చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Saturday, April 2, 2011

ఆలంపూర్



ఉదయము 7.30 కల్లా హైదరాబాద్ దాటాము , నేనూ , మా అమ్మా , లక్ష్మిగారు . షాద్నగర్ దాటాక టిఫినీలు కానిచ్చాము . 9.30 కల్లా బీచుపల్లి చేరుకున్నాము . కృష్ణ వడ్డున వున్న ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళాము . దేవాలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఏమీ లేదుట . చాలా పెద్ద విగ్రహము . స్వామివారు కళకళ లాడిపోతున్నారు .చాలా మహిమ గల స్వామి అట . హనుమాన్ చాలీసా చదువుకొని , కాసేపు గుడి లో కూర్చొని మా ప్రయాణము తిరిగి మొదలుపెట్టాము .

దారిలో అక్కడక్కడ నీళ్ళ తో , ఎండిపోయిన కృష్ణ ను చూస్తే , ఇంకా ఎండాకాలము పూర్తిగా మొదలే అవలేదు , అప్పుడే కృష్ణమ్మ ఇలా ఐపోయిందే అని చాలా బాధ పడ్డాము .




అక్కడి నుంచి 11.30 వరకు ఆలంపూర్ చేరాము . మేము వెళ్ళేసరికి పూట చివరి కుంకుమార్చన కు టికెట్స్ ఇస్తున్నారు . మేము టికెట్స్ తీసుకొని ఆలయము లోకి వెళ్ళాము . అమ్మవారి దర్శనము , కుంకుమార్చనా బాగా జరిగాయి . అందరూ వెళ్ళి తరువాత అక్కడి పూజారి మా కోరికపై అమ్మ వారి చరిత్ర చెపుతూ విగ్రహము చూపించారు .

ఆలంపూర్ లోని ' జోగుళాంబ ' అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవది . ప్రదేశము లో అమ్మవారి ముందు పళ్ళు పడ్డాయి . అందువలన అమ్మవారు నాలుక బయట పెట్టి చాలా ఉగ్రము గా వుంటారు . మేము పదిహేను సంవత్సరాల క్రితము వెళ్ళినప్పుడు అమ్మవారి , విగ్రహము , బాలబ్రహ్మేశ్వరుని ఆలయములో వుండేది . అప్పుడు , అమ్మవారిని నేరుగా చూడనివ్వలేదు . గోడకు వున్న కంత లో నుంచి చూసాము . ఇప్పుడు వున్న ఆలయము 1985 లో కొత్తగా కట్టారు . అక్కడ అమంవారి పాత విగ్రహము మును వుంచి , దాని ముందే కొత్తది , శాంతస్వరూపముతో స్తాపించారు . ఆలయము చుట్టూ నీటి కొలను వుంది . దాని వలన కూడా అమ్మవారు కొంత శాంతముగా వుంటారని చెప్పారు . అమ్మవారి జుట్టు మీద , బల్లి , తేలు , గబ్బిలము , మనిషి పుర్రె బొమ్మలు చిత్రించి వున్నాయి .

ఇక్కడ శక్తి పీఠమే కాకుండా , నవబ్రహ్మలు కూడా వున్నారు . బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా , ఈశ్వరుడు ఆవు గిట్ట రూపము లో వెలిశాడు . చాలా చిన్న లింగాకారము కావటము తో ' బాల బ్రహ్మేశ్వర స్వామి ' అంటారు . 5 రూపాయల టికెట్ తీసుకుంటే గర్భ గుడి లో కి వెళ్ళి లింగము ను తాకి ప్రార్ధించుకోవచ్చు .
అమ్మవారి ద్వారపాలకులైన ' చండి , ముండి ' విగ్రహాలు ఇక్కడే వున్నాయి . కొత్త ఆలయము నిర్మించక ముందు అమ్మవారి విగ్రహము ఇక్కడే వుండేది .


ఇక చరిత్ర విషయాని కి వస్తే , ఇది తుంగ భద్ర , కృష్ణ నదుల మద్య ప్రదేశము లో వున్నది . ఆలంపుర సీమ , దక్షిణకాశి , భాస్కర క్షేత్రము , పరుశురామ క్షేత్రము , శ్రీశైల పశ్చిమ ద్వారము అని కూడా అంటారు .
దక్కను ప్రాతాన్ని పరిపాలించిన బాదామీ చాళుక్యులు , రాష్ట్రకూటులు , కళ్యాణీ చాళుక్యులు , కాలచుర్యులు , కాకతీయులు , తెలుగు చోళులు , విజయనగర రాజులు మహా క్షెత్రాన్ని సేవించారు. ఇది 14, 15 శతాబ్ధములలో బహమనీ సుల్తానుల దాడి కి గురి ఐనది .

మహాద్వారము దగ్గర అలీ పహిల్వానుకు ఒక దర్గా వున్నది . దానిని ' ధడ్ ముబారక్ ' అంటారట .
ఇంతవరకు లభించిన ఆధారాల బట్టి శ్రీ శంకరుల శ్రీ చక్ర ప్రతిష్ఠ11 శతాబ్ధ శాసనము , 13 శతాబ్ధములోని రస రత్నాకర ఆనందకందముల వ్రాతల వల్ల జోగుళాంబ ప్రాచీనాలయాలు 7 శతాబ్ధము లో నిర్మించింట్లు గా తెలుస్తోంది .
క్షేత్ర దైవమైన శ్రీ బ్రహ్మేశ్వర స్వామి శ్రీశైలం పాజెక్టు మునకలో నిర్మూలము కాకుండా రక్షించుకున్నాడు అంటారు .

" మహాదేవీం , మహాకాళీం , మహాలక్ష్మీం , సరస్వతీం !
త్రిశక్తి రూపిణీం అంబాం , జోగుళాంబాం నమామ్యహం !!"


2 comments:

Ennela said...

bhale undandee gudi...nannu teesukellaruu!!

మాలా కుమార్ said...

ఎన్నెల గారు ,
మిమ్మలిని తప్పకుండా తీసుకెళుతామండి . మీరెప్పుడంటే అప్పుడు , నేనూ ,లక్ష్మిగారు రెడీ .