Monday, August 9, 2010
విజయవాడ - 2 ( కొండపల్లి - ద్వారకా తిరుమల - కీసర )
మేము సెటిల్ అయ్యాక భాస్కర్ కి ఫోన్ చేసి ఇలా వచ్చామని చెప్పాము . మేము హోటల్ లో దిగినందుకు నొచ్చుకున్నాడు . మరునాడు సీత కూడా డిల్లీ నుండి వచ్చేసింది. నలుగురము , మా చిన్న తమ్ముడి కొడుకు , జస్వంత్ , విజయవాడ అంతా చుట్టాము . ముందుగా కొండపల్లి కోట చూడటానికి వెళ్ళాము . ఏ కోట చూసినా మనసు ఒక విచిత్రమైన భావన కు గురవుతుంది . ఎక్కడి కక్కడ కూలిపోయి స్చప్ . . . ఏమిటో మనసంతా భారమై పోతుంది . నేను కొండను సునాయసంగా ఎక్కుతుంటే అందరూ ఆశ్చర్య పోయారు . కోట కింద కొండపల్లి బొమ్మలు చేసే వారి దగ్గర కొన్ని బొమ్మలు కొన్నాము . చెట్టు బెరడు తో అంత అద్భుతమైన బొమ్మలు చేయటము అబ్బురమే . అక్కడి నుండి భవానిపురం ఐలాండ్ కు వెళ్ళాము . కృష్ణమ్మ లో బోట్ ప్రయాణము చాలా ఆహ్లాదముగా జరిగింది . అక్కడ లంక లో కూడా పార్క్ లాగా బాగా చేసారు . భవానిపురం నుండి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు స్తాపించిన , మరకత రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్ళాము . అమ్మవారు చాలా కళగా వున్నారు . రాత్రికి సీత వాళ్ళింట్లో భోజనం చేసి మా విడిది కి తిరిగి వచ్చాము .
మరునాడు ద్వారకా తిరుమల లో వెంకటేశ్వర స్వామిని దర్షించుకున్నాము . విజయవాడ తిరిగి వచ్చేసరికి సాయంకాలమైంది .వస్తూ దారి లో గణపతి సచ్చిదానంద స్వామి వారి చే స్తాపించ బడిన , మరకత రాజరాజేశ్వరీ దేవి ఆలయానికి వెళ్ళాము . ఆలయము , ఆలయము లోని అమ్మవారు చాలా కళగా వున్నారు . ఆ తరువాత దుర్గ గుడి కివెళ్ళాము . ఆ సంద్యాసమయము లో దుర్గ గుడి నుండి కృష్ణ ను చూడటము ఎంత అందమైన దృశ్యమో . ఆ తరువాత ప్రకాశంబ్రిడ్జ్ పైన కాసేపు నడిచాము . మా మరిది గారు శంకర్ బలవంతము తో రాత్రికి హోటల్ నుండి సీత ఇంటికి మారాము . మరునాడు బందర్ పాండురగని గుడి బాగుంటుందని వెళుదామని సీత ప్లాన్ చేసింది . ఇంతలో మాడ్రైవర్ , మురళి కి ఇంటి నుండి రమ్మని ఫోన్ రావటము తో , మరునాడు తిరుగు ప్రయాణం కావలసి వచ్చింది . పొద్దున్నే , సీతా వాళ్ళ ఇంటికి దగ్గర లో వున్న కృష్ణ లో స్నానం చేసి , ఎన్ని ఏళ్ళుగానో , వెళ్ళాలి అనుకుంటున్న బాబాయ్ హోటల్ కు వెళ్ళాము . మనం అడగక ముందే , ముందుగా ఇడ్లీ ఇచ్చారు . ఆ పైన అక్కడి స్పెషలైన మినపట్టు తిన్నాము . నిజం గానే ఆ ఇడ్లీ రుచే వేరుగా వుంది .
మా మురళి పుణ్యమా అని ఇంకో రెండు రోజులుందామనుకున్న వాళ్ళము తిరుగు ప్రయాణం అయ్యాము . దారి లోనే నందిగామ కనుక , సీత , భాస్కర్ అక్కడి వరకూ మాతో వచ్చారు . దారి లో వున్న కీసర దగ్గర కాసేపు ఆగాము . నా చిన్నప్పుడు , మేము చింతలపాడు రావాలంటే కీసర దగ్గర బస్ దిగేవాళ్ళము . అక్కడికి మా తాతగారు బండి పంపేవారు . అమ్మమ్మ అన్మ్మం , కంది పచ్చడి , గోంగూర పచ్చడి , మూట కట్టి పంపేది . ఆ వాగు దగ్గర కూర్చొని , తిని వెళ్ళేవాళ్ళము . మద్యాహ్నం బండి ఎక్కుతే రాత్రి అయ్యేది , ఇంటికి చేరుకునేసరికి . ముక్యం గా , వెన్నెల రాత్రుల లో ఆ ప్రయాణం చాలా బాగుండేది . చిన్న దానినైనా , ఇసుకలో , బండి ప్రయాణం , ఆ వెన్నెల , మొగలి పొదల పక్క నుండి వెళుతుంటే వచ్చే మొగలిపూల సువాసనా , కీచురాళ్ళ ద్వనులు అన్నీ గుర్తే . తుమ్మ డొంకలొస్తున్నాయంటే వూరు దగ్గర పడిందని సూచన. వూరి మొదట్లోనే నూకాళమ్మ గుడి . అప్పుడు నేనొక్క దాన్నే చిన్న పిల్లని కాబట్టి అందరూ ఎంతో ముద్దు చేసేవారు . మా తాతగారు , వెనుక కొట్టము లో నా కోసం ఓ బొమ్మరిల్లు కట్టించారు . అక్కడ నేను ఆడుకుంటూ వుంటే , అమ్మమ్మ , మజ్జిగ , కవ్వం తో తిప్పుతూ బోలెడు పాటలు పాడేది . మా అమ్మమ్మ చాలా బాగా పాడేది . ఆ కవ్వ తిప్పటము నాకు చాలా నచ్చేది . నేనెంత ప్రయతించినా తిప్పలేక పోయేదానిని . ఇంతింత వెన్న ముద్దలు తీసి నాకు పెట్టేది కాని అదేమిటో నా కస్సలు తినాలని పించేది కాదు . తినవే అమ్మడూ అని తెగ బతిమిలాడేది . ఊమ్హూ అస్సలంటే అస్సలు నోరు తెరిచేదాన్ని కాదు . చెక్క పెట్టెలో నుండి తీసిన గడ్డ పెరుగు తో , అన్నం కలిపి పిన్ని పెడుతుంటే మటుకు గుటుకూ గుటుకు న ఎంత తినే దాని నో ! ఎంతైనా ఇంట్లో మొదటి మనవరాలు పుట్టినందుకు బోలెడు ముద్దులూ , మురిపాలు పొందాను . అవన్ని నేను చెపుతుంటే మా చెల్లెళ్ళు , తమ్ముడు చెవులు దోరవిడుచుకొని విన్నారు .నాకు అనుమానం కాస్త కుళ్ళు కున్నారేమో నని !
అక్కడ ఆ బాల్య సృతులలో వుండగానే , సెల్ కు నేను జవాబివ్వలేదని , మురళి సెల్ కు , మా వారు ఫోన్ చేసారు బయలు దేరారా అని . ఎక్కడ సార్ మేడం అసలు కదలటం లేదు అని నామీద ఆయనకు కంప్లైంట్ చేసాడు మురళి . అతని బాధ అతనిది , అతని పెళ్ళికి ముహూర్తాలు పెట్టు కోవటానికి మరునాడు పిల్లా వాళ్ళూ వస్తున్నారని కబురందింది మరి .
నందిగామ లో , మా చిన్న మామయ్య ఇంట్లో , ఇంకాసిని గుంటూరు , విజయవాడ స్మృతులను తలుచుకొని , హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమైనాము నేనూ , జయా, మురళి . ఈ ప్రయాణము లో విజయవాడలో తిరుగుతునంతసేపూ , జస్వంత్ ను , నువ్వు చాలా ముద్దుగా వున్నావురా , నిన్ను నేను తీసుకెళుతానురా అని జయ వాడిని తెగ ఏడిపించేసింది . పాపం పసివాడు , వాడూ నిజం గానే జయత్త వాడిని తీసుకెళుతుందని భయపడ్డాడు . ఇంతకీ అనుకున్న హంసలదీవి , బందరు పాండురంగడుని చూడనే లేదు . మమ్మలిని ఆదరించి , ఎంతో ఆప్యాయము గా గౌరవం గా చూసుకున్న ఆదరించిన , మా మరిది గారు శంకర్ , ఈ మద్యనే , ఆయన 50 వ ఏట , అకస్మికంగా , గుండె పోటుతో మరణించటము మరువలేని విషాదము .
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
ఎంతో ఆసక్తిగా చదివాను.
అదేంటండీ చివర్లో మరీ అలాంటి ట్విస్టు ఇచ్చారు. అఫ్కోర్సు, దేవుడే అలాంటి ట్విస్టు పెడితే మీరేం చేస్తారు లేండి!
శంకర్ గారి కుటుంబం ధైర్యంగా జీవితం కొనసాగిస్తున్నారని ఆశిస్తాను.
కొత్తపాళి గారు ,
మీకు నా పోస్ట్ ఆసక్తి కలిగించినందుకు సంతోషమండి .
నిజమేనండి , లేక పోతే 45 సంవత్సరాలకే కొడుకు మీద ఆధారపడటము స్చప్ . . . కొన్ని సార్లు ఆ భగవంతుడు పెట్టే ట్విస్ట్ లను అలా చూస్తూ వుండటము తప్ప ఏమి చేయగలము ?
హమ్మా! వెన్నపూస పెడితే తినకుండా మారాం చేసేవాళ్ళా.....ఐతే మీరు, నేను వేరే వేరే పార్టీస్ :-).......నేనైతే అమ్మమ్మ మజ్జిగ తిప్పుతుంటే వెళ్ళి పక్కన చక్కగా బాషీపెట్టు పెట్టుక్కూర్చుని వెన్నముద్దలు గుటుక్కు,గుటుక్కుమని మింగేవాణ్ణి.....హ్మ్..అప్ఫట్లో మాకు బోల్డు గేదెలు....ఇంకా బోల్డుమంది పాలేర్లూ....వాళ్ళందరికీ మజ్జిక్కావాలిగా మరి! మా ఇంట్లో పాలు కేంద్రాలకి పోసేవాళ్ళు కాదు....పాలు,పెరుగు,నెయ్యి అమ్మకూడదని అమ్మమ్మ నమ్మకం.(మన కృష్ణయ్య చెప్పింది కూడా అదేగా!)......మాకు తింటానికి పెద్దగేదె పెరుగు(మీగడతో సహా)ఉంచి,మిగతా గేదెల పెరుగంతా పెద్ద ఇత్తడి గంగాళానికి పోసి మజ్జిగ తిప్పేది అమ్మమ్మ.....పెద్ద చెక్కకవ్వం ఆ గంగాళంలో పెట్టి తిప్పుతుంటే భలే గమ్మత్తుగా ఉండేది చూడ్డానికి....అసలది చూట్టానికే పిల్లలందరం చుట్టూ చేరేవాళ్ళం.....ఆ కవ్వం సెట్టింగు కూడా భలే ఉండేది...రెండు పెద్ద పెద్ద ఇనుపవి "నాగవాసాలు" ఒకదాని కింద ఒకటి బిగించి ఉండేవి..వాటికి పెద్దపెద్ద తాళ్ళు...వాటిల్లో ఈ కవ్వం పెట్టేది..కవ్వానికి చుట్టూ మధ్యలో ’చిక్కం’ పోసి(స్పైరల్ గా),ఆ చిక్కం రెండు కొనలూ పట్టుకుని అమ్మమ్మ తిప్పుతుంటే, భలే గమ్మత్తుగా తిరిగేది....(నాకు ఇప్పుడు అనిపిస్తుంది...ఎంత గొప్ప ఫిజిక్సు నాలెడ్జ్ కదా అని.)....అలా తిప్పుతుంటే కవ్వం లయబధ్ధంగా తిరిగేది....అది పెరుగులో తిరిగే చప్పుడు కూడా భలే ఉండేది...దానికి తోడు అమ్మమ్మ రాగయుక్తంగా పాటందుకునేది.."చల్లాదిప్పు గొల్లభామ...నడ్డిదిప్పు ముసలి భామ" అని...ఈ పాట అమ్మమ్మ పై కాలంలో పాడుతుంటే మేం పడీ పడీ నవ్వేవాళ్ళం..(యాక్షనుతో సహా చేసేది లెండి, మమ్మల్ని నవ్వించటానికి)......కొద్దిగయ్యాక వెన్న పైకి భలే గమ్మత్తుగా తేలేది, మేం కళ్ళింతలు చేసుకు చూసేవాళ్ళం........మొదట ఇంత గుండులా వెన్నతీసి నాకే పెట్టేది...అబ్బ! తెల్లగా,చల్లగా వెన్న చూస్తుంటే ఎంత బాగా అనిపించేదో!......మరి మా ఇంట్లో మా అన్నయ్యేమో బలరాముడు, నేనేమో కృష్ణుడు కదా!(వర్ణభేదం లెండి)....అందుకని నాకు రెండో చేతిలో కూడా పెట్టేది....ఈ చేతిలో పెట్టే లోపు ఆ చేతిలోది గుటుక్కున మింగేశేవాణ్ణి....మురిపెంగా డిప్పమీద ఒకటిచ్చి, మళ్ళా ఆ చేతిలో కూడా పెట్టేది....తింటూ,గంతులేసుకుంటూ వెళ్ళేవాళ్ళం......హ్మ్! ఇప్పుడు! ఆ గేదెలూ లేవు,వెన్నముద్దలూ లేవు.......కనీసం గోగాకు పచ్చడిలో వేసుకుతినటానికి రుచిక్కూడా మంచి,తాజా వెన్న దొరకట్లా!....ఏంటో!......అయ్యో! చాలా రాసేసినట్టున్నానే! నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసినందుకు చాలా ధన్యవాదాలు.....
ఇంకో విషయమండీ! ముందు కామెంటులో మీరన్నట్టు నేనేమంత పెద్ద సాహితీవేత్తనేం కాదండీ! ఏదో గురువుగారివల్ల, నాన్నగారిదగ్గర నేర్చుకున్న నాలుగు మంచి మాటలు అందరితో పంచుకుంటున్నానంతే.....సంప్రదాయాల్నీ,సాహిత్యాన్నీ మర్చిపోతున్న ఈ తరం వాళ్ళందరికీ ఆ నాలుగు మంచి మాటలు తెలియజెప్పాలనే నా తాపత్రయం...నా భాగవత గమనం....
Post a Comment