చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Monday, October 24, 2011

బీదర్



మావారు పనిమీద బీదర్ వెళుతుంటే , ఒక్కరే వెళుతున్నారని నేను కూడా వెళ్ళాను . బీదర్ చేరగానే నాకు ఓ కార్ డ్రైవర్ ఇచ్చి తిరగమని చెప్పి తను పని మీద వెళ్ళారు . డ్రైవర్ మురళి ముందుగా బీదర్ కోటకు తీసుకెళ్ళాడు .

హైదరాబాద్ కు దగ్గర లో వున్న చారిత్రక ప్రదేశము " బీదర్ " . ఇక్కడి వాతావరణము , ప్రకృతి అందాలకు ముచ్చట పడ్డ బహ్మనీ సుల్తాన్ 1429 లో బీదర్ నిర్మాణానికి పూనుకున్నాడని చారిత్రిక ఆధారాలు తెలుపుతున్నాయి . 1724 నుంచి 1948 వరకూ నిజాం నవాబుల ఏలుబడి లో వుంది . హైదరబాద్ ప్రాంతము లో బాగము గా వున్న బీదర్ ఆ తరువాత కర్ణాటక లో భాగమైపోయింది.
బీదర్ లో ముందుగా చూడవలిసింది బీదర్ కోటను . పట్టణము లోకి వెళుతూనే , మొదట్లోనే కోట శిధిలాలు కనిపిస్తాయి . లోపల 16 స్తంబాలతో నిర్మించిన ప్రార్ధనా మందిరము ,( మసీదు ) , రాణివాసమైన గగన్ మహల్ ముఖ్యమైనవి .శిధిలమవుతున్న కోట భాగాలను మరమత్తుచేసి , పార్క్ లా చేసి , కోటను చూడముచ్చటగా తయారు చేస్తున్నారు .



గగన్ మహల్



సోలా స్తంబ్ మాస్క్

గురుద్వార



కోట చూసాక బీదర్ లో ముఖ్యమైన ' గురుద్వారా ' కు వెళ్ళాము . గురునానక్ ఇక్కడ కొద్దిరోజులు వున్నాడట . నేను ఇంతవరకూ ఎప్పుడూ గుర్ద్వారాలా చూడలేదు . చాలా ప్రశాంతము గా బాగుంది . గురునానక్ మొదటి అడుగు వేసిన చోటున సన్నటి నీటి ధార వస్తూ , అక్కడ వున్న చిన్న పూల్ లో పడుతున్నాయి . ఇదే ఆ 'అమృత కుండ్ ' .



గురుద్వారా లో ప్రసాదముగా ఇచ్చిన హల్వా తిని , శివాలయము చూపిస్తానని తీసుకెళ్ళాడు . అది కొంచం అడవి లో వున్నది . దీనిని ' పాపనాశం శివాలయము ' అంటారట . శ్రీరాముడు రావణుని సమ్హరించి , అయోద్య కు తిరిగివెళుతూ , రావణుడు శివభక్తుడు కాబట్టి ఆ భక్తుని చంపిన పాపము ను పోగొట్టుకొనినేందుకు దారిలో అక్కడక్కడ శివలింగాలను ప్రతిస్ఠించాడట . అలా రాముడు ప్రతిస్ఠించినదే ఇక్కడ వున్న శివలింగం . ఈ లింగమును దర్సించినంతనే సర్వ పాపములు వినాశమవుతాయట .
ఇదే ఆ లింగము , దేవాలయము ;







ఆ అడవిలోనే కొంచము ముందుకు వెళితే వస్తుంది ' బసవగిరి ' వీరశైవము క్లిష్ట పరిస్తితులలో వున్నప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు భూలోకములో ' బసవేశ్వరు ' ని గా అవతరించి వీర శైవ ధర్మమును ప్రభోదించాడు . ఆ బసవన్న ప్రార్ధనామందిరమే ఈ బసవగిరి .
ఈ మందిరము లో బసవన్న భక్తులు ప్రార్ధనలు చేస్తారు ;


మావారు లంచ్ కు వచ్చినప్పుడు ఇక్కడ ప్రసిద్ది చెందిన ' జరానరసిమ్హస్వామి ' దేవాలయము కు వెళ్ళాము . ఇక్కడ లక్ష్మీనరసిమ్హుడు ఓ గుహలో 600 మీటర్ ల దూరము లో వుంటాడు . అక్కడి వరకు నీళ్ళు వుంటాయి . అంటే ఆయనను దర్శించుకోవాలంటే గుహలో నీళ్ళలో వెళ్ళాలన్నమాట . ఆ గుహను , ఆ నీటిని చూడగానే నేను లోపలికి రానన్నాను . మా మావారు కొంచము నచ్చ చెప్పేందుకు ప్రయత్నించి , ఇహ నాకు నరసిమ్హుని దర్శించుకునే ప్రాప్తం లేదని చెప్పి ఆయన లోపలి కి వెళ్ళారు . కొద్దిగా లోపలికి వెళ్ళి భుజాలదాకా నీళ్ళు రాగా , వెనక్కి వెచ్చి ఆయన పర్సు , వాచీ నాకు ఇచ్చి వెళ్ళారు . ఆయనతో పాట ఆయన అసిస్టెంట్లు కూడా వారి సామానులు ఇచ్చి వెళ్ళారు . కాసేపు క్లాక్ రూం నయ్యానన్నమాట :) అక్కడే గట్టుమీద వచ్చేపోయే వాళ్ళను చూస్తూ కూర్చున్నాను . గట్టుపక్కనే వున్న లక్స్మీనరసిమ్హస్వామి దగ్గర కూర్చున్న పూజారిని స్తలపురాణము చెప్పమని అడిగాను . అందరూ తిరిగి రానీ అందరికీ కలిపి ఒకేసారి చెపౌతాను అన్నాడు ఆయన .






ఈ గుహలో శివుడు తపస్సు చేసుకుంటూ వుండగా ' జలాసురుడు ' అనే రాక్ష్సుడు ఆయనను చాలా విసిగిస్తూ వున్నాడట . అప్పుడు లక్ష్మీనరసిమ్హ స్వామి వచ్చి జలాసురుడిని సమ్హరించాడట . జలాసురుడి కొద్దిగా పుణ్యము చేసుకొని వుండటము వల్ల , ఏదైనా మంచి కోరిక కోరుకో తీరుస్తాను అన్నాడట నరసిమ్హస్వామి . ఐతే నువ్విక్కడే వెలవాలి , నిన్ను నా పేరు తో కలిపి పిలువాలి అని కోరాడట జలాసురుడు . అప్పుడు నరసిమ్హస్వామి అక్కడ వెలిశి ' జలానరసిమ్హుడు ' గా కొలవబడుతున్నాడు .' జలా అంటే నీరు కాబట్టి , నరసిమ్హస్వామి పాదాల వద్ద నుంచి నీరు ఆ గుహలో ప్రవహిస్తోందిట. ఇది ఆ పురోహితుడు , మరాఠీ , హిందీ కలిపి చెప్పగా నాకు అర్ధమైన స్తలపురాణము !



ఇవీ బీదర్ లో చూడ తగ్గ ప్రదేశాలు .

Thursday, June 16, 2011

సికింద్రాబాద్ లో సూర్య దేవాలయము















సూర్యుడిని
మనము ప్రత్యక్షభగవానునిగా పూజిస్తాము . సమస్త జీవులకు ప్రాణాధారమైన శక్తిని ప్రసాదిస్తున్న ఆరోగ్యప్రధాత శ్రీ సూర్యభగవానుడు . శ్రీసూర్య భగవానుని , దాదాపు ప్రతి ఆలయములో వున్న నవగ్రహాలలో వుంచి పూజిస్తూ వున్నప్పటికీ , ఆయనకు విడిగా దేవాలయాలు కూడా వున్నాయి . వాటిల్లో నాకు తెలిసినవి , "కోణార్క్ దేవాలయము " , " అరిసివిల్లి " లోని సూర్య దేవాలయము . అందులో అరిసివిల్లి దేవాలయాన్ని నేను చూసాను . సికింద్రాబాద్ , తిరుమలగిరి క్రాసింగ్ దగ్గర సూర్య దేవాలయము వున్నదని , ఐదారు నెలల క్రితము ఎందులోనో చదివాను . అప్పటి నుంచి అక్కడ నాకు తెలిసి వారిని దాని గురించి అడుగుతునే వున్నాను . కాని ఎవరూ చెప్పలేకపోయారు . నిన్న , తిరుమలగిరి లో వున్న మా కజిన్ ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా మాటల్లో ఇక్కడెక్కడో సూర్యదేవాలయము వుందట నీకు తెలుసా అని అడిగాను . ఎక్కడో ఏమిటి మాఇంటి వెనుకనే వుంది , చాలా బాగుంటుంది . మా ఇంటికి ఎవరొచ్చినా తీసుకెళుతాము . ఇన్నేళ్ళ నుంచి వస్తున్నావు నీకు చెప్పలేదా ? నిన్ను తీసుకెళ్ళలేదా అని చాలా ఆశ్చర్య పోయింది మా కజిన్ డాక్టర్ . కుమారి . ఓరినీ చంకలో పిల్లను బెట్టుకొని వూరంతా వెతికి నట్లు , ఇక్కడ పక్కనే వుంచుకొని ఎంత వెతుకుతున్నాను అనుకున్నాను . అడ్రెస్ తెలిసాకా ఆలశ్యం ఎందుకని అప్పుడే దేవాలయానికి వెళ్ళాము . అంతే దేనికైనా టైం రావాలి !

సూర్య దేవాలయము విశాలమైన ప్రాంగణములో వుంది . లోపలి కి వెళ్ళగానే ఎదురుగా సూర్య దేవాలయము , గేట్ కు కుడివైపున సత్యనారాయణస్వామి ఆలయము వున్నాయి . చిన్న కొండను తొలిచి గర్భాలయముగా చేసారు . అందులో సూర్యభగవానుడు కొలువుతీరి వున్నాడు .సప్తాశ్వారూడుడైన స్వామివారు చతుర్భుజుడు . శంఖు , చక్రములు ధరించి రధము తోలుతూ స్వామివారు దర్శనము ఇస్తారు . స్వామివారు ఎంత కళగా వున్నారో చెప్పలేను చూసేందుకు రెండు కళ్ళూ చాలవనిపించింది . అరిసివెల్లి లోని స్వామివారి కంటే ఇక్కడి స్వామివారే చాలా కళగా వున్నట్లు నాకు అనిపించింది . స్వామివారిని వివిధ వ్యాధులతో బాధ పడుతూ వున్నవారు దర్శిస్తే బాధలు తొలుగుతాయట.ఆలయము ముందు వైపు పై భాగం లో సప్తాశ్వారూడుడైన సూర్య భగవానుని విగ్రహం దర్శనమిస్తుంది .
సూర్యాలయము పక్కనే అశ్వత్ధవృక్షము వుంది . దాని కి కొంచం పక్కగా శివలింగమును స్తాపించారు . శివలింగము పక్కన సరస్వతి ఆలయము వుంది . అక్కడ సరస్వతి చేతిలో వీణను అలంకరించారు . మా కజిన్ కొద్ది నెలల క్రితం వాళ్ళ అబ్బాయి వివాహము తరువాత కొడుకును కోడలిని అక్కడకు తీసుకెళ్ళిందట. అదే రోజు ఎవరో భక్తులు వీణను అమ్మవారికి సమర్పించుకున్నారట . వీణను , మా కజిన్ కోడలు వారి పర్మిషన్ తో కొద్ది సేపు వాయించిదిట . ఇక్కడ సరస్వతీ అమ్మవారిని విద్యార్ధులు పూజిస్తే విద్యాభివృద్ధి జరుగుతుందని , అమ్మవారి ముందు అక్షరాభ్యాసము చేస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకము . సరస్వతి ఆలయము పక్కనే నాగదేవత ఆలయము వుంది . ఇక్కడ నాగదోషాలు వున్నవారు అర్చిస్తే దోషాలు తొలుగుతాయి అంటారు . గేట్ దగ్గరగా వున్న సత్యనారాయణ స్వామి ఆలయములో వ్రతము చేసుకోవచ్చు. ఆలయాలన్నీ ప్రశాంతమైన వాతవరణములో వున్నాయి .

ప్రతిరోజూ చేసే పూజలు కాక , ' రధసప్తమి ' రోజున , ' సంక్రాంతి ' రోజున ఆలయ ప్రాంగణములో హోమము చాలా బాగా చేస్తారట. అప్పుడు చాలా రష్ వుంటుదిట .

సుమారు యాభై సంవత్సరాల క్రితము ప్రాంతములో పోచయ్య అనే వ్యక్తి వుడేవాడు అతను వృత్తిరీత్యా ఎక్కువగా దూర్ప్రాంతాలకు వెళుతూవుండేవాడు .పోచయ్య ప్రతిరోజూ ఉదయము స్నానము చేయగానే సూర్య నమస్కారాలు చేస్తూ వుండేవాడు . ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా సూర్యుడికి నమస్కారాలు చేసుకొని వెళ్ళేవాడు . రాను రాను సూర్యభగవానుని పై నమ్మకము పెరిగి , సూర్యుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాడు . ఒకసారిపనిమీద కలకత్తాకు వెళ్ళాడు . అక్కడ ఆయనకు సూర్యుని గురించి అనేక విషయాలు తెలుసుకొనే అవకాశము కలిగింది .అలా సూర్యుని గురించి తెలుసుకున్న ఆయనకు సూర్యుని మీద నమ్మకము ఇంకా పెరిగింది .కలకత్తా నుంచి తిరిగి వచ్చాక సూర్య దేవాలయము నిర్మించాలనుకున్న ఆయనకు , సోదరి తో పాటు మరికొందరు భక్తులు చేయూతను ఇచ్చారు . దీనితో ప్రస్తుతము ఆలయము వున్నప్రదేశము అనువైన ప్రాంతము గా గుర్తించారు . 1962 లొ అక్కడ చిన్న పాకను నిర్మించి అందులో స్వామిని ఉంచి , ప్రతిరోజూ ఉదయమూ , సాయంకాలమూ దీపము వెలిగించి పూజలు చేసేవారు . 1964 లో ఇప్పుడు వున్న ఆలయాన్ని నిర్మించి , శ్రీ సూర్య భగవానుడి తోపాటు ఇతర దేవతా మూర్తులను కూడా ప్రతిష్టించారు .

దేవాలయము ఉదయము 7 గంటల నుంచి 11 వరకు , సాయం కాలము 5 నుంచి 7.30 వరకూ తెరిచి వుంటుంది . తప్పక చూడవలసిన ఆలయము .

Thursday, May 19, 2011

భాగ్యనగరము-సాంప్రదాయాలు

హైదరాబాద్ లో పండుగలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బోనాల పండుగ.ఆషాఢ మాసము లో గ్రామదేవతలకు చేసేది ఈ పండుగ. బోనము అంటే నైవేద్యము.ఎవరెవరి మొక్కులను బట్టి వారు అమ్మవారికి నివేదన చేస్తారు.ఒకప్పుడు బలులు ఇచ్చేవారట. కాని ఇప్పుడు మటుకు అన్న నైవేద్యమే ఇస్త్తున్నారని విన్నాను.ముఖ్యముగా ఎక్కువగా ఆషాడమాసములో వచ్చే ఆదివారాలు చేస్తారు. ఆ రోజు ఉదయమే తలస్నానము చేసి శుచిగా అమ్మవారి కి నైవేద్యము-బోనము వండి అలంకరించిన కొత్తకుండ లో పెట్టుకొని, తల మీద పెట్టుకొని అమ్మవారి గుడి కి వెళ్ళి నివేదన చేస్త్తారు.కొత్త పట్టు చీరలు కట్టుకొని, చక్కాగా అలంకరించుకొని ,బోనాల కుండని తల మీద పెట్టుకొని ముత్తయిదువలూ,కన్నెపిల్లలు,కొత్త పెళ్ళికూర్తులూ వెళుతుంటే చూడటానికి రెండు కళ్ళూ చాలవు.పిల్లా పాపలు చల్లగా ఆరోగ్యముగా వుండాలని,వర్షాలు సక్రమముగా పడి పంటలు బాగా పండాలని మొక్కుకుంటారు.చివరి వారము లో సికంద్రాబాద్ మహంకాళి ఆలయము లో పెద్ద ఎత్తున చేస్త్తారు.ఆ రొజు పూజారిణి మీదకు అమ్మవారు వచ్చి భవిష్యవాణి చెపుతుందని అందరి నమ్మకము.

నేను ఒక ఆదివారము ఇంట్లోనే అమ్మవారి కి పెరుగన్నము నివేదన చేసి,ఒక కొబ్బరి కాయ,జాకెట్టు బట్ట ,పసుపు ,కుంకుమ,గాజులు దగ్గర లోని అమ్మవారి గుడి లో ఇస్త్తాను.


బతుకమ్మ పండుగ మా అత్తవారింట్లొ చేసే అలవాటు వుంది.తంగేడు పూలు,పున్నాగ మొదలైన పూలు ఒక పెద్ద పళ్ళెము లో ఆకు వేసి దాని మీద అందముగా అలంకరించి,పైన తమలపాకు లో చిన్న పసుపు గౌరమ్మ ని పెట్టి,చిన్న కొత్త బట్టలో బియ్యము రుపాయి కాసు పెడతారు . అదే బతుకమ్మ.ఎవరు ఎంత ఎత్తుగా పేరుస్త్తారు అన్నది పోటి.పల్లెటూళ్ళ లో అయితే రకరకాల పులతో చాలా కళాత్మకముగా పేరుస్త్తారు.ఆ బతుకమ్మలని మద్యలో వుంచి ఆడవారంతా చుట్టూ తిరుగుతూ,చప్పట్లు తడుతూ,కొలాటాలు ఆడుతూ ,

ఒక్కొ పువ్వేసి చందమామా అని ఒకామె పాడుతే,

పడక కుర్చీలోని ఓ రాజశేఖరా మా అన్నలొచ్చారు మమపుతారా,మీ అన్నలొస్త్తేను కోల్ మాకేమి తెచ్చారు కోల్,
అత్తకు అద్దాలా రవికా కోల్,మామకు పట్టంచు దొవ్తీ కోల్ అని ఇంకో ఆవిడ అందుకుంతుంది.
ఒకరు చెబుతుంటే మిగితావాళ్ళు గొంతు కలుపుతారు.ఈ రకముగా పూజించి చివరకు నీళ్ళ లో

పోయిరా మాయమ్మ పొయిరావమ్మా ,పొయి నీ అత్తింటనూ సుఖముగా నుండు,
మగడేమన్ననూ మారాడబోకు ,ఎవరేమన్ననూ ఎదురాడబోకూ
అంటూ సుద్దులు చెబుతూ సాగనంపుతారు.

దసరా దేవీ నవరాత్రులలో ఒకవైపు బతుకమ్మగా పూజలందుకుంటూ ,ఇంకొవైపు శంకరమఠ ము లో రోజొక అలంకరణతొ అమ్మవారు శొభిల్లుతుంటారు.

ఇవే కాకుండా వినాయకచవితి మొదలైన పండుగలు కుడా జరుపుతారు.కాని ఇవి ఇక్కడి సాంప్రదాయ పండుగలు. ఈ పండగలప్పుడు సందడి చూడాలంటె బర్కత్పురా,చిక్కడపల్లి,అశోకనగర్ ,నల్లకుంట,విద్యానగర్ లలో చూడాలి.ఇవి మా ఇలాకాలు.అందుకని నాకు ఇక్కడి సంగతే తెలుసు.నల్లకుంట ,చిక్కడపల్లి మార్కెట్ల లో అయితే పండగలప్పుడు మొగలి పూలు,కలవ పూలు కుడా దొరుకుతాయి.
ఇక గుడుల విషయాని కి వస్త్తే మాకు చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయము చాలా అలవాటు.మా ఇంట్లొ కొత్తదంపతులు ముందుగా దర్షించుకునేది ఈ స్వామినే.మా కుటుంబము లోని పిల్లల అన్నప్రాసన,అక్షరాభ్యాసము,పుట్టివెంటుకలు అన్ని ఇక్కడే.
ఈ పరిసరాలన్ని ఎక్కువగా మద్యతరగతి వారు నివసించేవి.భాధ్యతలు తీరి,రిటైర్ అయిన నడివయసు దంపతులు ఇక్కడ సుఖంగా నివసించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.ముఖ్యముగా చిక్కడపల్లి లో ఐతే పొద్దున్నే సుధా హొటల్ నుంచి టిఫ్ఫిన్ తెచ్చుకొని,మధ్యహ్నము బందరు మిఠాయి దుకాణములో ఓ నాలుగు సీసాలు ఇస్త్తే కమ్మటి పచ్చడులు ఇస్త్తాడు -వాటిలోకి వేడి అన్నము వండుకొనితినేసి,సాయంకాలము పక్కనే వున్న ఏ థియేటర్ లో సినిమానో,లేదా త్యాగరాయగానసభ లో ఏ ప్రోగ్రామో చూసేసి ,అదీ కాదంటే సత్యనారయణ స్వామి గుడిలో పురాణ కాలక్షేపాని కో వెళ్ళివస్తూ హాయిగా ఏ చికూ చింతా లేకుండా గడపవచ్చు.

ఇలా నల్భై సంవత్సరాలనుండి మెట్టినిల్లు,పది సంవత్సరాలనుండి పుట్టిల్లు కుడా అయినా మా హైదరాబాద్ గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలనే వుంది.కాని ఎంతని చెప్పను?ఒక షహెరి (ఉర్దూ కవిత) ఐనా చెప్పకుండా ఆపేస్తే అసంపుర్తిగా వుంటుంది.మా ఫ్రెండ్ ప్రభ ఈ షెహారీ లు చెప్పటము లో దిట్ట.ఆమె చెప్పిన ఒక చిన్న షెహరి,
ఉత్తరాలు రాయటాని కి బద్దకించిన ప్రియుడి తో ప్రియురాలు,
యా ఇలాహి,క్యా సబబ్ హై,
మొహబత్ ఖతం హై,
యా ఢాఖానా బంద్ హై

భాగ్యనగరము -సుందరనగరము




హైదరబాద్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్.,హైదరబాద్ చరిత్రకు గురుతుగా ,ప్లేగ్ మహమ్మారినుండి రక్షించేందుకు గాను పదిహేనువందల తొంబైఒకటి లో కులికుత్బ్ షా నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. .పైవరకు ఎక్కి చూస్తే హైదరబాద్ మొత్తమును దర్షించవచ్చు

.మొత్తము ఏడుగురు కుతుబ్ షా వంశీయులు గొలుకొండ కోట నుండి హైదరాబాద్ ని పాలించారు.అందరు కుడా ఇక్కడి సన్స్క్రుతి ,సాహిత్యాలను పొసించారు. అలాగే వ్యాపారాన్ని కూడా వౄద్ది పరిచారు.ముక్యముగా ముత్యాలు,వజ్రాల వ్యాపారము ఎక్కువగా సాగేదివ్యాపారాభివ్రుధే కాకుండా పట్టణము అంతా బాగ్ (తోటల) తో సుందరముగా తీర్చి దిద్దారు.విదేసీయులు దీని అతి సుందరమైన ,ఇరాన్ లో వున్న ఇస్ఫాన్ తో పోల్చేవారు.

తరువాత పదిహేడువందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలబై ఏనిమిది వరకు పాలించిన నవాబులు హైదరబాద్ ను ఇంకా అభివౄద్ది చేసారు..మీర్ ఉస్మాన్ అలి ఖాన్ ఉస్మానియా హాస్పిటల్ ,ఉస్మానియా విశ్వవిద్యాలయము స్తాపించారు.అవి ఇప్పటికి ప్రజలకి ఎనలేని సేవ చేస్తున్నాయి.

ఉస్మానియా విశ్వ విద్యాలయములో అప్పుడు ఎక్కువగా ఉర్దూ మిడీయం లోనే ఎక్కువగా భోధన జరిగేది.మా మామగారు,మానాన్నగారు ఉర్దు లోనే చదువుకున్నారు.వాళ్ళ సర్టిఫికేట్స్ ఉర్దూ లోనే వున్నాయి.
ఇక పెద్ద పెద్ద భవనాలని నిర్మించారు.హైదరాబాద్ దివాన్,సాలార్జంగ్ నిర్మించిన సాలార్ జంగ్ ప్రదర్శనశాల ప్రపంచ ప్రసిద్ది పొందింది..
ఇక ప్రస్తుతాని కి వస్తే చార్మినార్
పక్కనే వున్న చూడీ బజార్ లో రకరకాల గాజులు మరులు కొలుపుతూ వుంటాయి.లక్క మీద చిన్న చిన్న గాజు ముక్కలు,అద్దాలు,పూసలు అతికిస్తూ ఇంత అందంగా ఎలా చేయగలరొ!చీర మీదికైనా ,డ్రెస్స్ మీదికైనా ఏరకము దుస్తుల మీదికైనా అందంగా అమరిపొతాయి.వాటి నైపుణ్యానికి అశ్చర్యపొకమానము.
పక్కనే ముత్యాల సరాలు.చిన్నవి,పెద్దవి అబ్బొ ఎన్ని రకాలొ!

యన్ .టి రామారావు గారి హయాము లో టాంక్ బండ్ దగ్గర ప్రముఖుల విగ్రహాలు,టాంక్ బండ్ మధ్యలో బుద్ద విగ్రహము ఏర్పరిచి పట్టణాని ఇంకా సుందరముగా తీరిచి దిద్దారు.
ఇలా చెప్పుకుటూ పోతే ఎంతైనావుంది.
నాకు నచ్చిన విగ్రహము సెక్రటేరియట్ ముందువున్న తెలుగుతల్లి విగ్రహము.


Get this widget | Track details | eSnips Social DNA

Monday, April 18, 2011

అహోబిలం - మహానంది





















" ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ,
నృసిమ్హం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్య్హం :"
యాగంటి నుండి అహోబిలం బయిలుదేరాము . కొంచము దూరము వెళ్ళగానే దారి తప్పినట్లుగా అనిపించింది . అడుగుదామన్నా అక్కడ ఎవరూ లేరు ! కొంత సేపటి కి మోటర్ సైకిల్ మీద ఇద్దరు అబ్బాయిలు వచ్చారు . వారిని ఆపి దారి అడిగాము . దాదాపు 10 కిలో మీటర్లు వెనకకి వెళ్ళాలసి వచ్చింది ! అహోబిలము దగ్గరికి చేరుకునేసరి కి చీకటైయ్యింది . అహోబిల చేరాలంటే దగ్గర దగ్గర 14 గు కిలో మీటర్లు అడవి గుండా వెళ్ళాలి . దారి లో అక్కడక్కడ మినుకు మినుకు మంటూ దీపాలు , చిన్న వూళ్ళు తప్ప ఎక్కువగా మనుషులెవరూ కనిపించలేదు . చీకటి ( 7 గంటల కే చిమ్మ చీకటైంది . అదేమిటో ) , నిశబ్ధం నాకైతే చాలా భయం వేసింది . లక్ష్మిగారు , అమ్మ , డ్రైవర్ మల్లేశ్ బాగానే వున్నారు .నేనొక్కదాన్నే భయపడ్డది :) మొత్తానికి అహోబిలం చేరుకున్నాము . అప్పటికే కొండమీద దేవాలయము మూసేసారు . కింద దేవాలయము " శయనోత్సవం " సేవ కోసం పరదా వేసారు . అది పూర్తి అయ్యే వరకు అక్కడే నిలబడ్డాము . సేవ ఐన తరువాత పాలు తీర్ధం గా ఇచ్చారు . స్వామి వారిని దర్శించుకొని బయటకు వచ్చాము .
దేవాలయాని కి దగ్గర లోనే వున్న " హరిత " రెస్టారెంట్ లో భోజనము చేసి తిరుగు ముఖం పట్టాము . రోజు ఉదయము నాకు కొంచము ఆరోగ్యము సరిగ్గా అనిపించలేదు . అందుకని అహోబిలం కాన్సిల్ చేసుకొని మహానంది మాత్రము చూసేసి తిరిగి వెళుదామన్నాను . ఏమికాదు వెళుదామని , అమ్మ , లక్ష్మిగారు ధైర్యం చెప్పారు . బయిలుదేరటము లోనే ఆలశ్యం కావటము తో చౌడేశ్వరి అమ్మవారి దగ్గర , యాగంటి లోనూ ఆలశ్యమై అహోబిలానికి వెళ్ళేసరికి దేవాలయము మూసే సమయము అయ్యింది . నేను రాను అన్నాననేమో , మళ్ళీ రమ్మని లక్ష్మినృసిమ్హ స్వామి సరిగ్గా దర్శనం ఇవ్వలేదు !

* * * * * * * * * * * * * * * * * * * * * ** * * * * * * * * * * * * *

మా మూడు రోజుల యాత్ర లో మూడో రోజు ఉదయమే " మహానంది " వెళ్ళాము . ఇది " శ్రీ శైలం " దక్షిన ద్వారము లోని క్షేత్రాల లో వొకటి . దీనికి చుట్టుప్రక్కల నవ నందీశ్వరాలయాలు వున్నాయి . ఇక్కడ శివలింగము కిద నుండి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ వుంటుంది . నీటిని మూడు కుండాల నుండి నంది నోటి గుండా నీరు బయటకు వెళ్ళేట్లుగా ఏర్పాటు చేసారు . మనము ఆలయము లోనికి ప్రవేశించగానే స్వచ్చమైన నీటితో రుద్ర కుండము అగుపడుతుంది . ఇక్కడి నుంచి తూముల గుండా నీరు బయటకు వచ్చి , ప్రధాన ద్వారము దాటగానే వున్న బ్రహ్మ , విష్ణు కుండాలను చేరుకుంటుంది . కుండాలలో నీరు చాలా స్వచ్చము గా వుండి , కింద వున్న చేపలు , నేల కూడా అగుపడుతుంది . వీటిలలో భక్తులు స్నానము చేస్తారు . నీటిలో స్నానము చేస్తే చర్మ వ్యాదులు పోతాయి అంటారు .
మహానంది లోని శివలింగము స్వయంభూ లింగము . పూర్వము ఒక గొల్ల వాని దగ్గర వున్న పెద్ద ఆవు , అడివిలో చొట పాలూ జార్చి ఒట్టి పొదుగుతో ఇంటికి వచ్చేది . ఒక రోజు కాపరి ఆవును అనుసరించి వెళ్ళి చూస్తాడు . ఆవు పాలు వదిలిన పచ్చగడ్డి కింద ఓక పుట్ట వుంటుంది . పుట్ట నుంచి ఒక అబ్బాయి బయటకు వచ్చి ఆవు వదిలిన పాలను తాగి , మళ్ళీ పుట్టలోనికి వెళ్ళిపోతాడు . సంగతి రాజ్యము రాజుకు తెలుస్తుంది . అదేదో చూద్దామని రాజు అక్కడి కి వచ్చి చూస్తూవుండగా చప్పుడుకు ఆవు భయపడి పరిగెడుతుంది . అప్పుడు దాని గిట్ట పుట్టమీద పడుతుంది . రాత్రి రాజుకు కలలో శివుడు అగుపించి నువ్వు చూసిన బాలుడిని నేనే . పుట్టను పూజించి దేవాలయము కట్టించమని చెపుతాడు . ఉదయమే రాజు పుట్ట దగ్గరికి వెళ్ళి చూడగా పుట్ట శివలింగము గా మారి వుంటుంది . లింగము మీద ఆవు గిట్ట దిగబడిన గుర్తు వుంటుంది . ఇప్పుడు కూడా గర్భ గుడిలోని శివలింగము మీద ఆవు గిట్ట గుర్తు చూడవచ్చు .
స్వామివారి గర్భ గుడి పక్కనే , కామేశ్వరీ దేవి గర్భగుడి ఉంటుంది . అక్కడ మేము కుంకుమార్చన చేసుకున్నాము . దేవాలయము లోకి ప్రవేశించే ద్వారము దగ్గర వున్న నవగ్రహాలకు నూనె దీపాలను వెలిగించాము .
మద్యాహ్నము 12 కల్లా నంద్యాల కు వచ్చి , అక్కడే భోజము చేసి , హైదరాబాదుకు తిరిగి బయలుదేరాము . సాయంకాలము 6 కల్లా హైదరాబాద్ చేరుకున్నాము .

Sunday, April 10, 2011

నందివరం - యాగంటి



జోగుళాంబను , బాల బ్రహ్మేశ్వరస్వామి ని దర్శించుకున్న తరువాత , అక్కడే వున్న కరివెళ్ళవారి సత్రములో భోజనము చేసి , జోగుళాంబ దర్శనము బాగా జరిగింది అన్న సంతృప్తి తో నంద్యాలకు బయలు దేరాము . సాయంకాలానికి నంద్యాల చేరాము . బస్ స్టాప్ కు దగ్గర లో వున్న శశిహోటల్ లో రూం తీసుకొన్నాము . ఫ్రెషప్ అయ్యాక హోటల్ కు దగ్గరలోనే వున్న శివాలయము ను , సాయిబాబా మందిరము ను దర్శించుకున్నాము .



మరునాడు ఉదయమే యాగంటి బయిలుదేరాము . యాగంటికి వెళ్ళే దారి లో "నందివరం " దగ్గర ఆగాము . ఇక్కడ " చౌడేశ్వరీ దేవి " ఆలయము చాలా ప్రశిద్ది పొందినది. నందవరమును పూర్వము నందనచక్రవర్తి పాలించేవాడు . ఆయన దత్తాత్రేయును ఉపాసకుడు .దత్తాత్రేయుని గురించి తపస్సు చేసి స్వామివారిని మెప్పించి , ప్రతిరోజూ కాశీ క్షేత్రమునకు వెళ్ళి , గంగా స్నానం చేసి , విశాలాక్షి అమ్మవారిని సేవించేందుకు మంత్రపాదుకలను పొందాడు . వాటి వలన రోజూ తెల్లవారకముందే కాశీ కి వెళ్ళి అమ్మవారిని సేవించి వచ్చేవాడు . అదంతా తెలియని రాణి మీరు అంత వెకువననే ఎక్కడికి వెళుతున్నారు అని చక్రవర్తిని అడిగింది . అప్పుడు ఆయనకు విషయము చెప్పక తప్పలేదు . రాణి తను కూడా వస్తానని పట్టుపట్టటము తో రాణీ ని కూడా వెంట తీసుకొనివెళ్ళాడు . పవిత్ర గంగా స్నానం , అమ్మవారి దర్శనం అయిన తరువాత రాణి కి ఋతుక్రమము రావటమువలన , మంత్రపాదుకల శక్తి నశిస్తుంది .వారు రాజ్య వెళ్ళే మార్గము కోసమని అక్కడే ఉన్న కాశీ బ్రాహ్మణులను సహాయము చేయమి వేడుకున్నారు . బ్రాహ్మణులు మంత్ర శక్తి చే వారిని , వారి రాజ్యానికి చేరుస్తారు . అప్పుడు రాజు మీకేమి కావాలో కోరుకోమంటాడు . వారు సమయము వచ్చినప్పుడు అడుగుతామంటారు . కొంతకాలము తరువాత కాశీ లో కరువు వస్తుంది . అప్పుడు బ్రాహ్మణులు నందవరము వచ్చి సహాయము అడుగుతారు . రాజు వారెవరో తనకు తెలీదని , ఒకవేళ వారికి తను వాగ్ధానము చేసినట్లైతే , దానికి ఎవరితోనైనా సాక్ష్యము చెప్పించమంటాడు . బ్రాహ్మణులు విశాలాక్షి అమ్మవారిని సాక్ష్యము చెప్పేందుకు తీసుకొని వస్తారు . అప్పుడు రాజు ఆమె ను శరణు వేడి , అమ్మవారిని అక్కడకు పిలిపించటము కోసమే తను వాగ్ధానము మర్చినట్లు నటించానని , అమ్మవారిని అక్కడే వుండమని వేడుకుంటాడు . చక్రవర్తి కోరిక తో అక్కడ వెలిసిన అమ్మవారే చౌడేశ్వరీ దేవి .
ఆలయము వెనుక భాగము లో ఉళందర వృక్షము వుంది . వృక్షము అమ్మవారితో పాటు వచ్చిందట . అక్కడ కూడా భక్తులు పూజలు చేసి , ముడుపులు కట్టుతారు . ఆలయము ఒక పక్కగా అమ్మవారి పాదాలు వున్నాయి . చౌడేశ్వరదేవి కి మీసాలు వుండటము ఇక్కడి ప్రత్యేకత . చౌడేశ్వరీ అమ్మవారు మమ్మలిని తొందరగా వెళ్ళి పోనీయలేదు . గంట పైగానే అమ్మ వారి దగ్గర గర్భగుడి ముందు అమ్మవారిని కనులారా చూస్తూ కూర్చున్నాము .




అక్కడి నుంచి " యాగంటి " చేరుకునే సరికి గుడి మూసివేసే సమయము అయ్యింది . అందుకని అక్కడే వున్న అన్నదాన సత్రము లో భోజనము చేసి 2 గంటలకు గుడి తలుపులు తీసేవరకు విశ్రాంతి తీసుకున్నాము . చుట్టూ కొండలు పెద్ద పెద్ద చెట్లతో అక్కడి ప్రదేశము చాలా బాగుంది . అగస్త్య మహాముని తన దక్షిణ దేశ యాత్రలో ప్రదేశములో కొన్ని రోజులు తపస్సు చేసారట . అప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టించతలిచి విగ్రహము తయారు చేయించారట . మరునాడు విగ్రహ ప్రతిష్ఠ అనగా విగ్రహము పాదమునకు బొటన వేలు లేదని గమనించారట . ఎలాగా అనుకుంటు వుండగా మహేశ్వరుడు అగస్త్యునికి కనిపించి , ఇది నాకు ఇష్టమైన ప్రదేశము , కాబట్టి ఇక్కడ నన్ను ప్రతిష్ఠించమని చెప్పాడట . అప్పుడు అగస్త్యుడు పార్వతి తో సహా వెలుస్తేనే ప్రతిష్ఠిస్తానని అంగా , ఉమాదేవి తో సహా ఈశ్వరుడు ఇక్కడ వెలిసాడు . ఇక్కడి శివలింగము మీద ఉమా మహేశ్వరుల వదనాలు వుంటాయి .అలా ఇంకే శివలింగము మీద వుండదు .

ఇక్కడి నంది విగ్రహము పెరుగుతూ వుండటము ఇక్కడి ప్రత్యేకత .80/90 సంవత్సరాల క్రితము నంది చుట్టూ ప్రదక్షణలు చేసేందుకు వీలుగా వుండేదిట . ఇప్పుడు నాలుగు స్తంబాలకు ఆనుకొని ప్రదక్షణకు వీలుగాలేదు . కలియుగాంతమునకు నందీశ్వరుడు లేచి రంకె వేస్తాడని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానము లో చెప్పారట . విగ్రహమును ఎక్కడో చేసి తెచ్చినట్లుగా లేదు . ఇక్కడే వెలిసినట్లు చిన్న పర్వతాకారములో వుంది .

ఇక్కడ మూడు గుహలు ఉన్నాయి . ఒకటి అగస్త్యమహాముని తపస్సు చేసింది . ఇంకొకటి వెంకటేశ్వర స్వామిని వుంచింది .మూడవ దానిలో వీరబ్రహ్మేంద్రస్వామి కొంతకాలము కాలజ్ఞానము రాసారంటారు .
ఇక్కడి కొలను లోని నీరు చాలా స్వచ్చం గా వుంటుంది . గుడి కి పైకి వెళ్ళేందుకు 60+ మెట్లు ఎక్కాలి ! అంతే కాదు ఇక్కడ తినేందుకు అరటిపళ్ళు కూడా కనిపించలేదు ! మంచినీళ్ళ బాటిల్స్ దగ్గర నుంచీ అన్నీ తీసుకొని వెళ్ళాలి . భోజన మంటే అక్కడి సత్రములోనే వుంది . మెట్లు ఎక్కాలి . ఇవన్ని చూసుకొని వెళితే చాల సుందరమైన ప్రదేశము "యాగంటి ".

Saturday, April 2, 2011

ఆలంపూర్



ఉదయము 7.30 కల్లా హైదరాబాద్ దాటాము , నేనూ , మా అమ్మా , లక్ష్మిగారు . షాద్నగర్ దాటాక టిఫినీలు కానిచ్చాము . 9.30 కల్లా బీచుపల్లి చేరుకున్నాము . కృష్ణ వడ్డున వున్న ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళాము . దేవాలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఏమీ లేదుట . చాలా పెద్ద విగ్రహము . స్వామివారు కళకళ లాడిపోతున్నారు .చాలా మహిమ గల స్వామి అట . హనుమాన్ చాలీసా చదువుకొని , కాసేపు గుడి లో కూర్చొని మా ప్రయాణము తిరిగి మొదలుపెట్టాము .

దారిలో అక్కడక్కడ నీళ్ళ తో , ఎండిపోయిన కృష్ణ ను చూస్తే , ఇంకా ఎండాకాలము పూర్తిగా మొదలే అవలేదు , అప్పుడే కృష్ణమ్మ ఇలా ఐపోయిందే అని చాలా బాధ పడ్డాము .




అక్కడి నుంచి 11.30 వరకు ఆలంపూర్ చేరాము . మేము వెళ్ళేసరికి పూట చివరి కుంకుమార్చన కు టికెట్స్ ఇస్తున్నారు . మేము టికెట్స్ తీసుకొని ఆలయము లోకి వెళ్ళాము . అమ్మవారి దర్శనము , కుంకుమార్చనా బాగా జరిగాయి . అందరూ వెళ్ళి తరువాత అక్కడి పూజారి మా కోరికపై అమ్మ వారి చరిత్ర చెపుతూ విగ్రహము చూపించారు .

ఆలంపూర్ లోని ' జోగుళాంబ ' అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవది . ప్రదేశము లో అమ్మవారి ముందు పళ్ళు పడ్డాయి . అందువలన అమ్మవారు నాలుక బయట పెట్టి చాలా ఉగ్రము గా వుంటారు . మేము పదిహేను సంవత్సరాల క్రితము వెళ్ళినప్పుడు అమ్మవారి , విగ్రహము , బాలబ్రహ్మేశ్వరుని ఆలయములో వుండేది . అప్పుడు , అమ్మవారిని నేరుగా చూడనివ్వలేదు . గోడకు వున్న కంత లో నుంచి చూసాము . ఇప్పుడు వున్న ఆలయము 1985 లో కొత్తగా కట్టారు . అక్కడ అమంవారి పాత విగ్రహము మును వుంచి , దాని ముందే కొత్తది , శాంతస్వరూపముతో స్తాపించారు . ఆలయము చుట్టూ నీటి కొలను వుంది . దాని వలన కూడా అమ్మవారు కొంత శాంతముగా వుంటారని చెప్పారు . అమ్మవారి జుట్టు మీద , బల్లి , తేలు , గబ్బిలము , మనిషి పుర్రె బొమ్మలు చిత్రించి వున్నాయి .

ఇక్కడ శక్తి పీఠమే కాకుండా , నవబ్రహ్మలు కూడా వున్నారు . బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా , ఈశ్వరుడు ఆవు గిట్ట రూపము లో వెలిశాడు . చాలా చిన్న లింగాకారము కావటము తో ' బాల బ్రహ్మేశ్వర స్వామి ' అంటారు . 5 రూపాయల టికెట్ తీసుకుంటే గర్భ గుడి లో కి వెళ్ళి లింగము ను తాకి ప్రార్ధించుకోవచ్చు .
అమ్మవారి ద్వారపాలకులైన ' చండి , ముండి ' విగ్రహాలు ఇక్కడే వున్నాయి . కొత్త ఆలయము నిర్మించక ముందు అమ్మవారి విగ్రహము ఇక్కడే వుండేది .


ఇక చరిత్ర విషయాని కి వస్తే , ఇది తుంగ భద్ర , కృష్ణ నదుల మద్య ప్రదేశము లో వున్నది . ఆలంపుర సీమ , దక్షిణకాశి , భాస్కర క్షేత్రము , పరుశురామ క్షేత్రము , శ్రీశైల పశ్చిమ ద్వారము అని కూడా అంటారు .
దక్కను ప్రాతాన్ని పరిపాలించిన బాదామీ చాళుక్యులు , రాష్ట్రకూటులు , కళ్యాణీ చాళుక్యులు , కాలచుర్యులు , కాకతీయులు , తెలుగు చోళులు , విజయనగర రాజులు మహా క్షెత్రాన్ని సేవించారు. ఇది 14, 15 శతాబ్ధములలో బహమనీ సుల్తానుల దాడి కి గురి ఐనది .

మహాద్వారము దగ్గర అలీ పహిల్వానుకు ఒక దర్గా వున్నది . దానిని ' ధడ్ ముబారక్ ' అంటారట .
ఇంతవరకు లభించిన ఆధారాల బట్టి శ్రీ శంకరుల శ్రీ చక్ర ప్రతిష్ఠ11 శతాబ్ధ శాసనము , 13 శతాబ్ధములోని రస రత్నాకర ఆనందకందముల వ్రాతల వల్ల జోగుళాంబ ప్రాచీనాలయాలు 7 శతాబ్ధము లో నిర్మించింట్లు గా తెలుస్తోంది .
క్షేత్ర దైవమైన శ్రీ బ్రహ్మేశ్వర స్వామి శ్రీశైలం పాజెక్టు మునకలో నిర్మూలము కాకుండా రక్షించుకున్నాడు అంటారు .

" మహాదేవీం , మహాకాళీం , మహాలక్ష్మీం , సరస్వతీం !
త్రిశక్తి రూపిణీం అంబాం , జోగుళాంబాం నమామ్యహం !!"


Wednesday, March 9, 2011

కట్ట మైసమ్మ దేవాలయము



సెక్రటేరియట్ దగ్గరి ఫ్లైఓవర్ నుంచి ఇందిరాపార్క్ వైపుకు వెళ్ళేటప్పుడు , ఫ్లైఓవర్ ఐపోగానే ఎడమ వైపు వుంటుంది ఈ దేవాలయము . ఇది దాదాపు 450 సంవత్సరాల క్రితముదట . హుసేన్ సాగర్ కు కట్ట కట్టేందుకు తవ్వుతుండగా అమ్మవారి విగ్రహము కూలీల కంట పడిందట . ఆ విగ్రహాన్ని అక్కడే స్తాపించి , కట్ట తవ్వుతుండగా వెలసిన అమ్మవారు కాబట్టి " కట్ట మైసమ్మ " అని పూజించారట . ఆ తరువాత ఎండొన్మెంట్ వారి ఆద్వర్యము లో గుడి కట్టించి సిమ్హవాహినిగా అమ్మవారి విగ్రహమును స్తాపించారట . మూల విగ్రహమును శ్రీచక్రము వద్ద వుంచారట . ఈ విషయాలు అక్కడి పూజారి గారు చెప్పారు . మూల విగ్రహమును కూడా చూపించారు .

ఈ దేవాలయానికి మొదటి సారిగా మా వియ్యపురాలిగారి తో వెళ్ళాను . అంతకు ముందు అట్లాంటా లో , మా మనవరాలు పుట్టేసమయము లో , నా కలలో కనిపించిన అమ్మావారు ఆమే నని గ్రహించి చాలా ఆశ్చర్య పోయాను . అంతే కాకుండా అప్పుడు నాకు కలలో జరిగినట్లే గుడి లో కూడా అనుభవము కావటము నమ్మలేని నిజము ! ఆ తరువాత మా రెండో మనవరాలు పుట్టినప్పుడూ కల లో దర్శనం ఇచ్చింది అమ్మవారు . ఆవిడ దర్శనమిచ్చిన మరునాడే మా కోడలు ఎక్స్పెక్టింగ్ అని తెలిసింది ! ఈ మద్య మూడు నెలలుగా ఆరోగ్యం ఇబ్బంది పెడుతోంది . పోయిన సోమవారము సాయంకాలము కూరున్న దానిని కూర్చున్నట్లే లేచి , అమ్మవారు పిలిచినట్లుగా ఈ గుడికి వెళ్ళాను . కాని నిలబడలేక , ఎలాగో కుంకుమార్చన చేయించుకొని , దగ్గర లోనే వున్న మా అమ్మాయి ఇంటికి వెళ్ళాను . మా అమ్మాయి వెంటనే , రేపు డాడీ తో వెళుతాను అన్నా వినకుండా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది . ఆయన నేను ఇన్ని రోజులు నిర్లక్షం చేసినందుకు బాగా కోపం చేసి మెడిసన్ ఇచ్చారు . ఆ రోజు అలా డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకొని ఆరోగ్యం బాగు చేసుకోమని చెప్పకనే చెప్పింది అమ్మవారు అనిపించింది . ఈ రోజు ఇలా వున్నాను అంటే ఆ అమ్మ దయే . నాకు ఇలా చాలాసార్లు అనుభవము కలిగింది . కట్ట మైసమ్మ చాలా పవర్ఫుల్ దేవత అని నాకు అనిపిస్తుంది .

ఈ దేవాలయము లో అన్నదానము చేసే వసతి కూడా వున్నది . మనము చెప్పిన రోజు అన్నదానము చేస్తారు . మనమిచ్చిన డబ్బుల తోనే అనుకోండి . మనకు కావలసిన రోజు , కావలసిన వారి పేరు మీద ఆ రోజు ఇందిరా పార్క్ లో ఏర్పాటు చేస్తారు . కావాలంటే మనము కూడా భోజనము వడ్డించ వచ్చు .

Tuesday, February 22, 2011

అమీర్ పేట్ లోని అమ్మవారి దేవాలయాలు

1. శ్రీ కనకదుర్గ ఆలయము



చాలా సందడి గా వుండే అమీర్ పేట్ కూడలిలో వుంది , శ్రీ కనకదుర్గ దేవాలయము . గుడి మొద్ట్లోనే వినాయకుడు దర్శనం ఇస్తాడు . లోపలి కి వెళ్ళగానే , ఎదురుగా వినాయకుడు , నాగదేవత ల చిన్న గుడి వుంటుంది . ఎడమ చేతివైపు సంతోషీ మాత , కుడి చేతివైపు ఎల్లమ్మ వుండ గా మద్యలో నిలువెత్తు విగ్రహము తో శ్రీ కనకదుర్గ అమ్మవారు కళ కళ లాడుతూ దర్శనం ఇస్తారు . అమ్మవారి కి ఇరువైపులా యక్షిణులు వుంటారు . గుడి లోపల , గోడల మీద , అమ్మవారి వివిధ రూపాలతో శిల్పాలను వుంచారు . అసలు లోపల ఒక వినాయకుడు తప్ప ఇంకో పురుష దేవుడే లేడు . చుట్టూ ఎటుచూసినా అమ్మవారి ప్రతిరూపాలే !
ఇక్కడ , మంగళవారము రోజున , రాహుకాలము లో చేసే పూజ చాలా ప్రసిద్ధి చెందింది . ఇక్కడి పూజారి అందరి తోనూ సంకల్పం చెప్పించి శ్రద్దగా పూజ చేయిస్తారు . నేనూ ఓసారి చేసుకున్నాను . నేను అప్పుడప్పుడు వెళ్ళే దేవాలయాల లో ఇది ఒకటి .

* * * * * * *

2. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయము


కనకదుర్గ ఆలయము నుంచి కొంచం ముందుకు వెళితే వుంది ఈ ఆలయము . బలకం పేట అమ్మావారి గురించి చాలా సంవత్సరాల క్రితమే విన్నాను . కాని అప్పటి నుంచి వెళ్ళాలంటే కుదరలేదు . మొన్న ఆదివారము వెళ్ళాను . వెళ్ళగానే అబ్బా ఎంత మంది జనం అని భయం వేసింది . జాతర లా వుంది . ప్రతి ఆదివారము , మంగళవారము ఇక్కడ ఇలానే రష్ వుంటుందిట. సరే వచ్చాను కదా అని లోపలికి వెళ్ళాను .

ఇక్కడ అమ్మవారు నీళ్ళల్లో వుంటారు . పూర్వము ఇది అడవి అట. ఎవరికో భావి లో నీళ్ళు తోడుకుందామని వెళితే , నీటి పైన జుట్టు తేలుతూ కనిపించిందట. పరీక్షగా చూస్తే , ఎవరో పడుకున్నట్లుగా కనిపించిందట. అది దేవత విగ్రహం గా భావించి , అక్కడ గుడి కట్టించారట. ఇది అక్కడ ఒకావిడ చెప్పింది . ఆవిడ ముప్పై సంవత్సరాల క్రితం , వాళ్ళ అబ్బాయిని పుట్టెంటుకలు తీయించేందుకు ఇక్కడి తెసుకొచ్చిందట . అప్పుడు చుట్టూ పొలాలు వుండేవి . గుడి కూడా చాలా చిన్నగా వుండేది అని చెప్పింది . అక్కడివారు ఎల్లమ్మను చాలా మహిమగల తల్లి గా కొలుస్తారని చెప్పింది .

అమ్మవారి విగ్రహం దర్శించేందుకు కొంచము కిందకు వెళ్ళాలి . కింద భావి మీద అమ్మవారు పడుకొని వున్నట్లుగా స్తాపించారు . అక్కడ దర్శించుకొని కొంచము ముందుకు వెళ్ళి తే ఉత్స విగ్రహము వుంటుంది . ఆ హాల్ లో నే సర్వదర్శనం ఇస్తారట.

నేను ఎలా అందరి నీ నెట్టుకుంటూ అలా భూగృహం లోకి వెళ్ళి అమ్మావారిని దర్శించుకున్నానో తెలీదు . అదో వూపులా వెళ్ళిపోయాను . బహుషా అమ్మవారిని దశించుకునే అదృష్టం వుందేమో ! మళ్ళీ ఇంకోసారైతే వెళ్ళ లేను !

* * * * * * * * * * *

3.శ్రీకనకదుర్గ మల్లికార్జున స్వామి దేవాలయము




అమీర్ పేట ట్రాఫిక్ లైట్ దగ్గర కుడి వైపున వుంది ఈ శ్రీకనకదుర్గ , మల్లికార్జున స్వామి దేవాలయము . కించము పరీశలన గా చూస్తే తప్ప కనిపించదు . ఆలయము బోర్డ్ కింద ఒక షాప్ కనిప్స్తే , ఒక క్షణం నాకు అర్ధం కాలేదు . పక్క నుంచి వున్న ద్వారము నుండి లోపలికి వెళ్ళగానే చాలా పెద్ద గుడి కనిపించింది . చాలా ప్రశాంతము గా వుంది . ద్వారము ముందు విఘ్నేశ్వరుడు కొలువై వున్నాడు . లోపల కుడి వైపు మల్లికార్జునస్వామి , ఎడమవైపు కనకదుర్గ ముచ్చటగా వున్నారు . ఇది పురాతన దేవాలయము కాదనుకుంటాను .

* * * * * * * *

4.విజయలక్ష్మి దేవాలయము



ఎర్రగడ్డ రైతుబజార్ నుంచి యూసుఫ్ గూడా వెళ్ళేందుకు తిరిగే మలుపు మొదట్లోనే వుంది ఈ ఆలయము . దీనిని చినజీయర్స్వామి స్తాపించారట. లోపల విజయదుర్గ అమ్మవారి విగ్రహము చాలా కళ గా వుంటుంది . పక్కన మంఠపము లో రంగనాథస్వామి వున్నారు . ఈ ఆలయము ను ఓసారి అటు గా వస్తూ చూసి లోపలికి వెళ్ళాను .

ఇవీ , ఇంత వరకు నేను అమీర్ పేట్ లో చూసిన అమ్మవారి ఆలయములు .

Saturday, February 12, 2011

శ్రీ త్రిపురాంతక క్షేత్రం































సాయంకాలము మల్లికార్జునుని దర్శనం చాలా బాగా జరిగినందున చాలా తృప్తి గా అనిపించింది . మరునాడు ఉదయమే టిఫిన్ పని కానిచ్చుకొని , త్రిపురాంతకం బయిలుదేరాము . శ్రీశైల శిఖర దర్షనము నుండి కుడి వైపు ఘాట్ రోడ్ మీదు గా వెళితే శ్రీ త్రిపురాంతక క్షేత్రం వస్తుంది . వూరి లోని కి ప్రవేశించగానే ముందుగా త్రిపురాంతకీశ్వరుని దేవాలయము . కొద్దిగా కొండమీదికి ఎక్కి వెళ్ళాలి . ఇక్కడ పూర్వము త్రిపురాంతకుడు అనే రాక్షసుని ఈశ్వరుడు వధించి , ఇక్కడే వెలిసినందు వలన , ఈ దేవాలయము లోని స్వామిని శ్రీ త్రిపురాంతకేశ్వరుడు అని అంటారు .
ఈ దేవాలయములో పురాతన శాసనాలు , శిల్పాలు చాలానే వున్నాయి . కాని శిధిలవస్తలో వున్నాయి . ఆ శాసనాలు తెలుగులో లేవు . మరి ఆ భాష ఏమిటో నాకు అర్ధము కాలేదు . కాపోతే స్పష్టం గా కూడా లేక , చెక్కుకు పోయి వున్నాయి . బహుషా అందువలన కూడా అర్ధం కాలేదనుకుంటాను .

దేవాలయములో ఓ పక్కగా చిన్న గది వుంది . దానిలో నుండి , ఇష్టకామేశ్వరి దేవాలాయానికి , సొరంగ మార్గము వుందిట . దాని ని మూసి వుంచారు .

ఈశ్వరునికి అభిషేకము చేయించుకొని , కాసేపు కూర్చున్నాము . ఆ తరువాత అక్కడి నుంచి శ్రీ బాలాత్రిపురసుందరి దేవాలయాని కి వెళ్ళాము .

శ్రీ బాలాత్రిపురసుందరి దేవాలయము చాలా ప్రశిస్తి కలది . ఇక్కడ ఋషులు యాగము చేస్తుండగా , యజ్ఞగుండము నుంచి దేవి బాల రూపములో అవతరించింది .షోడశకళలతో అమ్మావారు బాలగా స్వయంభూగా వెలిసారు . ఆ మూర్తి లోని తేజస్సును ఎవరూ చూడలేకపోయారుట . శ్రీ ఆదిశంకరాచర్యులవారు , ఆ మూర్తిలోని 30 కళలను నిక్షిప్తము చేసారట . ఆ తరువాత వేరొక మూర్తిని , శ్రీచక్రమును అక్కడ స్థాపించారట . ఈ విగ్రహము పాత విగ్రహానికి ముందుగా వుంటుంది . ఇక్కడే శంకరాచార్యులవారు ' శ్రీ లలితా సహస్రనామాల ' ను వెలుగులోకి తీసుకొచ్చారట .

ఆలయ ప్రాంగణము లో ఒకప్పుడు వరుసగా కదంబ వృక్షాలు వుండేవట . ప్రస్తుతము ఒకటే వుంది . పక్కగా ఓ పెద్ద పుట్ట వుంది . అందులో పెద్ద పాము వుందని , అది రోజూ రాత్రి పూట ఆలయములోని అమ్మావారి విగ్రహం దగ్గరకు వెళుతుందని అక్కడి వాచ్ మాన్ చెప్పాడు !

వర్షాకాలము లో ఈ దేవాలయము నీటిలో మునిగిపోతుందట. అప్పుడు కొద్ది దూరములో వున్న ఇంకొక దేవాలయములో అమ్మవారి విగ్రహము వుంచి పూజిస్తారట .

మేము అమ్మవారి ముందు కూర్చొని లలితాసహస్రనామ పారాయణము చేసుకున్నాము .

తిరిగి వస్తూ శ్రీశైలం దగ్గరనే వున్న హటకేశ్వరం కూడా వెళ్ళాము . కాని గుడి తలుపులు మూసి వున్నందున , కటకటాల లోనుచే ఈశ్వరుని దర్శించుకొని వచ్చేసాము . సాయంకాలం మరోసారి మల్లికార్జున స్వామిని , బ్రమరాంబ అమ్మవారి ని దర్శించుకున్నాము .

మరునాడు ఉదయము రోప్ వే ఎక్కాము . నాకైతే కొంచం భయం వేసింది :) కృష్ణ లో అప్పటికి ఇంకా బోటింగ్ మొదలు కాకపోవటముతో రోప్ వే తో సరిపెట్టి , అక్కడి నుంచే కృష్ణమ్మ అందాలను చూసి వచ్చేసాము .

ఇహ రూం కు తిరిగి వచ్చి సామాను సద్దేసి తిరుగు ప్రయాణమయ్యాము . మరి వచ్చేస్తూ సాక్షి గణపతి దగ్గర హాజరు వేయించుకొవాలిగా . అదీ చేసాము . వూరికే దండం పెట్టుకోవటము కాకుండా గోత్రనామాలు చెప్పుకొన్నాము .

అక్కడ నుంచి కొద్ది దూరములో వున్న స్వామి పూర్ణానంద అశ్రమానికి వెళ్ళాము . మేము వెళ్ళిన సమయములో పూర్ణానంద స్వామి వారి కి హారతి జరుగుతున్నది . అందులో పాలు పంచుకున్నాము . అక్కడే స్వామీజీ కట్టించిన నారయణి అమ్మవారి ఆలయములో అమ్మవారిని దర్శించుకున్నాము . ఆశ్రమములో భోజన ప్రసాదము చేసాము . ఆశ్రమము చాలా ప్రశాంతము గా వున్నది . పూల చెట్లతో చక్కని కుటీరం లా ఎంత బాగుందో ! అక్కడ భక్తులు వుండేందుకు విశ్రాంతి గదులు కూడా వున్నయట .

మేము హైదరాబద్ చేరుకునేటప్పటికి సాయంకాలమైంది . మళ్ళీ ట్రాఫిక్ . . . . .

ఇంటికి చేరేటప్పటికి 8 గంటలైంది .

* * * * * * * * * * * * * * * * * * * * * * *

ఈ రోజు లక్ష్మి గారి జన్మదినము . అందుకే వారికి మా ఈ యాత్ర పోస్ట్ ను కానుకగా ఇస్తూ ,

లక్ష్మిగారు ,
మీరు ఇలాగే యాత్రలు చేస్తూ , మాతోనూ యాత్రలు చేయిస్తూ ,
ఆయు ఆరోగ్యాల తో సౌభాగ్యవతి గా వుండాలని కోరుకుంటూ ,
జన్మదిన శుభాకాంక్షలు .