చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Friday, April 2, 2010

రాజమండ్రి - 2





మొదటి సారి సిలిగురి వెళ్ళేటప్పుడు , రాజమండ్రి స్టేషన్ చూసాను . అప్పుడు , అక్కడ , పసుపు , ఆకుపచ్చ డాట్స్ తో వున్న బత్తాయిలను చూసి , తెగ హాచర్య పోయి , ముచ్చటపడి కొన్నాను . ఆపైన రుచి మరిగి ఎప్పుడు సిలిగురి వెళ్ళేటప్పుడు , తిరిగి వచ్చేటప్పుడు , రాజమండ్రి స్టేషన్ లో బత్తాయిలు , వైజాగ్ స్టేషన్ లో కందిపొడి , విజయవాడ స్టేషన్ లో భోజనము తప్పనిసరైపోయాయి . రాజమండ్రి వస్తోంటే చాలు గోదావరి అందాలు చూడటానికి ఎవరినీ పట్టించు కోకుండా కిటికీ దగ్గర సెటిల్ ఐపోయేదానిని . అప్పుడే డిసైడ్ ఐపోయా జీవితములో ఒకసారైనా రాజమండ్రి స్టేషన్ లో దిగి , కోనసీమ లో గోదావరి అందాలు చూడాలని , ముచ్చట కొలిపే బత్తాయిలను తినాలని !!!!

ఆ కోరిక మొదటిసారిగా మా ఆడపడుచు విజయ పెళ్ళి లో తీరింది . తనతో పాటు మూడు నిద్రలకి వాళ్ళ అత్తవారి వూరు , గుమ్మళ్ళదొడ్డి వెళ్ళాను . మా ఇంట్లో గోదావరి జిల్లాలవారితో వియ్యమందటము కూడా అదే మొదటిసారి . వాళ్ళ భాష , అలవాట్లు చాలా గమ్మత్తుగా అనిపించాయి . గుమ్మళ్ళదొడ్డి లో వాళ్ళ ఇల్లు , ఆవూరు అచ్చం సినిమాలలో చూపించినట్లుగానే వున్నాయి . సిరిసిరిమువ్వ సినిమా అక్కడే తీసారుట . ఆ తరువాత మావారు ట్రాన్స్మిషన్ లైన్ లోకి వచ్చాక పని మీద వెళుతుంటే నేనూ వెళ్ళాను . అదేమిటో , ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక కారణము తో రెండు రోజుల కే తిరిగి వచ్చేయాల్సి వచ్చేది ! ఇది కాదు పని అని , నా పోరు పడలేక అక్కడ ఓ వర్క్ తీసుకున్నారు . రాజమండ్రి దగ్గర రాజోలు లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు .
ఓ శుభముహుర్తాన , చలో అనుకుంటూ వెళ్ళాము . అక్కడ ఇల్లు చూడగానే సీతారామయ్యగారి ఇల్లు లాలేదే అని కాస్త నిరుత్సాహం వేసిన మాటనిజమే . కాని సద్దేసుకున్నాను. మేము వెళ్ళేసరికి నీళ్ళురావటము , వెనక్కి పోవటము ( ? ) ఐపోయాయి . ఒక్క చుక్క నీరు లేదు ఎలాగా అనుకుంటూ వుంటే మావారికి గోదావరి లో స్నానం చేసేస్తే పోలే అనిపించి పక్కింటి ఆయనను , ఇక్కడికి దగ్గరలో గోదావరి ఎక్కడవుందీ అని అడిగారు . పట్టిసం ఇక్కడికి దగ్గరే , అక్కడ స్నానం చేసి , వీర్భద్రీశ్వరునికి అభిషేకం చేయించు కోండి , ఈ రోజు కార్తీక సోమవారం , చాలా మంచిది అన్నారు . అంతే రాజమండ్రి దగ్గర నావ ఎక్కి పట్టీసం చేరుకున్నాము . గోదారి గంగమ్మ స్నానాలు చేయంగ అనుకుంటూ హాపీగా స్నానం చేసి , కొండ ఎక్కి ఈశ్వరుని దర్షించుకొని , అభిషేకం చేసి వచ్చాము. .

ఓవారం రోజులు ఆయన బిజీగా వున్నా నాకేమి దిగులేయలేదు . మేమున్న కాలనీ లో , మా వక్కటితప్ప అన్ని ఒకే కుటుంబానివి . అందరూ గోడల మీదనుండి పెద్ద గొంతు తో మాట్ల్లడుకోవటము , ఏదైనా తేడావస్తే , పెద్దగా అందరూ కలిసి ఆ తేడా తెచ్చినవాడి మీద అరవటము అబ్బో చాలా ఎంజాయ్ చేసాను . ఆకుకూరలు , చుక్క కూర , గోంగూర ఒక్కొక్కటి అరచేతి మందాన వుండి ఫ్రెష్ గా నిగ నిగ లాడిపోతుండేవి . పచ్చివే తినాలనిపించేంత బాగుండేవి . ఏమిటో , అక్కడ ఏది చూసినా తెగ నచ్చేసేది !

వూళ్ళుచూద్దామని అనుకున్నాక అన్ని తెలిసిన డ్రైవర్ కావాలంటే , అక్కడి లోకల్ కాంట్రాక్టర్ ఒకాయన , ట్రావెల్స్ లో పని చేసే జానీ అనే అతనిని పిలిపించారు . బల్లకట్టు మీద కార్ తోసహా , బర్రెలు , మేకలు , సామాన్లతో మనుషుల తో పాటు గోదావరి దాటటము తో మా ప్రయాణము మొదలైంది . గోదావరి పాయల వెంట , గట్ల మీద , కొబ్బరి చెట్ల నడుమ , మధ్య మధ్య లో పాలకోవా తింటూ , చాలా ఆహ్లాదంగా సాగింది .ద్రాక్షారామం , సామర్ల కోట , భీమవరం , పాలకొల్లు , మందపాడు , ర్యాలి , పిఠాపురం, ధవళేశ్వరం అన్ని చూసాము . అంతర్వేది దగ్గర , గోదావరి ,సముద్రం లో కలిసే చోటుకు వెళ్ళాము . అక్కడ యు షేప్ లో వున్న చోట స్నానం చేసి వస్తూ , ఇక్కడ ఎవరూ లేరేమిటి , అంతా దూరంగా ఎక్కడో వున్నారు అనుకున్నాము . ఇంతలోనే ఒక పెద్ద అల మా దాకా వచ్చేసింది . ఆ తరువాత జానీ , మీరు అంత దూరం వెళుతారనుకోలేదు , అది చాలా డేంజర్ పాయింట్ ఎవరూ వెళ్ళరు , మీరు చాలా లక్కి , మీరున్నప్పుడు పోటు రాలేదు అన్నాడు . బాపురే , మాకు తెలీకుండానే సాహసం చేసాము , అక్కడ కొట్టుకు పోతే ఎవరికీ తెలిసేది కూడా కాదు అనుకున్నాము . కార్తీక మాసం కావటము వలన అన్నిశివాలయాలలో అభిషేకాలు చేసి , దీపాలు వెలిగించాము . రాజమండ్రి , గోదావరి ఒడ్డున వున్న ఉమామహేశ్వర ఆలయము లో ఈశ్వరుని 108 కలువ పూలతో పూజించి , రుద్రాభిషేకం చేసాము . ఆత్రేయపురం లో స్వీట్స్ కొన్నాము . బండారులంకలో మా వారు చీరలు కూడా కొనిచ్చారు . క్రిష్టియన్ ఐనా జానీ , అన్ని గుడులూ వాటి విషిస్టత చెప్పుతూ చక్కగా చూపించాడు . మావారి తో పని చేసే విజయ భాస్కర్ ,లాంచీ ఏర్పాటు చేసి , పాపికొండలు తీసుకెళ్ళాడు . లాంచీ లోనే వండటము , డెక్ మీద కూర్చొని తినటము అందాలరాముడు సినిమా గుర్తొచ్చింది . తిరిగి వచ్చేటప్పుడు లాంచీ మీదనుండి దీపాల వెలుగులో గోదావరి బ్రిడ్జ్ చూడటము , లాంతర్లు కట్టుకొని వెళ్ళే నావలను చూడటము మరపురాని అనుభూతి .అన్నవరం లో సత్యనారాయణవ్రతం చేసుకున్నాము . మొత్తం వారం రోజులు , జానీ పుణ్యమా అని కోనసీమ అంతా తిరిగాము .ఇంకా తిరిగే వారిమే కాని , మా డ్రైవర్ నరసిమ్హా గోల భరించలేక , మా వారికి హైద్రాబాద్ లో పని వుండటము చేతా తిరిగి వచ్చేసాము .

పదిహేను రోజుల క్రితం వెళ్ళినప్పుడు , ఈసారి యానాం వెళ్ళాలి అనుకున్నాను . అసలు కోనసీమ చూడలేదుట , అప్పుడే జానీ అన్నాడు . గోదావరి మీద బోట్ హౌస్ లు కొత్తగా పెట్టారట . అవన్నీ చ్హ్డాలనుకున్నాను , కాని వున్న మూడు రోజులలో మావారికి రెండురోజులు పనే సరి పోయింది . ఆ తరువాత తప్పనిసరై హైద్రాబాద్ రావాల్సి వచ్చింది . మధ్యలో ఒక రోజు యానాం వెళ్ళాము . జాని కోసం వెతికాము కాని అతను దొరకలే . హూస్టన్ దగ్గర , సముద్రపు వొడ్డున వున్న పల్లె లాగా యానాం ను వూహించుకున్నాను . కాని చాలా నిరాశ పరిచింది .ఒక్కటి కూడా పాత భవనం కనిపించలేదు . బీచ్ ను ఇప్పుడిప్పుడే అభివృద్ధి పరుస్తున్నారు . లిక్కర్ కోసం అందరూ వస్తారు అన్నారు . అక్కడికి సీ బాక్ వాటర్ వస్తుందిట గోదావరి మాత్రం మహా ఉదృతం గా వుంది . లాంచి లో ఓ అరగంట తిరిగి రావటము బాగుంది .
మళ్ళీ కోనసీమ ప్రయాణం ఎప్పుడో చూడాలి .

14 comments:

సుభద్ర said...

మలగారు,
చాలా చాలా బాగు౦ది...ర్యాలి గుడి,అ౦తర్వేది అన్నచెల్లెలగట్టు గురి౦చి...ఆత్రేయపుర౦ పుతచుట్టలు,క౦డ్రిగకోవా,ప౦టి దాటి౦పులు,పిఠాపుర౦ మొక్కజోన్నపుత్తు,ద్రాక్షర౦ బీమన్న,దవళ్వేశ్వర౦ బ్యారేజి,అయినవిల్లి వినాయకుడు,కొత్తల౦కబాబా మసీద్,ముమ్మిడివర౦ బాలయోగి గుడి,కాకినాడకాజాతో ఎ౦డ్..
రాజోలు మీదను౦చి యనా౦ అ౦టే అమలాపుర౦ మీదను౦చే వెళ్ళారా???
వెళ్ళునట్లు అయితే మా ఇల్లుదాటూకునే వెళ్ళి ఉ౦టారు...

శ్రీవాసుకి said...

మీ ప్రయాణం బాగుంది. గుమ్మళ్ళదొడ్డిలో చిరంజీవి మొదటి సినిమా పునాదిరాళ్ళు షూటింగ్ జరిగింది. ఈసారి కోనసీమలో ఉన్న రాజోలు పట్టణం దగ్గరలో ఉన్న దిండి వెళ్ళండి. అక్కడ టూరిజం వారి హౌస్ బోట్లు ఉంటాయి. అచ్చం కేరళ లా ఉంటుంది. తీరం వెంబడి కొబ్బరిచెట్లు అందంగా ఉంటాయి. మీరు తాపేశ్వరం తీపి కాజా కొనుక్కోవడం మరిచిపోయారు. ఈసారొస్తే మరిచిపోకండి.

Anonymous said...

ఇప్పుడు పెట్టిన ఫుటోలు బ్రహ్మాండంగా ఉన్నాయి.

నెలనెలావెన్నెల said...

baagunnaayi

మాలా కుమార్ said...

సుభద్రా ,
మమ్మడివరం బాలయోగి గుడి తప్ప , మీరు చెప్పిన వన్నీ చూసాము , తిన్నాము . మీరు దుబాయి కి ఆహ్వానించినందుకు థాంకు . మావారి మస్కా కొడుతున్నాను . చూడాలి ఎంతవరకు పలితం ఇస్తుందో . థాంకు .

మాలా కుమార్ said...

శ్రీవాసుకి గారు ,
తాపేశ్వరం కాజా అస్సలు మరచి పోలేదండి . మా ప్రయాణము మొదలైందే తాపేశ్వరము కాజాల తో . బోట్ హౌస్ లు వేసారని చదివాను . ఎక్కడో తెలీలేదు . అక్కడ అడిగినా ఎవరూ సరిగ్గా చెప్ప లేక పోయారు . దిండి లో నా . వాటి కోసమైనా మళ్ళీ తప్పక వెళ్ళాలి . థాంక్ యు .

మాలా కుమార్ said...

హరేఫలె గారు ,
నెలనెలావెన్నెల గారు ,
ధన్యవాదాలండి .

మాలా కుమార్ said...

రాజేంద్రకుమార్ దేవరపల్లి గారు ,
నిజమేనండి బాబూ , విశాఖపట్టణం రైల్వేస్టేషన్ లోనే . ఇది 1974 లోని సంగతి ఐనా నాకు బాగానే గుర్తుంది . రుచి కూడా గుర్తుంది . మా ఫ్రెండ్స్ డిమాండ్ మీద బోలెడు పాకెట్స్ కొనేదానిని . మరి ఇప్పటి విషయం నాకు తెలీదు .

మాలా కుమార్ said...

రాజేంద్ర కుమార్ గారు ,
తోపుడు బండి మీద ఒక పెద్ద అతను , రకరకాల పొడుల పాకెట్స్ తెచ్చేవాడు . పాకెట్ రూపాయనుకుంటాను . దగ్గర దగ్గర 20 రూపాయల వి కొనేదానిని . ఇంకా పిక్క తీసిన చింతపండు , తాటాకు బుట్టలలో అమ్మేవారు . సిలిగురి లో చింత పండు దొరకదని అది కూడా కొనేదానిని .

పరిమళం said...

మాలాగారు మా రాజమండ్రి గురించి ఇంత అందంగా మీరు టపా రాస్తే నేను ఇన్నాళ్ళు చూడనందుకు క్షమించెయ్యండి ...అన్నేళ్ల క్రిందటి జ్ఞాపకాలు మాకు ఫ్రెష్ గా అందించినందుకు థాంక్స్ :)

శిశిర said...

మాల గారు, చాలా బాగా రాశారండి. ఎప్పుడూ చూసే ప్రదేశాలు, రోజు జరిగే అనుభవాలే అయినా మీ టపాలో చదువుతుంటే భలే కొత్తగా, ఆనందంగా, గర్వంగా ఉంది. మా ఊళ్ళు ఇంతనచ్చాయా మాల గారికి అని. :)

రాజోలు కూడా వచ్చారా? అవునండి. ఇక్కడ ఆకుకూరలు ప్రతీ ఇంటి పెరట్లోను ఉంటాయండి. ఏ పూట ఏది వండుకోవాలనిపిస్తే అవి నాలుగాకులు కోసుకు తెచ్చుకోవడం, తాజాగా వండుకుతినడమూను.

యానాంలో పాతభవనాలు చాలానే ఉన్నాయండి. మీరు మొత్తం చూసి ఉండరు. మొత్తానికి చాలా ప్రదేశాలే చూశారు మీరు కానీ మీరన్నట్టు ఇంకా కోనసీమను పూర్తిగా చూడనేలేదు. త్వరలోనే చూసి ఆ విశేషాలని కూడా ఇంతే అందంగా మాకందిస్తారని ఆశిస్తూ..

శ్రీను .కుడుపూడి said...

మాలా గారు !మీరు మా ఊరి గురుంచి రాసింది చదువుతుంటే..ఎందుకో తెలియదు కానీ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయండి బాబూ !మీరు చెప్పింది నిజంగా నిజమండీ బాబూ ..అక్కడ ఆకు కూరలే కాదు ,మనుషులు కూడా అంతే స్వచ్చం గా ,అభిమానం గా ఉంటారు .ఈ మద్య కొంచెం తెలివి తేటలు నేర్చారు లెండి .మీరు చీరలు కొనుకున్న బండారులంక పక్క ఊరే మాది!ఆ పచ్చని కొనసీమని వదిలేసి ఈ అభాగ్య నగరం లో బ్రతకడం నా దురదృష్టం కాకపోతే మరేమిటి ?

మాలా కుమార్ said...

పరిమళం గారు ,
శిశిర గారు ,
ముందుగా ఇన్ని రోజుల తరువాత మీకు థాంక్స్ చెపుతున్నందుకు సారీ అండి . థాంక్ యు వెరీ మచ్ .శిశిర గారు అక్కడ ఎవరినీ అడిగినా ఆ బీచ్ ఒక్క దాని సంగతే చెప్పారండి . పాత వీధంటే ఓ ఇరుకు వీది చూపించారు . అక్కడనుండి మా కార్ బయటకు తీయటమే కష్టమైంది . మూడు గంటల పైనే తిరిగాము . చివరికి ఓ చర్చ్ , బీచ్ చూసేసరికి చీకటై పోయింది . దాని తో కాకినాడ వెళ్దామనుకున్న వాళ్ళం వెళ్ళ లేక పోయాము .

మాలా కుమార్ said...

తువ్వాయి గారు ,
మీకు నా పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలండి .
మరి మా హైదరాబాద్ ను కూడా పూర్తిగా చూసి ఆనందించండి . ఇక్కడ కూడా మీకు నచ్చేవి చాలా వున్నాయి . సొంత వూరిమీద దిగులు వుండటము సహజమే .
మరోసారి మీకు థాంక్స్ అండి .