చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Thursday, August 5, 2010

గుంటూరు - నాగార్జున సాగర్ - విజయవాడ -1
గుంటూరు నేను పుట్టిన వూరు . కాని , నేను పి . యు . సి లో చేరేవరకు ఎప్పుడూ గుంటూర్ వెళ్ళిన గుర్తు లేదు . గుంటూర్ ఉమెన్స్ కాలేజ్ లో , పి .యు . సి లో చేరాను . ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ లో వుండేదానిని . మా రూం లో ఏడుగురము వుండే వాళ్ళము . అందులో మణి , నేను ఒకే గ్రూప్ , ఒకే సెక్షన్ . ఇద్దరమూ మొదటిసారి ఇంటి నుండి దూరం గా వుండటము . దాని తో ఇద్దరమూ మంచి ఫ్రెండ్స్ మి అయ్యాము . హేమ , మాకన్నా సీనియర్ . కాని మాకు కొంచం ఫ్రెండ్ అన్నమాట . చాలా బాగా పాడేది . సాయంకాలం హాస్టల్ మేడ మీద ముగ్గరమూ కూర్చొని , రాధా మాధవ పూల సువాసనను ఆస్వాదిస్తూ , హేమ పాడే పాటలు వింటూ , కృష్ణశాస్త్రి భావ గీతాలు , ఎంకి పాటలు చదువుకుంటూ వుండే వాళ్ళం . మా కుక్ మాధవయ్యర్ , సాంబార్ , దోసెలు , ఊతప్పాలు బ్రహ్మాండం గా చేసేవాడు . మా కాలేజ్ కాంటిన్ లో మిరపకాయ బజ్జీలు చాలా బాగుండేవి , నేను , మణి రొండు కొనుక్కొని , హేమ కంట పడకుండా దాక్కొని తినటానికి మహా కష్టపడి పోయేవాళ్ళము . మరేం చేస్తాం , మాదగ్గర డబ్బులు ఎక్కువ వుండేవి కాదు . నెల కొక సారి సినిమాకు తీసుకెళ్ళేవాళ్ళు . ఒకసారి బయటకెళ్ళ టానికి పర్మిషన్ ఇచ్చేవారు . అప్పుడు ఎంచక్కా నాజ్ థియేటర్ లో సినిమా , శంకర్ విలాస్ హోటల్ లో దోస అబ్బో ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో ! కొంతమంది రౌడీ పిల్లలు , లంచ్ టైం లో డేస్ కాలర్ పిల్ల ల గుంపులో , కనపడకుండా బయటకు వెళ్ళేవాళ్ళు . మేము అలాంటి రౌడీస్ మి కాము . పైగా వాళ్ళెళ్ళినా , అమ్మో మా కైతే ఎంత భయం వేసేదో !అప్పట్లో , గుంటూరు లో అరండల్ పేట , బ్రాడీపేట ముఖ్యమైన వీధులు . అరండల్పేట , ఎన్నో లైనో గుర్తు లేదు , లో మా పెద్ద అమ్ముమ్మ ( మా అమ్ముమ్మ అమ్మ ) ఇల్లు వుండేది . ఆమె తరువాత , ఆ యిల్లు మా అమ్మమ్మకు ఇచ్చారు . అందులోనే , మా చిన్న మామయ్య వుండి చదువుకునే వాడు . అమ్మమ్మ , అప్పుడప్పుడూ వచ్చి పోతూ వుండేది . తాతగారు కూడ ఏదైనా పని వుంటే వచ్చేవారు . వాళ్ళు వచ్చినప్పుడు , ఆదివారము నాడు , నేనూ , మణి చర్చ్ ( మణి క్రిష్టియన్ , తంతో నేను అప్పుడప్పుడు చెర్చ్ కు వెళుతుండేదానిని ) కు వెళ్ళి , అమ్మమ్మ దగ్గరకు వెళ్ళే వాళ్ళము . మా తాతగారు ప్రతి రోజూ అగ్ని హోత్రం చేసి పూజ చేసుకొని , మడితో భోజనము , దాదాపు 3 గంటల ప్రాంతము లో తినేవారు . అందుకని అమ్మమ్మ మాకు మైల వంట చేసి , ఇద్దరినీ పక్క పక్క నే కూర్చో బెట్టే అన్నం వడ్డించేది . అంత ఆచారవంతులైనా , మణి ని కూడా నాతో సమానంగా ఆదరించేవారు .భోజనము అయ్యాక ఇద్దరమూ కంచాలు తీసి కడిగి పెట్టేవారము . తిన్న ప్రదేశము లో నీళ్ళు చల్లి , బట్ట తో తుడిచేసేదానిని . అది చాదస్తం అని ఎప్పుడూ అనుకోలేదు , శుభ్రం అనే అనుకున్నాను . మరి ఈ రోజు కూడా డైనిగ్ టేబుల్ మీద తిన్నా , ఆ తరువాత నీళ్ళు చల్లి తుడుస్తాను . తాతగారు రాకుండా , అమ్మమ్మ ఒక్కతే వచ్చినఫ్ఫుదు , ఇద్దరమూ సినిమాల కు వెళ్ళేవాళ్ళము . శంకర్ విలాస్ పక్కన ఏదో థియేటర్ వుండేది , దాని పేరు గుర్తులేదు , అవును మరి ఈ విషయాలు ఇప్పటివి కాదు దాదాపు నలభై రెండేళ్ళ క్రితం వి ! అమ్మమ్మకు ఒక్కతే వెళ్ళాలంటే చాలా భయం . అప్పట్లో అంటే , అమ్మమ్మ చిన్నప్పుడు గుంటూరు లో రిక్షా వాళ్ళు , ఆడవాళ్ళు ఒక్కరే వస్తే , దారి తప్పించి , మెడలో వస్తువులు గుంజుకొని , ఎక్కడో వూరి బయట వదిలేసేవారట . ఆ కథలు అమ్మమ్మ చాలా చెప్పేది . ఇంకా ఒక చిన్న జ్ణాపకం , అదేమిటంటే , అప్పట్లో మూర్చల వ్యాది వున్నవారి మెడలో ఓ బిళ్ళ ఇతనికి మూర్చ వ్యాధి వుంది అని ఇంకా ఏదో రాశి వేళ్ళాడ దీసేవారు . అతను రోడ్ మీద పడి పోగానే , అక్కడ వున్న ఇళ్ళ వాళ్ళు బిందల కొద్దీ నీళ్ళు తెచ్చి అతని మీద పోసేవారు . ఓసారి మా ఇంటి ముందు ఎవరో పడిపోతే అమ్మమ్మ కూడా బిందెతో నీళ్ళు తీసుకెళ్ళింది , కాని నన్ను అక్కడికి రానీయలేదు . ఇప్పుడు సాఫ్ట్ వేర్ వాళ్ళు మెడలో ఐడెంటిటీ కార్డ్ వేసుకొని తిరుగు తుంటే , నాకు అప్రయత్నం గా అదే గుర్తొస్తుంది . మా కోడలి తో ఓసారి చెపితే , తను పడీ పడీ నవ్వింది . వాళ్ళ ఫ్రెండ్స్ కు కూడా చెప్పిందిట .


జిందగీ లో మొదటిసారి లభించిన స్వాతంత్రాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే , హుం . . . ఇంగ్లిష్ పేపర్ తన్నేసి , మళ్ళీ సెప్టంబర్ లో రాసి , పాసైనా , డిసెంబర్ లో మంచి సంబంధం వచ్చిందని పెళ్ళి చేసి అత్తారింటికి పంపించేసినంత . పెళ్ళి తరువాత చాలా సార్లే గుంటూర్ వెళ్ళాను . ఈ మద్య చాలా సంవత్సరాల తరువాత వెళ్ళాను . అదేమిటో అంతా మారి పోయింది . ఏదీ గుర్తుపట్టలేక పోయాను .

విజయవాడ దగ్గర నందిగామ నుండి పది మైళ్ళ దూరం లో వున్నాయి పొక్కునూరు , మా నాన్నగారి వూరు , చింతలపాడు మా అమ్మా వాళ్ళ వూరు . మా నాన్నగారి తలితండ్రులు చిన్నప్పుడే పోవటము వలన అక్కడ ఎవరూ లేరు . పొక్కునూర్ ఒక్కసారి మాత్రం చూద్దామని వెళ్ళాము . అక్కడ కృష్ణ వడ్డున చిన్న ఇల్లు నాన్నగారి వాళ్ళది . అది చూడగానే ఎంత నచ్చేసిందో . ఎప్పటికైనా అక్కడ వుండాలి అనుకునే దానిని . స్చప్ . . . వీలు కాలేదు . అమ్మగారి వూరు చాలా సార్లే వెళ్ళాము . అలా విజయవాడ చిన్నప్పటి నుండి చాలా సార్లు వెళ్ళినా , ఎప్పుడూ ఊరు చూడలేదు . దుర్గ గుడి కి మాత్రం వెళ్ళేవాళ్ళము . గుంటూర్ లో చదువు కుంటున్నప్పుడు , నాగార్జున్ సాగర్ వెళ్ళాలంటే , విజయవాడ వచ్చి , బస్ మారాల్సి వచ్చేది . నేను , మా చిన్నమామయ్య , ( తను కూడా గుంటూర్ లో పి. యు .సి చదువుతుండే వాడు ) అప్పుడే కొత్తగా పెట్టిన , మనోరమ హోటల్ లో భోజనం చేసి , నాగార్జున సాగర్ బస్ ఎక్కేవాళ్ళము . మనోరమ హోటల్ లో భోజనం 2.50 వుండేది . స్వీట్ , పాన్ ఆకర్షణ . రెండేళ్ళ క్రితం నేనూ , జయా ఎటైనా తిరగనీకి వెళుదాము అనుకున్నప్పుడు , తక్కువ ఖర్చు తో , దగ్గరి వూరికి , ఇద్దరమే ఐనా వెళ్ళవచ్చని విజయవాడ వెళుదామనుకున్నాము . అప్పుడే హంసలదీవి గురించి చదివాను . అదీ చూద్దామని అనుకున్నాము . సరే ఏ కళన వున్నారో , మా వారు కార్ తీసుకెళ్ళ మన్నారు . ఓ శుభముహూర్తాన పొద్దున్నే బయలు దేరాము . చిన్నప్పుడు వున్న నాగార్జునసాగర్ నుండి వెళుదామనుకొని అటే బయలుదేరాము .

నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ దగ్గర చిన్న కాంప్ ' పొట్టి చెలమ ' లో వుండేవాళ్ళము . నేను 10 , 11 తరగతులు అక్కడనుండి సాగర్ వెళ్ళి , హైస్కూల్ లో చదివాను . జయ , మా చిన్న చెల్లెలు చాలా చిన్న వాళ్ళు . నాకంటే ఎక్కువగా వాళ్ళు అక్కడ గడిపారు . ఆ లెఫ్ట్ కెనాల్ తవ్వు తున్న ప్పుడు , అక్కడ , కాంతారావు , రాజనాల , రాజశ్రీ ల జానపద సినిమాలు షూటింగ్ జరిగాయి . సరే చిన్న నాటి సంగతులు తలుచుకుంటూ ఆ ప్రదేశాని ఎలాగో గుర్తు పట్టి దిగాము . అంతా అడవి లా వుంది . దూరం గా ఎక్కడో కూలి పోయిన గోడలు మాత్రం కనిపిస్తున్నాయి . జయ అంతే , కార్ దిగి గబగబా అటెళ్ళి పోయింది . అంతా నిర్మానుస్యం గా వుంది . మేమున్నప్పుడే , పాములు తెగ వచ్చేవి . గాంగ్ వాళ్ళు వాటిని , చంపేసేవాళ్ళు . ఇప్పుడు వాటి వంశంవి ఏవైనా మమ్మలిని గుర్తు పట్టి , పగతో కాటేస్తాయేమో నని నా భయం . అబ్బే జయ వింటేనా ? ఒకటే పరుగులు . ఆ శిధిలాల లోకి వెళ్ళి , ఇక్కడ మన ఇల్లు వుండేది . ఇది పలానా వాళ్ళ ఇల్లు . అంటూ తన్మయం చెంది పోయింది . నా కైతే అక్కడ ఏమీ కనిపించలేదు . చెప్పానుగా అక్కడ నేనున్నది తక్కువ అని . ఎలాగో కష్టపడి , కార్ దగ్గరికి తీసు కోచ్చాను . నా మీద ఒకటే గొణిగింది , తను తీసిన ఫొటో నామూలం గా సేవ్ చేయలేదుట !

అటునుండి సాగర్ స్కూల్ కు వెళ్ళాము . స్కూల్ ఏమాత్రం మారలేదు . మా క్లాస్ రూం దగ్గరకు వెళుతే ఆరోజులన్ని గుర్తొచ్చాయి . మాత్స్ లో క్లాస్ లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేదనిని . నా ఫ్రెండ్ భమిడపాటి హేమలత . తనూ నేనూ ఎప్పుడూ మాత్స్ లో పోటీ పడేవాళ్ళము . మా మాథ్ టీచర్ , రాజూ మాస్టరుగారు మమ్మలిని , మాడపాటి , భమిడపాటి అని పిలిచేవారు . అంతా బాగానే వుంది కాని , యస్. యస్ . యల్ . సి రిజల్ట్ వచ్చేవరకు తెలీలేదు , నాకు వయసు తక్కువుందని , అందుకని రిజల్ట్ విత్ హెల్డ్ లిస్ట్ లో పెట్టారని . మా నాన్నగారు , నల్గొండ , హైదరాబాద్ చుట్టూ తిరిగి నా రిజల్ట్ తెచ్చేసరికి పుణ్యకాలం గడిచిపోయింది . గుంటూరు కాలేజీ లో చేరేందుకు వెళ్ళేసరికి అన్ని సబ్జెక్ట్ ల లో సీట్లు ఐపోయి , హిస్టరీ , డ్రాయింగ్ కాంబినేషన్ లో సీట్ వొక్కటే వున్నది . ఇంకో విషాదం ఏమిటంటే , మాత్స్ లో ఖాళీ వున్నా , నాది జనరల్ మాత్స్ కాబట్టి ఇవ్వలేదు . అప్పటి వరకూ జనరల్ మాత్స్ వాళ్ళకు ఫ్యూచర్ లో మాత్స్ లో సీట్ ఇవ్వరని నాకు తెలీదు . మేము , వరంగల్ నుండి సాగర్ వచ్చి స్కూల్ లో 10 లో చేరేటప్పుడు , అమ్మాయిలంతా జనరల్ లో చేరుతున్నారని నా పేరు కూడా జన్రల్ మాత్స్ వేసాడట స్కూల్ క్లర్క్ . అంతే , మాత్స్ లో యం యస్సీ చేద్దానుకున్న నా కల అలా కూలిపోయింది . ఏమీ తెలియని తనం . నా దురదృష్టం . అలా అన్ని నెమరు వేసుకుంటూ వుంటే అక్కడే వున్న అటెండర్ మా గురించి అడిగి , పాత స్టూడెంట్ నని తెలుసు కొని , తలుపులన్ని తెరిచి , స్కూల్ మొత్తం చూపించాడు . అక్కడి నుండి , డాం దగ్గరకు వెళ్ళాము . అక్కడే వున్న శివాలయం కు వెళ్ళాము . మా వారు నన్ను చూడటానికి వచ్చినప్పుడు ఆ శివాలయం కు వచ్చాము . ఇద్దరమూ కలిసి మొదటి సారిగా వెళ్ళిన ఆలయం అది .

మా పెళ్ళైన అప్పుడు , అక్కడి విజయ విహార్ గెస్ట్ హౌస్ లో కూడా రెండు రోజులు వున్నాము . మేము వున్నప్పటికి ఇప్ప్పటికి , నాగార్జున సాగర్ ఎక్కువగా ఏమీ మార లేదు . మేము డాం కొత్తగా కడుతున్న రోజుల లో అక్కడ వున్నాము . డాం మీద బొంగుల తో మెట్ల లాగా ఏర్పాటు చేసి , దాని మీదనుండి కూలీలు ఎక్కుతూ పని చేస్తూ వుంటే చూసేందుకు చాలా బాగుండేది . రాముడు భీముడు సినిమాలో , విజయ లక్ష్మి , యన్ .టి . ఆర్ ల తో ఓ గ్రూప్ డాన్శ్ వుంది . అప్పుడు అక్కడ చాలా సినిమాలు షూటింగ్ చేసేవారు . డాక్టర్ చక్రవర్తి లో మనసున మనసై తోడొకరుండిన పాట కూడా రైట్ బాంక్ గెస్ట్ హౌస్ లో తీసారు . ప్రాజెక్ట్ హౌస్ , విజయవిహార్ , పైలాన్ , మా స్కూల్ పక్కన వున్న టైగర్ వ్యాలీ ఏవీ ఎక్కువగా మార్పు చెందలేదు .

మాచర్ల లో చెన్నకేశవ స్వామి ఆలయముకు వెళుదామనుకున్నాము , కాని డాం దగ్గరే ఆలశ్యం కావటము తో , గుడి మూసి వేసారు . వెళ్ళ లేక పోయాము . అమరావతి , గుంటూరు లో వున్నప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్ళాను . మా వారి తోకలిసి కూడా వెళ్ళాను . ఇప్పుడు చూసినప్పుడు చాలా నిరాశ కలిగింది . గుడి కంతా ఏమిటో నీలం , పసుపు రంగులు వేశారు . అసలు గుడి అలా రంగులు ఎందుకు వేస్తారో అర్ధం కాదు . ఈ మధ్య ఏ గుడి చూసినా అలా రంగులేస్తున్నారు . దానితో గుడి కి వుండే కళ పోతుందనిపిస్తుంది . కృష్ణమ్మ ఎక్కడో అల్లంత దురాన వున్నది . అప్పుడైతే కృష్ణ దాకా వెళ్ళాము . అమరేశుని దర్షించుకొని , అమరావతి స్తూపం చూసి , విజయవాడ చేరేసరికి రాత్రైంది . మనోరమా హోటల్ లో వుందామనుకున్నాము కాని అది రెనవేషన్ చేస్తున్నారు . శ్రీనివాస కు వెళ్ళాము . మా వారు విజయవాడ లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ హోటల్ లోనే వుండేవారని చెప్పినట్లు గుర్తు . ముందు రూం లేదన్నాడు . అంత రాత్రి ఎక్కడికెళ్ళాలి అని , మావారికి ఫోన్ చేస్తే , ఆయన మాట్లాడుతే , అప్పటి వరకూ లేని రూం వచ్చింది ! అసలైతే , మా పిన్ని పిల్లలు భాస్కర్ , సీత అక్కడే వున్నారు . వాళ్ళ ఇంటికి వెళ్ళ వచ్చు . కాని సీత కూతురి , పురిటి కి డిల్లీ వెళ్ళి ఆ , మరునాడు వస్తోంది . భాస్కర్ భార్య కేమో ఆరోగ్యం సరిగ్గాలేదు . మేము సర్దాగా తిరగటం కోసం వాళ్ళను ఇబ్బంది పెట్టటం ఇష్టం అనిపించలేదు .

ఈ రోజు మళ్ళీ అంతా చదువుకుంటే గుటూరు , నాగార్జున సాగర్ ల గురించి పూర్తి గా చెప్ప లేదు అని అనిపించింది . అందుకే మళ్ళీ ఆ పోస్ట్ ను రెండు భాగాలు గా చేసి రాసాను .

( సశేషం )

11 comments:

తార said...

బాగున్నాయి, కొన్ని ఫొటోలు కుడా పెడితే చూసి ఆనందించే వారిమి..

ఆ పాము పగ ఉత్త మూఢ నమ్మకం, పాములు సాధు జంతువులే, మనం వాటిని భయపెట్టనంత వరకూ..

sunita said...

ఓహోయి, మీకూ గుంటూరుతో చుట్టరికం ఉందన్నమాట.నేను ఇప్పటిదాకా మిమ్మలని హైదెరాబాద్ లిస్ట్ లో వేసాను. ఇంకేం! రేపటినుండి మాలాగారు కూడా గుంటూరు వాళ్ళోచ్చ్ అని నేను టముకేసుకోవచ్చు:-) మిమ్మలని నా పార్టీలోకి లాక్కోవచ్చు:-) సరదా తరువాత మీ మరిది గారి మరణానికి నా ప్రగాఢ సానుభూతి. మనిషి తప్పుకోలేని, అనుభవించక తప్పని కష్టం ఇదోక్కటేనండీ! మీరందరూ ఆ విచారంలోంచి త్వరగా బైటపడాలని కోరుకుంటూ

SRRao said...

మాలాకుమార్ గారూ !
మీ విజయవాడ ప్రయాణం జ్ఞాపకాలు బాగా అందించారు. మీ మరిదిగారి మరణానికి ప్రగాఢ సానుభూతి. ఈసారి విజయవాడ వస్తుంటే తప్పక తెలియజెయ్యండి.

కౌటిల్య said...

అబ్బ..భలే చెప్పారే, మీ ప్రయాణం కబుర్లూ, మీ మనసుని తట్టిన మీ జ్ఞాపకాల దొంతర్లూ...

ఇంతకు ముందు గుంటూరు ఎలా ఉండేదో గానీ, ఈ ఏడేళ్ళ అనుబంధంతో ఎలాఉన్నా గుంటూరు వదిలి రెండ్రోజులు కూడా ఉండలేకపోతున్నా...

నాక్కూడా అసలు గుళ్ళకి రంగులెందుకు పులుముతారో అస్సలర్థమై చావదు...ఆఖరికి తమిళనాడు వాళ్ళు కూడా..

మీ అమ్మమ్మ గారి ఊరి ప్రయాణం నాకు నోరూ,మనసూ రెండూ ఊరించిందండీ...అబ్బ! కందిపచ్చడీ, గోగాకుపచ్చడీ(ఇందులో అమ్మ చిన్నప్పుడు వెన్నపూస వేసి పెట్టేది.ఎంత సూపర్ కాంబినేషనో గోగాకుపచ్చడి,వెన్నపూస,వేడివేడన్నం...ఒకదానిమీద ఒకటి అరిటాకులో వడ్డిస్తుంటే, చూస్తుంటేనే నోట్లో నీళ్ళొచ్చేసేవి..ఇక జిహ్వ ఐతే సరేసరి.. స్వర్గానికి బెత్తెడెత్తులో ఉండేది..ప్చ్.ఏం చేద్దాం..అమ్మ ఇప్పుడడిగితే వెన్నముద్ద కాదు,రుచిక్కూడా పెట్టట్లా..)..

ఇక మొగలిపొదలూ...వెన్నల్లో ఇసుకతిన్నెల మీద బండిప్రయాణం...భలే భలే..

మాలా కుమార్ said...

తార గారు ,
ఫొటో లు లేవండి . అందుకే పెట్టలేదు .
పాము పగ పడుతుందో లేదో నాకు తెలీదు కనీయండి , నాకు పాములంటే చాలా భయం .
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

సునీత గారు ,
నన్ను మీ పార్టీలోకి తీసుకునందుకు థాంక్స్ అండి .

& SRRao గారు ,
మా వాఖ్యకు ధన్య వాదాలండి .

మాలా కుమార్ said...

కౌటిల్య గారు ,
మీ అమ్మ గారి మీద ఎన్ని కంప్లైంట్లండి . ఇహ నేనూ మా అబ్బాయి తో జాగ్రత్త గా వుండాలి . ఈ మద్య మా అబ్బాయి ఏమడిగినా ఓపికలేక తరువాత చేస్తాలేరా అంటున్నాను .
మా అమ్మ గారి వూరి ఆ ప్రయాణం చేసి 50 సంవత్సరాల పైనే ఐనా నాకు , ఇంకా ఫ్రెష్ గా అన్నీ గుర్తే నండి .
మొత్తానికి , నా జ్ఞాపకాలు అంత పెద్ద సాహితీ వేత్త , బిజీ డాక్టర్ గారిని ఇటు లాకొస్తున్నాయి .
థాంక్స్ అండి .

తార said...

పాములకి భయపడకండి, డిస్కవరి చూడండి..
మన భయాల వలన అవి అంతరించి పోతున్నాయి

మాలా కుమార్ said...

తార గారు ,
పాములను చంప కూడదు అని , ఇక్కడ మా కాలనీ లో కూడా అంటారండి . మా కాలనీ చివర , కొంచము అడవి లాగా వుంటుంది . అక్కడ వున్న ఇళ్ళ లోకి తరుచుగా పాములు వస్తుంటాయట . అప్పుడు స్నేక్ ప్రొటెక్షన్ వాళ్ళకు కాల్ చేస్తారు . వాళ్ళు పది నిమిషాల లోపే వచ్చి వాటిని తీసు కెళుతారు .

మీరు ఏమైనా చెప్పండి , నాకు మటుకు పాము బొమ్మ చూసినా భయమే . మీరు శ్రద్ధ తీసుకొని చెపినందుకు థాంక్స్ అండి .

Sravya Vattikuti said...

వామ్మో మాల గారు ఈ పాముల విషయం లో నాది కూడా మీ పార్టీనే . ఫోటో చూసిన నాకు ఒళ్ళు జలతరిస్తుంది . ఆ మధ్యన ఎవరో ఒక పెద్ద కొండచిలువ ఫోటో ఒకటి పెట్టారు కూడలి లో మొదటి పేజి లో తెగకనపడుతుండేది , ఆ దెబ్బకి ఆ పేజీనే చూడటం మానేసా . ఇప్పడు మళ్ళీ నిన్నటి నుంచి మాలిక లో ఒక ఫోటో కనపడుతుంది దెబ్బకి హారానికి మారిపోయా :)

భావన said...

మాల గారు బాగున్నాయండీ ప్రయాణపు కాబుర్లు. మా విజయవాడ ను తిరిగి మాకు పరిచయం చేసిన విధానం బాగుంది. అయ్యో మా పాండురంగడిని హంసలదీవి ని చూడలేదా. హంసలదీవి దగ్గర కృష్ణ సంగమం చూడాల్సిందే ఇంకో సారి వెళ్ళండి. గుంటురు లో పుట్టేరు అదే మరి ఆ మాటలలో ఘాటు. నిజమే సునీత మనకు చుట్టరికం వుంది ఐతే ఈమె తో. పాము పగ వుండదూ పాడు వుండదండి.