చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Thursday, June 16, 2011

సికింద్రాబాద్ లో సూర్య దేవాలయము















సూర్యుడిని
మనము ప్రత్యక్షభగవానునిగా పూజిస్తాము . సమస్త జీవులకు ప్రాణాధారమైన శక్తిని ప్రసాదిస్తున్న ఆరోగ్యప్రధాత శ్రీ సూర్యభగవానుడు . శ్రీసూర్య భగవానుని , దాదాపు ప్రతి ఆలయములో వున్న నవగ్రహాలలో వుంచి పూజిస్తూ వున్నప్పటికీ , ఆయనకు విడిగా దేవాలయాలు కూడా వున్నాయి . వాటిల్లో నాకు తెలిసినవి , "కోణార్క్ దేవాలయము " , " అరిసివిల్లి " లోని సూర్య దేవాలయము . అందులో అరిసివిల్లి దేవాలయాన్ని నేను చూసాను . సికింద్రాబాద్ , తిరుమలగిరి క్రాసింగ్ దగ్గర సూర్య దేవాలయము వున్నదని , ఐదారు నెలల క్రితము ఎందులోనో చదివాను . అప్పటి నుంచి అక్కడ నాకు తెలిసి వారిని దాని గురించి అడుగుతునే వున్నాను . కాని ఎవరూ చెప్పలేకపోయారు . నిన్న , తిరుమలగిరి లో వున్న మా కజిన్ ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా మాటల్లో ఇక్కడెక్కడో సూర్యదేవాలయము వుందట నీకు తెలుసా అని అడిగాను . ఎక్కడో ఏమిటి మాఇంటి వెనుకనే వుంది , చాలా బాగుంటుంది . మా ఇంటికి ఎవరొచ్చినా తీసుకెళుతాము . ఇన్నేళ్ళ నుంచి వస్తున్నావు నీకు చెప్పలేదా ? నిన్ను తీసుకెళ్ళలేదా అని చాలా ఆశ్చర్య పోయింది మా కజిన్ డాక్టర్ . కుమారి . ఓరినీ చంకలో పిల్లను బెట్టుకొని వూరంతా వెతికి నట్లు , ఇక్కడ పక్కనే వుంచుకొని ఎంత వెతుకుతున్నాను అనుకున్నాను . అడ్రెస్ తెలిసాకా ఆలశ్యం ఎందుకని అప్పుడే దేవాలయానికి వెళ్ళాము . అంతే దేనికైనా టైం రావాలి !

సూర్య దేవాలయము విశాలమైన ప్రాంగణములో వుంది . లోపలి కి వెళ్ళగానే ఎదురుగా సూర్య దేవాలయము , గేట్ కు కుడివైపున సత్యనారాయణస్వామి ఆలయము వున్నాయి . చిన్న కొండను తొలిచి గర్భాలయముగా చేసారు . అందులో సూర్యభగవానుడు కొలువుతీరి వున్నాడు .సప్తాశ్వారూడుడైన స్వామివారు చతుర్భుజుడు . శంఖు , చక్రములు ధరించి రధము తోలుతూ స్వామివారు దర్శనము ఇస్తారు . స్వామివారు ఎంత కళగా వున్నారో చెప్పలేను చూసేందుకు రెండు కళ్ళూ చాలవనిపించింది . అరిసివెల్లి లోని స్వామివారి కంటే ఇక్కడి స్వామివారే చాలా కళగా వున్నట్లు నాకు అనిపించింది . స్వామివారిని వివిధ వ్యాధులతో బాధ పడుతూ వున్నవారు దర్శిస్తే బాధలు తొలుగుతాయట.ఆలయము ముందు వైపు పై భాగం లో సప్తాశ్వారూడుడైన సూర్య భగవానుని విగ్రహం దర్శనమిస్తుంది .
సూర్యాలయము పక్కనే అశ్వత్ధవృక్షము వుంది . దాని కి కొంచం పక్కగా శివలింగమును స్తాపించారు . శివలింగము పక్కన సరస్వతి ఆలయము వుంది . అక్కడ సరస్వతి చేతిలో వీణను అలంకరించారు . మా కజిన్ కొద్ది నెలల క్రితం వాళ్ళ అబ్బాయి వివాహము తరువాత కొడుకును కోడలిని అక్కడకు తీసుకెళ్ళిందట. అదే రోజు ఎవరో భక్తులు వీణను అమ్మవారికి సమర్పించుకున్నారట . వీణను , మా కజిన్ కోడలు వారి పర్మిషన్ తో కొద్ది సేపు వాయించిదిట . ఇక్కడ సరస్వతీ అమ్మవారిని విద్యార్ధులు పూజిస్తే విద్యాభివృద్ధి జరుగుతుందని , అమ్మవారి ముందు అక్షరాభ్యాసము చేస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకము . సరస్వతి ఆలయము పక్కనే నాగదేవత ఆలయము వుంది . ఇక్కడ నాగదోషాలు వున్నవారు అర్చిస్తే దోషాలు తొలుగుతాయి అంటారు . గేట్ దగ్గరగా వున్న సత్యనారాయణ స్వామి ఆలయములో వ్రతము చేసుకోవచ్చు. ఆలయాలన్నీ ప్రశాంతమైన వాతవరణములో వున్నాయి .

ప్రతిరోజూ చేసే పూజలు కాక , ' రధసప్తమి ' రోజున , ' సంక్రాంతి ' రోజున ఆలయ ప్రాంగణములో హోమము చాలా బాగా చేస్తారట. అప్పుడు చాలా రష్ వుంటుదిట .

సుమారు యాభై సంవత్సరాల క్రితము ప్రాంతములో పోచయ్య అనే వ్యక్తి వుడేవాడు అతను వృత్తిరీత్యా ఎక్కువగా దూర్ప్రాంతాలకు వెళుతూవుండేవాడు .పోచయ్య ప్రతిరోజూ ఉదయము స్నానము చేయగానే సూర్య నమస్కారాలు చేస్తూ వుండేవాడు . ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా సూర్యుడికి నమస్కారాలు చేసుకొని వెళ్ళేవాడు . రాను రాను సూర్యభగవానుని పై నమ్మకము పెరిగి , సూర్యుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాడు . ఒకసారిపనిమీద కలకత్తాకు వెళ్ళాడు . అక్కడ ఆయనకు సూర్యుని గురించి అనేక విషయాలు తెలుసుకొనే అవకాశము కలిగింది .అలా సూర్యుని గురించి తెలుసుకున్న ఆయనకు సూర్యుని మీద నమ్మకము ఇంకా పెరిగింది .కలకత్తా నుంచి తిరిగి వచ్చాక సూర్య దేవాలయము నిర్మించాలనుకున్న ఆయనకు , సోదరి తో పాటు మరికొందరు భక్తులు చేయూతను ఇచ్చారు . దీనితో ప్రస్తుతము ఆలయము వున్నప్రదేశము అనువైన ప్రాంతము గా గుర్తించారు . 1962 లొ అక్కడ చిన్న పాకను నిర్మించి అందులో స్వామిని ఉంచి , ప్రతిరోజూ ఉదయమూ , సాయంకాలమూ దీపము వెలిగించి పూజలు చేసేవారు . 1964 లో ఇప్పుడు వున్న ఆలయాన్ని నిర్మించి , శ్రీ సూర్య భగవానుడి తోపాటు ఇతర దేవతా మూర్తులను కూడా ప్రతిష్టించారు .

దేవాలయము ఉదయము 7 గంటల నుంచి 11 వరకు , సాయం కాలము 5 నుంచి 7.30 వరకూ తెరిచి వుంటుంది . తప్పక చూడవలసిన ఆలయము .