చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Sunday, August 8, 2010

విజయవాడ - 3 ( బందర్ - మొవ్వ - శ్రీకాకుళం )



మా పిన్ని తిరుపతి నుండి వచ్చి , సీత దగ్గర , విజయవాడ లో వున్నదని తెలిసి , మా అమ్మ చెల్లెలిని చూసేందుకు విజయవాడ వెళుదామనుకున్నది . నేనూ , జయ కూడా అమ్మ తో పాటు బయిలుదేరాము . ఇంతకు ముందు వెళ్ళినప్పుడు , హంసలదీవి చూడలేదు . భావన తెగ ఊరిస్తున్న , బందరు పాండురంగని చూద్దామనుకున్నాము , వెళ్ళ లేక పోయాము . ఓ అల్ల నెప్పుడో , ఆంధ్ర మహావిష్ణువు ఆలయం వుందను కొని , విజయనగరం దగ్గర వున్న శ్రీకాకుళం వెళ్ళి , అది కాదని , ఈ శ్రీకాకుళం విజయవాడ దగ్గరే వుందని తెలుసుకొని అప్పటి నుండి వెళ్దామని అనుకుంటుంటే ఇప్పటి దాకా వీలవలేదు . మరి అదీ చూడాలి . అందుకే అమ్మకు , మావారి కి మస్కా కొట్టి అమ్మతో బయిలుదేరాను . నా తోపాటు జయా తయారు .

ఒక పూటంతా కబుర్ల తోనే సరి పోయింది . మరునాడు ఉదయమే , అమ్మా , పిన్నీ , నేనూ , జయ మా కారు లో బందరు బయలు దేరాము . పండరీపురం లో , నల్లగా , నిగ నిగ మెరిసి పోతూ , రెండు చేతులనూ ఇరుపక్కలా మడిచి పెట్టు కొని వున్న పండరినాథుని చూసినప్పుడే చాలా భావోద్వేగాని కి గురైనాను . మళ్ళీ మళ్ళీ చూడాలని పించేంతటి సుందరమూర్తి . అప్పటి నుండి మళ్ళీ ఒకసారి పండరిపురం వెళ్ళాలి అని అనుకుంటూ వున్నాను . పోయినసారి విజయవాడ వచ్చినప్పుడు , సీత చాలా గొప్పగా చెప్పింది , బందరు గుడి గురించి . అపుడే భావన కూడా చాలాసారులు ప్రమదావనం లో చెప్పింది . ఆంతవరకు , బందరు అంటే , గోల్డ్ కవరింగ్ నగలకి , బందరు లడ్డూల కు మాత్రమే ప్రశిద్ధి అనుకున్నాను . మా పెళ్ళప్పుడు , మా అమ్మ , ఉమా గోల్డ్ కవరింగ్ నగల వాళ్ళ అడ్వర్టైజ్ మెంట్ లో చూసి ,' హంసలపతకం ' గొలుసు , నాకు చేయించింది . అది ఎంత హిట్ అయ్యిందంటే ఆ తరువాత చాలా మంది నా గొలుసు చూపించి చేయించుకున్నారు ! అంతగా ఎదురు చూసిన పండరినాథుని ఆలయాని కి చేరుకున్నాము . అక్కడ ఆ గోపాలును చూస్తూ వుంటే , పండరి పురం లో లాగే వున్నడని , నన్ను నిరాశ పరచలేదని చాలా సంతోష పడి పోయాను . పండరిపురము లో చాలా రెష్ మూలము గా ఎక్కువ సేపు స్వామి సన్నిధి లో వుండలేక పోయాము . కాని ఇక్కడ ఎక్కువ రష్ లేదు . పైగా ఆయన ముందు ఎంత సేపు నిలబడినా , పాదాల చెంత తల ఆనించి , చాలాసేపు ప్రార్ధించినా ఎవ్వరూ పక్కకు నెట్టి వేయలేదు . కాక పోతే వెనుక వాళ్ళకు కూడా అవకాశము ఇవ్వాలిగా ! మంటపము లో చాలా సేపు కూర్చొని , స్వామిని చూస్తూ తన్మయం చెందాను . ఆ తరువాత పక్కనే వున్న శివాలయము లోనికి వెళ్ళాము . అక్కడ ఎవరికి వారు శివలింగము ప్రతిష్టించుకొని పూజించుకో వచ్చుట . పెద్ద లింగం చుట్టూ గుడి అంతా చిన్న చిన్న శివలింగాలు వరుసగా ప్రతిష్టించి వున్నాయి . కోనేటి దగ్గర చాలా సేపు కూర్చున్నాము . అక్కడ ఎంతసేపు వున్నా తనివి తీరలేదు . నేనైతే , మళ్ళీ మళ్ళీ ఆ గోపాలుని దర్షించుకొని వదల లేక వదల లేక వదిలి వచ్చాను .

అక్కడే వున్న గోల్డ్ కవరింగ్ షాపు లో మా మనవరాళ్ళిద్దరికీ చెరొక గొలుసు కొన్నాను . బస్ స్టాప్ దగ్గర , బందరు లడ్డూలు కొన్నాను . కాని ఎక్కడా సరైన భోజనము దొరకలేదు . ఐనా తిరిగేటప్పుడు భోజనం గురించి ఆలోచన రాదు . బందరు బీచ్ మటుకు చాలా నిరాశ పరిచింది . అబ్బ ఎంత చండాలం గా వున్నదంటే , మేమసలు కార్ లోనుండి కిదికి దిగలేదు . కొంచం దూరం కార్ లోనే వెళ్ళాము . బీచ్ కు దగ్గరిలోనే స్నాన ఘట్టము లాంటిది వుంది . అక్కడ కొన్ని భావులు వున్నాయి . ఎన్నో గుర్తు లేదు . వాటి ల్లో అన్ని నదుల నీరు వస్తుందిట .ఆ నీటి తో స్నానం చేస్తే ఆ నదుల లో స్నానం చేసినంత పుణ్యం అట . అప్పుడే వాన కూడా మొదలైంది . ఆ వాన లో తడుస్తూనే , మా పిన్నీ , జయా మా డ్రైవర్ మహేష్ వెళ్ళి ఒక్కొక్క భావి లో నీరు చేదు కొని తలపై చల్లు కున్నారు . నాకూ మా అమ్మ కోసం సీసాలో తీసు కొచ్చారు . అలా వాన లో తడుస్తూ , భావి లోనుండి నీరు తోడుకుంటూ , తల పైన చల్లు కోవటము బాగుంటుంది . కాని ఆరోగ్యం సహకరించనప్పుడు అలాంటి సరదాల జోలికి వెళ్ళ క పోవట మే మంచి కదా అని నా అభిప్రాయం .

శ్రీకాకుళం దారి అడుగుతూ బయలుదేరాము . ఇంతలో ' మువ్వ ' అని పేరు కనిపించింది . అరే ఇదేమైనా క్షెత్రయ్య పదాలు రాసిన మువ్వ నా అనుకొని , దాని దారి చూసుకుంటూ వెళ్ళాము . అప్పటికే సాయం కాలము 5 గంటలైంది . గుడి తలుపులు తీస్తూ వున్నారు . అది క్షేత్రయ పదాలు రాసిన మువ్వ గోపాలుని ఆలయమే . పక్కనే చిన్నగా క్షేత్రయ్య పదాలు వినిపిస్తూ , గుడి చాలా ప్రశాంతము గా వుంది . గోపాలుని విగ్రహము కిందుగా క్షేత్రయ్య విగ్రహము కూడా వుంది . అనుకోకుండా లభించిన దర్షనము .

కృష్ణ దేవరాయుని గురించి చదివినప్పుడు , శ్రీకాకుళము లో ' ఆంధ్ర మహా విష్ణువు ' గుడి కట్టించాడని , అక్కడ తరుచుగా పూజలు చేసే వాడని చదువుకున్నాము . కృష్ణదేవరాయుని మీద అభిమానము తో ఆ గుడి వెతుక్కుంటూ వెళ్ళాము . శ్రీకాకుళము చాలా చిన్న వూరిలా అనిపించింది . మేము అక్కడికి చేరుకునే సరికి చీకటి పడి పోయింది . లైట్ లు కూడా గుడ్డిగా వున్నాయి . గుడి ముందు అంతా కడుతున్నారు . చిన్నగా ఎక్కడ పడి పోతామో అని భయము తో తడుముకుంటూ లోపలికి వెళ్ళాము . చాలాసేపు గుడిలో వుండి , కృష్ణదేవరాయుని చే ప్రతిష్టింప బడి పూజించబడిన , ఆంధ్ర మహావిష్ణువును చూస్తూ నిలబడ్డాము . నాకు చిన్నప్పుడు చూసిన ' మహా మంత్రి తిమ్మరుసు ' సినిమా , అందులోని ,' చరిత్ర ఎరుగని మహా పాతకం ఈ దేశానికి పట్టినదా , ఆంధ్రదేవా వెంకటేస్వరా ఈ విధి రాయలే చేసెనా ' పాట గుర్తొచ్చింది ! అప్పుడు ఆ సినిమా చూసి , చివరలో ఈ పాట అప్పుడు చాలా ఏడ్చాను . ఇప్పుడు ఇక్కడా మనసంతా భారమైపోయింది . చెప్పుడు మాటలకు ఎంత శక్తి వుంటుందో , కృష్ణ దేవరాయులు , తిమ్మరుసుల కథే చెప్పుతుంది . ఆ ఘోరానికి సాక్షి ఈ ఆంధ్రమహా విష్ణువే కదా అనిపించింది . శ్రీకృష్ణ దేవరాయుని విగ్రహం దగ్గర అమ్మా , పిన్నీ ఆముక్తమాల్యద లోని పద్యాలు చదువుకుంటూ కూర్చున్నారు . జయ ఏవో కూనిరాగాలు తీస్తూ , నేనేమో ' దేశ భాషలందు తెలుగు లెస్స ' అని పొగిడిన రాయలు , తిమ్మరుసుల చరిత్ర నెమరువేసుకుంటూ , ఆ చీకట్లో , ఆ నిశబ్ధ వాతావరణము లో చాలా సేపు , పూజారి వచ్చి హారతి ఇస్తున్నాము అని పిలిచేవరకూ కూర్చున్నాము .

విజయవాడ చేరే సరికి రాత్రి 11 గంటలైంది . మరునాడు పొద్దున్నే , దుర్గను దర్షించుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైనాము . మావారు రెండు రోజల కోసం మాత్రమే కారు ఇవ్వటము వలన , ఈ సారి కూడా హంసలదీవి చూడకుండా నే వెనుతిర్గాల్సి వచ్చింది . మరి హంసలదీవి ప్రాప్తం ఎప్పుడో !

8 comments:

manasa said...

>>పక్కనే చిన్నగా క్షేత్రయ్య పదాలు వినిపిస్తూ , గుడి చాలా ప్రశాంతము గా వుంది .

చిన్న చిన్న ఊర్లలో గుడులు చాలా ప్రశాంతం గా ఉంటాయి.నేను ఒక రెండు సంవత్సరాలక్రితం ద్రాక్షారామం వెళ్ళాను.అక్కడ గుడులూన్నీ నాకు ఎంత నచ్చాయో.హాయిగా అనిపించింది మనసుకి.

కాస్త ఆ "ఆంధ్ర మహా విష్ణువు" కధ చెప్దురూ..నాకు తెలీదు అదేమిటొ.

ఇంతకీ శ్రీకాకుళం విజయవాడ కి దగ్గర కాదు కదా..కారు లో ఎలా వెళ్ళగలిగారు అదీ తక్కువ సమయం లో?ఇంకొక శ్రీకాకుళం ఉందా ఏమిటి విజయవాడ దగ్గరలో?

మేధ said...

>>ఇంతలో ' మువ్వ ' అని పేరు కనిపించింది . అరే ఇదేమైనా క్షెత్రయ్య పదాలు రాసిన మువ్వ నా అనుకొని , దాని దారి చూసుకుంటూ వెళ్ళాము . అప్పటికే సాయం కాలము 5 గంటలైంది . గుడి తలుపులు తీస్తూ వున్నారు . అది క్షేత్రయ పదాలు రాసిన మువ్వ గోపాలుని ఆలయమే .

ఆ ఊరి పేరు మొవ్వ కదండీ..?

మాలా కుమార్ said...

మానస గారు ,
అవునండి , విజయవాడ దగ్గర ఇంకో శ్రీకాకుళం వుంది . ముందు మేమూ విజయనగరం దగ్గర శ్రీకాకుళం ఒక్కటే అనుకున్నాము . అక్కడి కి వెళ్ళాక తెలిసింది , విజయవాడ దగ్గర ఇంకో శ్రీకాకుళం వుందని , అక్కడే కృష్ణ దేవరాయుడు , ప్రతిష్టించిన ' ఆంధ్ర మహావిష్ణువు ' ఆలయమ వుందని . శ్రీకృష్ణదేవరాయుడు , యుద్ధం ము లో విజయము సాధించిన సంధర్భము లో ఇక్కడ ' ఆంధ్ర మహావిష్ణువు ' ఆలయము , కట్టించాడని , తరుచుగా తన దేవేరీ ల తో కలిసి వచ్చేవాడని చెపుతారు . ' అప్పుడే తెలుగు బాష మీద అభిమానము ఏర్పడిందని . దేశ భాష లందు తెలుగు భాష లెస్స అనే పద్యం చెప్పాడనీ నూ , ' ఆముక్తమాల్యద ' ఇక్కడే రచించాడనినూ చదివినట్లుగా గుర్తు . ఆ ప్రదేశము లో కృష్ణదేవరాయుడు , విశ్రాంతి తీసుకుంటూ వుండగా , విష్ణుమూర్తి కలలో కనిపించి , ఆయన కు ఆలయము కట్టించమన్నాడని , అందుకే కృష్ణదేవరాయుడు ఆ ఆలయము కట్టించాడని , ఇలా చాలా రకాల కథలు చదివాను . నాకూ సరి ఐంది తెలీదు .అందుకే ఈ పోస్ట్ లో దాని గురించి ఏమీ రాయలేదు . పైన పెట్టిన ఫొటో ఆ వూరిలోని మంటపము లోనిదే . నీహారిక ఆ వూరి వారే . ఆవిడైతే సరిగ్గా చెప్పగలరేమో .

మాలా కుమార్ said...

మేధ గారు ,
అవునండి ఆ వూరి పేరు ' మొవ్వ ' నే . మీరు చెప్తే గుర్తొచ్చింది . అందుకే మొవ్వ , మువ్వ ఒకటేనా అని అనుమానము వచ్చింది . అక్కడి స్తల పురాణము కూడా సరిగ్గా గుర్తు లేకే , రాయలేదు .
గుర్తు తెచ్చినందుకు థాంక్స్ అండి .

Raj said...

మాల గారు మా బందరుని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు..చిలకలపూడి పాండురంగని గుడి ఎంతో అద్భుతంగా వుంతుంది...ఇకపొతే మంగినపూడి బీచ్ ఎప్పుడు బాగుండదు...అక్కడి బావులు గణపతి సచ్చిదానందస్వామి తవ్వించారు..నీళ్ళు తియ్యగా ఉంటాయి సముద్రం దగ్గర అయినా..ఆయన అప్పుడు చెప్పారు బదరు కి ఈ సముద్రం వల్ల ఎలాంటి ముప్పు ఉండదని ..సముద్రం పొంగినా ఆ బావులు దాటి రాలేదని...

కొత్త పాళీ said...

కృష్ణా జిల్లా, దివి మండలంలో సముద్రానికి దగ్గరగా కృష్ణాతీరంలో ఉన్నది ఈ శ్రీకాకుళం. ఇది శ్రీకాకుళాంధ్ర విష్ణువు నిజస్థలం. ఈ ఆంధ్రవిష్ణువు చరిత్రకెక్కని గతకాలపు పుటల్లో ఈ ప్రాంతంలో నిజంగా ఉద్భవించిన ఒక నాయకుడై ఉండవచ్చని, అచ్చటి ప్రజలని రక్షించడానికి అతను చేసిన ఘనకార్యాలతో అతన్ని సాక్షాత్ మహావిష్ణురూపంగా కొనియాడుతూ ఎన్నో కథలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ కథల ఆధారంగానే రామారావు, జమునలతో శ్రీకాకుళాంధ్ర విష్ణువు కథ అనే సినిమా తీశారు.

రాయల కాలానికే ఈ శ్రీకాకుళాంధ్ర విష్ణువు ఆలయం ఉండేది. రాయలు బహుశా దానికి మెరుగులు దిద్దడం, ఈనాములివ్వడం వంటి పనులు చేసి ఉండచ్చు.

కళింగ సామ్రాజ్యం మీద దండయాత్ర సాగిస్తున్నప్పుడు, ఈ ఊరి ప్రాంతంలో విడిది చేసి ఉండగా ఆంధ్రవిష్ణుడు కలలో కనిపించి తనని ఆముక్తమాల్యద రచనకి ఆదేశించినట్టు రాయలు ఆ కావ్య అవతారికలో చెప్పుకున్నాడు. ఆ సందర్భంగా బహుళ ప్రాచుర్యం పొందిన "దేశభాషలందు తెలుగు లెస్స" అన్న పద్యం, సాక్షాత్తూ శ్రీకాకుళాంధ్ర విష్ణువు నోట పలికించాడు రాయలు.
ఈ సందర్భాన్ని ఈ కింది లంకెల్లో ఆంగ్లంలోనూ, తెలుగులోనూ వివరంగా చదువుకోవచ్చు.
ఆంగ్లంలో

తెలుగులో

రాయలకి చాలా కాలం తరవాత ఈ ప్రాంతపు వాడే అయిన కాసుల పురుషోత్తమ కవిగారు ఈ ఆంధ్రవిష్ణువుని సంబోధిస్తూ "హత విమత జీవ, శ్రీకాకుళాంధ్ర దేవ!" అనే మకుటంతో సీసపద్యాల శతకం రచించారు. దేవుణ్ణి ఎద్దేవా చేస్తున్నట్టుగా కనబడుతూ గొప్ప భక్తిరసాన్ని, అద్భుతమైన చమత్కారాల్ని అందిస్తుందీ శతకం.

మాలా కుమార్ said...

రాజ్ గారు ,
చాలా థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

కొత్తపాళి గారు ,
శ్రమ అనుకోకుండా చక్కగా వివరించి చెప్పారు . ధన్యవాదాలండి .

& మానస గారు ,
కొత్తపాళి గారు వివరించారు , చదివారను కుటాను . థాంక్ యు .