చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Wednesday, March 24, 2010

అదిగదిగో భద్రగిరి







మా నాన్నగారి కి ట్రాన్స్ఫర్ డ్యూ వుండటము వలన , మధ్య లో చదువు పాడవుతుందని ,నేను ఏథ్ క్లాస్ చదివేటప్పుడు బూర్గుం పహాడ్ లో మా మామయ్య వాళ్ళ ఇంట్లో వుండి చదువుకున్నాను . రోజూ ఉదయమే పొలాల మధ్య లోనుండి నడుచు కుంటూ , మధ్య మధ్య లో పెసరకాయలు తుంపి , కాపలాదారునితో చివాట్లు తింటూ వెళ్ళి , గోదావరి లో స్నానం చేసి , అక్కడి నుండే రాముల వారికి దండం పెట్టుకొని వచ్చేవాళ్ళము . ప్రతి రోజూ సాయంకాలము కూడా , అమ్మ అత్తయ్య , పిల్లలము అందరము గోదావరి వొడ్డుకు షికారుకెళ్ళేవాళ్ళము . తరుచుగా నావలో అవతలి ఒడ్డుకెళ్ళి గుడికి కూడా వెళ్ళి వచ్చేవాళ్ళము . నా బాల్య స్మృతులలో , ఆ సంవత్సరము అంతా అలా గోదావరి ఒడ్డున ఆడుకోవటము , సీతారాములని దర్షించుకోవటము , మరపురాని మధురమైనవి .

ఆ తరువాత బహుషా 1985 లో అనుకుంటా , మా వారు పని మీద వెళుతుంటే , నేను ,మా పిల్లలు , మా అత్తగారు , మామగారు ఆయన తో పాటు వెళ్ళాము . అప్పటికి గుడి , గుడి పరిసరాలు నేను చిన్నప్పుడు చూసింట్లుగానే వున్నాయి . ఏమీ మార లేదు . గోదావరి స్నానము , గుడి కెళ్ళటము అంతా మా పిల్ల లిద్దరూ బాగా ఎంజాయ్ చేసారు .పర్ణశాల కు కూడా వెళ్ళి వచ్చాము . అక్కడ వున్న నెమలిని ఫొటో తీసుకుంటుంటే దానికి ఫొటోలు అలవాటేమో , దగ్గరికి వచ్చి చక్కగా ఫోజు లిచ్చింది .

రెండు సంవత్సరాల క్రితం నేనూ , మావారు వెళ్ళాము . అప్పటికి చాలా మార్పులు వచ్చాయి . గోదావరి స్నానం చేద్దామంటే అసలు గోదావరి కనపడలేదు . పెద్ద ఆనకట్ట దర్షనం ఇచ్చింది . ఇక సమయము కూడా లేక పోవటము వలన , గుడి లో అర్చన చేయించుకొని , పులిహోర ప్రసాదము తిని వచ్చాము .

లాస్ట్ వీక్ రాజమండ్రి వెళుతూ , భద్రాచలం వెళ్ళాము . ఈ సారి భద్రాచలం లో ఒకరాత్రి నిద్ర చేద్దామనుకొన్నాము . టూరిస్ట్ వారి సితారా హోటల్ లో బస చేసాము . ఉదయమే గోదావరి స్నానం చేసాము .ఊరుకూరికే గోదావరమ్మ , సీతారాముల పాదాలను తడుపు తోందట . అందుకే గోదావరమ్మకూ , సితారాములకు మధ్య పాపం అడ్డుగోడ కటారు !!! రష్ కూడా లేక పోవటము వలన దర్షనము కూడా తొందరగానే అయ్యింది . అర్చన చేసాము . చాలా సంతృప్తిగా అనిపించింది .
వస్తూ బూరుగుం పహాడ్ లో మా స్కూల్ చూసుకొన్నాను . మధురవాణి అన్నట్లు అక్కడ ఏమీ మార్పు రాలేదు . ప్రహారి గోడ కట్టి , దానిని జూనియర్ కాలేజ్ గా , బాయ్స్ స్కూల్ గా మార్చారు అంతే ! మేము వున్న ఇల్లు కూడా గుర్తు పట్టగలిగాన నే అనుకున్నాను .
ఆపైన అదిగో కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి . కాదు కాదు , ఎండలో తళ తళా మెరిసిపోతూ , రెండు గట్ల నడుమ పారుతూ ఎంత బాగుందో !
ఈ ఫొటొ సితార హోటల్ లో , లాన్ లో వున్న శ్రీరాముడు , శబరిల విగ్రహాలది . పక్కన లక్ష్మణ స్వామి కూడా వున్నారు , కాని నాకే ఆయనను ఫొటో తీయటము రాలేదు . మరి కాస్త దూరం గా వున్నారాయె ఏమిచేద్దును ?





శ్రీరామ కటాక్ష సిద్దిరస్తు .
శ్రీరమనవమి శుభాకాంక్షలు .