Showing posts with label మన దేవాలయాలు. Show all posts
Showing posts with label మన దేవాలయాలు. Show all posts
Saturday, September 13, 2025
Wednesday, September 3, 2025
Thursday, October 25, 2012
నల్లపోచమ్మ - యూసుఫ్ గూడ

యూసుఫ్ గూడా బస్తీ కీ ముత్యాలమ్మ తల్లి గ్రామ దేవత అట .ఈ అమ్మవారు ఎప్పుడు ఎలా వెలిసిందో , ఈ చిన్న గుడి ఎవరు ఎప్పుడు కట్టించారో నేను అడిగినవాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు . మా కాలనీ లో వున్న సీతమ్మగారు 20 సంవత్సరాల క్రితము వాళ్ళు ఇక్కడి కి వచ్చేసరికే ఈ గుడి వుంది అన్నారు . ఇక్కడ ఆ రోజులలో ఎక్కువగా బలులు ఇచ్చేవారట.
13 సంవత్సరాల క్రితం యన్. జనార్ధన రెడ్డి గారు , ముత్యాలమ్మ గుడి కి పక్కనే ఓ గుడి కట్టించి అందులో నల్లపోచమ్మను స్థాపించారట. ఈ గుడి లో బలులు ఇవ్వరట. అమ్మవారు చాలా కళగా వుంటుంది . చాలా మహిమ కలది అని కూడా అంటారు . 11 సంవత్సరాల నుంచి సీతమ్మగారి ఆధ్వర్యం లో , మా కాలనీ ఆడవారు ఇక్కడ రోజూ సాయంకాలము, లలితా సహస్రనామాలు పారాయణ చేస్తున్నారు .మధ్య మధ్య భారతము , భగవద్గీత , రామాయణము కూడా పారాయణ చేసారట . రామాయణము పారాయణ చేసి నంత కాలమూ ఓ కోతి అక్కడకు వచ్చి , పక్కనే గోడ మీద కూర్చునేదట . రామాయణ పారాయణము అయ్యాక రాలేదట !
అలాగే జయలక్ష్మి అనే ఆవిడ 9 సంవత్సరాల క్రితం ఇటువైపు ఇల్లు కట్టు కొని వచ్చారట . వకరోజు రాత్రి కలలో , ఏదో గుడి , అక్కడ అందరూ ఏదో చదువుతున్నట్లుగా కల వచ్చిందిట. ఆవిడ అంత పట్టించుకోలేదట. మరునాడు రాత్రి మళ్ళీ ఆ గుడి స్పష్టంగా కనిపించిందిట. అమ్మవారి ముందు ఏదో రాయిలాగా కూడా కనిపించిందట . మరునాడు సాయంకాలం ఆ గుడి ఈ చుట్టుపక్కల ఏమైనా వుందా అని వెతుక్కుంటూ వస్తే ఈ గుడి కనిపించిందిట. అప్పుడే అక్కడ కొంతమంది ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారుట . ఆ గుడి , గుడి లోని అమ్మవారు , అమ్మవారి ముంది శిల అంతా కలలో కనిపించినట్లే వుందిట . ఆ రోజు నుంచి ఆవిడా ఆ బృదం లో చేరి రోజూ లలిత చదువుతున్నారట . ఇంచు మించు ఇలాంటి అనుభవమే నాకూ కలిగింది . పదిరోజుల క్రితం నేనూ ఏదో గుడిలో లలిత పారాయణ చేస్తునట్లుగా కల వచ్చింది . ఏ గుడా , ఎక్కడా అని నేనూ కొంచం ఆలోచనలో పడ్డాను . పొద్దున పూజ చేసుకొని , వచ్చి కూర్చోగానే , అక్కడే ఊడుస్తున్న మా పనమ్మాయి , అమ్మా దసరా పదిరోజులూ నల్లపోచమ్మ గుడి లో బాగా చేస్తారమ్మా . పక్కనే షెడ్ లో పెద్ద అమ్మవారి విగ్రహం పెడుతున్నారు . సీతమ్మ వాళ్ళు రోజూ వెళ్ళి ఏదో చదివి వస్తారు అన్నది . వెంటనే సీతమ్మగారి దగ్గర కు వెళ్ళి ఎన్నిటి కి వెళతారో తెలుసుకొని రమ్మని పంపించాను . రోజూ పది నిమిషాల తక్కువ ఐదుకు వెళుతారుట నిన్ను అప్పటికల్లా రమ్మన్నది తీసుకెళుతానన్నది అని చెప్పింది . ఆ విధం గా అమ్మవారు నన్నూ పిలిపించుకుంది . ఈ పది రోజులూ అమ్మవారి ముందు కూర్చొని లలితా పారాయణ చేయగానే ఎంతో మనశ్సాంతిగా , హృదయం తేలికపడ్డట్టుగా అనిపించింది .

ఈ పదిరోజులూ ఉత్సవాలు చాలా బాగా జరిగాయి . రోజూ ఉదయమూ , సాయంకాలమూ లలితా సహస్రనామపారాయణము జరిగింది . అందులో మా కాలనీ ఆడవారే కాకుండా చుట్టు పక్కల బస్తీ వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధ గా చేసారు . ఆరో రోజు సుహాసినీ పూజ , ముగ్గురు ముత్తైదువులకు , ఓ బాల కు చేసారు . ఒక రోజు అన్నదానం జరిగింది . ఏడోరోజు హోమం చేసారు . నిన్న విజయదశమి రోజు లలిత పారాయణ అయ్యాక అమ్మవారి ని కదిలించారు . ఈ తొమ్మిదిరోజులూ అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజించారు.
Tuesday, April 3, 2012
చిలుకూరు బాలాజీ
రంగారెడ్డి జిల్లాలో వుంది "చిలుకూరు " . ఇక్కడ వెలిసిన "బాలాజీ" , వీసా బాలాజీ గా చాలా ప్రసిద్ది . అమెరికాకు విసా కావాలనుకున్నవారు ఈ బాలాజీ ని తప్పక దర్శించుకుంటారు .
చాలాకాలం క్రితం చిలుకూరులో ఒక గొప్ప వెంకటేశ్వరస్వామి భక్తుడు 'గుణాల మాధవ రెడ్డి ' వుండేవాడు .ప్రతి ఏటా పంట చేతికి రాగానే తిరుపతి వెళ్ళేవాడు .చేలో పండిన ధాన్యం కొంత స్వామికి అర్పించేవాడు . స్వామికి కళాయణోత్సవం చేయించేవాడు . తిరుపతి వెకటేశ్వరుడంటే ఆయనకు ప్రఘాడమైన భక్తి .కొన్నాళ్ళకు ఆ భక్తుడు ముసలివాడైనాడు . తిరుపతి ప్రయాణం తట్టుకునే స్తితిలో లేడు . అతడు చాలా బెంగపడ్డాడు . స్వామిని దర్శించుకోలేకపోయానేనని దిగులు పడి, ఆలోచించి ఆలోచించి నిద్రపోయిన ఆరాత్రి , ఎవరో తట్టి లేపుతున్నట్లుగా అనిపించి లేచి కూర్చున్నాడు . కళ్ళుతెరిచి చూడగానే శ్రీదేవి , భూదేవి సహితం గా వెంకటేశ్వర స్వామి కనిపించి "తాతా నువ్వు రాలేవని నేనే వచ్చేసాను " అని చెప్పాడు . " ఇకనుంచి నీ కొరకు ఇక్కడ వెలుస్తాను . నీ చేలో వున్న శివలింగానికి దక్షణం వైపు వున్న ఒక పాముపుట్ట అడుగున నేను వున్నాను . ఇంతవరకు భూగర్భం లో వున్నాను . ఇక పైన నీలాంటి భక్తులకు దర్శనం ఇవ్వ తలుచుకున్నాను .నీ చేలో నేను చెప్పిన చోట తవ్వి చూడు . శ్రీదేవి , భూదేవి ల తో సహా ఒకే రాతిమీద వెంకటేశ్వరుని రూపం లో నీకు దర్శనం ఇస్తాను " అని చెప్పాడు .
సృహలోకి వచ్చిన మాధవరెడ్డి , తన మనవల సహాయముతో , తన పొలం లో వున్న పుట్టను వెతికి త్రవ్వగా , గడ్డపారకు రక్తపు మరకలు కనిపించటం తో భయపడిన మాధవరెడ్డి పాల తో పుట్టను కరిగించాడు .పుట్ట కరిగిపోయి ఏక శిలలో వెంకటేశ్వరుడు , అలివేలుమంగ , పద్మావతి కనిపించింది . అదే చోట మాధవరెడ్డి గుడి నిర్మించాడు .స్వామి మూలవిరాట్టుకు ఎడమవైపు పైభాగము ,చాతి దగ్గర గడ్డపారతో గాయమైన గుర్తులు నేటికీ కనిపిస్తాయి .
ఈ గర్భ గుడి చుట్టూ పదకొండు ప్రదక్షణాలు చేసినవారికి కోరిక తీరుతుందని భక్తుల విశ్వాసము . కోరిక తీరిన తరువాత 108 ప్రదక్షణాలు చేయాలి .
ఈ ఆలయం లో హుండీ లేదు . అర్జితం టికెట్లు లేవు . ప్రత్యేక దర్శన టికెట్లు లేవు . ఎంతటివారైనా సామాన్యుల తోపాటు క్యూ లో రావలసిందే !
మేము అనుకోకుండా పోయిన శనివారం చిలుకూరు వెళ్ళాము . రష్ చాలానే వుంది . ఐనా సులభంగానే దర్శనం అయ్యింది .కాకపోతే స్వామి దగ్గర లైట్ లేదు . చీకటిగా వుంది . అందుచేత స్వామి సరిగ్గా కనిపించలేదు . కనిపించినంతవరకు తృప్తిగా చూసాము . జరగండి జరగండి అనే తోపులాటలు లేవు !
ఈ గుడి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి వుంటుంది .
Thursday, June 16, 2011
సికింద్రాబాద్ లో సూర్య దేవాలయము





సూర్యుడిని మనము ప్రత్యక్షభగవానునిగా పూజిస్తాము . సమస్త జీవులకు ప్రాణాధారమైన శక్తిని ప్రసాదిస్తున్న ఆరోగ్యప్రధాత శ్రీ సూర్యభగవానుడు . శ్రీసూర్య భగవానుని , దాదాపు ప్రతి ఆలయములో వున్న నవగ్రహాలలో వుంచి పూజిస్తూ వున్నప్పటికీ , ఆయనకు విడిగా దేవాలయాలు కూడా వున్నాయి . వాటిల్లో నాకు తెలిసినవి , "కోణార్క్ దేవాలయము " , " అరిసివిల్లి " లోని సూర్య దేవాలయము . అందులో అరిసివిల్లి దేవాలయాన్ని నేను చూసాను . సికింద్రాబాద్ , తిరుమలగిరి క్రాసింగ్ దగ్గర సూర్య దేవాలయము వున్నదని , ఐదారు నెలల క్రితము ఎందులోనో చదివాను . అప్పటి నుంచి అక్కడ నాకు తెలిసి వారిని దాని గురించి అడుగుతునే వున్నాను . కాని ఎవరూ చెప్పలేకపోయారు . నిన్న , తిరుమలగిరి లో వున్న మా కజిన్ ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా మాటల్లో ఇక్కడెక్కడో సూర్యదేవాలయము వుందట నీకు తెలుసా అని అడిగాను . ఎక్కడో ఏమిటి మాఇంటి వెనుకనే వుంది , చాలా బాగుంటుంది . మా ఇంటికి ఎవరొచ్చినా తీసుకెళుతాము . ఇన్నేళ్ళ నుంచి వస్తున్నావు నీకు చెప్పలేదా ? నిన్ను తీసుకెళ్ళలేదా అని చాలా ఆశ్చర్య పోయింది మా కజిన్ డాక్టర్ . కుమారి . ఓరినీ చంకలో పిల్లను బెట్టుకొని వూరంతా వెతికి నట్లు , ఇక్కడ పక్కనే వుంచుకొని ఎంత వెతుకుతున్నాను అనుకున్నాను . అడ్రెస్ తెలిసాకా ఆలశ్యం ఎందుకని అప్పుడే ఆ దేవాలయానికి వెళ్ళాము . అంతే దేనికైనా టైం రావాలి !
ఈ సూర్య దేవాలయము విశాలమైన ప్రాంగణములో వుంది . లోపలి కి వెళ్ళగానే ఎదురుగా సూర్య దేవాలయము , గేట్ కు కుడివైపున సత్యనారాయణస్వామి ఆలయము వున్నాయి . చిన్న కొండను తొలిచి గర్భాలయముగా చేసారు . అందులో సూర్యభగవానుడు కొలువుతీరి వున్నాడు .సప్తాశ్వారూడుడైన స్వామివారు చతుర్భుజుడు . శంఖు , చక్రములు ధరించి రధము తోలుతూ స్వామివారు దర్శనము ఇస్తారు . స్వామివారు ఎంత కళగా వున్నారో చెప్పలేను చూసేందుకు రెండు కళ్ళూ చాలవనిపించింది . అరిసివెల్లి లోని స్వామివారి కంటే ఇక్కడి స్వామివారే చాలా కళగా వున్నట్లు నాకు అనిపించింది . ఈ స్వామివారిని వివిధ వ్యాధులతో బాధ పడుతూ వున్నవారు దర్శిస్తే ఆ బాధలు తొలుగుతాయట.ఆలయము ముందు వైపు పై భాగం లో సప్తాశ్వారూడుడైన సూర్య భగవానుని విగ్రహం దర్శనమిస్తుంది .
సూర్యాలయము పక్కనే అశ్వత్ధవృక్షము వుంది . దాని కి కొంచం పక్కగా శివలింగమును స్తాపించారు . శివలింగము పక్కన సరస్వతి ఆలయము వుంది . అక్కడ సరస్వతి చేతిలో వీణను అలంకరించారు . మా కజిన్ కొద్ది నెలల క్రితం వాళ్ళ అబ్బాయి వివాహము తరువాత కొడుకును కోడలిని అక్కడకు తీసుకెళ్ళిందట. అదే రోజు ఎవరో భక్తులు ఆ వీణను అమ్మవారికి సమర్పించుకున్నారట . ఆ వీణను , మా కజిన్ కోడలు వారి పర్మిషన్ తో కొద్ది సేపు వాయించిదిట . ఇక్కడ సరస్వతీ అమ్మవారిని విద్యార్ధులు పూజిస్తే విద్యాభివృద్ధి జరుగుతుందని , అమ్మవారి ముందు అక్షరాభ్యాసము చేస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకము . సరస్వతి ఆలయము పక్కనే నాగదేవత ఆలయము వుంది . ఇక్కడ నాగదోషాలు వున్నవారు అర్చిస్తే దోషాలు తొలుగుతాయి అంటారు . గేట్ దగ్గరగా వున్న సత్యనారాయణ స్వామి ఆలయములో వ్రతము చేసుకోవచ్చు. ఈ ఆలయాలన్నీ ప్రశాంతమైన వాతవరణములో వున్నాయి .
ప్రతిరోజూ చేసే పూజలు కాక , ' రధసప్తమి ' రోజున , ' సంక్రాంతి ' రోజున ఈ ఆలయ ప్రాంగణములో హోమము చాలా బాగా చేస్తారట. అప్పుడు చాలా రష్ వుంటుదిట .
సుమారు యాభై సంవత్సరాల క్రితము ఈ ప్రాంతములో పోచయ్య అనే వ్యక్తి వుడేవాడు అతను వృత్తిరీత్యా ఎక్కువగా దూర్ప్రాంతాలకు వెళుతూవుండేవాడు .పోచయ్య ప్రతిరోజూ ఉదయము స్నానము చేయగానే సూర్య నమస్కారాలు చేస్తూ వుండేవాడు . ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా సూర్యుడికి నమస్కారాలు చేసుకొని వెళ్ళేవాడు . రాను రాను సూర్యభగవానుని పై నమ్మకము పెరిగి , సూర్యుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాడు . ఒకసారిపనిమీద కలకత్తాకు వెళ్ళాడు . అక్కడ ఆయనకు సూర్యుని గురించి అనేక విషయాలు తెలుసుకొనే అవకాశము కలిగింది .అలా సూర్యుని గురించి తెలుసుకున్న ఆయనకు సూర్యుని మీద నమ్మకము ఇంకా పెరిగింది .కలకత్తా నుంచి తిరిగి వచ్చాక సూర్య దేవాలయము నిర్మించాలనుకున్న ఆయనకు , సోదరి తో పాటు మరికొందరు భక్తులు చేయూతను ఇచ్చారు . దీనితో ప్రస్తుతము ఆలయము వున్నప్రదేశము అనువైన ప్రాంతము గా గుర్తించారు . 1962 లొ అక్కడ చిన్న పాకను నిర్మించి అందులో స్వామిని ఉంచి , ప్రతిరోజూ ఉదయమూ , సాయంకాలమూ దీపము వెలిగించి పూజలు చేసేవారు . 1964 లో ఇప్పుడు వున్న ఆలయాన్ని నిర్మించి , శ్రీ సూర్య భగవానుడి తోపాటు ఇతర దేవతా మూర్తులను కూడా ప్రతిష్టించారు .
ఈ దేవాలయము ఉదయము 7 గంటల నుంచి 11 వరకు , సాయం కాలము 5 నుంచి 7.30 వరకూ తెరిచి వుంటుంది . తప్పక చూడవలసిన ఆలయము .
Wednesday, March 9, 2011
కట్ట మైసమ్మ దేవాలయము
సెక్రటేరియట్ దగ్గరి ఫ్లైఓవర్ నుంచి ఇందిరాపార్క్ వైపుకు వెళ్ళేటప్పుడు , ఫ్లైఓవర్ ఐపోగానే ఎడమ వైపు వుంటుంది ఈ దేవాలయము . ఇది దాదాపు 450 సంవత్సరాల క్రితముదట . హుసేన్ సాగర్ కు కట్ట కట్టేందుకు తవ్వుతుండగా అమ్మవారి విగ్రహము కూలీల కంట పడిందట . ఆ విగ్రహాన్ని అక్కడే స్తాపించి , కట్ట తవ్వుతుండగా వెలసిన అమ్మవారు కాబట్టి " కట్ట మైసమ్మ " అని పూజించారట . ఆ తరువాత ఎండొన్మెంట్ వారి ఆద్వర్యము లో గుడి కట్టించి సిమ్హవాహినిగా అమ్మవారి విగ్రహమును స్తాపించారట . మూల విగ్రహమును శ్రీచక్రము వద్ద వుంచారట . ఈ విషయాలు అక్కడి పూజారి గారు చెప్పారు . మూల విగ్రహమును కూడా చూపించారు .
ఈ దేవాలయానికి మొదటి సారిగా మా వియ్యపురాలిగారి తో వెళ్ళాను . అంతకు ముందు అట్లాంటా లో , మా మనవరాలు పుట్టేసమయము లో , నా కలలో కనిపించిన అమ్మావారు ఆమే నని గ్రహించి చాలా ఆశ్చర్య పోయాను . అంతే కాకుండా అప్పుడు నాకు కలలో జరిగినట్లే గుడి లో కూడా అనుభవము కావటము నమ్మలేని నిజము ! ఆ తరువాత మా రెండో మనవరాలు పుట్టినప్పుడూ కల లో దర్శనం ఇచ్చింది అమ్మవారు . ఆవిడ దర్శనమిచ్చిన మరునాడే మా కోడలు ఎక్స్పెక్టింగ్ అని తెలిసింది ! ఈ మద్య మూడు నెలలుగా ఆరోగ్యం ఇబ్బంది పెడుతోంది . పోయిన సోమవారము సాయంకాలము కూరున్న దానిని కూర్చున్నట్లే లేచి , అమ్మవారు పిలిచినట్లుగా ఈ గుడికి వెళ్ళాను . కాని నిలబడలేక , ఎలాగో కుంకుమార్చన చేయించుకొని , దగ్గర లోనే వున్న మా అమ్మాయి ఇంటికి వెళ్ళాను . మా అమ్మాయి వెంటనే , రేపు డాడీ తో వెళుతాను అన్నా వినకుండా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది . ఆయన నేను ఇన్ని రోజులు నిర్లక్షం చేసినందుకు బాగా కోపం చేసి మెడిసన్ ఇచ్చారు . ఆ రోజు అలా డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకొని ఆరోగ్యం బాగు చేసుకోమని చెప్పకనే చెప్పింది అమ్మవారు అనిపించింది . ఈ రోజు ఇలా వున్నాను అంటే ఆ అమ్మ దయే . నాకు ఇలా చాలాసార్లు అనుభవము కలిగింది . కట్ట మైసమ్మ చాలా పవర్ఫుల్ దేవత అని నాకు అనిపిస్తుంది .
ఈ దేవాలయము లో అన్నదానము చేసే వసతి కూడా వున్నది . మనము చెప్పిన రోజు అన్నదానము చేస్తారు . మనమిచ్చిన డబ్బుల తోనే అనుకోండి . మనకు కావలసిన రోజు , కావలసిన వారి పేరు మీద ఆ రోజు ఇందిరా పార్క్ లో ఏర్పాటు చేస్తారు . కావాలంటే మనము కూడా భోజనము వడ్డించ వచ్చు .
Subscribe to:
Posts (Atom)