చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Tuesday, November 21, 2017

రామప్ప - కోట గుళ్ళు
రామప్ప - కోట గుళ్ళు
"ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో "
ఏ శిల్పి చేతిలో నుంచి రూపు దిద్దుకున్నాయో! తొమ్మిది శతాబ్ధాలుగా ఎన్ని చరిత్రలు చూసాయో! వాటికే నోరు ఉంటే ఎన్ని కథలు చెపుతాయో! ఐనా ఈ శిల్పాలకు నోరు అవసరము లేదు కళ్ళ తోనే భావాలు పలికిస్తున్నాయి! రామప్ప దేవాలయము లోని శిల్పాలు చూస్తుంటే నాలో కలిగిన భావాలు ఇవి.వయ్యారం, ఆగ్రహం,కరుణ నవరసాలు ఆ రాతిలో ఇంత అద్భుతం గా పలికించిన ఆ శిల్పి కి జోహారులు. ఆ మదనికల అందం చూడాల్సిందే కాని వర్ణించ నా తరమా ? నాగిని ప్రత్యేకం. చెవులు దోర విరుచుకొని,తోక లేపి, వక కాలు ను కొద్దిగా పైకి లేపి శివయ్య ఎప్పుడు పిలుస్తే అప్పుడు వెళ్ళేందుకు తయారుగా ఉన్న నందీశ్వరుడు గంభీరంగా ఉన్నాడు.అందరినీ గమనిస్తూ ప్రసన్నదృక్కులతో శివయ్య ప్రసన్నంగా ఉన్నారు.ఎంత చూసినా తనివి తీరని అందం రామప్ప దేవాలయంది.
స్కూల్ పిల్లల తోపాటు గైడ్ చూపిస్తుంటే చూడటం బాల్యం లోకి తీసుకెళ్ళింది.
వరంగల్ నుంచి రెండు గంటల ప్రయణము చేసి ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న రామప్ప దేవాలయము కు వెళ్ళాము.మీకు దారిలో తినేందుకు ఏమీ దొరకవు అని ,మా ఏమండీ మామ్మయ్య కూతురు అనూరాధ మాకు లంచ్ పాక్ చేసి ఇచ్చింది.మంచి ఎండలో, మా వయసు మరచి పిల్లలతో సమానంగా పరుగులు పెడుతూ చూసి కూర్చున్నాక అప్పడు అలసట తెలిసి, ఆకలి కరకరలాడింది.టమాటాపప్పు, క్యాబేజ్ కూర, కొత్త ఉసిరికాయ ఖారం, నిమ్మకాయ మిరియం ,పెరుగు సూపరో సూపర్.థాంక్ యూ అనూరాధ.అన్నదాతా సుఖీభవ.
అక్కడి నుంచి , రామప్ప వెళుతున్నానంటే కోట గుళ్ళు చూసి రండి, అక్కడ వాళ్ళు సరిగ్గా మేంటేన్ చేస్తున్నారోలేదో, కాస్త గదమాయించి రండి అని మా లక్ష్మిగారు ఆర్డర్ వేసారు.లక్ష్మిగారూ,కోట గుళ్ళు చూసాను.అంతా అలాగే పాడుబడి ఉంది.ఏదో మీరన్నారని కాస్త కోపంచేసాను కాని వాళ్ళు పట్టించుకోలేదు :(
గుబురుగా పెరిగిన గడ్డిలో నుంచి వెళ్ళి గుడి మెట్లు ఎక్కలంటే ధైర్యం చాలలేదు.కాని పూజారి మమ్మలిని వదలలేదు.నీకెందుకు భయం నేను ఉన్నాను పద అని బలవంతంగా తీసుకెళ్ళాడు.మెట్లు చూడగానే గుండె గుభిల్లు మంది. నేను ఎక్కలేను అన్నా, 80 ఏళ్ళ వాడి నేను ఎక్కుతున్నాను, నువ్వు ఎక్కలేవా పదపదమన్నాడు.రాజేశ్వరి ఎక్కలేక రెండో మెట్టు మీద కూర్చుండిపోయింది.నన్ను మటుకు పూజారయ్య వదలలేదు ఎక్కించాడు.లోపల శివయ్యను చూడగానే మైమరచిపోయాను.ఎంత కళగా ఉన్నాడో.నాకు తెలీకుండానే శివయ్య ఎదురుగా కింద కూర్చొని ధ్యానం లోకి వెళ్ళిపోయాను.బహుశా పది నిమిషాలు అలాగే కళ్ళు మూసుకొని కూర్చుండిపోయాను. కళ్ళు తెరవగానే పూజారి పాదాలు కనిపించాయి.అవి శివుని పాదాలుగా అనిపించాయి. పూజారి రూపం లో శివుడు పిలిచాడేమో ఎందుకో మరి!

దేవాలయం ప్రాంగణం లో చాలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కాని ఎందులోనూ విగ్రహం లేదు.అంతేగా మన ప్రాచీన దేవాలయాలన్నీ ముష్కరులదాడికి గురయ్యాయికదా! వాళ్ళకు మణులుమాణిక్యాలు ఎన్ని దొరికాయో కాని మన శిల్ప సంపద ను పోగొట్టుకున్నాము.

2 comments:

అన్యగామి said...

మీరు తీసిన ఫోటోలు, చివర మీ వ్యాఖ్యానము బావున్నాయి.

Anonymous said...

బుచికి వెధవలు శిల్పసంపదను ధ్వంసం చేశారు.