చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Monday, November 29, 2010

ఔరంగాబాద్ - ఎల్లోరా



మావారు పని వుంది నేను రాలేను , నువ్వే వెళ్ళి చూసిరా అన్నారు . ముందు ఒక్క దాన్నే తెలియని ప్లేస్ లో వెళ్ళేందుకు సంశయించాను . కాని ధైర్యే సాహసే లక్ష్మీ అనుకొని డ్రైవర్ బంటి గైడెన్స్ లో ఔరంగాబాద్ చూసేందుకు బయిలుదేరాను . ఔరంగాబాద్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ . కట్టడాలు అవి ఎక్కువగా నవాబుల కల్చర్లోనే వున్నాయి . ఇక్కడ ముఖ్యం గా చూడవలసినవి , ' పంచక్కి ' , ' బీబీ - కా - మక్బారా ' , ' ఔరంగాబాద్ కేవ్స్ ' . ' పంచక్కి ' , ' ఔరంగాబాద్ గుహలు ' చూడలేకపోయాను .
1679 లో , ఔరంగజీబ్ తన భార్య ' రబియా - ఉద్ - దుర్రానీ ' జ్ఞాపకార్ధము కట్టించిన , ఆమె సమాధి . దీని ని తన తండ్రి షాజహాన్ , ఆగ్రా లో కట్టించిన ' తాజ్ మహల్ ' నమూనా లో కట్టించాడు . కాని అంత బాగా ఐతే లేదు :) తాజ్ మహల్ తో పోల్చకుండా చూస్తే బాగానే వుంటుంది . లోపల హాల్ లో రబియా ఉద్ దుర్రాని సమాధి వుంటుంది . నాలుగు పక్కలా పాలరాతి మీద చెక్కిన శిల్పాలు వున్నాయి . పైన డోం కూడా చక్కని నగిషీ పనితో వుంది . (' రాజుల సొమ్ము రాళ్ళపాలు ' అని నానుడి . ఈ మొగలు చక్రవర్తుల పుణ్యమా అని సమాధుల పాలు అయ్యాయి .)
అందులోనే ఓ పక్క గా హైదరాబాద్ నవాబు , ' నమాజ్ ' చేసుకునేందుకు ఒక పెద్ద హాల్ కట్టించాడు .

పైన ఫొటో లో వున్నటువంటి దర్వాజా లు ఔరంగాబాద్ లో ఏడువున్నాయట.

ఆ కమాన్ దాటి ముందుకు వెళ్ళగానే , పెద్ద మజీద్ వుంది . ఆ రోజు రంజాన్ మూలము గా అక్కడ చాలా రష్ గా వుండింది .



మరునాడు ఎల్లోరా చూద్దామని వెళ్ళాము . ఎల్లోరా కు వెళ్ళే దారి లోనే ' దౌలతాబాద్ కోట ' వస్తుంది . అది ఎక్కాలంటే నడిచి వెళ్ళాలసిందే ! అంత ఎత్తు ఎక్క లేక కింద నుంచే చూసి తృప్తి చెందాము :) అక్కడ అమ్ము తున్న జామకాయలు బహు పసందుగా వున్నాయి . వానలు వచ్చి నప్పుడు , అప్పుడప్పుడు ఆ చుట్టు పక్కల దొరుకుతాయని , కొన్ని నాణాలు చూపించారు . అవి అమ్ముతారట కూడా .

కొంచము ముందుకు వెళ్ళి , వూరి లోపలికి వెళుతే ఔరంగజీబు సమాధి వుంది . భార్య సమాధి ఎంత ఆడంబరము గా కట్టించాడో , ఆయన సమాధి , ఆయన జీవన విధానములా అంత నిరాడంబరము గా వుంది !



ఎల్లోరా గుహలు అనగానే , గుహల లోపలి కి వెళ్ళాలేమో నని ముందు భయపడ్డాను :) బంటి ని , పక్కవాళ్ళను అడిగి , గుహలు అంటే అంతర్ భాగం ఏమీ కాదని , చాలా వరకు ఓపెన్ ప్లేసే నని నిర్ధారించుకొని ముందడుగు వేసాను . ఐనా అక్కడి కివెళ్ళేవరకు , గుండెలు పీచు పీచు మంటూనే వున్నాయి . మరి అంత భయపడుతూ వెళ్ళటమెందుకయ్యా అంటే , ఇంత దూరం వచ్చి చూడకుండా వెళ్ళేందుకు మనసు ఒప్పదు . పైగా చూడకుండా వచ్చాను అంటే అందరూ నవ్వరూ ?

ఎల్లోరా గుహలు 500 - 700 ఏ .డి లలో నిర్మించినవి . మొత్తం 34 గుహలు వున్నాయి . అందులో 1 నుండి , 12 వరకు బౌద్ద మతమునకు , ఆ తరువాతి 16 హిందూ మతమునకు , 30 నుంచి 34 వరకు జైన మతమునకు సంబంధించినవి . అవి వారి వారి నమ్మకము ప్రకారము నిర్మించుకున్నారు . అన్ని గుహలూ ఒకే రోజు చూడాలంటే నాలాంటి ఓపికలేనివారికి కష్టమే ! కారు ఆగగానే ముందుగా 16 వ నంబర్ గుహ కనిపించింది . అది కైలాసము లా గా నిర్మించారు . హిందూ మతమునకు సంబంధించిన వాటిలో అన్నీ శివ పార్వతుల వే వున్నాయి . బుధ్ధుని ప్రతిమ వున్న గుహలో ఓ భౌద్ధ సన్యాసి ధ్యానము లో కనిపించాడు . అన్ని గుహలూ చూడలేము అంటే , అక్కడి గైడ్ , 5 , 10 , 15 , 16 , 21, 29 , 32 చూడమని సలహా ఇచ్చాడు . అంతవరకే చూడగలిగాము . కొండలను తొలిచి , అంత పెద్ద పెద్ద రాళ్ళను , అద్భుతమైన శిల్పాలుగా మలిచారు అంటే , చూసి తీరాల్సిందేకాని వర్ణింప నా తరమా ?



ఔరంగాబాద్ లో నాకు భోజనాని కి ఇబ్బంది కాలేదు . మేము వున్న ' లాడ్ లీ ' హోటల్ లో శాఖాహారము , అదీను వెల్లులిపాయ , మసాల లేకుండా శుభ్రము గా , రుచి గా వున్నది . అది నాకు చాలా విచిత్రము గా , సంతోషం గా అనిపించింది . హోటల్ రూం కూడా శుభ్రం గా వుంది . ధర కూడా ఎక్కువ లేదు . అందుకే వారము రోజులు హాయిగా వుండగలిగాను . వంట పని లేదు . చక్కగా బాలకనీ లో కూర్చొని నవల చదువుకుంటూ, ఆకలేసినప్పుడు బెల్ కొట్టి ఏదో వకటి తెప్పించుకొని తింటూ అహా ఏమి నా భాగ్యమూ అనుకుంటూ హాపిగా వారం గడిపేసాను . ఎంత హాపీ ఐనా ఇంటి కి తిరిగి రాక తప్పదుకదా :)

3 comments:

Srujana Ramanujan said...

Nice :)

అశోక్ పాపాయి said...

బాగున్నాయండి మీ కబుర్లు.

మాలా కుమార్ said...

srujana ,

ashok paapaayi ,

thank you.