యూసుఫ్ గూడా బస్తీ కీ ముత్యాలమ్మ తల్లి గ్రామ దేవత అట .ఈ అమ్మవారు ఎప్పుడు ఎలా వెలిసిందో , ఈ చిన్న గుడి ఎవరు ఎప్పుడు కట్టించారో నేను అడిగినవాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు . మా కాలనీ లో వున్న సీతమ్మగారు 20 సంవత్సరాల క్రితము వాళ్ళు ఇక్కడి కి వచ్చేసరికే ఈ గుడి వుంది అన్నారు . ఇక్కడ ఆ రోజులలో ఎక్కువగా బలులు ఇచ్చేవారట.
13 సంవత్సరాల క్రితం యన్. జనార్ధన రెడ్డి గారు , ముత్యాలమ్మ గుడి కి పక్కనే ఓ గుడి కట్టించి అందులో నల్లపోచమ్మను స్థాపించారట. ఈ గుడి లో బలులు ఇవ్వరట. అమ్మవారు చాలా కళగా వుంటుంది . చాలా మహిమ కలది అని కూడా అంటారు . 11 సంవత్సరాల నుంచి సీతమ్మగారి ఆధ్వర్యం లో , మా కాలనీ ఆడవారు ఇక్కడ రోజూ సాయంకాలము, లలితా సహస్రనామాలు పారాయణ చేస్తున్నారు .మధ్య మధ్య భారతము , భగవద్గీత , రామాయణము కూడా పారాయణ చేసారట . రామాయణము పారాయణ చేసి నంత కాలమూ ఓ కోతి అక్కడకు వచ్చి , పక్కనే గోడ మీద కూర్చునేదట . రామాయణ పారాయణము అయ్యాక రాలేదట !
అలాగే జయలక్ష్మి అనే ఆవిడ 9 సంవత్సరాల క్రితం ఇటువైపు ఇల్లు కట్టు కొని వచ్చారట . వకరోజు రాత్రి కలలో , ఏదో గుడి , అక్కడ అందరూ ఏదో చదువుతున్నట్లుగా కల వచ్చిందిట. ఆవిడ అంత పట్టించుకోలేదట. మరునాడు రాత్రి మళ్ళీ ఆ గుడి స్పష్టంగా కనిపించిందిట. అమ్మవారి ముందు ఏదో రాయిలాగా కూడా కనిపించిందట . మరునాడు సాయంకాలం ఆ గుడి ఈ చుట్టుపక్కల ఏమైనా వుందా అని వెతుక్కుంటూ వస్తే ఈ గుడి కనిపించిందిట. అప్పుడే అక్కడ కొంతమంది ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారుట . ఆ గుడి , గుడి లోని అమ్మవారు , అమ్మవారి ముంది శిల అంతా కలలో కనిపించినట్లే వుందిట . ఆ రోజు నుంచి ఆవిడా ఆ బృదం లో చేరి రోజూ లలిత చదువుతున్నారట . ఇంచు మించు ఇలాంటి అనుభవమే నాకూ కలిగింది . పదిరోజుల క్రితం నేనూ ఏదో గుడిలో లలిత పారాయణ చేస్తునట్లుగా కల వచ్చింది . ఏ గుడా , ఎక్కడా అని నేనూ కొంచం ఆలోచనలో పడ్డాను . పొద్దున పూజ చేసుకొని , వచ్చి కూర్చోగానే , అక్కడే ఊడుస్తున్న మా పనమ్మాయి , అమ్మా దసరా పదిరోజులూ నల్లపోచమ్మ గుడి లో బాగా చేస్తారమ్మా . పక్కనే షెడ్ లో పెద్ద అమ్మవారి విగ్రహం పెడుతున్నారు . సీతమ్మ వాళ్ళు రోజూ వెళ్ళి ఏదో చదివి వస్తారు అన్నది . వెంటనే సీతమ్మగారి దగ్గర కు వెళ్ళి ఎన్నిటి కి వెళతారో తెలుసుకొని రమ్మని పంపించాను . రోజూ పది నిమిషాల తక్కువ ఐదుకు వెళుతారుట నిన్ను అప్పటికల్లా రమ్మన్నది తీసుకెళుతానన్నది అని చెప్పింది . ఆ విధం గా అమ్మవారు నన్నూ పిలిపించుకుంది . ఈ పది రోజులూ అమ్మవారి ముందు కూర్చొని లలితా పారాయణ చేయగానే ఎంతో మనశ్సాంతిగా , హృదయం తేలికపడ్డట్టుగా అనిపించింది .
ఈ పదిరోజులూ ఉత్సవాలు చాలా బాగా జరిగాయి . రోజూ ఉదయమూ , సాయంకాలమూ లలితా సహస్రనామపారాయణము జరిగింది . అందులో మా కాలనీ ఆడవారే కాకుండా చుట్టు పక్కల బస్తీ వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధ గా చేసారు . ఆరో రోజు సుహాసినీ పూజ , ముగ్గురు ముత్తైదువులకు , ఓ బాల కు చేసారు . ఒక రోజు అన్నదానం జరిగింది . ఏడోరోజు హోమం చేసారు . నిన్న విజయదశమి రోజు లలిత పారాయణ అయ్యాక అమ్మవారి ని కదిలించారు . ఈ తొమ్మిదిరోజులూ అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజించారు.