చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Wednesday, November 29, 2017

రింజిం రింజిం హైదరబాద్!



మహ్మద్ కులీ కుతుబ్ షా తన ముద్దుల ప్రేయసి భార్య ఐన భాగమతి కోసము కట్టిన ఊరు ఈ భాగ్యనగరము.
అందరు ఒక హిందు స్త్రీ పేరు పెడతావా అని గుస్సా చూపించారు . ఆయన ఏమైన తక్కువ తిన్నాడా! వెంటనే భాగమతిని హైదర్ మహల్ గా మార్చి , భాగ్యనగర్ ని హైదరాబాద్ గా మార్చేసారు.
అది మన హైదరాబాద్ ప్రేమకథ.
దీనిమీద యం . యల్.  ఏ సినిమా లో
ఇదేనండి ఇదేనండి భాగ్య నగరం మూడుకోట్ల ఆంద్రులకు ముఖ్యపట్టణం, ” (కాకపోతే ఇప్పుడు నాలుగు కోట్ల ప్రజలున్న తెలంగాణా)
అని ఘంటసాలా,  జానకి పాడిన పాట వుంది. దానికోసము ఎంత వెతికినా దొరకలేదు. బహుశా అన్ని పాత పాటలు నెట్ లొ లేనట్టున్నాయి.
నా చిన్నప్పుడు ఎప్పుడో గుర్తులేదు చాలా చాలా చిన్నతనంలో హైదరాబాద్ అమ్మ,  నాన్నగారి తో కలిసి వచ్చాను.  అప్పుడు తాజ్ నారాయణగూడా లో మసాలా దోస తిన్నాము . పక్కనే ఉన్న దీపక్ లో మాంగళ్యబలం సినిమా చూసాము.  వైయంసియే నారాయణగూడా ఎదురుగా ఉన్న ఎవరింట్లోనో ఉన్నాము. అది నాన్నగారి మేనత్త ఇల్లు అని అమ్మ చెప్పింది ఇప్పుడు. అలా లీలగా గుర్తున్న బాల్య స్మృతి హైదరాబాద్ !
ఆ తరువాత పంతొమ్మిది వందలా అరవై ఎనిమిది డిసెంబర్ లో మేళతాళాలు,  మిలటరి బ్యాండ్ తో , వేయిమందికి పైగా అతిధుల ఆశీర్వాదము తో, అబిడ్స్ తాజ్ వారి ఆతిధ్యం తో కన్న వారి వీడ్కోలు మధ్య పూల పల్లకిలా అలకరించిన పొడవాటి ఓపెన్ టాప్ కారులో ఊరెగింపుగా హైదరాబాద్ లో మెట్టినింట గృహ ప్రవేశము చేసాను.
ఉదయము లేచి బాల్కని లోకి వెళ్ళగానే పలచటి మంచు లోనుంచి వస్తున్న సుర్యకిరణా లను చూస్తుంటే తెల్లటి , పలచటి మేలిముసుగు కప్పుకొని , ముసుగులోనుండి తొంగి చూస్తున్న కొత్తపెళ్ళికూతురులా వుంది ప్రకృతి.  మది పులకించి పోయింది.  నీకు ఇంకా ఇలాటి అనుభూతులు చాలానే వుంటాయిలే అని సూర్య కిరణాలు స్వాగతము చెప్పిన భావన కలిగింది.

నులి వెచ్చటి లేలేత ఎండలొ వెస్పా మీద గండిపేట విహారాలు, కాలాపహాడ్, చార్మినార్ మీదినుంచి నగర దర్శనము, చల్లటి వతావరణము లో టాంక్ బండ్ మీదనుంచి వచ్చె చల్లని గాలులను ఆస్వాదిస్తూ ఐస్ క్రీం,  వేడి వేడీ పల్లీలను తినటము ,  గొపి హొటల్ లో ఇడ్లి ,  కామత్ లో మసాల దోశ పబ్లిక్ గార్డెన్ లో తటాకము పక్కన కుర్చొని అందులోని కలవలను,  పక్క నుంచి కూత పెడుతూ వయ్యారంగా పరుగులు తీసే రైలు ను చూడటము వకటా,  రెండా ఎన్నని చెప్పను స్వీట్ మెమొరీస్ ను? . సాలార్జంగ్ మ్యూజియం లోని గంటల గడియారము చూడటము వింత . ఎంత బాగుండేదో! డబల్ డెక్కర్ బస్ ప్రత్యేక ఆకర్శణ .  హైదరాబాద్ తెగ నచ్చేసింది.
పొద్దటి సంది రిక్షా తొక్కుతున్న పది పైసలు ఎక్కువియమ్మా చాయ్ తాగుతా అనే రిక్షా వాలా స్థానము లో మనము పిలవగా నే ఎగాదిగా చూసేసి నేను అటువైపు రాను అనే ఆటో వాలా వచ్చేసాడు.
ఇప్పుడైతే ఒక్క ఫోన్ చేయగానే ఇంటిముందుకు కాబ్ వాలిపోతుంది.

దీపక్ మహల్, బసంత్ టాకీస్, రహత్మహల్ , జమ్రుద్ లను దాటేసి శాంతి,  సుదర్షన్, మహేశ్వరి

పరమేశ్వరి వగైరాలు వచ్చేసాయి. మహేశ్వరి లో ఎస్కలేటర్ ఎక్కటము కోసం పిల్లలు తెగ మారాము చేసేవారు 
చూస్తూండగానే ఐమాక్ష్ థియేటెర్ లు , మాల్ లులు, పబ్ లు మద్యతరగతి మందహాసాని కి చిరునామా గా హైటెక్ సిటి, ఐ. డి. కార్డ్లు మెళ్ళొ వేసుకొని ముచ్చటగా తిరిగే అమ్మాయిలూ , అబ్బాయిలూ, ఎంత ఎదిగి పొయిందో. ఎంత ఎదిగినా వదిగే వుంటాను అన్నట్లుగా పక్కనే ముచ్చటైన ముగ్గులతొ , పర్ణశాలలతొ,  ఎప్పుడూ ఎదోవక సాంప్రదాయ కార్యక్రమములు నిర్వహిస్తూ శిల్పారామము ఎనలేని సేవ చేస్తొంది.

హిందూ ముస్లిం ల అపూర్వ కలయకకి ప్రతీక హైదరాబాద్. పాత కొత్తల కలగలుపు . అసలు 

ఎవరన్నారు? హిందువులు ముస్లింలు కొట్టుకుంటున్నారని?. అదంతా స్వార్ధపరుల కుట్ర.  వినాయక చవితి, మొహరం ఒకే సారి వస్త్తాయి. ఒక వైపు,  పీర్లు ఒకవైపు వినాయకుడు ఒకేసారి ఉరేగుతారు.

మేమైతే రంజాన్ పండగ రోజు మా ముస్లిం స్నేహితుల ఇళ్ళకి వెళ్లి శుభాకాంక్షలు తెలిపి , ఖోవా, చాయపప్పు వేసి చేసిన ఖీర్ తాగి వస్తాము.  అలాగే మా పండగల కి మా ముస్లిం స్నేహితులు వచ్చి శుభాకాంక్షలు పులిహోర,  బొబ్బట్లు తిని వెళుతారు.

హైదరాబాద్ లో మూడు రోజుల నుంచి ఒకటే సందడి. పండగ వాతావరణం కనీస్తోంది. పేపర్ లు టీ. వీ లు మెట్రో గురించి హ్పెరెత్తిసున్నాయి.  చూస్తుండగానే ఇన్ని సంవత్సరాలల్లో ఎంతగా మారిపోయింది హైదరాబాద్! అందమైన మార్పులు ఎప్పుడూ స్వాగతించ దగినవే. ఇప్పటి కీ నాకు సేలింగ్ క్లబ్ లో కుర్చొని చల్లటి పైనాపిల్ జ్యూస్ తాగుతూ హుసేన్సాగర్ లో కదిలే నావలను గమనించటము ఇష్టము.  అందరూ అక్కడ దొమలు కుడుతుంటాయి, కంపు అంటారు ఐనా సరే.








Tuesday, November 21, 2017

రామప్ప - కోట గుళ్ళు
































రామప్ప - కోట గుళ్ళు
"ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో "
ఏ శిల్పి చేతిలో నుంచి రూపు దిద్దుకున్నాయో! తొమ్మిది శతాబ్ధాలుగా ఎన్ని చరిత్రలు చూసాయో! వాటికే నోరు ఉంటే ఎన్ని కథలు చెపుతాయో! ఐనా ఈ శిల్పాలకు నోరు అవసరము లేదు కళ్ళ తోనే భావాలు పలికిస్తున్నాయి! రామప్ప దేవాలయము లోని శిల్పాలు చూస్తుంటే నాలో కలిగిన భావాలు ఇవి.వయ్యారం, ఆగ్రహం,కరుణ నవరసాలు ఆ రాతిలో ఇంత అద్భుతం గా పలికించిన ఆ శిల్పి కి జోహారులు. ఆ మదనికల అందం చూడాల్సిందే కాని వర్ణించ నా తరమా ? నాగిని ప్రత్యేకం. చెవులు దోర విరుచుకొని,తోక లేపి, వక కాలు ను కొద్దిగా పైకి లేపి శివయ్య ఎప్పుడు పిలుస్తే అప్పుడు వెళ్ళేందుకు తయారుగా ఉన్న నందీశ్వరుడు గంభీరంగా ఉన్నాడు.అందరినీ గమనిస్తూ ప్రసన్నదృక్కులతో శివయ్య ప్రసన్నంగా ఉన్నారు.ఎంత చూసినా తనివి తీరని అందం రామప్ప దేవాలయంది.
స్కూల్ పిల్లల తోపాటు గైడ్ చూపిస్తుంటే చూడటం బాల్యం లోకి తీసుకెళ్ళింది.
వరంగల్ నుంచి రెండు గంటల ప్రయణము చేసి ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న రామప్ప దేవాలయము కు వెళ్ళాము.మీకు దారిలో తినేందుకు ఏమీ దొరకవు అని ,మా ఏమండీ మామ్మయ్య కూతురు అనూరాధ మాకు లంచ్ పాక్ చేసి ఇచ్చింది.మంచి ఎండలో, మా వయసు మరచి పిల్లలతో సమానంగా పరుగులు పెడుతూ చూసి కూర్చున్నాక అప్పడు అలసట తెలిసి, ఆకలి కరకరలాడింది.టమాటాపప్పు, క్యాబేజ్ కూర, కొత్త ఉసిరికాయ ఖారం, నిమ్మకాయ మిరియం ,పెరుగు సూపరో సూపర్.థాంక్ యూ అనూరాధ.అన్నదాతా సుఖీభవ.
అక్కడి నుంచి , రామప్ప వెళుతున్నానంటే కోట గుళ్ళు చూసి రండి, అక్కడ వాళ్ళు సరిగ్గా మేంటేన్ చేస్తున్నారోలేదో, కాస్త గదమాయించి రండి అని మా లక్ష్మిగారు ఆర్డర్ వేసారు.లక్ష్మిగారూ,కోట గుళ్ళు చూసాను.అంతా అలాగే పాడుబడి ఉంది.ఏదో మీరన్నారని కాస్త కోపంచేసాను కాని వాళ్ళు పట్టించుకోలేదు :(
గుబురుగా పెరిగిన గడ్డిలో నుంచి వెళ్ళి గుడి మెట్లు ఎక్కలంటే ధైర్యం చాలలేదు.కాని పూజారి మమ్మలిని వదలలేదు.నీకెందుకు భయం నేను ఉన్నాను పద అని బలవంతంగా తీసుకెళ్ళాడు.మెట్లు చూడగానే గుండె గుభిల్లు మంది. నేను ఎక్కలేను అన్నా, 80 ఏళ్ళ వాడి నేను ఎక్కుతున్నాను, నువ్వు ఎక్కలేవా పదపదమన్నాడు.రాజేశ్వరి ఎక్కలేక రెండో మెట్టు మీద కూర్చుండిపోయింది.నన్ను మటుకు పూజారయ్య వదలలేదు ఎక్కించాడు.లోపల శివయ్యను చూడగానే మైమరచిపోయాను.ఎంత కళగా ఉన్నాడో.నాకు తెలీకుండానే శివయ్య ఎదురుగా కింద కూర్చొని ధ్యానం లోకి వెళ్ళిపోయాను.బహుశా పది నిమిషాలు అలాగే కళ్ళు మూసుకొని కూర్చుండిపోయాను. కళ్ళు తెరవగానే పూజారి పాదాలు కనిపించాయి.అవి శివుని పాదాలుగా అనిపించాయి. పూజారి రూపం లో శివుడు పిలిచాడేమో ఎందుకో మరి!

దేవాలయం ప్రాంగణం లో చాలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కాని ఎందులోనూ విగ్రహం లేదు.అంతేగా మన ప్రాచీన దేవాలయాలన్నీ ముష్కరులదాడికి గురయ్యాయికదా! వాళ్ళకు మణులుమాణిక్యాలు ఎన్ని దొరికాయో కాని మన శిల్ప సంపద ను పోగొట్టుకున్నాము.

Thursday, June 6, 2013

తిరుమలగిరి - జిలుగుమాడు





ఈ తిరుమలగిరి కృష్ణా జిల్లా  జగ్గయ్యపేట కు దగ్గరలో వుంది . ఇక్కడ వున్న వెంకటేశ్వరస్వామి మా ఇంటి ఇలవేలుపు.మా అత్తగారు వాళ్ళు హైదరాబాద్ కు రాక ముందు ,మా ఇంట్లో జరిగే శుభకార్యాలన్నీ ఇక్కడే జరుపుకునేవారట.చాలా సంవత్సరాల నుంచీ అనుకుంటూ వుంటే ఇప్పటి కి ఇక్కడకు రావటానికి వీలయ్యింది .

ఇక్కడ వెంకటేశ్వరస్వామి పుట్టలో నుంచి వచ్చినట్లుగా వుంటారు . విగ్రహం ఏదీ వుండదు. పుట్ట మాత్రమే వుంటుంది. పుట్ట మీద సహజసిద్దంగా ఏర్పడ్డ నామాలు 24 వుంటాయట. అందుకని ఈ స్వామివారిని 'నామాల వెంకటేశ్వరస్వామి"అంటారట.

 ఈ దేవాలయము ఎన్ని ఏళ్ళక్రితం నిర్మించారో తెలీదుట. ఈ మధ్య దేవాదాయశాఖవారు దీనిని తిరిగి నిర్మించారట.ఉదయము 6 గంటల నుంచి సాయంకాలము 6 గంటల వరకు తెరిచి వుంటుంది. సాయంకాలము 6 గంటలకు మూసివేసిన తరువాత ఎట్టి పరిస్తితులలోనూ తిరిగి తెరువరు . ప్రతి రోజూ రాత్రి పూట దేవతలు ఇక్కడ స్వామివారిని పూజించుకుంటారట.అందుకు నిదర్షనం గా ఉదయము తలుపులు తీసాక పుట్ట చుట్టూ నీటి చుక్కలు  కనిపిస్తాయట.  చాలా మహిమగల స్వామి అని నమ్ముతారు .


 జిలుగుమాడు



తిరుమలగిరి మా అత్తగారి మెట్టినింటివారి ఇలవేలుపైతే ,జిలుగుమాడు లోని శివయ్య ఆవిడ పుట్టినింటివారి ఇలవేలుపు .దాదాపు 150 సంవత్సరాల క్రితం మా అత్తగారింటి వారైన పెగళ్ళపాటి వీరభద్రయ్య గారికి  పొలం  లో  భూమికింద శివలింగం వున్నట్లుగా కల వచ్చిందట. . అక్కడ తవ్విస్తే పానపట్టము తో సహా శివలింగం వుందట. దానిని వెలికి తీసి , అక్కడే చిన్న గుడి కట్టించి స్తాపించారట.గుడి కి వక అర ఎకరము పొలం ఇచ్చారట. అప్పటి నుంచి ఆ స్వామివారి ని ఇలవేలుపుగా కొలుస్తున్నారట.
దాదాపు 40 సంవత్సరాల క్ర్రితం అక్కడి పొలము ను ఎవరో ఆక్రమించుకున్నారు . గుడి ని మూత పెట్టారు . పూజా పున:స్కారాలు లేక జీర్ణించిపోయింది .రెండుమూడు సంవత్సరాల క్రితము ఆ ఇంటి ఆడపడుచు అన్నపూర్ణ( ఆవిడ అమ్మవారి భక్తురాలు. పూజలు చాలా చేస్తుంటారు)కు కలలో ఆ దేవాలయము కనిపించిందిట.వెంటనే ఆవిడ ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి ఆ దేవాలయాన్ని తిరిగి నిర్మించారు .నిత్య పూజలకై పూజారిని ఏర్పాటు చేసారు . ఆవిడ కూడా జిలుగుమాడు గ్రామం లో వక ఇల్లు అద్దెకు తీసుకొని ఎక్కువగా ఆ దేవాలయము లోనే గడుపుతూవుంటారు .

మధిర లో మావారి కజిన్ కుమార్తే వివాహమైతే వెళ్ళాము . అప్పుడు ఈ రెండు దేవాలయాలనూ దర్శించుకొని వచ్చాము .  




Thursday, October 25, 2012

నల్లపోచమ్మ - యూసుఫ్ గూడ









యూసుఫ్ గూడా బస్తీ కీ ముత్యాలమ్మ తల్లి గ్రామ దేవత అట .ఈ అమ్మవారు ఎప్పుడు ఎలా వెలిసిందో , ఈ చిన్న గుడి ఎవరు ఎప్పుడు కట్టించారో నేను అడిగినవాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు . మా కాలనీ లో వున్న సీతమ్మగారు 20 సంవత్సరాల క్రితము వాళ్ళు ఇక్కడి కి వచ్చేసరికే ఈ గుడి వుంది అన్నారు . ఇక్కడ ఆ రోజులలో ఎక్కువగా బలులు ఇచ్చేవారట.





13 సంవత్సరాల క్రితం యన్. జనార్ధన రెడ్డి గారు , ముత్యాలమ్మ గుడి కి పక్కనే ఓ గుడి కట్టించి అందులో నల్లపోచమ్మను స్థాపించారట. ఈ గుడి లో బలులు ఇవ్వరట. అమ్మవారు చాలా కళగా వుంటుంది . చాలా మహిమ కలది అని కూడా అంటారు . 11 సంవత్సరాల నుంచి సీతమ్మగారి ఆధ్వర్యం లో , మా కాలనీ ఆడవారు  ఇక్కడ రోజూ సాయంకాలము, లలితా సహస్రనామాలు పారాయణ చేస్తున్నారు .మధ్య మధ్య భారతము , భగవద్గీత , రామాయణము కూడా పారాయణ చేసారట . రామాయణము పారాయణ చేసి నంత కాలమూ ఓ కోతి అక్కడకు వచ్చి , పక్కనే గోడ మీద కూర్చునేదట . రామాయణ పారాయణము అయ్యాక రాలేదట !

అలాగే జయలక్ష్మి అనే ఆవిడ 9 సంవత్సరాల క్రితం ఇటువైపు ఇల్లు కట్టు కొని వచ్చారట . వకరోజు రాత్రి కలలో , ఏదో గుడి , అక్కడ అందరూ ఏదో చదువుతున్నట్లుగా కల వచ్చిందిట. ఆవిడ అంత పట్టించుకోలేదట. మరునాడు రాత్రి మళ్ళీ ఆ గుడి స్పష్టంగా కనిపించిందిట. అమ్మవారి ముందు ఏదో రాయిలాగా కూడా కనిపించిందట .  మరునాడు సాయంకాలం ఆ గుడి ఈ చుట్టుపక్కల ఏమైనా వుందా అని వెతుక్కుంటూ వస్తే ఈ గుడి కనిపించిందిట. అప్పుడే అక్కడ కొంతమంది ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారుట . ఆ గుడి , గుడి లోని అమ్మవారు , అమ్మవారి ముంది శిల అంతా కలలో కనిపించినట్లే వుందిట . ఆ రోజు నుంచి ఆవిడా ఆ బృదం లో చేరి రోజూ లలిత చదువుతున్నారట . ఇంచు మించు ఇలాంటి అనుభవమే నాకూ కలిగింది . పదిరోజుల క్రితం నేనూ ఏదో గుడిలో లలిత పారాయణ చేస్తునట్లుగా కల వచ్చింది . ఏ గుడా , ఎక్కడా అని నేనూ కొంచం ఆలోచనలో పడ్డాను . పొద్దున పూజ చేసుకొని , వచ్చి కూర్చోగానే , అక్కడే ఊడుస్తున్న మా పనమ్మాయి , అమ్మా దసరా పదిరోజులూ నల్లపోచమ్మ గుడి లో బాగా చేస్తారమ్మా . పక్కనే షెడ్ లో పెద్ద అమ్మవారి విగ్రహం పెడుతున్నారు . సీతమ్మ వాళ్ళు రోజూ వెళ్ళి ఏదో చదివి వస్తారు అన్నది . వెంటనే సీతమ్మగారి దగ్గర కు వెళ్ళి ఎన్నిటి కి వెళతారో తెలుసుకొని రమ్మని పంపించాను . రోజూ పది నిమిషాల తక్కువ ఐదుకు వెళుతారుట నిన్ను అప్పటికల్లా రమ్మన్నది తీసుకెళుతానన్నది అని చెప్పింది . ఆ విధం గా అమ్మవారు నన్నూ పిలిపించుకుంది . ఈ పది రోజులూ అమ్మవారి ముందు కూర్చొని లలితా పారాయణ చేయగానే ఎంతో మనశ్సాంతిగా , హృదయం తేలికపడ్డట్టుగా అనిపించింది .























ఈ పదిరోజులూ ఉత్సవాలు చాలా బాగా జరిగాయి . రోజూ ఉదయమూ , సాయంకాలమూ లలితా సహస్రనామపారాయణము జరిగింది . అందులో మా కాలనీ ఆడవారే  కాకుండా చుట్టు పక్కల బస్తీ వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధ గా చేసారు . ఆరో రోజు సుహాసినీ పూజ , ముగ్గురు ముత్తైదువులకు , ఓ బాల కు చేసారు . ఒక రోజు అన్నదానం జరిగింది . ఏడోరోజు హోమం చేసారు . నిన్న విజయదశమి రోజు లలిత పారాయణ అయ్యాక అమ్మవారి ని కదిలించారు . ఈ తొమ్మిదిరోజులూ అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజించారు.



Tuesday, April 3, 2012

చిలుకూరు బాలాజీ


రంగారెడ్డి జిల్లాలో వుంది "చిలుకూరు " . ఇక్కడ వెలిసిన "బాలాజీ" , వీసా బాలాజీ గా చాలా ప్రసిద్ది . అమెరికాకు విసా కావాలనుకున్నవారు ఈ బాలాజీ ని తప్పక దర్శించుకుంటారు .

చాలాకాలం క్రితం చిలుకూరులో ఒక గొప్ప వెంకటేశ్వరస్వామి భక్తుడు 'గుణాల మాధవ రెడ్డి ' వుండేవాడు .ప్రతి ఏటా పంట చేతికి రాగానే తిరుపతి వెళ్ళేవాడు .చేలో పండిన ధాన్యం కొంత స్వామికి అర్పించేవాడు . స్వామికి కళాయణోత్సవం చేయించేవాడు . తిరుపతి వెకటేశ్వరుడంటే ఆయనకు ప్రఘాడమైన భక్తి .కొన్నాళ్ళకు ఆ భక్తుడు ముసలివాడైనాడు . తిరుపతి ప్రయాణం తట్టుకునే స్తితిలో లేడు . అతడు చాలా బెంగపడ్డాడు . స్వామిని దర్శించుకోలేకపోయానేనని దిగులు పడి, ఆలోచించి ఆలోచించి నిద్రపోయిన ఆరాత్రి , ఎవరో తట్టి లేపుతున్నట్లుగా అనిపించి లేచి కూర్చున్నాడు . కళ్ళుతెరిచి చూడగానే శ్రీదేవి , భూదేవి సహితం గా వెంకటేశ్వర స్వామి కనిపించి "తాతా నువ్వు రాలేవని నేనే వచ్చేసాను " అని చెప్పాడు . " ఇకనుంచి నీ కొరకు ఇక్కడ వెలుస్తాను . నీ చేలో వున్న శివలింగానికి దక్షణం వైపు వున్న ఒక పాముపుట్ట అడుగున నేను వున్నాను . ఇంతవరకు భూగర్భం లో వున్నాను . ఇక పైన నీలాంటి భక్తులకు దర్శనం ఇవ్వ తలుచుకున్నాను .నీ చేలో నేను చెప్పిన చోట తవ్వి చూడు . శ్రీదేవి , భూదేవి ల తో సహా ఒకే రాతిమీద వెంకటేశ్వరుని రూపం లో నీకు దర్శనం ఇస్తాను " అని చెప్పాడు .
సృహలోకి వచ్చిన మాధవరెడ్డి , తన మనవల సహాయముతో , తన పొలం లో వున్న పుట్టను వెతికి త్రవ్వగా , గడ్డపారకు రక్తపు మరకలు కనిపించటం తో భయపడిన మాధవరెడ్డి పాల తో పుట్టను కరిగించాడు .పుట్ట కరిగిపోయి ఏక శిలలో వెంకటేశ్వరుడు , అలివేలుమంగ , పద్మావతి కనిపించింది . అదే చోట మాధవరెడ్డి గుడి నిర్మించాడు .స్వామి మూలవిరాట్టుకు ఎడమవైపు పైభాగము ,చాతి దగ్గర గడ్డపారతో గాయమైన గుర్తులు నేటికీ కనిపిస్తాయి .

ఈ గర్భ గుడి చుట్టూ పదకొండు ప్రదక్షణాలు చేసినవారికి కోరిక తీరుతుందని భక్తుల విశ్వాసము . కోరిక తీరిన తరువాత 108 ప్రదక్షణాలు చేయాలి .

ఈ ఆలయం లో హుండీ లేదు . అర్జితం టికెట్లు లేవు . ప్రత్యేక దర్శన టికెట్లు లేవు . ఎంతటివారైనా సామాన్యుల తోపాటు క్యూ లో రావలసిందే !

మేము అనుకోకుండా పోయిన శనివారం చిలుకూరు వెళ్ళాము . రష్ చాలానే వుంది . ఐనా సులభంగానే దర్శనం అయ్యింది .కాకపోతే స్వామి దగ్గర లైట్ లేదు . చీకటిగా వుంది . అందుచేత స్వామి సరిగ్గా కనిపించలేదు . కనిపించినంతవరకు తృప్తిగా చూసాము . జరగండి జరగండి అనే తోపులాటలు లేవు !

ఈ గుడి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి వుంటుంది .

Monday, October 24, 2011

బీదర్



మావారు పనిమీద బీదర్ వెళుతుంటే , ఒక్కరే వెళుతున్నారని నేను కూడా వెళ్ళాను . బీదర్ చేరగానే నాకు ఓ కార్ డ్రైవర్ ఇచ్చి తిరగమని చెప్పి తను పని మీద వెళ్ళారు . డ్రైవర్ మురళి ముందుగా బీదర్ కోటకు తీసుకెళ్ళాడు .

హైదరాబాద్ కు దగ్గర లో వున్న చారిత్రక ప్రదేశము " బీదర్ " . ఇక్కడి వాతావరణము , ప్రకృతి అందాలకు ముచ్చట పడ్డ బహ్మనీ సుల్తాన్ 1429 లో బీదర్ నిర్మాణానికి పూనుకున్నాడని చారిత్రిక ఆధారాలు తెలుపుతున్నాయి . 1724 నుంచి 1948 వరకూ నిజాం నవాబుల ఏలుబడి లో వుంది . హైదరబాద్ ప్రాంతము లో బాగము గా వున్న బీదర్ ఆ తరువాత కర్ణాటక లో భాగమైపోయింది.
బీదర్ లో ముందుగా చూడవలిసింది బీదర్ కోటను . పట్టణము లోకి వెళుతూనే , మొదట్లోనే కోట శిధిలాలు కనిపిస్తాయి . లోపల 16 స్తంబాలతో నిర్మించిన ప్రార్ధనా మందిరము ,( మసీదు ) , రాణివాసమైన గగన్ మహల్ ముఖ్యమైనవి .శిధిలమవుతున్న కోట భాగాలను మరమత్తుచేసి , పార్క్ లా చేసి , కోటను చూడముచ్చటగా తయారు చేస్తున్నారు .



గగన్ మహల్



సోలా స్తంబ్ మాస్క్

గురుద్వార



కోట చూసాక బీదర్ లో ముఖ్యమైన ' గురుద్వారా ' కు వెళ్ళాము . గురునానక్ ఇక్కడ కొద్దిరోజులు వున్నాడట . నేను ఇంతవరకూ ఎప్పుడూ గుర్ద్వారాలా చూడలేదు . చాలా ప్రశాంతము గా బాగుంది . గురునానక్ మొదటి అడుగు వేసిన చోటున సన్నటి నీటి ధార వస్తూ , అక్కడ వున్న చిన్న పూల్ లో పడుతున్నాయి . ఇదే ఆ 'అమృత కుండ్ ' .



గురుద్వారా లో ప్రసాదముగా ఇచ్చిన హల్వా తిని , శివాలయము చూపిస్తానని తీసుకెళ్ళాడు . అది కొంచం అడవి లో వున్నది . దీనిని ' పాపనాశం శివాలయము ' అంటారట . శ్రీరాముడు రావణుని సమ్హరించి , అయోద్య కు తిరిగివెళుతూ , రావణుడు శివభక్తుడు కాబట్టి ఆ భక్తుని చంపిన పాపము ను పోగొట్టుకొనినేందుకు దారిలో అక్కడక్కడ శివలింగాలను ప్రతిస్ఠించాడట . అలా రాముడు ప్రతిస్ఠించినదే ఇక్కడ వున్న శివలింగం . ఈ లింగమును దర్సించినంతనే సర్వ పాపములు వినాశమవుతాయట .
ఇదే ఆ లింగము , దేవాలయము ;







ఆ అడవిలోనే కొంచము ముందుకు వెళితే వస్తుంది ' బసవగిరి ' వీరశైవము క్లిష్ట పరిస్తితులలో వున్నప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు భూలోకములో ' బసవేశ్వరు ' ని గా అవతరించి వీర శైవ ధర్మమును ప్రభోదించాడు . ఆ బసవన్న ప్రార్ధనామందిరమే ఈ బసవగిరి .
ఈ మందిరము లో బసవన్న భక్తులు ప్రార్ధనలు చేస్తారు ;


మావారు లంచ్ కు వచ్చినప్పుడు ఇక్కడ ప్రసిద్ది చెందిన ' జరానరసిమ్హస్వామి ' దేవాలయము కు వెళ్ళాము . ఇక్కడ లక్ష్మీనరసిమ్హుడు ఓ గుహలో 600 మీటర్ ల దూరము లో వుంటాడు . అక్కడి వరకు నీళ్ళు వుంటాయి . అంటే ఆయనను దర్శించుకోవాలంటే గుహలో నీళ్ళలో వెళ్ళాలన్నమాట . ఆ గుహను , ఆ నీటిని చూడగానే నేను లోపలికి రానన్నాను . మా మావారు కొంచము నచ్చ చెప్పేందుకు ప్రయత్నించి , ఇహ నాకు నరసిమ్హుని దర్శించుకునే ప్రాప్తం లేదని చెప్పి ఆయన లోపలి కి వెళ్ళారు . కొద్దిగా లోపలికి వెళ్ళి భుజాలదాకా నీళ్ళు రాగా , వెనక్కి వెచ్చి ఆయన పర్సు , వాచీ నాకు ఇచ్చి వెళ్ళారు . ఆయనతో పాట ఆయన అసిస్టెంట్లు కూడా వారి సామానులు ఇచ్చి వెళ్ళారు . కాసేపు క్లాక్ రూం నయ్యానన్నమాట :) అక్కడే గట్టుమీద వచ్చేపోయే వాళ్ళను చూస్తూ కూర్చున్నాను . గట్టుపక్కనే వున్న లక్స్మీనరసిమ్హస్వామి దగ్గర కూర్చున్న పూజారిని స్తలపురాణము చెప్పమని అడిగాను . అందరూ తిరిగి రానీ అందరికీ కలిపి ఒకేసారి చెపౌతాను అన్నాడు ఆయన .






ఈ గుహలో శివుడు తపస్సు చేసుకుంటూ వుండగా ' జలాసురుడు ' అనే రాక్ష్సుడు ఆయనను చాలా విసిగిస్తూ వున్నాడట . అప్పుడు లక్ష్మీనరసిమ్హ స్వామి వచ్చి జలాసురుడిని సమ్హరించాడట . జలాసురుడి కొద్దిగా పుణ్యము చేసుకొని వుండటము వల్ల , ఏదైనా మంచి కోరిక కోరుకో తీరుస్తాను అన్నాడట నరసిమ్హస్వామి . ఐతే నువ్విక్కడే వెలవాలి , నిన్ను నా పేరు తో కలిపి పిలువాలి అని కోరాడట జలాసురుడు . అప్పుడు నరసిమ్హస్వామి అక్కడ వెలిశి ' జలానరసిమ్హుడు ' గా కొలవబడుతున్నాడు .' జలా అంటే నీరు కాబట్టి , నరసిమ్హస్వామి పాదాల వద్ద నుంచి నీరు ఆ గుహలో ప్రవహిస్తోందిట. ఇది ఆ పురోహితుడు , మరాఠీ , హిందీ కలిపి చెప్పగా నాకు అర్ధమైన స్తలపురాణము !



ఇవీ బీదర్ లో చూడ తగ్గ ప్రదేశాలు .