చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Saturday, January 22, 2011

బడిచావిడీ హనుమాన్ జీ
నాకు ఏమైనా టెన్షన్ గా వున్నా , మనసు బాగున్నా బాగలేకపోయినా బడి చావిడీ లోని హనుమాంజీ ని దర్శించుకోవటము అలవాటు . ఈ రోజు వెళ్ళాలి అనిపించి , పొద్దున వెళ్ళి వచ్చాను . అసలు నాకు ఈ గుడికి వెళ్ళటము మా అత్తగారితో అలవాటు అయ్యింది . ప్రతి మంగళవారమూ వెళ్ళేవాళ్ళము . అప్పుడప్పుడు కాచిగూడా లోని హనుమంతుని గుడి కి వెళ్ళేవాళ్ళము .

ఈ దేవాలయము , బడిచావిడీ లో , పోలీస్ స్టేషన్ పక్కన వుంటుంది . చాలా చిన్న దేవాలయము . రావి చెట్టు చుట్టూ కట్టివుంటుంది . చెట్టు కి ఓ పక్కన దాదాపు కింద విగ్రహం వుంది . అన్ని దేవాలయాలలో లా కాకుండా చాలా చిన్న విగ్రహము . కొంచము కిందికి వంగే నమస్కరించుకోవలసి వుంటుంది . ప్రదక్షణ చేసేటప్పుడు వెనుకవైపు చిన్న సందులా వుంటుంది . ఒకొక్కరే వెళ్ళగలరు . ఈ దేవాలయము 100 సంవత్సరాల క్రితముది అన్నారు అక్కడున్న పూజారి . ఈ రోజు ఆయనకు మౌన వ్రతమట . చేతిలో రాసి చూపించారు . ఇంతకు మించి ఆ గుడి చరిత్ర తెలుసుకోలేక పోయాను . అదృష్టం ! నేను ఇంతకు ఎప్పుడూ కూర్చొని , కొద్ది సాఎపు ధ్యానం చేసుకొనే స్తలం ఖాళీగా వుంది . కాసేపు కూర్చొని వచ్చేసాను . మధ్యలో కొన్ని సంవత్సరాలు ఈ గుడిని మూసేసి వుంచారు . మళ్ళీ ఈ మధ్యనే తెరిచారట .

నాకు ఏదేవుడన్నా కాస్త భయమూ భక్తీ ఎక్కువే . మా ఇలవేలుపు వెంకటేశ్వరునీ పూజిస్తాను , శివపార్వతులు , సీతారాములూ , దుర్గా దేవీ ఎవరన్నా భక్తే కాని ఆంజనేయస్వామి అంటే కొంచం ఎక్కువ . ఆయన ఎప్పుడూ నన్నో కంట కనిపెడుతూవుంటాడని నా భావన . చాలా సంవత్సరాలుగా , అంటే పెళ్ళైన కొత్తలో బడి చావిడీ హనుమాన్ జీ దేవాలయానికి వెళ్ళటము అలవాటైనప్పటి నుంచి ప్రతి రోజూ ఆంజనేయస్వామి దేవాలయానికి వెళుతున్నాను . పిల్లలు కొంచం పెద్దవాళైనాక బడీ చావిడీ వరకు వెళ్ళే టైం లేక మా ఇంటి దగ్గరే వున్న హనుమంతుని గుడి రోజూ వెళ్ళే దానిని . అక్క డే ఒక పెద్దావిడ పరిచయము అయ్యారు . నలభై రోజుల పాటు , రోజూ 108 ప్రదక్షణలు చేస్తే మంచిదని చెప్పారు . అప్పటి నుంచి నాకు వీలున్నప్పుడల్లా చేస్తూ వుంటాను .

ఖైరతాబాద్ , నిలోఫర్ హాస్పెటల్ దగ్గర ఓ హనుమాన్ దేవాలయము వుంది . అది బహుషా మార్వాడిలు కట్టించారనుకుంటాను . చాలా పెద్ద ప్రాంగణము లో వుంది . గుడి కూడా కొంచము పెద్దదే . ఆ ప్రాంగణములోకి ప్రవేసిస్తునే మన్సంతా ప్రశాంతము గా అవుతుంది . ఈ దేవాలయములో ప్రతి గురువారము , ఆదివారము ఒక పూజారి , పిల్లలకు దిష్టి తీస్తాడు . పిల్లల కనే కాదు , పెద్దలకు కూడా తీస్తాడు . మా పిల్లల చిన్నప్పుడు , హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఓసారైనా తీసుకెళ్ళి దిష్టి తీయించేదానిని .

విద్యానగర్ కు మారాక , అక్కడి రామాలయము లో ఆంజనేయస్వామికి , డి . డి కాలనీకి మారాక అహోబిలమఠం లో వున్న మారుతికి ప్ర్దక్షణలు చేసేదానిని . ప్రస్తుతము మా ఇంటి కి దగ్గరలోనే వున్న హనుమంతుని గుడి వెళుతున్నాను . ఇంకా నేను రెగ్యులర్గా దర్శించే ది ఆర్. టి. సి క్రాస్ రోడ్ లో వున్న పంచముఖ ఆంజనేయస్వామిని . ఈ సారి అటు వైపు వెళ్ళినప్పుడు ఆ ఫొటోలు కూడా తీసి పెడుతాను .

Tuesday, January 18, 2011

సిద్ది గణపతి - రుద్రారం
హైద్రాబాద్ నుంచి మెదక్ వెళ్ళే దారిలో హైవే మీద పటాంచెరువు నుంచి ఇంచుమించు 16 కిలోమీటర్ల దూరములో వున్నది ఈ గణపతి ఆలయము . ఇది 300 సంవస్తరాల పురాతనమైన ఆలయము . ఒకొప్పుడు ఇక్కడ చింతల తోపు వుండేది . శివరామ భట్ అనే భక్తుడు అనంత చదుర్దశి నాడు వినయకుని పూజించేవాడు . ఒక సారి ఆయన తిరుపతి కి పాద యాత్ర చేస్తూ ఇక్కడ విశ్రమించాడు . ఆ రోజు అనంత చతుర్దశి అయ్యింది . అప్పుడు ఆయన పూజ చేసుకుందామని , అనుకోకుండా ఓ శిల ను ముట్టుకోగా అది వినాయకుని రూపం గా మారింది . దానిని ఇక్కడ ప్రతిష్టించి పూజించాడు . అలా ఆయనకు , ఆయన పర్యటనలలో ఏడు సార్లు వివిధ ప్రదేశాలలో జరిగింది .
అవి ;
1 . చింతలగిరి - కర్ణాటక
2. రేచింతల - జహీరాబాద్
3. రుద్రారం - మెదక్
4. అజ్ఞూర్ - మెదక్
5- మల్కంపాడు - మెదక్
6. చీకుర్తి - నారాయణపేట్
7 . అమీరాబాద్
ఈ వివరాలు శివరామభట్ వ్రాశిన ' లఘుభఖ్త విజయం ' అనే పుస్తకము లో వున్నాయి . ఆ గ్రంధము నాందేడ్ గ్రంధాలయము లో దొరికింది . ఎ దేవాలయపు ధర్మకర్త లలో ఒకరైన అల్లూరి గోపాల్ గారు , ఈ దేవాలయము మీద రీసర్చ్ చేసి , ఈ వివరాలన్నీ సేకరించారు .

శివరామభట్ తరువాత , ఓ సారి , నిజాం నవాబు దగ్గర మిలిటరీ కమాండర్ గా వున్న ' మక్కందాస్ ' అనే అతను , బీదర్ నుండి బలగాలను తీసుకొని నవాబుగారి దగ్గరకు వెళుతుండగా , ఆయన గుర్రము ఇక్కడ వెనుక అడుగు వేసి కదలకుండా వుండిపోయింది . ఎందుకు ఆగిపోయిందా అనుకొని ఆయన అక్కడే గూడారాలు వేసుకొని నిద్ర చేయగా , కలలో వినాయకుడు కనపడి పూజ చేసుకోమన్నాడు . అప్పుడు ఆయన నిద్ర లేచి ఆ ప్రదేశమనతా వెతికగా , శివరామభట్ స్తాపించిన వినాయక విగ్రహము కనిపించింది . ఆ విగ్రహమును పూర్తిగా రూపము వచ్చేట్లుగా చెక్కించి , గుడి కట్టించాడు . వుద్యోగ విరమణ చేసి ఆ స్వామిని పూజించుకోసాగాడు . ఆయన తరువాత ఆయన శిష్యురాలు దుర్గా బాయి ఈ ఆలయము భాద్యత తీసుకున్నారు .
మక్కందాస్ ఇక్కడే సజీవ సమాధి చెందారు . దుర్గాబాయి కూడా ఇక్కడే సమాధి చెందారు .
ఇప్పుడు ఎండోన్మెంట్ స్వాధీనములో వున్నది .
ఈ ఆలయము ప్రత్యేకత ఏమిటంటే , శివరామభట్ స్తాపించిన ఈ ఏడు ఆలయాలు కూడా ధక్షిణముఖం గా వుంటాయి . స్వామివారిని సింధూరము తో అలంకరిస్తారు .
ఈ స్వామి వారి దగ్గర ఏవైనా కోరికలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయంటారు . అందుకు ఉదాహరణలు చాలా నే చెప్పారు . తప్పక దర్శించవలసిన ఆలయము ఇది .

Sunday, January 16, 2011

6వ శతాబ్ధము నాటి భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానము
హైదరాబాద్ నుంచి , బి హెచ్ యల్ తరువాత , దగ్గర దగ్గర 8 కిలోమీటర్లు దాటిన తరువాత , కుడి వైపు " బీరంగూడ " అని చిన్న వూరు వస్తుంది . మేన్ రోడ్ కు కుడివైపు పెద్ద కమాన్ , " భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానము ' అని రాసిన ది కనిపిస్తుంది . కమాన్ నుండి లోపలికి వెళ్ళి , జంక్షన్ లో ఎడమవైపుకు తిరిగి కొద్ది దూరం వెళ్ళితే అంతా చిన్న చిన్న కొండలతో వున్న ఖాళీ మైదానములో వున్నది 6 లేక 7 శతాబ్ధము లో నిర్మించబడినట్లుగా చెప్పబడుతున్న , మల్లికార్జున స్వామి దేవాలయము .

భోగ మహర్షి , బృగు మహర్షి ప్రదేశములో తపస్సు చేసుకున్నారట. అక్కడే గుహ కింద నుండి శ్రీశైలం కు సొరంగ మారగము కూడా వుండేదట . మహర్షులు ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళేవారని , స్వామి నే ఇక్కడా ప్రతిష్టించారని , అందుకే ఇక్కడ శివుని కూడా మల్లికార్జున స్వామి
అంటారట .

బాదామి చాళుక్యుల కాలం లో ఇక్కడ దేవాలయము కట్టించారని , రాష్ట్రకూటులు , కళ్యాణి చాణుక్యులు , కాకతీయులు మల్లికార్జునిని సేవించుకున్నారని చరిత్ర. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత , నవాబుల కాలం లో కొంత వైభవం తగ్గిందట . మొగలుల దాడులలో దేవాలయము కూలిపోయిందట.

సికింద్రాబాద్ మిలిట్రీ లో పని చేసే తిప్పర వెంకయ్య అనే అతను , సన్యసించటానికి వివేకానదుని వద్దకు వెళ్ళగా , వివేకానందుడు ముందు గృహస్తధర్మం నిర్వహించి రమ్మని తిప్పి పంపారట . వెంకయ్య తిరుగు ప్రయాణములో ఇక్కడ విశ్రమించిన సమయములో స్వామి కలలో కనిపించారట . అక్కడే దగ్గర వున్న నూతిలో శివలింగం దొరికిందట . దాని తో స్నేహితుల సహాయముతో చిన్న గుడి కట్టించాడట .

1898 లో గంగా రెడ్డి అనే భక్తుడు శిలా మండపం కట్టించాడు . ఆంజనేయస్వామిని కూడా ప్రతిష్ఠించారు . వెంకయ్య తరువాత ఆయన కుమారుడు
భార్గవ దేవాలయ భాద్యతను తీసుకున్నారు .వెంకయ్య గారి కుమార్తె శ్రీమతి . అన్నపూర్ణ , ఆవిడ కుమారుని తో కలిసి ఇప్పుడు వున్న విధముగా నిర్మించారు . అంతే కాకుండా పక్కనే వెంకటేశ్వరాలయము కూడా నిర్మించారు .

భ్రమరాంబా మల్లికార్జున ఆలయము లో వున్న ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద శనీశ్వరుడు వుండటము ఇక్కడి ఇంకో ప్రత్యేకత .
ఆలయము వున్న ప్రదేశము చాలా ప్రశాంతము గా వుంటుంది . ఎంతసేపు వున్నా తనివి తీరలేదు


ఆలయము నుంచి మేన్ రోడ్ మీదకు వచ్చాక ముందుకు ఇంకో 16 కిలోమీటర్ లు వెళి, కుడి వైపు మట్టి రోడ్ వెంట లోపలికి ఇంకో రెండు కిలోమీటర్లు వెళితే ఇస్మాయిల్ ఖాన్ పేట్ అనే గ్రామము వస్తుంది . అక్కడ సప్తప్ర్రాకారాయుత శ్రీ దుర్గాభవానీ మహాక్షేత్రం వుంది . పెద్ద కోట లాంటి ప్రహారి లో దేవాలయము వుంది . ప్రాహారీ నిర్మించేటప్పుడు , అక్కడ కూలి గా చేస్తున్న సోదరుని కోసం భవానీ అనే అమ్మాయి భోజనం తేగా , కొందరు తుంటరి కూలీలు అమ్మాయిని ఏడిపించారట . దానితో ఆమె కలత చెంది ప్రాకారములో మూలకు వెళ్ళి శిలగా మారి పోయిందట .

ఎనిమిది సంవత్సరాల క్రితం శ్రీ మదానంద స్వామి , ప్రదేశము లో నిదురించగా అమ్మవారు స్వప్నము లో అగుపించి దేవాలయమును నిర్మించమని ఆదేశించిందట . వెను వెంటనే నిధులు కూడా సమకూరాయట . చక్కని దేవాలయమును నిర్మించారు . దుర్గాభవాని విగ్రహము నిలువెత్తు లో వుండి , చాలా కళగా వుంది .

మేన్
రోడ్ మీదకు రాగానే ఎడమవైపు , 300 సంవత్సరాల పురాతనమైన , రుద్రారం సిద్ది గణపతి ఆలయము వుంది . దాని గురించి రేపు చెపుతాను .

మొన్న 12 తారీకున , పుష్య శుద్ద అష్టమి బుధవారము రోజున పూజ చేస్తే లక్ష సార్లు ఫలితమిస్తుందట . రోజున అనుకోకుండా , నేను
మా అమ్మ , లక్ష్మి గారు దేవాలయాలను దర్శించుకున్నాము .