చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Monday, April 18, 2011

అహోబిలం - మహానంది

" ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ,
నృసిమ్హం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్య్హం :"
యాగంటి నుండి అహోబిలం బయిలుదేరాము . కొంచము దూరము వెళ్ళగానే దారి తప్పినట్లుగా అనిపించింది . అడుగుదామన్నా అక్కడ ఎవరూ లేరు ! కొంత సేపటి కి మోటర్ సైకిల్ మీద ఇద్దరు అబ్బాయిలు వచ్చారు . వారిని ఆపి దారి అడిగాము . దాదాపు 10 కిలో మీటర్లు వెనకకి వెళ్ళాలసి వచ్చింది ! అహోబిలము దగ్గరికి చేరుకునేసరి కి చీకటైయ్యింది . అహోబిల చేరాలంటే దగ్గర దగ్గర 14 గు కిలో మీటర్లు అడవి గుండా వెళ్ళాలి . దారి లో అక్కడక్కడ మినుకు మినుకు మంటూ దీపాలు , చిన్న వూళ్ళు తప్ప ఎక్కువగా మనుషులెవరూ కనిపించలేదు . చీకటి ( 7 గంటల కే చిమ్మ చీకటైంది . అదేమిటో ) , నిశబ్ధం నాకైతే చాలా భయం వేసింది . లక్ష్మిగారు , అమ్మ , డ్రైవర్ మల్లేశ్ బాగానే వున్నారు .నేనొక్కదాన్నే భయపడ్డది :) మొత్తానికి అహోబిలం చేరుకున్నాము . అప్పటికే కొండమీద దేవాలయము మూసేసారు . కింద దేవాలయము " శయనోత్సవం " సేవ కోసం పరదా వేసారు . అది పూర్తి అయ్యే వరకు అక్కడే నిలబడ్డాము . సేవ ఐన తరువాత పాలు తీర్ధం గా ఇచ్చారు . స్వామి వారిని దర్శించుకొని బయటకు వచ్చాము .
దేవాలయాని కి దగ్గర లోనే వున్న " హరిత " రెస్టారెంట్ లో భోజనము చేసి తిరుగు ముఖం పట్టాము . రోజు ఉదయము నాకు కొంచము ఆరోగ్యము సరిగ్గా అనిపించలేదు . అందుకని అహోబిలం కాన్సిల్ చేసుకొని మహానంది మాత్రము చూసేసి తిరిగి వెళుదామన్నాను . ఏమికాదు వెళుదామని , అమ్మ , లక్ష్మిగారు ధైర్యం చెప్పారు . బయిలుదేరటము లోనే ఆలశ్యం కావటము తో చౌడేశ్వరి అమ్మవారి దగ్గర , యాగంటి లోనూ ఆలశ్యమై అహోబిలానికి వెళ్ళేసరికి దేవాలయము మూసే సమయము అయ్యింది . నేను రాను అన్నాననేమో , మళ్ళీ రమ్మని లక్ష్మినృసిమ్హ స్వామి సరిగ్గా దర్శనం ఇవ్వలేదు !

* * * * * * * * * * * * * * * * * * * * * ** * * * * * * * * * * * * *

మా మూడు రోజుల యాత్ర లో మూడో రోజు ఉదయమే " మహానంది " వెళ్ళాము . ఇది " శ్రీ శైలం " దక్షిన ద్వారము లోని క్షేత్రాల లో వొకటి . దీనికి చుట్టుప్రక్కల నవ నందీశ్వరాలయాలు వున్నాయి . ఇక్కడ శివలింగము కిద నుండి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ వుంటుంది . నీటిని మూడు కుండాల నుండి నంది నోటి గుండా నీరు బయటకు వెళ్ళేట్లుగా ఏర్పాటు చేసారు . మనము ఆలయము లోనికి ప్రవేశించగానే స్వచ్చమైన నీటితో రుద్ర కుండము అగుపడుతుంది . ఇక్కడి నుంచి తూముల గుండా నీరు బయటకు వచ్చి , ప్రధాన ద్వారము దాటగానే వున్న బ్రహ్మ , విష్ణు కుండాలను చేరుకుంటుంది . కుండాలలో నీరు చాలా స్వచ్చము గా వుండి , కింద వున్న చేపలు , నేల కూడా అగుపడుతుంది . వీటిలలో భక్తులు స్నానము చేస్తారు . నీటిలో స్నానము చేస్తే చర్మ వ్యాదులు పోతాయి అంటారు .
మహానంది లోని శివలింగము స్వయంభూ లింగము . పూర్వము ఒక గొల్ల వాని దగ్గర వున్న పెద్ద ఆవు , అడివిలో చొట పాలూ జార్చి ఒట్టి పొదుగుతో ఇంటికి వచ్చేది . ఒక రోజు కాపరి ఆవును అనుసరించి వెళ్ళి చూస్తాడు . ఆవు పాలు వదిలిన పచ్చగడ్డి కింద ఓక పుట్ట వుంటుంది . పుట్ట నుంచి ఒక అబ్బాయి బయటకు వచ్చి ఆవు వదిలిన పాలను తాగి , మళ్ళీ పుట్టలోనికి వెళ్ళిపోతాడు . సంగతి రాజ్యము రాజుకు తెలుస్తుంది . అదేదో చూద్దామని రాజు అక్కడి కి వచ్చి చూస్తూవుండగా చప్పుడుకు ఆవు భయపడి పరిగెడుతుంది . అప్పుడు దాని గిట్ట పుట్టమీద పడుతుంది . రాత్రి రాజుకు కలలో శివుడు అగుపించి నువ్వు చూసిన బాలుడిని నేనే . పుట్టను పూజించి దేవాలయము కట్టించమని చెపుతాడు . ఉదయమే రాజు పుట్ట దగ్గరికి వెళ్ళి చూడగా పుట్ట శివలింగము గా మారి వుంటుంది . లింగము మీద ఆవు గిట్ట దిగబడిన గుర్తు వుంటుంది . ఇప్పుడు కూడా గర్భ గుడిలోని శివలింగము మీద ఆవు గిట్ట గుర్తు చూడవచ్చు .
స్వామివారి గర్భ గుడి పక్కనే , కామేశ్వరీ దేవి గర్భగుడి ఉంటుంది . అక్కడ మేము కుంకుమార్చన చేసుకున్నాము . దేవాలయము లోకి ప్రవేశించే ద్వారము దగ్గర వున్న నవగ్రహాలకు నూనె దీపాలను వెలిగించాము .
మద్యాహ్నము 12 కల్లా నంద్యాల కు వచ్చి , అక్కడే భోజము చేసి , హైదరాబాదుకు తిరిగి బయలుదేరాము . సాయంకాలము 6 కల్లా హైదరాబాద్ చేరుకున్నాము .

2 comments:

శివ చెరువు said...

Thank you so much. By reading your post.. I also got the blessing of the god.

మాలా కుమార్ said...

శివ చెరువు గారు ,
థాంక్స్ అండి .