చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Friday, August 13, 2010

సికింద్రాబాద్




హైదరాబాద్ లో నవాబుల సంస్కృతి ఎక్కువగా వుంటే , సికందరాబాద్ బ్రిటిష్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుంది . బ్రిటిష్ వాళ్ళు తమ స్తావరం కోసం , కంటోన్మెంట్ ఏరియా నిర్మించారు . అక్కడ చాలావరకు వారు నిర్మించిన భవంతులే వున్నాయి . ఒకొప్పుడు , సికిందరాబాద్ లో మిలిటరీ ఆఫీసులూ , వాళ్ళ కాలినీసే ఎక్కువగా వుండేవి . మావారు పని చేసిన ఈ .యం . ఈ వారివి , కాలేజ్ , సెంటర్ , స్టేషన్ వర్క్ షాప్ ఇక్కడే వున్నాయి . కాబట్టి ఈ .యం . ఈ లో పని చేసినవారు ,దాదాపు అందరూ ఏదో ఒక పోస్టింగ్ కో , ట్రైనింగ్ కో ఇక్కడి కి వస్తారు . ఒకసారి ఇక్కడకు వచ్చిన వారు , ఇక్కడి వాతావరణము , స్తలము అన్నీ నచ్చి , చాలామంది రిటైర్మెంట్ తరువాత ఇక్కడే స్తిరపడటము కూడా సాధారణము . అలా ఆర్మీ ఆఫీసర్స్ కోసం ఏర్పడ్డవే , సైనిక్ పురి , వాయుపురి , గన్ రాక్ , ఆర్మీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కాలనీ మొదలైన కాలనీలు .

మావారు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో డిస్కంటిన్యూ చేసి చైనా వార్ లో షార్ట్ సర్వీస్ ఆఫీసర్ గా చేరారు . ఐదు సంవత్సరాల తరువాత పర్మినెంట్ ఆఫీసర్ అయ్యాక , 1 1/2 ఇయర్ పూనా లో , 1 1/2 ఇయర్ సికిందరాబాద్ యం . సి యం ఇ కాలేజ్ లో ఏ యమై కోర్స్ చేసారు . అప్పుడు మేము మొదటిసారిగా సికింద్రాబాద్ లో అడుగు పెట్టాము . అప్పుడే మా అమ్మాయి పుట్టటమూ , నేను కాలేజీ లో బి .యే సెకండ్ ఇయర్ లో చేరటము తో , మేము బర్కత్ పురా లో , మా అత్తవారింట్లోనే వుండే వాళ్ళము . మా వారు మటుకు పొద్దున్నే 5 గంటలకు సికింద్రాబాద్ వచ్చి , రాత్రి 10 గంటలకు ఇల్లు చేరే వారు . మా అమ్మాయి పుట్టినప్పుడు , ఒక పార్టీ లో అందరినీ అమ్మాయిల పేరు లు ఏమైనా చెప్పమని అడిగారుట . అప్పుడు మిసెస్ . ధర్మాధికారి చెప్పిన పేరు ' సంజ్యోత్ ' మా వారికి నచ్చేసి అదే పెట్టారు . మా సంజు మొదటి పుట్టిన రోజున , బంగ్లాదేశ్ వార్ మూలము గా ఎమర్జెన్సీ వుండింది . 24 గంటలూ యూనిఫాం లో వుండాల్సి వచ్చేది . అందుకని అందరూ పాపం పార్టీ కి యూనీఫాం లోనే వచ్చారు !

ఆ తరువాత ఇంకోసారి సిలిగురి నుండి షార్ట్ కోర్స్ మీద వచ్చాము . అప్పుడు మావారు వాలీబాల్ ఆడుతుండగా కాలు మెలికపడి మోకాలు దగ్గర దెబ్బ తగిలింది . కోర్స్ వద్దు ఏం వద్దు అని , కాలికి పట్టీ కట్టి మిలిటరీ హాస్పెటల్ లో ఓనెల రోజులుంచి , సిలిగురి వాపసు పంపించేసారు . పాపం కదా ! ఎంత దిగులుగా కూర్చున్నారో చూడండి . హాస్పిటల్ లో వున్నప్పుడు మద్య లో ఓరోజు ఇంటి కొచ్చారులెండి . అప్పుడు తీసాను ఈ ఫొటో . ఇది బ్లాగ్ లో పెట్టానని తెలుస్తే చంపేస్తారు నన్ను . ఎవ్వరూ చెప్పకండి ప్లీజ్ .

ఇహ ముచ్చటగా మూడోసారి సికింద్రాబాద్ వచ్చిన విధమెట్టిదనగా ;;;; ఓ చీకటి రాత్రి , సిలిగురి లో పిల్లలిద్దరికీ జ్వరాలు రావటము తో , నేను పార్టీ కెళ్ళ కుండా ఇంట్లోనే వుండి పోయాను . పార్టీ తరువాత జనరల్ కుమార్ మావారి తో పాటు మాయింటి కి వచ్చారు . ఎర్ర గులాబీ పూల బుకే పెద్దది ,డిల్లీ స్పెషల్ మిఠాయి పాకెట్ తెసుకొని మరీ వచ్చాడాయన . వస్తే ఏముంది , పెద్ద సోఫాలో పిల్లలిద్దరి నీ పెట్టుకొని శోక దేవతలా కూర్చొని వున్నాను . పాపం ఆయన మనసు కరిగి పోయింది . మాలా మీ పోస్టింగ్ డ్యూ కదా సింకిద్రాబాద్ చేయించమంటవా అని అడిగారు . ఒక్క సారే గుండెల్లో రాయి పడింది . ఇప్పుడే సికింద్రాబాద్ నుండి వచ్చాము , మళ్ళినా ?? ఎంచక్కా ఏదైనా కొత్త వూరైతే చూడొచ్చుకదా అనుకుంటూ మావారి వైపు చూసాను . ఆయనేదో సైగ చేస్తున్నారు . హుం ఈయనకు సికింద్రబాద్ వెళ్ళాలని వుందేమో ఖర్మ , ఇప్పుడు నేను వద్దంటే ఆ తరువాత బుర్ర వాచేంత క్లాస్ పీకుతారు అనుకొని , మనసులో ఏడ్చుకుంటూ పైకి సరే అన్నాను . ఇదేమిటి ఈయనగారు నన్ను గుర్రున చూస్తున్నారు ? అనుకునంతా ఐయింది , అటు జనరల్ కుమార్ వెళ్ళటము , ఇటు నాకు క్లాస్ మొదలు కావటము . వద్దని చెప్పమని సైగ చేస్తే సికింద్రాబాద్ కావాలని అడుగుతావా ? ఇప్పుడేగా అక్కడినుండి వచ్చాము , ఆ మాత్రం పిల్లలను పెంచలేవా ? ఇంకో పదేళ్ళ తరువాత రిటర్మెంట్ తీసుకుందామనుకుంటున్నామా , అప్పుడు లాస్ట్ పోస్టింగ్ హోం స్టేషన్ అవుతే బాగుంటుందని నేను ప్లాన్ చేస్తుంటే అంతా చెడ గొట్టావు ఢాం ఢూమ్మ్ . . . . .
వా ((( . . . సరిగ్గ సైగ చేయొచ్చుకదండీ అని ఓ ఏడుపు .
నీ మొహం ఏదీ అర్ధమైచావదు . . .
వా ((( * * *
అలా జనరల్ కుమార్ గారి అభిమానం తగలెయ్య , గోడకు కొట్టిన బంతిలా సికింద్రాబాద్ వచ్చి పడ్డాము .

రాగానె క్వాటర్ దొరకలేదు . ఈ సారి మూడు సంవత్సరాలూ వుండాలి కనుక హైద్రాబాద్ లో వుండేందుకు వీలుకాదు . బొలారం లో సెంట్ . ఆన్స్ స్కూల్ లో సంజును చేర్చాము . అక్కడే మెస్ లో టెంపరరీ క్వాటర్ లో మూడు నెలలు వున్నాక సైనిక్ పురి లో ఇల్లు ఎలాటైంది . నెక్స్ట్ ఇయర్ స్కూల్ మొదలైనప్పుడు , సంజు పేరు క్లాస్ లిస్ట్ లో లేదని ఇంటి కి పంపించేసారు . సంజ్యొత్ అంటే అబ్బాయను కున్నారట పేరు తీసేసారట !హాయిగా పాటలు పాడుకుంటూ , డాన్స్ చేసుకుంటూ వచ్చేస్తుంటే , మా ఇంటి దగ్గరి షాప్ అతను చూసి , గుర్తుపట్టి ఇంటికి తీసుకొచాడు . ఇప్పటికీ తలుచుకుంటే , వాళ్ళు అలా ఎలా పంపేసారో అర్ధం కాదు . బొలారం నుండి సైనిక్ పురి కి పిల్ల క్షేమం గా చేరిందంటే ఆ భగవంతుడి దయే . ఆ దెబ్బకి పిల్లలిద్దరినీ ఇంటికి దగ్గరగా వున్న రామకృష్ణా విద్యాలయ లో చేర్పించాము . మా అబ్బాయి బిపు కు స్కూల్ కెళ్ళటము అస్సలిష్టం వుండేది కాదు . స్కూటర్ వెనుక కూర్చొని , నా వైపు చూస్తూ ఏడుస్తూ వెళ్ళేవాడు . వాడు వెళ్ళి పోయాడుకాని , మీరిక ఏడుపాపి , ఇంట్లోకెళ్ళండి అని ఎదురింటి మిసెస్ .శ్రీరాములు అన్నపుడు చూసుకుంటే నా కళ్ళూ నీళ్ళతో నిండి బుగ్గల మీద నీళ్ళు ధారగా కారుతుండేవి పాపం ! ఎందుకొచ్చిన చదువులురా బాబూ అనిపించేది హుం .

మావారేమో పొద్దున్నే ఐదింటి కి డ్రిల్లు , ఎనిమిది నుండి వంటి గంట వరకు ఆఫీస్ , నాలుగు నుండి గేంస్ వగైరా తో బిజీ గా వుంటే నేనేమో పిల్లలూ , మాజాంగ్ , కార్డ్స్ , లేడీస్ క్లబ్ , వెల్ఫేర్ సెంటర్ , ఓపెన్ ఏయిర్ తియేటర్ ల లో వారాని కి రెండు సినిమాలూ , ఎంత బిజీ గా వుండేద్దాన్నంటే ఓ డైరీ లో రోజు వారీ ప్రోగ్రాములు రాసుకోవలసి వచ్చేది . నిజం .సచ్చీ . పెద్ద సెంటర్ కావటము వలన జవాన్ల భార్యలు చాలా మంది వుండేవారు . వాళ్ళ కోసం వారాని కోసారి వెల్ఫేర్ సెంటర్ నిర్వహించే వాళ్ళము . ఎక్కువగా పంజాబీ వాళ్ళు వుండేవాళ్ళు . స్వెట్టర్ లు అల్లటము , ఎంబ్రాయిడరీ చేయటము , ఫ్రాక్స్ , డ్రెస్ లు కుట్టటము చేసేవారు . వాళ్ళు చేసినవవి , దివాలీ మేలా లో అమ్మి , ఆ మనీని వాళ్ళకు కొంత , ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కు కొంత ఇచ్చేవాళ్ళము . పర్సనల్ గా ఎవరికైనా కావాలన్నా కుట్టించి ఇచ్చేవాళ్ళము . ఆ రకముగా వాళ్ళకూ కొంత ఆదాయము సమకూరేది . ఎక్కువగా వెల్ఫేర్ సెంటర్ లో జరిగే ఆక్టివిటీస్ అన్ని నేనే ఆర్గనైజ్ చేసేదానిని . మాలా దీదీ అంటూ జవానుల భార్యలంతా , నాతో చాలా చనువు గా వుండేవారు . అందుకే మాఫ్రెండ్స్ నన్ను ముద్దుగా యం .సి ( మాస్టర్ ఆఫ్ సెర్మొనీ ) అని పిలిచేవారు . అదేమిటో , ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ కూడా ఈవెంట్ మానేజర్ ను చేసేసారు . ఆగస్ట్ పదిహేను న , జనవరి ఇరవైఆరున , ఆర్మీ డే రోజున ఇలా అప్పుడప్పుడు ఆఫీసర్స్ , జావాన్ల కుటుంబాల తో కలిసి బరాఖానా వుండేది . మా మెస్ పార్టీలు సరేసరి . న్యూ ఇయర్ నాడు , రాత్రి పది నుండి వుదయము 5 వరకు , సికింద్రాబాద్ క్లబ్ లో డాన్స్ చేసీ చేసీ , అలసి పోయి , అక్కడే బ్రేక్ ఫాస్ట్ కూడా తినేసి ఇళ్ళకు చేరేవాళ్ళము .

సైనిక్ పురి , అమ్ముగుడ తెగ తిరిగేవాళ్ళము . క్వాటర్ గార్డ్ ముందునుండి వెళుతుంటే సావధాన్ అని విని పించేది . ఓరినీ , వీడి దుంపతెగ , ప్రతిరోజు ఇటు నుండి వెళ్ళే వాళ్ళమే కదా సావధాన్ అని అరుస్తాడు . ఎప్పుడో ఓసారి మనల్ని క్వాటర్ గార్డ్ లో వేసేయరు కదా అని , నేనూ , మా ఫ్రెండ్ దేవి తెగ భయపడేవాళ్ళము . తరువాత తెలిసింది , రోజూ వాళ్ళకు అది లంచ్ టైం అని అందుకే ఆ గార్డ్ అందరినీ అలా ఎలర్ట్ చేస్తున్నాడనీనూ .

ఒక సంవత్సరము మా యూనిట్ ఆర్మీ స్కూల్ , మావారి ఆధీనములో వుండింది . ఆప్పుడు ఆగస్ట్ పదిహేనున ఆ స్కూల్ లో నన్ను జండా ఎగురవేసేందుకు ఆహ్వానించారు . చిన్న స్కూల్ , ఇరవై మందే పిల్లలు . ఐతేనేమి , ఓ జే. సి . వో వెంట వెళ్ళి జండా ఎగురవేసి , పిల్లలకు చాక్లెట్స్ పంచి రావటము నేనైతే గొప్పగానే ఫీల్ అయ్యాను . అప్పుడే మావారు పెరేడ్ గ్రౌండ్ లో పెరేడ్ ను కమాండ్ చేసారు . ఆ ఫొటోలు అవే.

అనుకున్నాము కాని మూడు సంవత్సరాలు చిటికెలో ఐపోయాయి . చంటి పిల్ల ల తో వచ్చి బడికి వెళ్ళే పిల్లలతో జబల్ పూర్ వెళ్ళాము . మేము జబల్ పూర్ వెళ్ళేముందు , యు .యస్ నుండి , మా మరిది ఫ్రెండ్ డాక్టర్ .నాథ్ వచ్చారు . మేము బయిలుదేరుతుండగా మా నలుగురి కలర్ ఫొటో తీసాడు . అదే మా మొదటి కలర్ ఫొటో !

ఆ చివరి ఫొటో మావారు వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకొని సికంద్రాబాద్ వచ్చినప్పటి రిటైర్మెంట్ ఫొటో అన్నమాట .

అందరికీ ముందుగా స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు .

కృష్ణ సినిమాలలో నాకు నచ్చిన సినిమా పాట ఇది .



3 comments:

అశోక్ పాపాయి said...

సికింద్రాబాద్ & హైదరాబాదు ల మధ్య మీకు వీడని బందం వుందన్నమాట అవున మీరు స్కూల్ లో జెండా ఎగురవేశరా చాల అదృష్టవంతులండి.ఆ లక్కి అందరికి రాదులేండి.మీకు అడ్వన్స్ గా happy Independence Day maala gaaru

కౌటిల్య said...

మీ బ్లాకండ్ వైట్ ఫొటొలు భలే ఉన్నాయండీ!నాకు చాలా ఇష్టం అలా ఉండే ఫొటోలంటే....మా అమ్మవాళ్ళ పెళ్ళిఫొటోలు తీసి చూసుకుని తెగ మురిసిపోతుంటా!అమ్మంటూ ఉంటుంది.."అవేమన్నా గొప్పఫొటొలా చిన్నీ! మాటిమాటికీ చూస్తుంటావ్!" అని.

జెండా ఎగరేశారన్నమాట!చాలా గొప్ప చాన్స్ లెండి అది! నేను కూడా మొదట మా కాలేజ్ లో ఎగరేశాను.అదెలా అనుకుంటున్నారా!మా కాలేజ్ కి ఓ గొప్ప ట్రెడిషన్ ఉంది...మెరిట్ స్టూడెంట్ తొ చేయిస్తారు..ప్రతిసారి...కాలేజ్ లో ఉన్నన్నాళ్ళు నాదే ఛాన్స్...వళ్ళు పులకరించేది....

lakshmi raaghava said...

మీ బ్లాగు లను చూసి చాలా ఆనందపడ్డానండి. technical గా చాలా ముందున్నారు మీరు.. నేను మీవి చూసి నేర్చుకొవాలి..నాకథ ను మెచ్చు కుంటూ రాసినది చదివి నా బ్లాగుకూడా..కొందరైనా చదువుతున్నరనిసంతోషించాను thank u