకు కొంచం ఫ్రెండ్ అన్నమాట . చాలా బాగా పాడేది . సాయంకాలం హాస్టల్ మేడ మీద ముగ్గరమూ కూర్చొని , రాధా మాధవ పూల సువాసనను ఆస్వాదిస్తూ , హేమ పాడే పాటలు వింటూ , కృష్ణశాస్త్రి భావ గీతాలు , ఎంకి పాటలు చదువుకుంటూ వుండే వాళ్ళం . మా కుక్ మాధవయ్యర్ , సాంబార్ , దోసెలు , ఊతప్పాలు బ్రహ్మాండం గా చేసేవాడు . మా కాలేజ్ కాంటిన్ లో మిరపకాయ బజ్జీలు చాలా బాగుండేవి , నేను , మణి రొండు కొనుక్కొని , హేమ కంట పడకుండా దాక్కొని తినటానికి మహా కష్టపడి పోయేవాళ్ళము . మరేం చేస్తాం , మాదగ్గర డబ్బులు ఎక్కువ వుండేవి కాదు . నెల కొక సారి సినిమాకు తీసుకెళ్ళేవాళ్ళు . ఒకసారి బయటకెళ్ళ టానికి పర్మిషన్ ఇచ్చేవారు . అప్పుడు ఎంచక్కా నాజ్ థియేటర్ లో సినిమా , శంకర్ విలాస్ హోటల్ లో దోస అబ్బో ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో ! కొంతమంది రౌడీ పిల్లలు , లంచ్ టైం లో డేస్ కాలర్ పిల్ల ల గుంపులో , కనపడకుండా బయటకు వెళ్ళేవాళ్ళు . మేము అలాంటి రౌడీస్ మి కాము . పైగా వాళ్ళెళ్ళినా , అమ్మో మా కైతే ఎంత భయం వేసేదో !అప్పట్లో , గుంటూరు లో అరండల్ పేట , బ్రాడీపేట ముఖ్యమైన వీధులు . అరండల్పేట , ఎన్నో లైనో గుర్తు లేదు , లో మా పెద్ద అమ్ముమ్మ ( మా అమ్ముమ్మ అమ్మ ) ఇల్లు వుండేది . ఆమె తరువాత , ఆ యిల్లు మా అమ్మమ్మకు ఇచ్చారు . అందులోనే , మా చిన్న మామయ్య వుండి చదువుకునే వాడు . అమ్మమ్మ , అప్పుడప్పుడూ వచ్చి పోతూ వుండేది . తాతగారు కూడ ఏదైనా పని వుంటే వచ్చేవారు . వాళ్ళు వచ్చినప్పుడు , ఆదివారము నాడు , నేనూ , మణి చర్చ్ ( మణి క్రిష్టియన్ , తంతో నేను అప్పుడప్పుడు చెర్చ్ కు వెళుతుండేదానిని ) కు వెళ్ళి , అమ్మమ్మ దగ్గరకు వెళ్ళే వాళ్ళము . మా తాతగారు ప్రతి రోజూ అగ్ని హోత్రం చేసి పూజ చేసుకొని , మడితో భోజనము , దాదాపు 3 గంటల ప్రాంతము లో తినేవారు . అందుకని అమ్మమ్మ మాకు మైల వంట చేసి , ఇద్దరినీ పక్క పక్క నే కూర్చో బెట్టే అన్నం వడ్డించేది . అంత ఆచారవంతులైనా , మణి ని కూడా నాతో సమానంగా ఆదరించేవారు .భోజనము అయ్యాక ఇద్దరమూ కంచాలు తీసి కడిగి పెట్టేవారము . తిన్న ప్రదేశము లో నీళ్ళు చల్లి , బట్ట తో తుడిచేసేదానిని . అది చాదస్తం అని ఎప్పుడూ అనుకోలేదు , శుభ్రం అనే అనుకున్నాను . మరి ఈ రోజు కూడా డైనిగ్ టేబుల్ మీద తిన్నా , ఆ తరువాత నీళ్ళు చల్లి తుడుస్తాను . తాతగారు రాకుండా , అమ్మమ్మ ఒక్కతే వచ్చినఫ్ఫుదు , ఇద్దరమూ సినిమాల కు వెళ్ళేవాళ్ళము . శంకర్ విలాస్ పక్కన ఏదో థియేటర్ వుండేది , దాని పేరు గుర్తులేదు , అవును మరి ఈ విషయాలు ఇప్పటివి కాదు దాదాపు నలభై రెండేళ్ళ క్రితం వి ! అమ్మమ్మకు ఒక్కతే వెళ్ళాలంటే చాలా భయం . అప్పట్లో అంటే , అమ్మమ్మ చిన్నప్పుడు గుంటూరు లో రిక్షా వాళ్ళు , ఆడవాళ్ళు ఒక్కరే వస్తే , దారి తప్పించి , మెడలో వస్తువులు గుంజుకొని , ఎక్కడో వూరి బయట వదిలేసేవారట . ఆ కథలు అమ్మమ్మ చాలా చెప్పేది . ఇంకా ఒక చిన్న జ్ణాపకం , అదేమిటంటే , అప్పట్లో మూర్చల వ్యాది వున్నవారి మెడలో ఓ బిళ్ళ ఇతనికి మూర్చ వ్యాధి వుంది అని ఇంకా ఏదో రాశి వేళ్ళాడ దీసేవారు . అతను రోడ్ మీద పడి పోగానే , అక్కడ వున్న ఇళ్ళ వాళ్ళు బిందల కొద్దీ నీళ్ళు తెచ్చి అతని మీద పోసేవారు . ఓసారి మా ఇంటి ముందు ఎవరో పడిపోతే అమ్మమ్మ కూడా బిందెతో నీళ్ళు తీసుకెళ్ళింది , కాని నన్ను అక్కడికి రానీయలేదు . ఇప్పుడు సాఫ్ట్ వేర్ వాళ్ళు మెడలో ఐడెంటిటీ కార్డ్ వేసుకొని తిరుగు తుంటే , నాకు అప్రయత్నం గా అదే గుర్తొస్తుంది . మా కోడలి తో ఓసారి చెపితే , తను పడీ పడీ నవ్వింది . వాళ్ళ ఫ్రెండ్స్ కు కూడా చెప్పిందిట .


జిందగీ లో మొదటిసారి లభించిన స్వాతంత్రాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే , హుం . . . ఇంగ్లిష్ పేపర్ తన్నేసి , మళ్ళీ సెప్టంబర్ లో రాసి , పాసైనా , డిసెంబర్ లో మంచి సంబంధం వచ్చిందని పెళ్ళి చేసి అత్తారింటికి పంపించేసినంత . పెళ్ళి తరువాత చాలా సార్లే గుంటూర్ వెళ్ళాను . ఈ మద్య చాలా సంవత్సరాల తరువాత వెళ్ళాను . అదేమిటో అంతా మారి పోయింది . ఏదీ గుర్తుపట్టలేక పోయాను .

విజయవాడ దగ్గర నందిగామ నుండి పది మైళ్ళ దూరం లో వున్నాయి పొక్కునూరు , మా నాన్నగారి వూరు , చింతలపాడు మా అమ్మా వాళ్ళ వూరు . మా నాన్నగారి తలితండ్రులు చిన్నప్పుడే పోవటము వలన అక్కడ ఎవరూ లేరు . పొక్కునూర్ ఒక్కసారి మాత్రం చూద్దామని వెళ్ళాము . అక్కడ కృష్ణ వడ్డున చిన్న ఇల్లు నాన్నగారి వాళ్ళది . అది చూడగానే ఎంత నచ్చేసిందో . ఎప్పటికైనా అక్కడ వుండాలి అనుకునే దానిని . స్చప్ . . . వీలు కాలేదు . అమ్మగారి వూరు చాలా సార్లే వెళ్ళాము . అలా విజయవాడ చిన్నప్పటి నుండి చాలా సార్లు వెళ్ళినా , ఎప్పుడూ ఊరు చూడలేదు . దుర్గ గుడి కి మాత్రం వెళ్ళేవాళ్ళము . గుంటూర్ లో చదువు కుంటున్నప్పుడు , నాగార్జున్ సాగర్ వెళ్ళాలంటే , విజయవాడ వచ్చి , బస్ మారాల్సి వచ్చేది . నేను , మా చిన్నమామయ్య , ( తను కూడా గుంటూర్ లో పి. యు .సి చదువుతుండే వాడు ) అప్పుడే కొత్తగా పెట్టిన , మనోరమ హోటల్ లో భోజనం చేసి , నాగార్జున సాగర్ బస్ ఎక్కేవాళ్ళము . మనోరమ హోటల్ లో భోజనం 2.50 వుండేది . స్వీట్ , పాన్ ఆకర్షణ . రెండేళ్ళ క్రితం నేనూ , జయా ఎటైనా తిరగనీకి వెళుదాము అనుకున్నప్పుడు , తక్కువ ఖర్చు తో , దగ్గరి వూరికి , ఇద్దరమే ఐనా వెళ్ళవచ్చని విజయవాడ వెళుదామనుకున్నాము . అప్పుడే హంసలదీవి గురించి చదివాను . అదీ చూద్దామని అనుకున్నాము . సరే ఏ కళన వున్నారో , మా వారు కార్ తీసుకెళ్ళ మన్నారు . ఓ శుభముహూర్తాన పొద్దున్నే బయలు దేరాము . చిన్నప్పుడు వున్న నాగార్జునసాగర్ నుండి వెళుదామనుకొని అటే బయలుదేరాము .

నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ దగ్గర చిన్న కాంప్ ' పొట్టి చెలమ ' లో వుండేవాళ్ళము . నేను 10 , 11 తరగతులు అక్కడనుండి సాగర్ వెళ్ళి , హైస్కూల్ లో చదివాను . జయ , మా చిన్న చెల్లెలు చాలా చిన్న వాళ్ళు . నాకంటే ఎక్కువగా వాళ్ళు అక్కడ గడిపారు . ఆ లెఫ్ట్ కెనాల్ తవ్వు తున్న ప్పుడు , అక్కడ , కాంతారావు , రాజనాల , రాజశ్రీ ల జానపద సినిమాలు షూటింగ్ జరిగాయి . సరే చిన్న నాటి సంగతులు తలుచుకుంటూ ఆ ప్రదేశాని ఎలాగో గుర్తు పట్టి దిగాము . అంతా అడవి లా వుంది . దూరం గా ఎక్కడో కూలి పోయిన గోడలు మాత్రం కనిపిస్తున్నాయి . జయ అంతే , కార్ దిగి గబగబా అటెళ్ళి పోయింది . అంతా నిర్మానుస్యం గా వుంది . మేమున్నప్పుడే , పాములు తెగ వచ్చేవి . గాంగ్ వాళ్ళు వాటిని , చంపేసేవాళ్ళు . ఇప్పుడు వాటి వంశంవి ఏవైనా మమ్మలిని గుర్తు పట్టి , పగతో కాటేస్తాయేమో నని నా భయం . అబ్బే జయ వింటేనా ? ఒకటే పరుగులు . ఆ శిధిలాల లోకి వెళ్ళి , ఇక్కడ మన ఇల్లు వుండేది . ఇది పలానా వాళ్ళ ఇల్లు . అంటూ తన్మయం చెంది పోయింది . నా కైతే అక్కడ ఏమీ కనిపించలేదు . చెప్పానుగా అక్కడ నేనున్నది తక్కువ అని . ఎలాగో కష్టపడి , కార్ దగ్గరికి తీసు కోచ్చాను . నా మీద ఒకటే గొణిగింది , తను తీసిన ఫొటో నామూలం గా సేవ్ చేయలేదుట !

అటునుండి సాగర్ స్కూల్ కు వెళ్ళాము . స్కూల్ ఏమాత్రం మారలేదు . మా క్లాస్ రూం దగ్గరకు వెళుతే ఆరోజులన్ని గుర్తొచ్చాయి . మాత్స్ లో క్లాస్ లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేదనిని . నా ఫ్రెండ్ భమిడపాటి హేమలత . తనూ నేనూ ఎప్పుడూ మాత్స్ లో పోటీ పడేవాళ్ళము . మా మాథ్ టీచర్ , రాజూ మాస్టరుగారు మమ్మలిని , మాడపాటి , భమిడపాటి అని పిలిచేవారు . అంతా బాగానే వుంది కాని , యస్. యస్ . యల్ . సి రిజల్ట్ వచ్చేవరకు తెలీలేదు , నాకు వయసు తక్కువుందని , అందుకని రిజల్ట్ విత్ హెల్డ్ లిస్ట్ లో పెట్టారని . మా నాన్నగారు , నల్గొండ , హైదరాబాద్ చుట్టూ తిరిగి నా రిజల్ట్ తెచ్చేసరికి పుణ్యకాలం గడిచిపోయింది . గుంటూరు కాలేజీ లో చేరేందుకు వెళ్ళేసరికి అన్ని సబ్జెక్ట్ ల లో సీట్లు ఐపోయి , హిస్టరీ , డ్రాయింగ్ కాంబినేషన్ లో సీట్ వొక్కటే వున్నది . ఇంకో విషాదం ఏమిటంటే , మాత్స్ లో ఖాళీ వున్నా , నాది జనరల్ మాత్స్ కాబట్టి ఇవ్వలేదు . అప్పటి వరకూ జనరల్ మాత్స్ వాళ్ళకు ఫ్యూచర్ లో మాత్స్ లో సీట్ ఇవ్వరని నాకు తెలీదు . మేము , వరంగల్ నుండి సాగర్ వచ్చి స్కూల్ లో 10 లో చేరేటప్పుడు , అమ్మాయిలంతా జనరల్ లో చేరుతున్నారని నా పేరు కూడా జన్రల్ మాత్స్ వేసాడట స్కూల్ క్లర్క్ . అంతే , మాత్స్ లో యం యస్సీ చేద్దానుకున్న నా కల అలా కూలిపోయింది . ఏమీ తెలియని తనం . నా దురదృష్టం . అలా అన్ని నెమరు వేసుకుంటూ వుంటే అక్కడే వున్న అటెండర్ మా గురించి అడిగి , పాత స్టూడెంట్ నని తెలుసు కొని , తలుపులన్ని తెరిచి , స్కూల్ మొత్తం చూపించాడు . అక్కడి నుండి , డాం దగ్గరకు వెళ్ళాము . అక్కడే వున్న శివాలయం కు వెళ్ళాము . మా వారు నన్ను చూడటానికి వచ్చినప్పుడు ఆ శివాలయం కు వచ్చాము . ఇద్దరమూ కలిసి మొదటి సారిగా వెళ్ళిన ఆలయం అది .

మా పెళ్ళైన అప్పుడు , అక్కడి విజయ విహార్ గెస్ట్ హౌస్ లో కూడా రెండు రోజులు వున్నాము . మేము వున్నప్పటికి ఇప్ప్పటికి , నాగార్జున సాగర్ ఎక్కువగా ఏమీ మార లేదు . మేము డాం కొత్తగా కడుతున్న రోజుల లో అక్కడ వున్నాము . డాం మీద బొంగుల తో మెట్ల లాగా ఏర్పాటు చేసి , దాని మీదనుండి కూలీలు ఎక్కుతూ పని చేస్తూ వుంటే చూసేందుకు చాలా బాగుండేది . రాముడు భీముడు సినిమాలో , విజయ లక్ష్మి , యన్ .టి . ఆర్ ల తో ఓ గ్రూప్ డాన్శ్ వుంది . అప్పుడు అక్కడ చాలా సినిమాలు షూటింగ్ చేసేవారు . డాక్టర్ చక్రవర్తి లో మనసున మనసై తోడొకరుండిన పాట కూడా రైట్ బాంక్ గెస్ట్ హౌస్ లో తీసారు . ప్రాజెక్ట్ హౌస్ , విజయవిహార్ , పైలాన్ , మా స్కూల్ పక్కన వున్న టైగర్ వ్యాలీ ఏవీ ఎక్కువగా మార్పు చెందలేదు .

మాచర్ల లో చెన్నకేశవ స్వామి ఆలయముకు వెళుదామనుకున్నాము , కాని డాం దగ్గరే ఆలశ్యం కావటము తో , గుడి మూసి వేసారు . వెళ్ళ లేక పోయాము . అమరావతి , గుంటూరు లో వున్నప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్ళాను . మా వారి తోకలిసి కూడా వెళ్ళాను . ఇప్పుడు చూసినప్పుడు చాలా నిరాశ కలిగింది . గుడి కంతా ఏమిటో నీలం , పసుపు రంగులు వేశారు . అసలు గుడి అలా రంగులు ఎందుకు వేస్తారో అర్ధం కాదు . ఈ మధ్య ఏ గుడి చూసినా అలా రంగులేస్తున్నారు . దానితో గుడి కి వుండే కళ పోతుందనిపిస్తుంది . కృష్ణమ్మ ఎక్కడో అల్లంత దురాన వున్నది . అప్పుడైతే కృష్ణ దాకా వెళ్ళాము . అమరేశుని దర్షించుకొని , అమరావతి స్తూపం చూసి , విజయవాడ చేరేసరికి రాత్రైంది . మనోరమా హోటల్ లో వుందామనుకున్నాము కాని అది రెనవేషన్ చేస్తున్నారు . శ్రీనివాస కు వెళ్ళాము . మా వారు విజయవాడ లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ హోటల్ లోనే వుండేవారని చెప్పినట్లు గుర్తు . ముందు రూం లేదన్నాడు . అంత రాత్రి ఎక్కడికెళ్ళాలి అని , మావారికి ఫోన్ చేస్తే , ఆయన మాట్లాడుతే , అప్పటి వరకూ లేని రూం వచ్చింది ! అసలైతే , మా పిన్ని పిల్లలు భాస్కర్ , సీత అక్కడే వున్నారు . వాళ్ళ ఇంటికి వెళ్ళ వచ్చు . కాని సీత కూతురి , పురిటి కి డిల్లీ వెళ్ళి ఆ , మరునాడు వస్తోంది . భాస్కర్ భార్య కేమో ఆరోగ్యం సరిగ్గాలేదు . మేము సర్దాగా తిరగటం కోసం వాళ్ళను ఇబ్బంది పెట్టటం ఇష్టం అనిపించలేదు .

ఈ రోజు మళ్ళీ అంతా చదువుకుంటే గుటూరు , నాగార్జున సాగర్ ల గురించి పూర్తి గా చెప్ప లేదు అని అనిపించింది . అందుకే మళ్ళీ ఆ పోస్ట్ ను రెండు భాగాలు గా చేసి రాసాను .

( సశేషం )

Friday, April 2, 2010

రాజమండ్రి - 2





మొదటి సారి సిలిగురి వెళ్ళేటప్పుడు , రాజమండ్రి స్టేషన్ చూసాను . అప్పుడు , అక్కడ , పసుపు , ఆకుపచ్చ డాట్స్ తో వున్న బత్తాయిలను చూసి , తెగ హాచర్య పోయి , ముచ్చటపడి కొన్నాను . ఆపైన రుచి మరిగి ఎప్పుడు సిలిగురి వెళ్ళేటప్పుడు , తిరిగి వచ్చేటప్పుడు , రాజమండ్రి స్టేషన్ లో బత్తాయిలు , వైజాగ్ స్టేషన్ లో కందిపొడి , విజయవాడ స్టేషన్ లో భోజనము తప్పనిసరైపోయాయి . రాజమండ్రి వస్తోంటే చాలు గోదావరి అందాలు చూడటానికి ఎవరినీ పట్టించు కోకుండా కిటికీ దగ్గర సెటిల్ ఐపోయేదానిని . అప్పుడే డిసైడ్ ఐపోయా జీవితములో ఒకసారైనా రాజమండ్రి స్టేషన్ లో దిగి , కోనసీమ లో గోదావరి అందాలు చూడాలని , ముచ్చట కొలిపే బత్తాయిలను తినాలని !!!!

ఆ కోరిక మొదటిసారిగా మా ఆడపడుచు విజయ పెళ్ళి లో తీరింది . తనతో పాటు మూడు నిద్రలకి వాళ్ళ అత్తవారి వూరు , గుమ్మళ్ళదొడ్డి వెళ్ళాను . మా ఇంట్లో గోదావరి జిల్లాలవారితో వియ్యమందటము కూడా అదే మొదటిసారి . వాళ్ళ భాష , అలవాట్లు చాలా గమ్మత్తుగా అనిపించాయి . గుమ్మళ్ళదొడ్డి లో వాళ్ళ ఇల్లు , ఆవూరు అచ్చం సినిమాలలో చూపించినట్లుగానే వున్నాయి . సిరిసిరిమువ్వ సినిమా అక్కడే తీసారుట . ఆ తరువాత మావారు ట్రాన్స్మిషన్ లైన్ లోకి వచ్చాక పని మీద వెళుతుంటే నేనూ వెళ్ళాను . అదేమిటో , ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక కారణము తో రెండు రోజుల కే తిరిగి వచ్చేయాల్సి వచ్చేది ! ఇది కాదు పని అని , నా పోరు పడలేక అక్కడ ఓ వర్క్ తీసుకున్నారు . రాజమండ్రి దగ్గర రాజోలు లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు .
ఓ శుభముహుర్తాన , చలో అనుకుంటూ వెళ్ళాము . అక్కడ ఇల్లు చూడగానే సీతారామయ్యగారి ఇల్లు లాలేదే అని కాస్త నిరుత్సాహం వేసిన మాటనిజమే . కాని సద్దేసుకున్నాను. మేము వెళ్ళేసరికి నీళ్ళురావటము , వెనక్కి పోవటము ( ? ) ఐపోయాయి . ఒక్క చుక్క నీరు లేదు ఎలాగా అనుకుంటూ వుంటే మావారికి గోదావరి లో స్నానం చేసేస్తే పోలే అనిపించి పక్కింటి ఆయనను , ఇక్కడికి దగ్గరలో గోదావరి ఎక్కడవుందీ అని అడిగారు . పట్టిసం ఇక్కడికి దగ్గరే , అక్కడ స్నానం చేసి , వీర్భద్రీశ్వరునికి అభిషేకం చేయించు కోండి , ఈ రోజు కార్తీక సోమవారం , చాలా మంచిది అన్నారు . అంతే రాజమండ్రి దగ్గర నావ ఎక్కి పట్టీసం చేరుకున్నాము . గోదారి గంగమ్మ స్నానాలు చేయంగ అనుకుంటూ హాపీగా స్నానం చేసి , కొండ ఎక్కి ఈశ్వరుని దర్షించుకొని , అభిషేకం చేసి వచ్చాము. .

ఓవారం రోజులు ఆయన బిజీగా వున్నా నాకేమి దిగులేయలేదు . మేమున్న కాలనీ లో , మా వక్కటితప్ప అన్ని ఒకే కుటుంబానివి . అందరూ గోడల మీదనుండి పెద్ద గొంతు తో మాట్ల్లడుకోవటము , ఏదైనా తేడావస్తే , పెద్దగా అందరూ కలిసి ఆ తేడా తెచ్చినవాడి మీద అరవటము అబ్బో చాలా ఎంజాయ్ చేసాను . ఆకుకూరలు , చుక్క కూర , గోంగూర ఒక్కొక్కటి అరచేతి మందాన వుండి ఫ్రెష్ గా నిగ నిగ లాడిపోతుండేవి . పచ్చివే తినాలనిపించేంత బాగుండేవి . ఏమిటో , అక్కడ ఏది చూసినా తెగ నచ్చేసేది !

వూళ్ళుచూద్దామని అనుకున్నాక అన్ని తెలిసిన డ్రైవర్ కావాలంటే , అక్కడి లోకల్ కాంట్రాక్టర్ ఒకాయన , ట్రావెల్స్ లో పని చేసే జానీ అనే అతనిని పిలిపించారు . బల్లకట్టు మీద కార్ తోసహా , బర్రెలు , మేకలు , సామాన్లతో మనుషుల తో పాటు గోదావరి దాటటము తో మా ప్రయాణము మొదలైంది . గోదావరి పాయల వెంట , గట్ల మీద , కొబ్బరి చెట్ల నడుమ , మధ్య మధ్య లో పాలకోవా తింటూ , చాలా ఆహ్లాదంగా సాగింది .ద్రాక్షారామం , సామర్ల కోట , భీమవరం , పాలకొల్లు , మందపాడు , ర్యాలి , పిఠాపురం, ధవళేశ్వరం అన్ని చూసాము . అంతర్వేది దగ్గర , గోదావరి ,సముద్రం లో కలిసే చోటుకు వెళ్ళాము . అక్కడ యు షేప్ లో వున్న చోట స్నానం చేసి వస్తూ , ఇక్కడ ఎవరూ లేరేమిటి , అంతా దూరంగా ఎక్కడో వున్నారు అనుకున్నాము . ఇంతలోనే ఒక పెద్ద అల మా దాకా వచ్చేసింది . ఆ తరువాత జానీ , మీరు అంత దూరం వెళుతారనుకోలేదు , అది చాలా డేంజర్ పాయింట్ ఎవరూ వెళ్ళరు , మీరు చాలా లక్కి , మీరున్నప్పుడు పోటు రాలేదు అన్నాడు . బాపురే , మాకు తెలీకుండానే సాహసం చేసాము , అక్కడ కొట్టుకు పోతే ఎవరికీ తెలిసేది కూడా కాదు అనుకున్నాము . కార్తీక మాసం కావటము వలన అన్నిశివాలయాలలో అభిషేకాలు చేసి , దీపాలు వెలిగించాము . రాజమండ్రి , గోదావరి ఒడ్డున వున్న ఉమామహేశ్వర ఆలయము లో ఈశ్వరుని 108 కలువ పూలతో పూజించి , రుద్రాభిషేకం చేసాము . ఆత్రేయపురం లో స్వీట్స్ కొన్నాము . బండారులంకలో మా వారు చీరలు కూడా కొనిచ్చారు . క్రిష్టియన్ ఐనా జానీ , అన్ని గుడులూ వాటి విషిస్టత చెప్పుతూ చక్కగా చూపించాడు . మావారి తో పని చేసే విజయ భాస్కర్ ,లాంచీ ఏర్పాటు చేసి , పాపికొండలు తీసుకెళ్ళాడు . లాంచీ లోనే వండటము , డెక్ మీద కూర్చొని తినటము అందాలరాముడు సినిమా గుర్తొచ్చింది . తిరిగి వచ్చేటప్పుడు లాంచీ మీదనుండి దీపాల వెలుగులో గోదావరి బ్రిడ్జ్ చూడటము , లాంతర్లు కట్టుకొని వెళ్ళే నావలను చూడటము మరపురాని అనుభూతి .అన్నవరం లో సత్యనారాయణవ్రతం చేసుకున్నాము . మొత్తం వారం రోజులు , జానీ పుణ్యమా అని కోనసీమ అంతా తిరిగాము .ఇంకా తిరిగే వారిమే కాని , మా డ్రైవర్ నరసిమ్హా గోల భరించలేక , మా వారికి హైద్రాబాద్ లో పని వుండటము చేతా తిరిగి వచ్చేసాము .

పదిహేను రోజుల క్రితం వెళ్ళినప్పుడు , ఈసారి యానాం వెళ్ళాలి అనుకున్నాను . అసలు కోనసీమ చూడలేదుట , అప్పుడే జానీ అన్నాడు . గోదావరి మీద బోట్ హౌస్ లు కొత్తగా పెట్టారట . అవన్నీ చ్హ్డాలనుకున్నాను , కాని వున్న మూడు రోజులలో మావారికి రెండురోజులు పనే సరి పోయింది . ఆ తరువాత తప్పనిసరై హైద్రాబాద్ రావాల్సి వచ్చింది . మధ్యలో ఒక రోజు యానాం వెళ్ళాము . జాని కోసం వెతికాము కాని అతను దొరకలే . హూస్టన్ దగ్గర , సముద్రపు వొడ్డున వున్న పల్లె లాగా యానాం ను వూహించుకున్నాను . కాని చాలా నిరాశ పరిచింది .ఒక్కటి కూడా పాత భవనం కనిపించలేదు . బీచ్ ను ఇప్పుడిప్పుడే అభివృద్ధి పరుస్తున్నారు . లిక్కర్ కోసం అందరూ వస్తారు అన్నారు . అక్కడికి సీ బాక్ వాటర్ వస్తుందిట గోదావరి మాత్రం మహా ఉదృతం గా వుంది . లాంచి లో ఓ అరగంట తిరిగి రావటము బాగుంది .
మళ్ళీ కోనసీమ ప్రయాణం ఎప్పుడో చూడాలి .

Thursday, April 1, 2010

రాజమండ్రి - 1




రాజమండ్రి చాలా పురాతన మైన నగరము . ఇది వేంగీ - చాళుక్యుల పరిపాలన లో వుండేది ." వేంగీ " అంటే కోస్తా ప్రాంతం అని అర్ధం .మొదట్లో దీనిని వేంగీ అనే పిలిచేవారు . కాలక్రమేణా , రాజమహేంద్రవరం గా మార్చారు . ముఖ్యముగా రాజరాజ నరేంద్రుడు సాహిత్యాని కి , లలిత కళలకు చేసిన సేవతో ప్రాముఖ్యత పొందింది .నన్నయ , తిక్కన మహాభారతం ను తెలుగు లోనికి అనువదించినదీ ఇక్కడే !! ఈస్ట్ ఇండియా వారి కాలము లో బ్రిటిషర్స్ దీనిని వర్తకకేంద్రముగా చేసుకున్నారు . అప్పుడే రాజమండ్రి గా మారింది . కాటన్ దొర తెలుగు భాష మీద మక్కువ ఏర్పరుచుకొని , తెలుగు నేర్చుకొని , తెలుగు భాష , సాహిత్య అభివృధికి కృషి చేసాడు . గోదావరి మీద ధవళేశ్వరము మీద ఆనకట్ట కట్టించి , వర్తకాని ని వ్యవసాయాన్ని అభివృధి పరిచాడు . కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తలు వెలసినదీ ఈ పుణ్య భూమి లోనే . ముస్లిం ప్రభావము ఈ ప్రాంతములో లేనందున , తెలుగు సాంప్రదాయాలు , ఆచారాలూ సంస్కృతీ ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి . ప్రస్తుత కాలము లోనూ పర్యాటక ప్రాంతము గా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది .

రాజమండ్రి చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చాలనే వున్నాయి . పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన ఐదు శివాలయాలలో నాలుగు , సామర్లకోట , భీమవరం , పాలకొల్లు , ద్రాక్షారామం ఇక్కడనే వున్నాయి . ర్యాలి లో జగన్మొహినీ ఆకారములో విష్ణుమూర్తి ని చూడవచ్చు . ముందువైపు , విష్ణు మూర్తిగా , వెనుక వైపు జగన్మోహినిగా విగ్రహము చాలా నైపుణ్యముతో మలిచారు . ఇక్కడ పూజారులు కూడా చాలా శ్రద్ధ గా దీపము వెలుగు లో చూపిస్తూ వివరిస్తారు . వున్న చోటినుండి , వుద్యోగములో బదిలీ కావలానుకుంటే ర్యాలీని దర్షిస్తే అవుతుందిట . కర్కోటకుడు అనే నాగు , ఈశ్వరుని ప్రతిష్టించి కొలిచిన చోటు మందపల్లి . మందపల్లి శనీశ్వరుని దేవాలయము చాలా ప్రషిద్ది పొందినది . అష్టాదశశక్తి పీఠాలలో వకటి , ద్రాక్షారామము లోని మాణిక్యాంబ . పిఠాపురములోని పురంధరేశ్వరి కూడా అష్టాదశశక్తి పీఠము లోని దేవినే . పిఠాపురం లోనే పాదగయ వుంది . ధక్షయజ్ఞము లో ఉధ్భవించిన వీరభద్రీశ్వర స్వామి వెలసిన చోటు పట్టీసం .

నాసిక్ లో పుట్టిన గోదావరి , పాపికొండల నడుమ వయ్యారం గా వంపులు తిరుగుతూ , , కోనసీమను అన్నపూర్ణ గా మారుస్తూ , రాజమండ్రి దగ్గరలోవున్న , అంతర్వేది దగ్గర సముద్రం లో కలుస్తుంది . ఈ కోన సీమ లోని గోదావరి అందం చూడవలసినదే కాని వర్ణించతరము కాదు .

ఇలా ప్రఖ్యాతి చెందిన దేవాలాయాలు రాజమండ్రి చుట్టుపక్కల చాలానే వున్నాయి . దేవాలాయాలే కాక , కోనసీమ అందాలు చూడాలంటే రెండు కళ్ళూ చాలవు .

Wednesday, March 24, 2010

అదిగదిగో భద్రగిరి







మా నాన్నగారి కి ట్రాన్స్ఫర్ డ్యూ వుండటము వలన , మధ్య లో చదువు పాడవుతుందని ,నేను ఏథ్ క్లాస్ చదివేటప్పుడు బూర్గుం పహాడ్ లో మా మామయ్య వాళ్ళ ఇంట్లో వుండి చదువుకున్నాను . రోజూ ఉదయమే పొలాల మధ్య లోనుండి నడుచు కుంటూ , మధ్య మధ్య లో పెసరకాయలు తుంపి , కాపలాదారునితో చివాట్లు తింటూ వెళ్ళి , గోదావరి లో స్నానం చేసి , అక్కడి నుండే రాముల వారికి దండం పెట్టుకొని వచ్చేవాళ్ళము . ప్రతి రోజూ సాయంకాలము కూడా , అమ్మ అత్తయ్య , పిల్లలము అందరము గోదావరి వొడ్డుకు షికారుకెళ్ళేవాళ్ళము . తరుచుగా నావలో అవతలి ఒడ్డుకెళ్ళి గుడికి కూడా వెళ్ళి వచ్చేవాళ్ళము . నా బాల్య స్మృతులలో , ఆ సంవత్సరము అంతా అలా గోదావరి ఒడ్డున ఆడుకోవటము , సీతారాములని దర్షించుకోవటము , మరపురాని మధురమైనవి .

ఆ తరువాత బహుషా 1985 లో అనుకుంటా , మా వారు పని మీద వెళుతుంటే , నేను ,మా పిల్లలు , మా అత్తగారు , మామగారు ఆయన తో పాటు వెళ్ళాము . అప్పటికి గుడి , గుడి పరిసరాలు నేను చిన్నప్పుడు చూసింట్లుగానే వున్నాయి . ఏమీ మార లేదు . గోదావరి స్నానము , గుడి కెళ్ళటము అంతా మా పిల్ల లిద్దరూ బాగా ఎంజాయ్ చేసారు .పర్ణశాల కు కూడా వెళ్ళి వచ్చాము . అక్కడ వున్న నెమలిని ఫొటో తీసుకుంటుంటే దానికి ఫొటోలు అలవాటేమో , దగ్గరికి వచ్చి చక్కగా ఫోజు లిచ్చింది .

రెండు సంవత్సరాల క్రితం నేనూ , మావారు వెళ్ళాము . అప్పటికి చాలా మార్పులు వచ్చాయి . గోదావరి స్నానం చేద్దామంటే అసలు గోదావరి కనపడలేదు . పెద్ద ఆనకట్ట దర్షనం ఇచ్చింది . ఇక సమయము కూడా లేక పోవటము వలన , గుడి లో అర్చన చేయించుకొని , పులిహోర ప్రసాదము తిని వచ్చాము .

లాస్ట్ వీక్ రాజమండ్రి వెళుతూ , భద్రాచలం వెళ్ళాము . ఈ సారి భద్రాచలం లో ఒకరాత్రి నిద్ర చేద్దామనుకొన్నాము . టూరిస్ట్ వారి సితారా హోటల్ లో బస చేసాము . ఉదయమే గోదావరి స్నానం చేసాము .ఊరుకూరికే గోదావరమ్మ , సీతారాముల పాదాలను తడుపు తోందట . అందుకే గోదావరమ్మకూ , సితారాములకు మధ్య పాపం అడ్డుగోడ కటారు !!! రష్ కూడా లేక పోవటము వలన దర్షనము కూడా తొందరగానే అయ్యింది . అర్చన చేసాము . చాలా సంతృప్తిగా అనిపించింది .
వస్తూ బూరుగుం పహాడ్ లో మా స్కూల్ చూసుకొన్నాను . మధురవాణి అన్నట్లు అక్కడ ఏమీ మార్పు రాలేదు . ప్రహారి గోడ కట్టి , దానిని జూనియర్ కాలేజ్ గా , బాయ్స్ స్కూల్ గా మార్చారు అంతే ! మేము వున్న ఇల్లు కూడా గుర్తు పట్టగలిగాన నే అనుకున్నాను .
ఆపైన అదిగో కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి . కాదు కాదు , ఎండలో తళ తళా మెరిసిపోతూ , రెండు గట్ల నడుమ పారుతూ ఎంత బాగుందో !
ఈ ఫొటొ సితార హోటల్ లో , లాన్ లో వున్న శ్రీరాముడు , శబరిల విగ్రహాలది . పక్కన లక్ష్మణ స్వామి కూడా వున్నారు , కాని నాకే ఆయనను ఫొటో తీయటము రాలేదు . మరి కాస్త దూరం గా వున్నారాయె ఏమిచేద్దును ?





శ్రీరామ కటాక్ష సిద్దిరస్తు .
శ్రీరమనవమి శుభాకాంక్షలు .