చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Thursday, November 25, 2010

కార్తీకమాసము లో హరిహరుల దర్శనం - నల్లగొండ , పానగల్లు , పిల్లలమర్రి



కార్తీక మాసం లో శివుని దర్శించుకొని , గుడి ప్రాంగణము లో దీపాలు వెలిగిస్తే చాలా పుణ్యం అంటారు . ఆ పుణ్యమేదో కాస్త సంపాదించుకుందామనుకొని , psm .లక్ష్మి గారు , మా అమ్మ , నేను , నల్లగొండ జిల్లా లోని కొన్ని పురాతనమైన శివాలయాలు దర్శించుకుందామని ఓ శుభోదయాన బయిలు దేరాము . psm.లక్ష్మి గారు , వాటిని ఇంతకు ముందు చూసి వుండటము వలన మాకు వాటి ప్రాశస్త్యము గురించి వివరము గా చెప్పారు .
ముందుగా , నల్లగొండ లోని , రామగిరి రామాలయాని కి వెళ్ళాము . అక్కడ శ్రీరామచంద్రుడు , సీతాదేవి , లక్ష్మణ , భరత , శతృగ్నలు , ఆంజనేయ స్వామి సహితము గా పట్టాబిషక్తుడైన పట్టాభిరాముని గా వెలిసాడు . హైదరాబాద్ నవాబు గారి భార్యకు నయము కాని జబ్బు రాగా , నల్లగొండ లో నున్న వక ఆయుర్వేదవైద్యుడు , ఆవిడ ముంజేతి కి పురికొస కట్టించి , ఆ పురికొస రెండో చివర సహాయముతో , బేగం గారి నాడి పరీక్షించి మందు ఇచ్చి , ఆ జబ్బును నయం చేసారట. అప్పుడు నవాబు గారు సంతసించి , ఆ వైద్యుని ఏమి కావాలో కోరుకోమంటే , తనకు స్వప్న ములో కనిపించిన , పట్టాభిరాముని ఆలయ నిర్మాణము కొరకు భూమి అడిగాడట . నవాబు ఇచ్చిన స్తలము లో ,ఆలయమును నిర్మించి , కాపరాల గుట్ట కింద భూస్తాపితం ఐన విగ్రహాలను వెలికితీసి ఈ ఆలయము లో ప్రతిష్టించారట . ఇది 400 సంవత్సరాల పురాతనమైన ఆలయము అని అక్కడి పూజారులు చెప్పారు . శ్రీరామచంద్రుని దర్శించుకున్న తరువాత , గుడి వెనకవైపు వున్న ఉసిరిక చెట్టు కింద దీపాలను వెలిగించుకొన్నాము .


పచ్చలసోమేశ్వరుడు -పానగల్లు


నల్లగొండ కుదగ్గర లోనే వున్న , పానగల్లు లో పచ్చలసోమేశ్వరలయాము ను , కాకతీయ రాజులకు సామంతులైన కందూరు చోళ రాజులు క్రీ. శ. 11 - 12 శతాబ్దం లో నిర్మించారు . ఈ దేవాలయము కింద ఇంకోక శివాలయము వుందని , దానికి బంగారు తలుపులు వున్నాయని , కాని కాలక్రమములో భూమిలోపలికి వుండిపోయిందని , అక్కడి పూజారిణి చెప్పింది . శివుని ఎడమ వైపున రాజరాజేశ్వరీ దేవి , ఎదురుగా నందీసుడు , నందీసుని కి ఎదురుగా వినాయకుడు కొలువై వున్నారు . శివును ఎదురుగా దీపాలను వెలిగించాము . పూజారిణి వాటిని లింగము ఎదురుగా వుంచింది .
పక్కనే వున్న రాజరాజేశ్వరీ దేవి కి పసుపుకుంకుమ సమర్పించాము . అమ్మవారు పవళించివున్న శివుని మీద హాయిగా కూర్చొని వున్నారు . ఇలా ఏ దేవాలయము లోనూ చూడలేదు .
వినాయకుని దగ్గర కూడా దీపాలు వెలిగించుకున్నాము .
మండపము లోని నంది , స్తంబాలు చక్కని శిల్పకళ తో వున్నాయి . ఆలయము బయట కూడా విరగగొట్టి పడవేసిన శిల్పాలు చాలా వున్నాయి . వాటిని చూస్తుంటే ఎంత బాధ కలిగిందో చెప్పలేను .

చాయాసోమేశ్వరుడు




పచ్చలసోమేశ్వరుని దగ్గర నుండి , అక్కడికి దగ్గరలోనే పొలాలలో కొలువైన చాయాసోమేశ్వరుని దర్షించుకోవటానికి వెళ్ళాము . అక్కడ , శివలింగము వెనుక వైపు ఓ స్తంబము లా నీడ వుంటుంది . ఆ నీడ ఎక్కడినుంచి వస్తోందో ఇంతవరకు , ఎవరూ కనిపెట్టలేక పోయారట ! ఆ నీడ వుండటము వలననే చాయాసోమేశ్వరుడు అని పేరు వచ్చిందట . ఆ నీడ కెమేరాకు కూడా చిక్కలేదు !
మా నాన్నగారు , నల్లగొండ లోనే చదువుకున్నారు . నాగార్జునసాగర్ కెనాల్ లో పని చేసేటప్పుడు , దాని తో పాటే నల్లగొండ వరకూ వచ్చారు . ఆ సమయములో మా అమ్మ , నాన్నగారు , చాయాసోమేశుని చాలాసారులు దర్శించుకున్నారట . మా అమ్మ ఆ సంగతులన్నీ తలుచుకుంది .

చాయాసోశ్వర దేవాలయము లోని నీడ గురించి న సమాచారము ఇక్కడ వుంది . ఈ లింక్ ఇచ్చిన ఆవకాయ గారు థాంక్స్ అండి .
ఆ ఈశుని పూజించుకున్న తరువాత , అక్కడే కూర్చొని , మేము తెచ్చుకున్న పులిహోర , పెరుగన్నం తిన్నాము :)

ఉదయసముద్రము



పానగల్లుకు ఉత్తరాన , ఉదయ చోడుడు ప్రజల అవసరార్ధం 11 వ శతాబ్ధం లో చెరువును తవ్వించాదు . అది ఈ రోజు కూ ప్రజల అవసరాలను తీరుస్తూనే వుంది . కాసేపు ఆ చెరువు గట్టున , ఆ చెరువు అందాన్ని ఆస్వాదిస్తూ తిరిగాము .

పిల్లలమర్రి



నల్లగొండ నుండి హైద్రాబాద్ కు వచ్చే దారి లో , సూర్యాపేట కు దగ్గర లో వుంది , పిల్లలమర్రి . మేన్ రోడ్ నుండి పక్కకు వెళ్ళాలి . ఆ తిరిగే ముందు , మేన్ రోడ్ లో నున్న ధాభా లో వేడి వేడి అలూ బజ్జీలు , చిక్కని కాఫీ ఇప్పించారు లక్ష్మి గారు .
పిల్లలమర్రి లో నామేశ్వరాలయం , ముక్తేశ్వరాలయం , ఎరకేశ్వరాలయం అని మూడు శివాలయాలు , చెన్నకేశవస్వామి దేవాలయము వున్నాయి . ముందుగా వూరి మొదట్లో వున్న నామేశ్వరాలయము నకు వెళ్ళాము . సాయంకాలము ఆరు కూడా కాకుండానే పూజారి గుడి తలుపులు మూసివేసి వెళ్ళిపోయాడు . అక్కడే వున్న పిల్లలు వెళ్ళి ఆయనను పిలుచుకొని వచ్చారు ! శీతాకాలపు పొద్దు . త్వరగా చీకటి పడిపోయింది . గుడి లో సరైన దీపాలు కూడా లేవు . ఆలయమును కాకతీయ రాజులు నిర్మించారు అని మటుకే చెప్పగలిగారు పూజారి ! మండపము లోని స్తంబాలు అద్భుతమైన శిల్పకళ తో వున్నాయి . ప్రతి స్తంబమూ , మీటితే , సప్తరాగాలను పలికిస్తోంది . స్తంబాలను ఒక్కొక్క చోట కొట్టి చూపించాడు పూజారి , అదీనూ లక్ష్మి గారు అడుగుతే ! స్తంబాల మీద శిల్పాలు ఎంత నాజూకుగా వున్నాయంటే , వాటిలో నుంచి సన్నటి దారము దూర్చవచ్చు. అదీ లక్ష్మి గారు అడుగుతే చూపించారు !
చెన్నకేశవస్వామి దేవాలయము మూసివేసారు . లో చాలా చీకటి గా వుండింది . ముక్తేశ్వరాలయము లో దీపాలు సరిగ్గా లేవు . చాలా చీకటి గా వుండినది . స్వామి ని దర్శించుకొని వచ్చేసాము . ఎరకేశ్వరాలయము లో ఆ మాత్రము కూడా దీపాలు లేక పోవటము వలన చూడలేక పోయాము .పక్కగా బ్రహ్మ , సరస్వతి ల విగ్రహాలు వున్నాయట . కాని చీకటి మూలము గా చూడలేక పోయాము .
కవి పిల్లలమర్రి చినవీరభద్రుడు ఈ వూరి వాడే నా అన్నదానికి ఎవరూ సమాధానము చెప్పలేకపోయారు . చిన్న వూరు . వచ్చేవారు లేరు . ఇక శ్రద్ధ ఎవరికి వుంటుంది ? లక్ష్మి గారు , ఇదివరకు చూసి వున్నందువలన మమ్మలిని తీసుకెళ్ళ గలిగారు . ఆవిడ చెప్పేవరకూ అక్కడ సప్తరాగాలు పలికించే స్తంబాలు వున్నాయని నాకు తెలీదు . ఇప్పటి వరకూ ఒక హంపీ లోనే వున్నాయనుకున్నాను , ఇలా చిన్న చిన్న వూళ్ళ లో మనకు తెలియని అద్భుతాలు ఇంకెన్ని వున్నాయో కదా అనుకున్నాను .


మేము మా కార్ లోనే , పొద్దున 6 గంటలకు బయిలుదేరాము . లంచ్ , స్నాక్స్ , కాఫీ పాక్ చేసుకొని వెళ్ళాము . అన్నీ తిరిగి చూసుకొని వచ్చేసరికి , రాత్రి 11 అయ్యింది . మాకు ఆ రోజు పొద్దున సిటీ ఔట్ స్కర్ట్స్ లో ట్రాఫిక్ మూలంగా ఆలశ్యం అయ్యింది . అందుకే తిరిగి రావటాని కి ఆలశ్యం అయ్యింది .

నల్లగొండ రామాలయము ఉదయము 11 గంటలకే మూసేస్తారు . ఇక్కడ పూజారి వుంటాడు . మనకు కావలసిన పూజ చేయించుకోవచ్చు . అందువల్ల ఆ సమయానికల్లా అక్కడి కి చేరుకునేటట్లు ప్లాన్ చేసుకుంటే చాలు . చాయాసోమేశ్వరాలయము లో పూజారి వుండడు , తలుపులు వుండవు .పూజరి పొద్దున్నే వచ్చి వెళ్ళిపోతాడట. ఇక్కడ మనమే పూజ చేసుకోవచ్చు . పచ్చలసొమేశుని దగ్గర గుడి మూసినా , కట కటా లలో నుండి చూడవచ్చు . ఇహ పిల్లలమర్రి కే కొంచం పొద్దు వుండగా వెళితే మంచిది . అక్కడ ఈశ్వరాలయము లో స్తంబాలను పరిశీలనగా చూడవచ్చు .


. లక్ష్మి గారు , కార్తీకమాసము లో ఇంత మంచి శివాలయాలను చూపించినందుకు మీకు చాలా ధన్యవాదాలండి .

4 comments:

ఆవకాయ said...

మీ ఇంట్రస్టుని మెచ్చుకోవాలండీ, దర్శించుకోవడమే కాకుండా,వాటి విషయాలతో వివరంగా టపా రాసి మాకందించినందుకు కూడా.

బాగుంది మీ ప్రయాణం. ఛాయా సోమేశ్వరుడు గురించి ఈ పోస్టు చూడండి.http://astikalu.blogspot.com/2010_07_01_archive.html

>>ఇలా చిన్న చిన్న వూళ్ళ లో మనకు తెలియని అద్భుతాలు ఇంకెన్ని వున్నాయో కదా
అవునండీ.


ఏమీ అనుకోకపోతే మీ టపాలో దర్శనం అని ఉండాల్సిన చోట "దర్షనం" అని ఉండి టపా అందాన్ని పోగొట్టింది,ముఖ్యం గా హెడ్దింగు కూడా అలా ఉండేసరికి. సరి చేస్తారు కదూ.

మాలా కుమార్ said...

ఆవకాయ గారు ,
సరి చేసానండి . ధన్యవాదాలు .

అశోక్ పాపాయి said...

చల్తే చల్తే బ్లాగ్ బహుత్ హస్తే హస్తే
మలుం నహీ క్యా బాత్ హై
కైస బీ అజ్ అయ హై మాలాజీ
పసంద్ క కహానిసే ఎ ఒగయ చల్తే చల్తే...

మాలా కుమార్ said...

అశోక్ పాపాయీ జీ ,
ఆప్ కా తారీఫ్ సే హం బహుత్ కుష్ హోగయే . షుక్రియా :)
( కరెక్టేనా :) )