చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Monday, October 24, 2011

బీదర్



మావారు పనిమీద బీదర్ వెళుతుంటే , ఒక్కరే వెళుతున్నారని నేను కూడా వెళ్ళాను . బీదర్ చేరగానే నాకు ఓ కార్ డ్రైవర్ ఇచ్చి తిరగమని చెప్పి తను పని మీద వెళ్ళారు . డ్రైవర్ మురళి ముందుగా బీదర్ కోటకు తీసుకెళ్ళాడు .

హైదరాబాద్ కు దగ్గర లో వున్న చారిత్రక ప్రదేశము " బీదర్ " . ఇక్కడి వాతావరణము , ప్రకృతి అందాలకు ముచ్చట పడ్డ బహ్మనీ సుల్తాన్ 1429 లో బీదర్ నిర్మాణానికి పూనుకున్నాడని చారిత్రిక ఆధారాలు తెలుపుతున్నాయి . 1724 నుంచి 1948 వరకూ నిజాం నవాబుల ఏలుబడి లో వుంది . హైదరబాద్ ప్రాంతము లో బాగము గా వున్న బీదర్ ఆ తరువాత కర్ణాటక లో భాగమైపోయింది.
బీదర్ లో ముందుగా చూడవలిసింది బీదర్ కోటను . పట్టణము లోకి వెళుతూనే , మొదట్లోనే కోట శిధిలాలు కనిపిస్తాయి . లోపల 16 స్తంబాలతో నిర్మించిన ప్రార్ధనా మందిరము ,( మసీదు ) , రాణివాసమైన గగన్ మహల్ ముఖ్యమైనవి .శిధిలమవుతున్న కోట భాగాలను మరమత్తుచేసి , పార్క్ లా చేసి , కోటను చూడముచ్చటగా తయారు చేస్తున్నారు .



గగన్ మహల్



సోలా స్తంబ్ మాస్క్

గురుద్వార



కోట చూసాక బీదర్ లో ముఖ్యమైన ' గురుద్వారా ' కు వెళ్ళాము . గురునానక్ ఇక్కడ కొద్దిరోజులు వున్నాడట . నేను ఇంతవరకూ ఎప్పుడూ గుర్ద్వారాలా చూడలేదు . చాలా ప్రశాంతము గా బాగుంది . గురునానక్ మొదటి అడుగు వేసిన చోటున సన్నటి నీటి ధార వస్తూ , అక్కడ వున్న చిన్న పూల్ లో పడుతున్నాయి . ఇదే ఆ 'అమృత కుండ్ ' .



గురుద్వారా లో ప్రసాదముగా ఇచ్చిన హల్వా తిని , శివాలయము చూపిస్తానని తీసుకెళ్ళాడు . అది కొంచం అడవి లో వున్నది . దీనిని ' పాపనాశం శివాలయము ' అంటారట . శ్రీరాముడు రావణుని సమ్హరించి , అయోద్య కు తిరిగివెళుతూ , రావణుడు శివభక్తుడు కాబట్టి ఆ భక్తుని చంపిన పాపము ను పోగొట్టుకొనినేందుకు దారిలో అక్కడక్కడ శివలింగాలను ప్రతిస్ఠించాడట . అలా రాముడు ప్రతిస్ఠించినదే ఇక్కడ వున్న శివలింగం . ఈ లింగమును దర్సించినంతనే సర్వ పాపములు వినాశమవుతాయట .
ఇదే ఆ లింగము , దేవాలయము ;







ఆ అడవిలోనే కొంచము ముందుకు వెళితే వస్తుంది ' బసవగిరి ' వీరశైవము క్లిష్ట పరిస్తితులలో వున్నప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు భూలోకములో ' బసవేశ్వరు ' ని గా అవతరించి వీర శైవ ధర్మమును ప్రభోదించాడు . ఆ బసవన్న ప్రార్ధనామందిరమే ఈ బసవగిరి .
ఈ మందిరము లో బసవన్న భక్తులు ప్రార్ధనలు చేస్తారు ;


మావారు లంచ్ కు వచ్చినప్పుడు ఇక్కడ ప్రసిద్ది చెందిన ' జరానరసిమ్హస్వామి ' దేవాలయము కు వెళ్ళాము . ఇక్కడ లక్ష్మీనరసిమ్హుడు ఓ గుహలో 600 మీటర్ ల దూరము లో వుంటాడు . అక్కడి వరకు నీళ్ళు వుంటాయి . అంటే ఆయనను దర్శించుకోవాలంటే గుహలో నీళ్ళలో వెళ్ళాలన్నమాట . ఆ గుహను , ఆ నీటిని చూడగానే నేను లోపలికి రానన్నాను . మా మావారు కొంచము నచ్చ చెప్పేందుకు ప్రయత్నించి , ఇహ నాకు నరసిమ్హుని దర్శించుకునే ప్రాప్తం లేదని చెప్పి ఆయన లోపలి కి వెళ్ళారు . కొద్దిగా లోపలికి వెళ్ళి భుజాలదాకా నీళ్ళు రాగా , వెనక్కి వెచ్చి ఆయన పర్సు , వాచీ నాకు ఇచ్చి వెళ్ళారు . ఆయనతో పాట ఆయన అసిస్టెంట్లు కూడా వారి సామానులు ఇచ్చి వెళ్ళారు . కాసేపు క్లాక్ రూం నయ్యానన్నమాట :) అక్కడే గట్టుమీద వచ్చేపోయే వాళ్ళను చూస్తూ కూర్చున్నాను . గట్టుపక్కనే వున్న లక్స్మీనరసిమ్హస్వామి దగ్గర కూర్చున్న పూజారిని స్తలపురాణము చెప్పమని అడిగాను . అందరూ తిరిగి రానీ అందరికీ కలిపి ఒకేసారి చెపౌతాను అన్నాడు ఆయన .






ఈ గుహలో శివుడు తపస్సు చేసుకుంటూ వుండగా ' జలాసురుడు ' అనే రాక్ష్సుడు ఆయనను చాలా విసిగిస్తూ వున్నాడట . అప్పుడు లక్ష్మీనరసిమ్హ స్వామి వచ్చి జలాసురుడిని సమ్హరించాడట . జలాసురుడి కొద్దిగా పుణ్యము చేసుకొని వుండటము వల్ల , ఏదైనా మంచి కోరిక కోరుకో తీరుస్తాను అన్నాడట నరసిమ్హస్వామి . ఐతే నువ్విక్కడే వెలవాలి , నిన్ను నా పేరు తో కలిపి పిలువాలి అని కోరాడట జలాసురుడు . అప్పుడు నరసిమ్హస్వామి అక్కడ వెలిశి ' జలానరసిమ్హుడు ' గా కొలవబడుతున్నాడు .' జలా అంటే నీరు కాబట్టి , నరసిమ్హస్వామి పాదాల వద్ద నుంచి నీరు ఆ గుహలో ప్రవహిస్తోందిట. ఇది ఆ పురోహితుడు , మరాఠీ , హిందీ కలిపి చెప్పగా నాకు అర్ధమైన స్తలపురాణము !



ఇవీ బీదర్ లో చూడ తగ్గ ప్రదేశాలు .