చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Friday, April 2, 2010

రాజమండ్రి - 2

మొదటి సారి సిలిగురి వెళ్ళేటప్పుడు , రాజమండ్రి స్టేషన్ చూసాను . అప్పుడు , అక్కడ , పసుపు , ఆకుపచ్చ డాట్స్ తో వున్న బత్తాయిలను చూసి , తెగ హాచర్య పోయి , ముచ్చటపడి కొన్నాను . ఆపైన రుచి మరిగి ఎప్పుడు సిలిగురి వెళ్ళేటప్పుడు , తిరిగి వచ్చేటప్పుడు , రాజమండ్రి స్టేషన్ లో బత్తాయిలు , వైజాగ్ స్టేషన్ లో కందిపొడి , విజయవాడ స్టేషన్ లో భోజనము తప్పనిసరైపోయాయి . రాజమండ్రి వస్తోంటే చాలు గోదావరి అందాలు చూడటానికి ఎవరినీ పట్టించు కోకుండా కిటికీ దగ్గర సెటిల్ ఐపోయేదానిని . అప్పుడే డిసైడ్ ఐపోయా జీవితములో ఒకసారైనా రాజమండ్రి స్టేషన్ లో దిగి , కోనసీమ లో గోదావరి అందాలు చూడాలని , ముచ్చట కొలిపే బత్తాయిలను తినాలని !!!!

ఆ కోరిక మొదటిసారిగా మా ఆడపడుచు విజయ పెళ్ళి లో తీరింది . తనతో పాటు మూడు నిద్రలకి వాళ్ళ అత్తవారి వూరు , గుమ్మళ్ళదొడ్డి వెళ్ళాను . మా ఇంట్లో గోదావరి జిల్లాలవారితో వియ్యమందటము కూడా అదే మొదటిసారి . వాళ్ళ భాష , అలవాట్లు చాలా గమ్మత్తుగా అనిపించాయి . గుమ్మళ్ళదొడ్డి లో వాళ్ళ ఇల్లు , ఆవూరు అచ్చం సినిమాలలో చూపించినట్లుగానే వున్నాయి . సిరిసిరిమువ్వ సినిమా అక్కడే తీసారుట . ఆ తరువాత మావారు ట్రాన్స్మిషన్ లైన్ లోకి వచ్చాక పని మీద వెళుతుంటే నేనూ వెళ్ళాను . అదేమిటో , ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక కారణము తో రెండు రోజుల కే తిరిగి వచ్చేయాల్సి వచ్చేది ! ఇది కాదు పని అని , నా పోరు పడలేక అక్కడ ఓ వర్క్ తీసుకున్నారు . రాజమండ్రి దగ్గర రాజోలు లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు .
ఓ శుభముహుర్తాన , చలో అనుకుంటూ వెళ్ళాము . అక్కడ ఇల్లు చూడగానే సీతారామయ్యగారి ఇల్లు లాలేదే అని కాస్త నిరుత్సాహం వేసిన మాటనిజమే . కాని సద్దేసుకున్నాను. మేము వెళ్ళేసరికి నీళ్ళురావటము , వెనక్కి పోవటము ( ? ) ఐపోయాయి . ఒక్క చుక్క నీరు లేదు ఎలాగా అనుకుంటూ వుంటే మావారికి గోదావరి లో స్నానం చేసేస్తే పోలే అనిపించి పక్కింటి ఆయనను , ఇక్కడికి దగ్గరలో గోదావరి ఎక్కడవుందీ అని అడిగారు . పట్టిసం ఇక్కడికి దగ్గరే , అక్కడ స్నానం చేసి , వీర్భద్రీశ్వరునికి అభిషేకం చేయించు కోండి , ఈ రోజు కార్తీక సోమవారం , చాలా మంచిది అన్నారు . అంతే రాజమండ్రి దగ్గర నావ ఎక్కి పట్టీసం చేరుకున్నాము . గోదారి గంగమ్మ స్నానాలు చేయంగ అనుకుంటూ హాపీగా స్నానం చేసి , కొండ ఎక్కి ఈశ్వరుని దర్షించుకొని , అభిషేకం చేసి వచ్చాము. .

ఓవారం రోజులు ఆయన బిజీగా వున్నా నాకేమి దిగులేయలేదు . మేమున్న కాలనీ లో , మా వక్కటితప్ప అన్ని ఒకే కుటుంబానివి . అందరూ గోడల మీదనుండి పెద్ద గొంతు తో మాట్ల్లడుకోవటము , ఏదైనా తేడావస్తే , పెద్దగా అందరూ కలిసి ఆ తేడా తెచ్చినవాడి మీద అరవటము అబ్బో చాలా ఎంజాయ్ చేసాను . ఆకుకూరలు , చుక్క కూర , గోంగూర ఒక్కొక్కటి అరచేతి మందాన వుండి ఫ్రెష్ గా నిగ నిగ లాడిపోతుండేవి . పచ్చివే తినాలనిపించేంత బాగుండేవి . ఏమిటో , అక్కడ ఏది చూసినా తెగ నచ్చేసేది !

వూళ్ళుచూద్దామని అనుకున్నాక అన్ని తెలిసిన డ్రైవర్ కావాలంటే , అక్కడి లోకల్ కాంట్రాక్టర్ ఒకాయన , ట్రావెల్స్ లో పని చేసే జానీ అనే అతనిని పిలిపించారు . బల్లకట్టు మీద కార్ తోసహా , బర్రెలు , మేకలు , సామాన్లతో మనుషుల తో పాటు గోదావరి దాటటము తో మా ప్రయాణము మొదలైంది . గోదావరి పాయల వెంట , గట్ల మీద , కొబ్బరి చెట్ల నడుమ , మధ్య మధ్య లో పాలకోవా తింటూ , చాలా ఆహ్లాదంగా సాగింది .ద్రాక్షారామం , సామర్ల కోట , భీమవరం , పాలకొల్లు , మందపాడు , ర్యాలి , పిఠాపురం, ధవళేశ్వరం అన్ని చూసాము . అంతర్వేది దగ్గర , గోదావరి ,సముద్రం లో కలిసే చోటుకు వెళ్ళాము . అక్కడ యు షేప్ లో వున్న చోట స్నానం చేసి వస్తూ , ఇక్కడ ఎవరూ లేరేమిటి , అంతా దూరంగా ఎక్కడో వున్నారు అనుకున్నాము . ఇంతలోనే ఒక పెద్ద అల మా దాకా వచ్చేసింది . ఆ తరువాత జానీ , మీరు అంత దూరం వెళుతారనుకోలేదు , అది చాలా డేంజర్ పాయింట్ ఎవరూ వెళ్ళరు , మీరు చాలా లక్కి , మీరున్నప్పుడు పోటు రాలేదు అన్నాడు . బాపురే , మాకు తెలీకుండానే సాహసం చేసాము , అక్కడ కొట్టుకు పోతే ఎవరికీ తెలిసేది కూడా కాదు అనుకున్నాము . కార్తీక మాసం కావటము వలన అన్నిశివాలయాలలో అభిషేకాలు చేసి , దీపాలు వెలిగించాము . రాజమండ్రి , గోదావరి ఒడ్డున వున్న ఉమామహేశ్వర ఆలయము లో ఈశ్వరుని 108 కలువ పూలతో పూజించి , రుద్రాభిషేకం చేసాము . ఆత్రేయపురం లో స్వీట్స్ కొన్నాము . బండారులంకలో మా వారు చీరలు కూడా కొనిచ్చారు . క్రిష్టియన్ ఐనా జానీ , అన్ని గుడులూ వాటి విషిస్టత చెప్పుతూ చక్కగా చూపించాడు . మావారి తో పని చేసే విజయ భాస్కర్ ,లాంచీ ఏర్పాటు చేసి , పాపికొండలు తీసుకెళ్ళాడు . లాంచీ లోనే వండటము , డెక్ మీద కూర్చొని తినటము అందాలరాముడు సినిమా గుర్తొచ్చింది . తిరిగి వచ్చేటప్పుడు లాంచీ మీదనుండి దీపాల వెలుగులో గోదావరి బ్రిడ్జ్ చూడటము , లాంతర్లు కట్టుకొని వెళ్ళే నావలను చూడటము మరపురాని అనుభూతి .అన్నవరం లో సత్యనారాయణవ్రతం చేసుకున్నాము . మొత్తం వారం రోజులు , జానీ పుణ్యమా అని కోనసీమ అంతా తిరిగాము .ఇంకా తిరిగే వారిమే కాని , మా డ్రైవర్ నరసిమ్హా గోల భరించలేక , మా వారికి హైద్రాబాద్ లో పని వుండటము చేతా తిరిగి వచ్చేసాము .

పదిహేను రోజుల క్రితం వెళ్ళినప్పుడు , ఈసారి యానాం వెళ్ళాలి అనుకున్నాను . అసలు కోనసీమ చూడలేదుట , అప్పుడే జానీ అన్నాడు . గోదావరి మీద బోట్ హౌస్ లు కొత్తగా పెట్టారట . అవన్నీ చ్హ్డాలనుకున్నాను , కాని వున్న మూడు రోజులలో మావారికి రెండురోజులు పనే సరి పోయింది . ఆ తరువాత తప్పనిసరై హైద్రాబాద్ రావాల్సి వచ్చింది . మధ్యలో ఒక రోజు యానాం వెళ్ళాము . జాని కోసం వెతికాము కాని అతను దొరకలే . హూస్టన్ దగ్గర , సముద్రపు వొడ్డున వున్న పల్లె లాగా యానాం ను వూహించుకున్నాను . కాని చాలా నిరాశ పరిచింది .ఒక్కటి కూడా పాత భవనం కనిపించలేదు . బీచ్ ను ఇప్పుడిప్పుడే అభివృద్ధి పరుస్తున్నారు . లిక్కర్ కోసం అందరూ వస్తారు అన్నారు . అక్కడికి సీ బాక్ వాటర్ వస్తుందిట గోదావరి మాత్రం మహా ఉదృతం గా వుంది . లాంచి లో ఓ అరగంట తిరిగి రావటము బాగుంది .
మళ్ళీ కోనసీమ ప్రయాణం ఎప్పుడో చూడాలి .

Thursday, April 1, 2010

రాజమండ్రి - 1
రాజమండ్రి చాలా పురాతన మైన నగరము . ఇది వేంగీ - చాళుక్యుల పరిపాలన లో వుండేది ." వేంగీ " అంటే కోస్తా ప్రాంతం అని అర్ధం .మొదట్లో దీనిని వేంగీ అనే పిలిచేవారు . కాలక్రమేణా , రాజమహేంద్రవరం గా మార్చారు . ముఖ్యముగా రాజరాజ నరేంద్రుడు సాహిత్యాని కి , లలిత కళలకు చేసిన సేవతో ప్రాముఖ్యత పొందింది .నన్నయ , తిక్కన మహాభారతం ను తెలుగు లోనికి అనువదించినదీ ఇక్కడే !! ఈస్ట్ ఇండియా వారి కాలము లో బ్రిటిషర్స్ దీనిని వర్తకకేంద్రముగా చేసుకున్నారు . అప్పుడే రాజమండ్రి గా మారింది . కాటన్ దొర తెలుగు భాష మీద మక్కువ ఏర్పరుచుకొని , తెలుగు నేర్చుకొని , తెలుగు భాష , సాహిత్య అభివృధికి కృషి చేసాడు . గోదావరి మీద ధవళేశ్వరము మీద ఆనకట్ట కట్టించి , వర్తకాని ని వ్యవసాయాన్ని అభివృధి పరిచాడు . కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తలు వెలసినదీ ఈ పుణ్య భూమి లోనే . ముస్లిం ప్రభావము ఈ ప్రాంతములో లేనందున , తెలుగు సాంప్రదాయాలు , ఆచారాలూ సంస్కృతీ ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి . ప్రస్తుత కాలము లోనూ పర్యాటక ప్రాంతము గా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది .

రాజమండ్రి చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చాలనే వున్నాయి . పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన ఐదు శివాలయాలలో నాలుగు , సామర్లకోట , భీమవరం , పాలకొల్లు , ద్రాక్షారామం ఇక్కడనే వున్నాయి . ర్యాలి లో జగన్మొహినీ ఆకారములో విష్ణుమూర్తి ని చూడవచ్చు . ముందువైపు , విష్ణు మూర్తిగా , వెనుక వైపు జగన్మోహినిగా విగ్రహము చాలా నైపుణ్యముతో మలిచారు . ఇక్కడ పూజారులు కూడా చాలా శ్రద్ధ గా దీపము వెలుగు లో చూపిస్తూ వివరిస్తారు . వున్న చోటినుండి , వుద్యోగములో బదిలీ కావలానుకుంటే ర్యాలీని దర్షిస్తే అవుతుందిట . కర్కోటకుడు అనే నాగు , ఈశ్వరుని ప్రతిష్టించి కొలిచిన చోటు మందపల్లి . మందపల్లి శనీశ్వరుని దేవాలయము చాలా ప్రషిద్ది పొందినది . అష్టాదశశక్తి పీఠాలలో వకటి , ద్రాక్షారామము లోని మాణిక్యాంబ . పిఠాపురములోని పురంధరేశ్వరి కూడా అష్టాదశశక్తి పీఠము లోని దేవినే . పిఠాపురం లోనే పాదగయ వుంది . ధక్షయజ్ఞము లో ఉధ్భవించిన వీరభద్రీశ్వర స్వామి వెలసిన చోటు పట్టీసం .

నాసిక్ లో పుట్టిన గోదావరి , పాపికొండల నడుమ వయ్యారం గా వంపులు తిరుగుతూ , , కోనసీమను అన్నపూర్ణ గా మారుస్తూ , రాజమండ్రి దగ్గరలోవున్న , అంతర్వేది దగ్గర సముద్రం లో కలుస్తుంది . ఈ కోన సీమ లోని గోదావరి అందం చూడవలసినదే కాని వర్ణించతరము కాదు .

ఇలా ప్రఖ్యాతి చెందిన దేవాలాయాలు రాజమండ్రి చుట్టుపక్కల చాలానే వున్నాయి . దేవాలాయాలే కాక , కోనసీమ అందాలు చూడాలంటే రెండు కళ్ళూ చాలవు .