చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Sunday, April 10, 2011

నందివరం - యాగంటి



జోగుళాంబను , బాల బ్రహ్మేశ్వరస్వామి ని దర్శించుకున్న తరువాత , అక్కడే వున్న కరివెళ్ళవారి సత్రములో భోజనము చేసి , జోగుళాంబ దర్శనము బాగా జరిగింది అన్న సంతృప్తి తో నంద్యాలకు బయలు దేరాము . సాయంకాలానికి నంద్యాల చేరాము . బస్ స్టాప్ కు దగ్గర లో వున్న శశిహోటల్ లో రూం తీసుకొన్నాము . ఫ్రెషప్ అయ్యాక హోటల్ కు దగ్గరలోనే వున్న శివాలయము ను , సాయిబాబా మందిరము ను దర్శించుకున్నాము .



మరునాడు ఉదయమే యాగంటి బయిలుదేరాము . యాగంటికి వెళ్ళే దారి లో "నందివరం " దగ్గర ఆగాము . ఇక్కడ " చౌడేశ్వరీ దేవి " ఆలయము చాలా ప్రశిద్ది పొందినది. నందవరమును పూర్వము నందనచక్రవర్తి పాలించేవాడు . ఆయన దత్తాత్రేయును ఉపాసకుడు .దత్తాత్రేయుని గురించి తపస్సు చేసి స్వామివారిని మెప్పించి , ప్రతిరోజూ కాశీ క్షేత్రమునకు వెళ్ళి , గంగా స్నానం చేసి , విశాలాక్షి అమ్మవారిని సేవించేందుకు మంత్రపాదుకలను పొందాడు . వాటి వలన రోజూ తెల్లవారకముందే కాశీ కి వెళ్ళి అమ్మవారిని సేవించి వచ్చేవాడు . అదంతా తెలియని రాణి మీరు అంత వెకువననే ఎక్కడికి వెళుతున్నారు అని చక్రవర్తిని అడిగింది . అప్పుడు ఆయనకు విషయము చెప్పక తప్పలేదు . రాణి తను కూడా వస్తానని పట్టుపట్టటము తో రాణీ ని కూడా వెంట తీసుకొనివెళ్ళాడు . పవిత్ర గంగా స్నానం , అమ్మవారి దర్శనం అయిన తరువాత రాణి కి ఋతుక్రమము రావటమువలన , మంత్రపాదుకల శక్తి నశిస్తుంది .వారు రాజ్య వెళ్ళే మార్గము కోసమని అక్కడే ఉన్న కాశీ బ్రాహ్మణులను సహాయము చేయమి వేడుకున్నారు . బ్రాహ్మణులు మంత్ర శక్తి చే వారిని , వారి రాజ్యానికి చేరుస్తారు . అప్పుడు రాజు మీకేమి కావాలో కోరుకోమంటాడు . వారు సమయము వచ్చినప్పుడు అడుగుతామంటారు . కొంతకాలము తరువాత కాశీ లో కరువు వస్తుంది . అప్పుడు బ్రాహ్మణులు నందవరము వచ్చి సహాయము అడుగుతారు . రాజు వారెవరో తనకు తెలీదని , ఒకవేళ వారికి తను వాగ్ధానము చేసినట్లైతే , దానికి ఎవరితోనైనా సాక్ష్యము చెప్పించమంటాడు . బ్రాహ్మణులు విశాలాక్షి అమ్మవారిని సాక్ష్యము చెప్పేందుకు తీసుకొని వస్తారు . అప్పుడు రాజు ఆమె ను శరణు వేడి , అమ్మవారిని అక్కడకు పిలిపించటము కోసమే తను వాగ్ధానము మర్చినట్లు నటించానని , అమ్మవారిని అక్కడే వుండమని వేడుకుంటాడు . చక్రవర్తి కోరిక తో అక్కడ వెలిసిన అమ్మవారే చౌడేశ్వరీ దేవి .
ఆలయము వెనుక భాగము లో ఉళందర వృక్షము వుంది . వృక్షము అమ్మవారితో పాటు వచ్చిందట . అక్కడ కూడా భక్తులు పూజలు చేసి , ముడుపులు కట్టుతారు . ఆలయము ఒక పక్కగా అమ్మవారి పాదాలు వున్నాయి . చౌడేశ్వరదేవి కి మీసాలు వుండటము ఇక్కడి ప్రత్యేకత . చౌడేశ్వరీ అమ్మవారు మమ్మలిని తొందరగా వెళ్ళి పోనీయలేదు . గంట పైగానే అమ్మ వారి దగ్గర గర్భగుడి ముందు అమ్మవారిని కనులారా చూస్తూ కూర్చున్నాము .




అక్కడి నుంచి " యాగంటి " చేరుకునే సరికి గుడి మూసివేసే సమయము అయ్యింది . అందుకని అక్కడే వున్న అన్నదాన సత్రము లో భోజనము చేసి 2 గంటలకు గుడి తలుపులు తీసేవరకు విశ్రాంతి తీసుకున్నాము . చుట్టూ కొండలు పెద్ద పెద్ద చెట్లతో అక్కడి ప్రదేశము చాలా బాగుంది . అగస్త్య మహాముని తన దక్షిణ దేశ యాత్రలో ప్రదేశములో కొన్ని రోజులు తపస్సు చేసారట . అప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టించతలిచి విగ్రహము తయారు చేయించారట . మరునాడు విగ్రహ ప్రతిష్ఠ అనగా విగ్రహము పాదమునకు బొటన వేలు లేదని గమనించారట . ఎలాగా అనుకుంటు వుండగా మహేశ్వరుడు అగస్త్యునికి కనిపించి , ఇది నాకు ఇష్టమైన ప్రదేశము , కాబట్టి ఇక్కడ నన్ను ప్రతిష్ఠించమని చెప్పాడట . అప్పుడు అగస్త్యుడు పార్వతి తో సహా వెలుస్తేనే ప్రతిష్ఠిస్తానని అంగా , ఉమాదేవి తో సహా ఈశ్వరుడు ఇక్కడ వెలిసాడు . ఇక్కడి శివలింగము మీద ఉమా మహేశ్వరుల వదనాలు వుంటాయి .అలా ఇంకే శివలింగము మీద వుండదు .

ఇక్కడి నంది విగ్రహము పెరుగుతూ వుండటము ఇక్కడి ప్రత్యేకత .80/90 సంవత్సరాల క్రితము నంది చుట్టూ ప్రదక్షణలు చేసేందుకు వీలుగా వుండేదిట . ఇప్పుడు నాలుగు స్తంబాలకు ఆనుకొని ప్రదక్షణకు వీలుగాలేదు . కలియుగాంతమునకు నందీశ్వరుడు లేచి రంకె వేస్తాడని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానము లో చెప్పారట . విగ్రహమును ఎక్కడో చేసి తెచ్చినట్లుగా లేదు . ఇక్కడే వెలిసినట్లు చిన్న పర్వతాకారములో వుంది .

ఇక్కడ మూడు గుహలు ఉన్నాయి . ఒకటి అగస్త్యమహాముని తపస్సు చేసింది . ఇంకొకటి వెంకటేశ్వర స్వామిని వుంచింది .మూడవ దానిలో వీరబ్రహ్మేంద్రస్వామి కొంతకాలము కాలజ్ఞానము రాసారంటారు .
ఇక్కడి కొలను లోని నీరు చాలా స్వచ్చం గా వుంటుంది . గుడి కి పైకి వెళ్ళేందుకు 60+ మెట్లు ఎక్కాలి ! అంతే కాదు ఇక్కడ తినేందుకు అరటిపళ్ళు కూడా కనిపించలేదు ! మంచినీళ్ళ బాటిల్స్ దగ్గర నుంచీ అన్నీ తీసుకొని వెళ్ళాలి . భోజన మంటే అక్కడి సత్రములోనే వుంది . మెట్లు ఎక్కాలి . ఇవన్ని చూసుకొని వెళితే చాల సుందరమైన ప్రదేశము "యాగంటి ".

1 comment:

కమల్ said...

చాలా మంచి ప్రదేశం యాగంటి.. మంచి వ్యాసం అందించారు..! మీకు వీలుంటే నా బ్లాగ్‌లో ఉన్న " యాగంటి " క్షేత్రం మీద నేను వ్రాసిన వ్యాసం చూడగలరు.

http://mahavarnam.blogspot.com/2010/11/blog-post.html