చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Wednesday, November 29, 2017

రింజిం రింజిం హైదరబాద్!



మహ్మద్ కులీ కుతుబ్ షా తన ముద్దుల ప్రేయసి భార్య ఐన భాగమతి కోసము కట్టిన ఊరు ఈ భాగ్యనగరము.
అందరు ఒక హిందు స్త్రీ పేరు పెడతావా అని గుస్సా చూపించారు . ఆయన ఏమైన తక్కువ తిన్నాడా! వెంటనే భాగమతిని హైదర్ మహల్ గా మార్చి , భాగ్యనగర్ ని హైదరాబాద్ గా మార్చేసారు.
అది మన హైదరాబాద్ ప్రేమకథ.
దీనిమీద యం . యల్.  ఏ సినిమా లో
ఇదేనండి ఇదేనండి భాగ్య నగరం మూడుకోట్ల ఆంద్రులకు ముఖ్యపట్టణం, ” (కాకపోతే ఇప్పుడు నాలుగు కోట్ల ప్రజలున్న తెలంగాణా)
అని ఘంటసాలా,  జానకి పాడిన పాట వుంది. దానికోసము ఎంత వెతికినా దొరకలేదు. బహుశా అన్ని పాత పాటలు నెట్ లొ లేనట్టున్నాయి.
నా చిన్నప్పుడు ఎప్పుడో గుర్తులేదు చాలా చాలా చిన్నతనంలో హైదరాబాద్ అమ్మ,  నాన్నగారి తో కలిసి వచ్చాను.  అప్పుడు తాజ్ నారాయణగూడా లో మసాలా దోస తిన్నాము . పక్కనే ఉన్న దీపక్ లో మాంగళ్యబలం సినిమా చూసాము.  వైయంసియే నారాయణగూడా ఎదురుగా ఉన్న ఎవరింట్లోనో ఉన్నాము. అది నాన్నగారి మేనత్త ఇల్లు అని అమ్మ చెప్పింది ఇప్పుడు. అలా లీలగా గుర్తున్న బాల్య స్మృతి హైదరాబాద్ !
ఆ తరువాత పంతొమ్మిది వందలా అరవై ఎనిమిది డిసెంబర్ లో మేళతాళాలు,  మిలటరి బ్యాండ్ తో , వేయిమందికి పైగా అతిధుల ఆశీర్వాదము తో, అబిడ్స్ తాజ్ వారి ఆతిధ్యం తో కన్న వారి వీడ్కోలు మధ్య పూల పల్లకిలా అలకరించిన పొడవాటి ఓపెన్ టాప్ కారులో ఊరెగింపుగా హైదరాబాద్ లో మెట్టినింట గృహ ప్రవేశము చేసాను.
ఉదయము లేచి బాల్కని లోకి వెళ్ళగానే పలచటి మంచు లోనుంచి వస్తున్న సుర్యకిరణా లను చూస్తుంటే తెల్లటి , పలచటి మేలిముసుగు కప్పుకొని , ముసుగులోనుండి తొంగి చూస్తున్న కొత్తపెళ్ళికూతురులా వుంది ప్రకృతి.  మది పులకించి పోయింది.  నీకు ఇంకా ఇలాటి అనుభూతులు చాలానే వుంటాయిలే అని సూర్య కిరణాలు స్వాగతము చెప్పిన భావన కలిగింది.

నులి వెచ్చటి లేలేత ఎండలొ వెస్పా మీద గండిపేట విహారాలు, కాలాపహాడ్, చార్మినార్ మీదినుంచి నగర దర్శనము, చల్లటి వతావరణము లో టాంక్ బండ్ మీదనుంచి వచ్చె చల్లని గాలులను ఆస్వాదిస్తూ ఐస్ క్రీం,  వేడి వేడీ పల్లీలను తినటము ,  గొపి హొటల్ లో ఇడ్లి ,  కామత్ లో మసాల దోశ పబ్లిక్ గార్డెన్ లో తటాకము పక్కన కుర్చొని అందులోని కలవలను,  పక్క నుంచి కూత పెడుతూ వయ్యారంగా పరుగులు తీసే రైలు ను చూడటము వకటా,  రెండా ఎన్నని చెప్పను స్వీట్ మెమొరీస్ ను? . సాలార్జంగ్ మ్యూజియం లోని గంటల గడియారము చూడటము వింత . ఎంత బాగుండేదో! డబల్ డెక్కర్ బస్ ప్రత్యేక ఆకర్శణ .  హైదరాబాద్ తెగ నచ్చేసింది.
పొద్దటి సంది రిక్షా తొక్కుతున్న పది పైసలు ఎక్కువియమ్మా చాయ్ తాగుతా అనే రిక్షా వాలా స్థానము లో మనము పిలవగా నే ఎగాదిగా చూసేసి నేను అటువైపు రాను అనే ఆటో వాలా వచ్చేసాడు.
ఇప్పుడైతే ఒక్క ఫోన్ చేయగానే ఇంటిముందుకు కాబ్ వాలిపోతుంది.

దీపక్ మహల్, బసంత్ టాకీస్, రహత్మహల్ , జమ్రుద్ లను దాటేసి శాంతి,  సుదర్షన్, మహేశ్వరి

పరమేశ్వరి వగైరాలు వచ్చేసాయి. మహేశ్వరి లో ఎస్కలేటర్ ఎక్కటము కోసం పిల్లలు తెగ మారాము చేసేవారు 
చూస్తూండగానే ఐమాక్ష్ థియేటెర్ లు , మాల్ లులు, పబ్ లు మద్యతరగతి మందహాసాని కి చిరునామా గా హైటెక్ సిటి, ఐ. డి. కార్డ్లు మెళ్ళొ వేసుకొని ముచ్చటగా తిరిగే అమ్మాయిలూ , అబ్బాయిలూ, ఎంత ఎదిగి పొయిందో. ఎంత ఎదిగినా వదిగే వుంటాను అన్నట్లుగా పక్కనే ముచ్చటైన ముగ్గులతొ , పర్ణశాలలతొ,  ఎప్పుడూ ఎదోవక సాంప్రదాయ కార్యక్రమములు నిర్వహిస్తూ శిల్పారామము ఎనలేని సేవ చేస్తొంది.

హిందూ ముస్లిం ల అపూర్వ కలయకకి ప్రతీక హైదరాబాద్. పాత కొత్తల కలగలుపు . అసలు 

ఎవరన్నారు? హిందువులు ముస్లింలు కొట్టుకుంటున్నారని?. అదంతా స్వార్ధపరుల కుట్ర.  వినాయక చవితి, మొహరం ఒకే సారి వస్త్తాయి. ఒక వైపు,  పీర్లు ఒకవైపు వినాయకుడు ఒకేసారి ఉరేగుతారు.

మేమైతే రంజాన్ పండగ రోజు మా ముస్లిం స్నేహితుల ఇళ్ళకి వెళ్లి శుభాకాంక్షలు తెలిపి , ఖోవా, చాయపప్పు వేసి చేసిన ఖీర్ తాగి వస్తాము.  అలాగే మా పండగల కి మా ముస్లిం స్నేహితులు వచ్చి శుభాకాంక్షలు పులిహోర,  బొబ్బట్లు తిని వెళుతారు.

హైదరాబాద్ లో మూడు రోజుల నుంచి ఒకటే సందడి. పండగ వాతావరణం కనీస్తోంది. పేపర్ లు టీ. వీ లు మెట్రో గురించి హ్పెరెత్తిసున్నాయి.  చూస్తుండగానే ఇన్ని సంవత్సరాలల్లో ఎంతగా మారిపోయింది హైదరాబాద్! అందమైన మార్పులు ఎప్పుడూ స్వాగతించ దగినవే. ఇప్పటి కీ నాకు సేలింగ్ క్లబ్ లో కుర్చొని చల్లటి పైనాపిల్ జ్యూస్ తాగుతూ హుసేన్సాగర్ లో కదిలే నావలను గమనించటము ఇష్టము.  అందరూ అక్కడ దొమలు కుడుతుంటాయి, కంపు అంటారు ఐనా సరే.