చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Monday, December 28, 2009

ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా




నేను మొదటి సారి గా తిరుపతి కి , నా పెళ్ళి తరువాత మావారి తో , మా అత్త గారు , మామగారు తోకలిసి వెళ్ళాను . ఉదయము సుప్రభాత దర్శనానికి వెళ్ళి , తొలిసారిగా , మా వారి తో కలిసి ఆ శ్రీనివాసుని దర్శించాను . . ఆ దర్శనమును నేనెన్నడూ మరువలేను . ఆ రోజులలో ఏమాత్రము రెష్ వు౦డేది కాదు . ఎ౦తో సులభముగా లోపలికి వెళ్ళేవాళ్ళమో! నెట్టి వేయటము కూడ వుండేదికాదు . . ఆ తరువాత దాదాపు ప్రతి రె౦డు సంవత్సరాల కొకసారి వెళుతూనే వున్నాము . మేము ఎక్కువగా సుప్రభాత దర్శనానికే వెళుతాము . నేను అ౦దరిక౦టే ముందుగా తయారు అయ్యి , కాటేజ్ బయిట చిన్నగా వాకి౦గ్ చేస్తాను . సామాన్యముగా తిరుపతి కొ౦డ మీద , ఏకాలము లో నయినా తెల్లవారుజామున మ౦చు కురుస్తూ వు౦టు౦ది . ఆ సమయములో అలా నడవటము నాకు చాలా ఇష్ట౦ . ఒకేసారి నిజరూప దర్సనానికి వెళ్ళాము . అసలు ఆ దర్సనము కలగటము ఎ౦త భాగ్యమో ! అది ప్రతి శుక్రవారము మాత్రమే వు౦టు౦ది . ఆ తరువాత తోమాల సేవ కు , కళ్యాణానికి చాలా సారు లే వెళ్ళాము .


మావారు , తిరుపతి లో వర్క్ చేసేటప్పుడు , బైరాగి పట్టెడ లో , మా పిన్నీ వాళ్ళ ఇ౦టి దగ్గర ఇల్లు రెన్ట్ కు తీసుకున్నారు . అప్పుడు నేను , అక్కడ ఒక నెల రోజులు వున్నాను . అప్పుడు , శ్రీనివాసమ౦గాపురము , నారాయణ వనము , శిలాతోరణము , చూసాము . సరే ఎప్పుడు తిరుపతి వెళ్ళినా , అలివేలు మ౦గను , కాళహస్తీసుని దర్శి౦చకు౦డారాము . ఇక అక్కడ వున్నప్పుడు , కాణీపాక౦ , క౦చి కూడా వెళ్ళాము . చ౦ద్రగిరి కోట కూడా చూసాను . కాని కొ౦డ మీద శ్రీనివాసుని పాదాలు వున్నాయట , వెళ్ళే౦దుకు కుదర లేదు .కొ౦చము ఎత్తు ఎక్కి వెళ్ళాలి , దారి సరిగా వు౦డదు అన్నారు . దాదాపు ప్రతి రోజూ సాయ౦కాలము , గోవి౦దరాజస్వామి మ౦దిరానికి నడిచి వెళ్ళేదానిని . అక్కడ వున్న ఇత్తడి సామానుల దుకాణమును౦డి ఒక అమ్మవారి మొహము , ఫీఠము తెచ్చుకున్నాను . పైన డాబా మీద కూర్చొని ,సాయం కాలము కాగానే , కొండ మీద వెలుగుతూ వుండే శ్రీనివాసుని నామాలను చూస్తూవుండే దానిని .


తిరుపతి లో తెలుగు రాయలసీమ యాస లో మాట్లాడే వారు . మొదట్లో నాకు అర్ధ౦ అయ్యేది కాదు . కూరగాయలు చాలా తాజాగా వు౦డేవి . వ౦కాయలు నవనవ లాడుతు౦డేవి . కూరగాయలామెను పిలిచి బేరమాడ బోతే , కాలి చ్చేదా అనేది . రాయలసీమ అ౦టే కాళ్ళూ , చేతులూ , పీకలూ నరకటమనే సినిమా నాలెడ్జ్ వున్నదానిని కావటము వలన , నాకాలు తీయాలి కాని , ఆమె కాలిస్తాన౦టు౦దెమిటా ? అని వద్దని ప౦పెసేదానిని . రోజూ ఇదే త౦తు . ఒక రోజు , మా పిన్ని తో , కూరలమ్మాయి కాలిస్తాన౦టు౦దెమిటి ? ఆమె కాలు నాకె౦దుకు ? అని గోల పెట్టాను . మా పిన్ని కి అర్ధ౦ కాలేదు కాని , పక్కనే వున్న మా మరదలు , పకా పకా నవ్వి , కాలివ్వటము కాదు వదినగారు , కాలు అ౦టే పావు కిలో . , పావు కిలో ఇవ్వనా అని అడుగుతో౦ది . అ౦ది . ఓరినీ అనుకున్నాను . పాప౦ ఎ౦త అపార్ధ౦ చేసుకున్నాను !


మేము తిరుపతి లో వు౦డగానే , వైకు౦ఠ ఏకాదశి వచ్చి౦ది . అప్పుడే మావారి కి పని వు౦డటము వలన హైదరాబాదు కు వచ్చారు . నేను మాత్రము ,తిరుపతి లోనే వున్నాను . మా పిన్ని తో కలిసి , వైకు౦ఠఏకాదశికి పై తిరుపతి కి వెళ్ళాను . మనము లోపల , మామూలుగా దర్శనానికి వెళ్ళే ద్వారము పక్కన ఒక చిన్న ద్వారము వు౦టు౦ది . దాని మీద వైకు౦ఠ ద్వారము అని రాసి వు౦టు౦ది . తలుపులు మూసి వు౦టాయి . చాలా సార్లు చూసాను కాని అదేమిటో తెలీ లేదు. ఆ తలుపు వైకు౦ఠఏకాదశి రోజు తెరుస్తారు . ఆ రోజు మనము లోపల కి వెళ్ళవచ్చు. నేను , మా పిన్ని ము౦దు రోజు ననే పై తిరుపతి కి వెళ్ళి , కాటేజ్ లో వున్నాము . మేము తెల్లవారుజామున నే తల స్నాన౦ చేసి , నాలుగు గ౦టలకు వెళ్ళాము . ము౦దుగా వరాహస్వామిని దర్శి౦చుకొని , కోనేటి లో , కాళ్ళు కడుగుకొని , లోపలికి వెళ్ళాము . వైకు౦ఠద్వారము గు౦డా ప్రదక్షణ చేసాము . లోపల అ౦తా దీపతోరణాలు కట్టారు . ఎ౦త ప్రశా౦తముగా వు౦దో చెప్పలేను . చాలా సేపు శ్రేనివాసుని ద్యాని౦చుకు౦టూ అక్కడే కూర్చున్నాము . మరి ఆ రోజు మమ్మలిని ఎవరూ ప౦పి౦చేయలేదు కూడా . వెనుక గోడ దగ్గర నిలబడి , ఆ గోడను ముట్టుకొని , ఇక్కడే కదా శ్రీనివాసుడు వున్నాడు అనుకుంటూ పదే పదే ముట్టుకుంటూ , కళ్ళకద్దుకొని ,వివరించలేని అనుభూతికి లోనైనాను . మరల అలాంటి బాగ్యము కలుగుతుందని అనుకోవటము లేదు . ఆ రోజు అ౦త రెష్ కూడా లేదు . లోపల శ్రీనివాసుని కూడా చాలాసేపే దర్సి౦చుకున్నాము . వైకు౦ఠఏకాదశి రోజు న జరిగిన ఆ దర్శనము నేను జీవితము లో మరచి పోలేనిది , ఆ శ్రీనివాసుడు నాకు ఇచ్చిన అపురూపమైన కానుక . ఏ జన్మ పుణ్య ఫలమో ! నాకు ఆ దర్షన భాగ్యము కలిగించిన మా పిన్ని కి సర్వదా కృతజ్ఞురాలిని .


అప్పుడే తెప్పోత్సవము కూడా చూసే భాగ్యము కలిగి౦ది . హ౦స ఆకారము లో దీపాలతో అల౦కరి౦చిన నావ లో స్వామివారు దేవేరుల తో కలిసి కోనేటి లో విహరిస్తూ౦డగా చూసే౦దుకు రె౦డు కళ్ళూ చాలలేదు . . .


తిరుపతి కొ౦డ మీద సన్నని జల్లులు పడుతు౦డగా , మురమరాలు , మామిడికాయముక్కలు కలిపి చేసిన , చాట్ తినటము ఓ చక్కని అనుభూతి . మా వారి వర్క్ స్పాట్ కి , నేను వెళ్ళినప్పుడల్లా , అక్కడ ఓ అబ్బాయి నా కోస౦ ప్రత్యేకముగా చేసి ఇచ్చేవాడు .


ఇప్పుడైతే ఆ రెష్ లో , క్యూ లో అ౦త సేపు వు౦డి , దర్షనానికి వెళ్ళలేను . అలా అనుకున్నప్పుడల్లా , ఇక్కడే , సత్యసాయి దగ్గర వున్న వె౦కటేశ్వరస్వామి గుడి కో , లేదా , చిక్కడపల్లి వె౦కటేశ్వరస్వామి గుడికో వెళ్ళి వస్తాను . అలా అని అనుకుంటానే కాని వెళుతూనే వుంటాను . ఈ మధ్య నాలుగైదు నెలల క్రితము అనుకుంటాను వెళ్ళాను . ఆ రోజు అందరూ తయారైయ్యే లోపల మనమొకసారి గుడిదాకా వెళ్ళివద్దామని మావారు , నేను వెళ్ళాము . అప్పుడే స్వామి వారి ని మాడలలో ఊరేగింపుకు తీసుకెళుతున్నారు . మేము వెనకాలనే వెళ్ళాము . మమ్మలిని ఆ వూరేగింపు లోకి రమ్మని పిలిచారు .పల్లకీని కొంచము దూరము పట్టుకున్నాము . మేము స్వామివారిని పై చిత్రము లో లా ఊరేగుతున్నప్పుడే కొంచము దూరము మోసింది . మరి ఆ స్వామి అలా కరుణిస్తున్నాడు .

ఆ తరువాత కళ్యాణము రెష్ లో అస్సలు వెళ్ళలేక పోయాను . ఎలాగో కష్టం మీద వెళ్ళాను . ఎప్పటికప్పుడు క్యూ లోనుండి బయటకి వచ్చేస్తానని గొడవ పెడుతునే వుంటాను . మా వారు కోపం చేసి తీసుకెళుతుంటారు !


ఈ రోజు వైకు౦ఠ ఏకాదశి . శ్రీనివాసుని కటాక్ష సిద్దిరస్తు .

Saturday, October 3, 2009

కర్నూలు



1991 లో కర్నూల్ కు మావారు పని మీద వెళుతుంటే నేను ,పిల్లలు కూడా వెళ్ళాము. మల్లాది ఏదో నవల లో కొండా రెడ్డి బురుజు గురంచి చదివినప్పటి నుండి , అది చూడాలని కోరిక వుండింది. మావారు పని లో వుండగా నేను , మా అమ్మాయి , మా అబ్బాయి కర్నూల్ అంతా తిరిగాము. అక్కడ నేను చూద్దామనుకున్న కొండారెడ్డి బురుజు దగ్గర చాలా సమయము గడిపాము. దాని వెనుకననే పోలిస్ స్టేషన్ వున్నట్లు గుర్తు.
ఆ తరువాత తుంగభద్ర దగ్గర సాయిబాబా గుడి లో కొద్దిసేపు వున్నాము.
ఇకపైన చూసేందుకు ఏమీ లేవన్నారు అక్కడి హోటల్ సిబ్బంది. మేమున్న హోటల్ కి దగ్గరలో వున్న సినిమా హాల్ లో వెంకటేశ్ , భానుప్రియ నటంచిన శ్రీనివాస కల్యాణం సినిమా చూసాము.

నిన్నటి నుండి టి . వి లో కర్నూల్ ను చూస్తూవుంటే అప్పుడు మేము చూసిన కర్నూల్ గుర్తుకువచ్చి చాలా బాధ కలుగుతోంది. ఆ రోజు మేము తిరిగిన కొండా రెడ్డి బురుజు కు ,ఈ రోజు పేపర్ లో చూసిన కొండారెడ్డి బురుజుకు తేడ చూస్తూవుంటే మనసు తరుక్కు పోతోంది !
కన్నతల్లి లా అక్కున చేర్చుకునే నదీమతల్లి ఆగ్రహిస్తే పరిస్తితులు ఎంత దారుణముగా వుంటాయోకదా ! ఎంత ఎత్తుకు ఎదిగినా మనిషి ప్రకృతి ముందు తలదించవలసినదేకదా !

Wednesday, September 9, 2009

శ్రీశైలం



ఆకులో ఆకునై ,
పూవులో పూవునై ,
నునులేత కొమ్మనై ,
ఈ అడవి సాగిపోనా ,
ఎటులైనా ఇచటనే ఆగిపోనా .

శనివారం రాత్రి 9 .30 కి మావారు ఫోన్ చేసి ,రమణ రేపు ఉదయము శ్రీశైలం వెళుదామంటున్నాడు వెళ్దామా ? అని అడిగారు .నేను సరే ఆన్నాను. పొద్దున్నే 7 గంటలకి మా వారు, నేను , మా వారి ఫ్రెండ్ రమణ గారూ , ఆయన భార్య రమ , వారమ్మాయి స్నేహ శ్రీశైలం కి కార్ లో బయిలుదేరాము. పది సంవత్సరాల క్రితం ,మా అబ్బాయి అత్తగారు, మామగారు ,క్రిష్ణవేణి గారు, రమణారావు గార్ల తో మొదటి సారి శ్రీశైలం వెళ్ళాము. ఆ తరువాత మా ఫ్రెండ్స్ తో కలిసి ఓ కార్తీక మాసము లో వెళ్ళాము. ఇది మూడోసారి. శ్రీశైలం ఒక సారి వెళ్ళినవారు మూడు సార్లు తప్పక వెళుతారట !

శ్రీశైలం దగ్గరికి చేరుతుండగా మావారు ,మనము ఎలాగూ 12 గంటల దర్షనానికి చేరుకోలేము ,ఇటువైపు ఉమామహేశ్వర దేవాలయం వుంది వెళుదామా అన్నారు. అది చాలా పురాతన మైన దేవాలయం. కొద్దిగా గుహలోకి వుంటుంది. పార్వతి దేవి ఇక్కడ మహేషునికై తపస్సు చేసిందిట. ఇది శ్రీశైలం కి ఉత్తరద్వారమట. లోపల అమ్మవారి గుడి , పక్కన శివుడి గుడి వున్నాయి.మేము రుద్రాభిషేకం చేయించాము. అమ్మవారి గుడి లో ఒక ఆవిడ కాషాయ వస్త్రాలు ధరించి పద్మాసనం లో కూర్చోని ధ్యానం చేసుకుంటోంది.మేము అక్కడ కుంకుమ పూజ చేయించేప్పుడు కాని , భక్తులు దర్షనానికి వచ్చినప్పుడు కాని ఆవిడ కళ్ళు తెరచి చూడలేదు. అంత రెష్ లో ,అంత ఏకాగ్రత ఎలా కుదిరిందో అనుకున్నాను.
ఆ దేవాలయము దగ్గరనుండి ఘాట్ రోడ్ మొదలైంది. దారంతా పచ్చనిచెట్లు ,లోయలు , మేకల గుంపులు , కోతుల అల్లరి చాలా ఆహ్లాదం గా వుండింది. ఈ అడవిలోనే వుండిపోవాలనిపించింది ! అన్నట్లు గుడి దగ్గర స్నేహ చేతులోనించి చిప్స్ పాకెట్ గుంజుకు పోయి ,టకటకా ఓ స్తంభం ఎక్కేసీ ఓ కోతమ్మ వాటిని లాగించేసింది. హి హి హి.

దారిలోనే అభయారణ్యం అని పులల బొమ్మలేసి , బోర్డ్ కనిపించింది. లోపలికి తీసుకెళుతారా అంటే ఓయస్ 500 రుపీస్ కట్టండి అన్నారు. మరి పులులు కనిపిస్తాయా అంటే ఆప్ కా కిష్మత్ అన్నాడు సరె ఏం కిష్మత్ తో చూద్దామని వెళ్ళాము. ఎంత కళ్ళు విప్పుకొని చూసినా దూరంగా ఓ నెమలి , ఇంకొంచం దూరం లో ఓనాలుగు జింకలు తప్ప ఏం కనపడలే ! మరే నువ్వొస్తున్నావని అక్కడ ఎదురుగా కూర్చోనివుంటాయ్ అవి అని మావారు జోక్స్. టైగర్ వాలీ మటుకు చాలా మనోహరం గా వుంది. ఎంతసేపైనా కదలాలనిపించలేదు. ఎలాగు పులులు కనిపించలేదు, పాము పుట్ట నైనా ఫొటో తీసుకుందామనుకున్నాను. ఫొటో తీసుకోవాలన్న భయమే 1 స్నేహ మీరు పుట్ట పక్కన నిలబడండి ఆంటీ ఫొటో తీస్తాను అంది.అమ్మో అందులోని పాము ,ముస్తాబై ఫొటో కోసం నా పక్కన వచ్చి ఫొజ్ ఇస్తే ! అప్పుడే గైడ్ చెప్పాడు ,అక్కడ 700 రకాల పాములున్నాయట ! వద్దులేమ్మా అని నేనే దూరం నుంచి ఓ ఫొటో తీసుకున్నాను.

శ్రీశైలం లో పాతాళేశ్వర నిలయం లో రూం తీసుకొని, కాసేపు విశ్రాంతి తీసుకొని ,సాయంకాలము రోప్ వేలో వెళ్ళాము. అక్కడి నుండి ఓ మోటర్ బోట్ 500 రుపీస్ కి అద్దెకు తీసుకొని కొద్ది సేపు కృష్ణమ్మ లో విహరించాము. మావారికి బుట్ట దొన్నె లో వెళ్ళాలని వుండింది కాని ఇప్పుడు పోనీయటము లేదు అన్నారు.
12 జ్యోతిర్లిగాల లో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామికి ,18 శక్తి పీఠాలలో ఒకరైన భ్రమరాంబా దేవికి ఆలవాలం శ్రీశైలం .ఇది కర్నూల్ జిల్లా లో ,ఆత్మకూర్ తాలూకాలో వున్న నల్లమల అడువులలోని పర్వతశ్రేణి లో వుంది. ఇది సకల సంపదలతో ,మహర్షుల తపోవనాల తో లతలు అనంతమైన ఓషదుల తో నిండి వున్న చెట్ల తో విరాజిల్లుతుతోంది.
ఇప్పటికీ లోపలి వైపున వున్న చెంచు గూడెముల లోమూలికా వైద్యము చేసే చెంచులు వున్నారట. వారిలో మల్లన్న అనే అతను చాలా వృద్దుడు వున్నాడట. కాని నాగరికులను ఎవరినీ లోపలికి రానివ్వరట. గైడ్ అన్నాడు . నాకు చెంచు గూడెం లో కి వెళ్ళాలని చాలా వుండింది !

మరునాడు తెల్లవారుఝామున 5 గంటల కు రుద్రాభిషేకం , భ్రమరాంబకు కుంకుమ పూజ చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యాము. తిరిగి వచ్చేప్పుడు కూడా అదేభావన ,ఆకులో ఆకునై ,పూవులో పూవునై ఈ అడివి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా !
శ్రీశైలా మల్లయ్యా దైవమే నీవయ్యా

Monday, July 20, 2009

పుట్టపర్తి -భగవాన్ అస్ లార్డ్ శివ అండ్ ది గ్రేట్ హీలర్



మా అమ్మాయి అత్తగారు సరళా మాగల్ తండ్రిగారు, శ్రీ.వినాయక్ గోకక్ .ఆయన కన్నడ రచయత ,జ్ఞానపీఠ అవార్డుగ్రహీత. ఈ సంవత్సరము కర్నాటక ప్రభుత్వము ఆయన సెంచనరీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నది.. ఆయన సత్యసాయిబాబా యూనివర్సిటీ లో మొదటి వైస్ చాన్సలర్ గా చేసారట. .అప్పుడు వారి కుటుంబానికి బాబా తో సన్నిహిత సంబంధం వుండేదట. అలా సరళ గారు చిన్నప్పటి నుంచే బాబా భక్తురాలు. అనుకోకుండ నేను ఆవిడ తో కలిసి పుట్టపర్తి వెళ్ళటము జరిగింది. మొన్న గురుపూర్ణిమ రోజు ఆవిడ పుట్టపర్తి వెళ్ళి వచ్చానని చెబితే నాకు మా ప్రయాణము గుర్తుకు వచ్చి రాద్దామని పించింది. అప్పుడు సరళ గారిని మీ అనుభవాలు ఏమైనా చెప్పండి నా బ్లాగ్ లో పబ్లిష్ చేస్తాను అని అడిగాను . ఏమిరాయాలి అని అడిగారు. మీఇష్టం అన్నాను. సరె బాబా ఏది ప్రేరేపిస్తే అదే రాసిస్తాను అన్నారు. సరేనని నేను నా అనుభవం రాసి పొస్ట్ చేసాను.మరి ఆవిడా అదే రాసిచ్చారు. మరి ఆవిడన్నట్లు బాబా ప్రేరణ అదేనేమో ! నా మాటలతో చదివారు. ఇప్పుడు అదే ప్రయాణము గురించి ఆవిడ మాటలలలో

Bhagavaan As lord siva and The Great Healer

Sou. Mala and myself were on the A.P.S.R.T.C bus for Puttaparti on Mahasivaratri Night. During darshan Hour ,He came and stood in front of both of us , saying”Bangaroo” .I had done little Namasmarana the previous night ,on the bus. He proved that “if one takes one step forward ,God takes a thousand steps towards you.”

In the afternoon session some one gave Him peppermints on the ladies side. He threw them while He was going to the other side. Both of us got one each.

Next year also we went Puttaparti during the same occasion .I was running fever and had boils in my left part of my head. I had taken no medicine. Both of us were put up at East Prasanthi building.The volunteer there asked to stand in the balcony. Bhagavaan while giving Divine Darshan looked at us. Both of us and another girl, for quite a few moments. Later on my return to Hyderabad my physician late.Dr. Ramaiah of chikkadapalli gave me “ Arnica’ and nothing else. I was cured.

I was told by my mother that Bhagavaan is a Great Healer, specially for women.

Sou.Mala used to stay in Narayanaguda with her family.Her parents-in-laws were devotees of Bhagavaan. They used to go for his darshan at Shivam. When sou. Malas daughter sou. Sanjyoth came back fromUS with her husband(my son) Sateesh,daughter Aditi and son Vikram ,she bought a house in D.D colony ,which is near Sivam .Now sou. Mala’s family ,has bought a house near Sri.Satya Sai Nigamaagamam .

Things do happen after Bhagavaan’s Divine Darshan. Sou. Mala used to go on strict fast on Thursdays in Sri Siridi Saibabaas name. She has been going to Siridi with her husband.

Samasta Loka Shukino Bhavanthu.

Thank you bhabhijii for giving this article

Saturday, July 18, 2009

పుట్టపర్తి



నాకు దేవుడంటే భయమూ ,భక్తీ రెండూ వున్నాయి. ఎక్కడికి ఇల్లు మారినా దగ్గరలో గుడీ , లైబ్రరీ ని ముందు వెతుకుంటాను. వీలైనంతవరకూ ప్రతిరోజూ వుదయం గుడికి వెళుతాను. పూజలూ, నోములూ ,వ్రతాలు చేసుకుంటాను .ఇదివరకు ఉపవాసాలుకూడా వుండేదాన్ని ,కాన్ని ఇప్పుడు ఉండలేక మానేసాను. ఏ కొంచం ఇబ్బంది వచ్చినా నా మొక్కులంటే మా ఇంట్లో వాళ్ళకి హడలుపుట్టేంతగా మొక్కులు మొక్కేసుకుంటాను. కొన్నిసార్లు ఏం మొక్కుకున్నానో కూడా మర్చిపోతుంటాను అది వేరే విషయం. ఇదంతా ఉదయము పది గంటల వరకే పరిమితం. ఆ తరువాత మళ్ళీ మరునాడుదయం వరకూ దేవుడిని ఇబ్బంది పెట్టను. ఎంత దేవుడంటే భక్తి వున్నా ,స్వామీజీలు ,బాబాలు అన్నా , భజనలన్నా ఇష్టం లేదు. దేని ప్రభావమో తెలీదుకాని ,స్వామీజీలంటే నమ్మకము లేదు. సత్య సాయిబాబా హైదరబాద్ వచ్చినప్పుడల్లా మా అత్తగారు , మామగారు శివంకి వెళ్ళేవారు. ఇంట్లో బాబా ఫొటోలు కూడా వుండేవి .అయినా మరి ఎందుకో ఎప్పుడూ బాబా మీద నమ్మకమైతే కలగలేదు. అసలెప్పుడూ బాబా గురించి ఆలోచించనూ లేదు.

మా అమ్మాయి పెళ్ళి జరిగాకా మా వియ్యపురాలు నా పార్లర్ కి వస్తుండేవారు. ఆవిడకి సత్య సాయిబాబా అంటే చాలా నమ్మకం , భక్తి. ఆవిడ మమ్మలిని కోరిన ఒకేఒక కోరిక పెళ్ళి సత్య సాయి నిగమాగం లో చేయమని. ఆవిడకోరిక బలమేమో కొద్ది పిరియడ్ లోనే ఆ హాల్ దొరికి మా అమ్మాయి పెళ్ళి అక్కడే చేసాము. ఆవిడ పార్లరికి వచ్చినప్పుడల్లా సాయి బాబా గురించే మాట్లాడేవారు. అమ్మాయి అత్తగారు కదా మొహమాటం గా వినేదాన్ని. సడన్ గా ఓ సారి రేపు శివరాత్రి పుట్టపర్తి వెళుదామంటే నాకు తొడేవరూ లేరు అన్నారు.వెంటనే నేనొస్తాను అన్నాను. ఆవిడ చాలా సంతోషించి అప్పటికప్పుడే నైట్ బస్ కి టికెట్స్ కొన్నారు. అలా అనుకోకుండా పుట్టపర్తి కి మా వియ్యపురాలు సరళ గారి తో కలిసి వెళ్ళాను.

రాత్రి బస్ ఎక్కి పొద్దున్నే ప్రశాంతి నిలయం ముందు దిగాము. మాకు రూం దొరకటము కష్టమైంది. డార్మెంటరీ లో దొరికింది.అది ఒక పెద్ద షెడ్ .వరుసగా చాపలు పరిచి వున్నాయి. అక్కడే మా సామాను పదిల పరుచుకొని ,బాబా ఉపన్యాసం వినటాని కి వెళ్ళాము, కాని అప్పటికే అయిపోయింది. సాయంకాలము దర్షనం వుందంటే ,టిఫ్ఫిన్ చేయటానికి వెళ్ళాము. అక్కడ సరళ గారికి తెలిసినావిడ కనిపించి కుశలం అడిగి ,ఎక్కడున్నావు అని అడిగింది. డార్మెంటరీ లో అనగానే ఆవిడ నొచ్చుకొని గోకక్ గారమ్మయి అని కౌంటర్ లో చెప్పి రూం ఇప్పించారు. అలా రూంలో కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి కొంచం సేపు ప్రశాంతి నిలయమంతా తిరిగాము. చాలా బాగుంది. చాలా ప్రశాంతముగా వుంది. అక్కడ అంతమంది తిరుగుతున్నా ఎక్కడా చప్పుడేలేదు..

రాత్రంతా ప్రయాణము వలన కొంచం సేపు విశ్రాంతి తీసుకుందామని రూం కి వచ్చి చాపలు పరుచుకొని పడుకున్నాము.వెంటనే నాకు నిద్ర పట్టింది. నా పక్కనే సాయిబాబా నిలబడి ఏదో చెపుతున్నారు. నాకు గబుక్కున మెలుకువ వచ్చింది. లేచి చూస్తే సరళ అయారవుతూ, లే మాలా మనం దర్షనానికి వెళ్ళాలి అన్నారు.

దర్షనమైయే ప్రదేశం లో చాలా మంది వున్నారు.అప్పటి దాకా లేని ఇంత మంది ఎక్కడనుండి వచ్చారో ! ఎక్కడా కుర్చునే స్తలమే లేదు. నేను నిద్ర పోవటమువల్లే ఆలస్యం అయ్యింది కదా అని గిల్టీ గా అనిపించింది.చివరికి వెళ్ళి కూర్చుందామని వెళుతున్నాము , ఇంతలో పొద్దున కనిపించిన ఆవిడనే కనిపించి వెనకకి వెలుతున్నావేమిటి ? ముందుకురా అని మమ్మలిని తీసుకెళ్ళి ముందు వరుసలో కూర్చో పెట్టింది. మేము వెళ్ళిన కొద్దిసేపటికే సత్య సాయిబాబా వచ్చారు.అందరూ వారి వారి కోరికలేమో రాసి ,కవర్లు పెట్టి ఆయనకు ఇస్తున్నారు.అవి అందుకుంటూ మా ముందుకు వచ్చారు. మాముందు నిలబడ్డారు. నేను తలెత్తి చూడగానే దండం పెట్టుకో బంగారూ అన్నారు. నేను అప్రయత్నముగా పాద నమస్కారం చేసాను. వెంటనే ఇంతకు కొద్దిసేపు ముందు కలలో నాపక్కన ఆయన నిలబడింది గుర్తుకు వచ్చింది.

ఇక అప్పుడే తిరిగి రాత్రి బస్ లో హైదరాబాద్ వచ్చేసాము. అక్కడ అందరిలో సేవా భావము ఎక్కువగా కనిపించింది.భోజనము, వసతి తక్కువ ధర లోనే ఏర్పాటు చేసారు.చిన్న చిన్న రూములలో అక్కడే నివాసము ఏర్పాటు చేసుకొని వున్న వారున్నారు. ఒక పూటనే వున్నందువలన అక్కడి ఇతర ప్రదేశాలు చూడలేదు.తరువాతి సంవత్సరము కూడా ఆవిడకి తోడుగా వెళ్ళాను. అప్పుడూ ఒక పూట్నే వుండి వచ్చాము. ఆయన శివలింగము తీయటము,అందరికీ ఏవేవో బహుమతులు గాలి లో సృస్టించి ఇవ్వటము వగైరా ఏమో కాని అక్కడ ఆయన ఏర్పాటు చేసిన విద్యాలాయాలు, ఆసుపత్రి మొదలైన వాటి తో సామాన్య జనులు లాభ పడుతున్నారు.అంతా ఒక పద్దతి ప్రకారము నడుస్తోంది.ముఖ్యముగా హిందూ దర్మ ప్రచార మైతే జరుగు తోంది.అక్కడి వెళ్ళి వచ్చాక సాయిబాబా మీద నమ్మకము, భక్తి ఐతే కలుగ లేదు కాని ,వ్యతిరేకత ముందంత లేదు.

పైన వున్న చిత్రము పుట్టపర్తి యూనివర్సిటీ ది.

Monday, June 29, 2009

బరోడ-జీవన శైలి

బరోడా లో నాకు చాలా నచ్చిన ప్రదేశము యం.యస్ (మహరాజా సాయాజీ )యునివర్సిటీ ఏరీయా .మా హొం సైన్స్కాలేజీ కి వెనుక వైపు గా ఫైనాన్స్ ఫాకల్టీ వుండేది.నాకు వీలైనప్పుడల్లా అక్కడికి వెళ్ళేదాన్ని. ముఖ్యంగా స్కల్ప్చర్యూనిట్ లో పిల్లలు రకరకాలుగా బొమ్మలు చెక్కుతుంటే చూస్తూవుండాలనిపించేది.
బరోడాలో విద్యావిధానము చాలా బాగుండేది. అప్పటికే హైదరబాద్ లో యం సెట్ హవా మొదలయింది. కాని ఇక్కడమాత్రం ఇంకా రకరకాల కొర్స్ లు చేసేవారు. అప్పటికింకా యంసెట్ మొదలుకాలేదు.కాలేజీ లలో కూడా చాలాస్నేహపూరిత వాతావరణముండేది.అమ్మాయిలూ,అబ్బాయిలూ చాలా ఫ్రెండ్లీగా వుండేవారు. టీచర్లూ, విద్యార్ధుల మద్యకూడా చక్కని అనుబంధముండేది.మా అబ్బాయి భవన్స్ స్కూల్ లో చదివే వాడు. స్కూల్ లోనే బోజనము పెట్టే వారు. మేము చూడటాని కి వెళ్ళినా మాకూ మర్యాదలు చేసేవారు.పిల్లలకి ,అపనా కాం అప్నేఆప్ కరనా అని ,వాళ్ళ బుక్స్ కికవర్స్ వేసుకోవటమూ,సర్ట్స్ కి బటన్స్ కుట్టుకోవటమూ, షూస్ పాలిష్ చేసుకోవటమూ వగైరా నేర్పించారు.స్కూల్స్ లో కౌన్సలర్ తప్పకకుండా వుండేవారు.పిల్లలకి సహాయకారి గా వుండేవారు.

అప్పటికే అక్కడ అమ్మాయిలు రకరకాల డ్రస్ లు వెసుకునేవారు.హైదరబాద్ లో అమ్మాయిలు లంగా వొణీలనుంచిఅప్పుడప్పుడే డ్రస్ లకు మారుతున్న రోజులవి.స్టార్చ్ చేసిన కాటన్ చీరలు పెద్ద కొంగు ,చిన్నకొంగు తో ,బ్లౌజ్ పెద్దచేతులు, చిన్న చేతుల తో వేసుకునే నాకు వాళ్ళ డ్రసెస్స్ వేరుగానే అనిపించేవి.పెద్ద వాళ్ళు తెల్ల జుట్టు తో రెండుజజడలేసుకొని ,ముందుకేసుకొని,పెద్ద పెద్ద చెవి రింగులు పెట్టుకుంటే నాకు చాలా గమ్మత్తుగా వుండేది.అమ్మాయిలుఎంత వేళ అయినా నిర్భయం గా తిరగటము ముచ్చటగా వుండేది.

మా కోర్స్ లో ప్రాజెక్ట్ వర్క్ కోసం ,కేస్ స్టడీ కోసం మా స్కూల్ విద్యార్ధుల ఇంటికి, దగ్గరలోని పల్లెటూరు కి వెళ్ళటముసంభవించింది.ఎవ్వరింటి కి వెళ్ళినా ముందుగా బంగారం లా మెరిసే పెద్ద ఇత్తడి గ్లాస్ నిండా మంచి నీరు,మజ్జిగఇచ్చేవారు.ఇంటి లోపలికి వెళ్ళగానే కుడివైపు భావి, ఎడమ వైపు మెట్లు పైకి వెళ్ళటాని కి వుండేవి. చాలావరకు ఇళ్ళకిచిన్న చిన్న కిటికీ లే వుండేవి.వంటిల్లైతే ఎంత బాగా పెట్టుకునేవారో! ఇత్తడి,అల్యూమినియం గిన్నెల్లు,డబ్బాలుమెరుస్తుండేవి.నేను ఇంటి కి వచ్చాక నా వంటిల్లు నాకస్సలు నచ్చేది కాదు.వంట కూడా చాలా రకాలుచేసేవారు.టిఫ్ఫిన్స్ ఐతే చెప్పనక్కర లేదు.చాలా వరకు ఉమ్మడి కుటుంబాలే వుండేవి.నాకు తెలిసిన ఒక గుజరాతికుటుంబం ఐదుగురు కొడుకులూ,కోడల్లూ,మనవలూ,మనవరాళ్ళ తో తల్లీ తండ్రీ ఇక్కడే ఇప్పటికీ కలిసి ,నల్లకుంటలోవున్నారు

కుటుంబం లో .అందరూ కలిసి లేదా విడి విడిగా నైనా సంవత్సరానికి ఒకసారైనా వూళ్ళు చూడటానికి వెళ్ళేవారు.దానికోసమని ప్రతి నెలా ఒక బాక్స్ లో కొంత మనీ జమ చేసేవారు. మనీ ప్రయాణాలకి తప్ప వేరేగా వాడేవారు కాదు.చిన్నచిన్న ప్రయాణాలైనా ,పెద్ద పెద్ద డబ్బాలలో చిరుతిండ్లు తీసుకెళ్ళేవారు.చల్తే చల్తే ఖాలేంగే అనేవారు. ప్రయాణా లంటె అంతసులభంగా ఆడుతూ, పాడుతూ ,వెళ్ళేవారు.అది గుర్తుకు వచ్చే నా ప్రయాణాల బ్లాగ్ కి చల్తె చల్తే అని పేరుపెట్టుకున్నాను.
మాకు బరోడా లో పార్లీకర్స్, ధాండేకర్స్ ముఖ్య స్నేహితులు.వారి తో మేము బాగా ఎంజాయ్ చేసాము.అందులోముఖ్యముగా ఇప్పటికీ గుర్తు చేసుకునేది అప్పాసాహెబ్, రమేష్ పార్లీకర్ తండ్రిగారి ని. ఆయన అప్పటికే ఎనభయ్సంవత్సరాలు దాటినవారు.ఇంటి కి ఎవరువచ్చి వెళుతున్నా ,చివరికి పనిమనిషి వెళుతున్నానని చెప్పినా బెస్ట్ ఆఫ్ లక్అనేవారు. ఆయన అలా చెపుతుంటే మాకు చాలా నవ్వు వచ్చేది.అందరమూ భోజనము చేస్తుంటే గిన్నలలో మిగిలినదిపారేయ కూడదని లోపలి దాక తుడుచుకొని వేసుకునేవారు.ఇప్పటి కీ మా పిల్లలు భోజనము చివరికొచ్చాకా నువ్వుఅప్పాసాహెబ్ అవుతావా అని అడుగుతూ వుంటారు. ఎవరికిష్టమైన వంటైతే వాళ్ళు నేను అప్పాసాహేబ్అంటూవుంటారు. అలాగే బెస్టాఫ్ లక్ చెప్పటము కూడా అలవాటయ్యింది.
ఇక్కడ ఇప్పటి వరకు చెప్పింది,1980- 1984 లో నేను చూసిన బరోడా గురించి.1984 ఏప్రిల్ లో బరోడా ను హప్పీమేమొరీస్ మూటగట్టుకొని వదిలాము.బరోడా మా ఆర్మీ లైఫ్ కి చివరి మజిలీ.

ప్రేం రోగ్ లోని ఈపాట లక్ష్మీపాలస్ లోనే చిత్రీకరించారట.


Saturday, June 13, 2009

బరోడా






గుజరాత్ లో మూడవ పెద్దనగరం వడోద్రా ,సూరత్, అహందాబాద్ తరువాత అన్నమాట.ఇక్కడ చాలా ఏండ్లు మహారాజుల పరిపాలనే వుండింది. ఇక్కడి హిస్టరి గురించి నాకు అంతగా తెలీదు. నగరమంతా పాలేస్ లతో కమాన్ లు తోటలు,చిన్న చిన్న చెరువులతో చాలా అందంగా వుంటుంది(వుండేది, ఇప్పటిసంగతి తెలీదు.)
ఇక్కడమేము 1981 ఏప్రిల్ నుంచి, 1984 ఏప్రిల్ వరకు వున్నాము.రైల్ వే స్టేషన్ నుండి ఇంటికి వెళుతుండాగానే అబ్బ ఎంత బాగుంది ఈవూరు అనుకున్నాను.ఇంటికి వెళ్ళగానే స్టవ్ వెలిగించమని మా వారు అంటే ఎందుకా అనుకుంటూ స్టవ్ వెలిగించగానే అబ్బో ఇక ఈ వూరు వదలద్దు అనుకున్నాను. ఎందుకంటే స్టవ్ వెలిగించగానే నల్లా తిప్పగానే నీళ్ళు వచ్చినట్ట్లు ,గొడ మీద నాబ్ తిప్పగానే గాస్ వచ్చింది.సిలిండర్ పనిలేదు.అయిపోతుందని లేదు.నెలకి 20 రూపాయలు కడితే చాలు.పైప్ లైన్ గాస్ అన్నమాట.ఎంత సుఖమో!

దీనికంటే ముందు మావారు బరొడా లో రెండుసార్లు వున్నారు.అప్పుడు టెన్నిస్ క్లబ్ లో సుధీర్ ధాండేకర్, అయన ద్వార రమేష్ పార్లీకర్ పరిచయం వున్నారు. మేము వెళ్ళగానే రమేష్ పార్లీకర్ ఇంటికి భోజనానికి వెళ్ళాము.ఆయన భార్య కల్పన వారి అబ్బాయిలు ముగ్గురూ మమ్మలిని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. రమేష్ సైకాలజీ ప్రొఫెసర్గానూ, కల్పన ఎడ్యుకెషనల్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్గానూ పని చెస్తున్నారు. అందువల్ల అద్యాపక్ కుటీర్ లో వుండే వారు.మేమున్న ఏరియా ఫథెగంజ్.తరువాత ఆర్మీ ఏరియాకి మారాము.అన్ని కూడా దగ్గర దగ్గరనే .
రోడ్స్ అన్నీ చాలా పెద్దగా శుభ్రంగా వుండేవి.రోడ్ పక్కన పెద్ద పెద్ద చెట్లు ,వాటికింద సిమెంట్ బేంచీలు.సిమెంట్ బెంచీలు రోడ్ పక్కన ఎందుకున్నాయా అనుకున్నాను.రాత్రి కాగానే అందరూ పనులు ముగించుకోని వాటి మీద కుర్చొని చిరుతిండ్లు తింటూ రాత్రి పొద్దు పోయేదాకా వుండేవారు.పొద్దున ఆఫ్ఫిస్ లైనా దుకాణా లైనా పదకొండు తరువాతే తెరిచేవారు.కులాసా జీవులు.పెద్ద పెద్ద ఐస్క్రీం పార్లర్లూ అక్కడే మొదటిసారి చూసాను.
మే మున్న ఏరియాకి దగ్గరలోనే యూనివర్సిటీ,దాని అనుబంద కళాశాలలు వాటి ఎదురుగా కమాటీ భాగ్ అని పెద్ద తోటా వున్నాయి.ఆ భాగ్ ఎదురుగా పావ్ భాజీ, భేల్ పూరీ బండ్లు ,అక్కడ ఏంత రుచిగా చేసెవారో! ఏంతైనా గుజరాతీలు భోజన ప్రియులు.
అప్పుడే అక్కడ చైల్డ్ డెవలప్మెంట్ లో ప్రీ స్కూల్ మానేజ్మెంట్ కొర్స్ లో సీట్ వచ్చింది.మా ఫ్రేండ్ ఉషా దాండేకర్ తన బ్యూటీ పాల్లర్లో పని చేయటానికి అవకాశం ఇచ్చింది.కల్పన దీదీ బ్యుటీ పర్లర్లో మోజు కొన్ని సంవత్సరాల తరువాత తగ్గి పోవచ్చు,కాని నర్సరి టీచర్ కి గైనకాలజిస్ట్కీ మాత్రం ఎప్పటికీ డిమాండ్ తగ్గదు ముందు కోర్స్ చేయి అంది.అనే కాకుండా ఉస్మానియా యునివర్సిటే లో పి.జి చేయలేకపోయాను అనె భాధ ను తగ్గించుకొవటాని కి యం.యస్ యూనివర్సిటీ లో అడుగు పెట్టాను. అక్కడ స్టుడెంట్స్ ,లెక్చరర్ అనే తేడా వుండేది కాదు.అందరూ కలిసి ఫ్రెండ్స్ లా వుండేవారు.మొదటి సెమిష్టర్ లో నా అనారోగ్యము వలన ఫస్ట్ పార్ట్ సరిగ్గారాయలేకపోయాను..సెకండ్ పార్ట్ కూడా అయ్యాక క్లాస్ లో మార్క్స్ చదువుతూ ఫస్ట్ పార్ట్ లో మాలా బెన్ (అందరి పేర్లెకీ చివర బెన్ తప్పకుండా చేర్చెవారు) ఫేల్ అని లెక్చరర్ చదవగానే ఏంత సిగ్గు బాధ ఏడుపు వచ్చాయ్. ఇంతలోనే సెకండ్ పార్ట్ లో ఓ గ్రేడ్ అనగానే క్లాస్ మొత్తం చప్పట్ల తో అభినందించారు.ఒకే సమయములో,బాధ,సిగ్గు,ఆపైన సంతొషం ,గర్వం .అబ్బో ఆ క్షణాలు మరుపురానివి.
ఆర్మీ ఏరియాలో దక్షణామూర్తి ఆలయము చూడ తగినది.అది మామూలు దేవాలయాల లాగా కాక భిన్నం గా మొత్తము అల్యూమినియం షీట్స్ తో కట్టారు.దానిని నిర్వహించేది ఇ.యం.ఇ జవానులు.చాలా బాగుంటుంది.
అప్పుడే కొన్ని సంవత్సరాలు లక్ష్మి పాలెస్ లో విజిటర్స్ ని అనుమతించక పోవటము వలన చూడలేకపోయను.
దసరా రోజులలో ధాండియా చాలా కనుల పండుగ గా జరిగేది. అమ్మాయిలూ, అబ్బాయిలూ కలిసి రాత్రంతా తిరుగుతూ దాండియా ఆడుతుండే వారు.

వడోద్రా అని పేరు మారినా మాకు బరోడా అనటమే ఇష్టం. మాకు ఒకరకంగా బరోడా సెకండ్ హోం స్టేషన్ అనుకుంటాము.మా అందరికీ బరోడా అంటే చాలా ఇష్టం.ఎవరైనా గుజరాతీలు కనిపిస్తే మా వారు,కేంచో ,తుమారూ సూ నాం చే అని ఆప్యాయం గా పలకరిస్తారు. కల్పనా దీదీ ,ఉషా దాండేకర్ రమ్మని ఎప్పుడు ఆహ్వానిస్తారు.మళ్ళీ ఒకసారైనా వెళ్ళాలి అనె వుంది. కాని ఏప్పుడో1
1.,2.లక్ష్మి పాలెస్
3,5.దక్షణామూర్తి మందిరం,
4.యునివర్సిటీ భవనము
5.మా ఇంటి తోట,
6. మా కామపస్ ప్లే గ్రౌండ్,
7.బరోడా ఆంద్ర సమితి,
8.పావాగడ్ బరోడా కి కొద్ది దూరములో కొండమీద మాతా మందిర్,
9.కమాటీ బాఘ్

Tuesday, May 19, 2009

పోరుబందర్


భారతీయులకు కాశీ,తిరుపతి లాగే పొరుబందర్ కూడా పుణ్యస్తలము.అహింసా వాదము తో రవి అస్తమించని బ్రిటిష్ వారిని గడగడలాడించిన అసింసావాది గాంధి మహాత్ముడు జన్మించిన పుణ్యప్రదేశము.తన జీవన శైలి తో అందరూ ఎంత నిరాడంబరము గా వుండాలో,చెడు వినవద్దు,చెడుచూడవద్దు,చెడు మాట్లాడవద్దు అని అందరికి భోదించిన మహనీయుని జన్మ స్తానము. భారతీయులందరు కనీసము వక్కసారైనా దర్షించవలసిన ప్రదేశము పోరుబందర్.ఆ మహనీయుని గృహములోనికి వెళుతుంటే నే చెప్పలేని భావన కలిగింది.ఒక దేవాలయములోనికి వెళుతున్నట్లుగానే భావించి మహాత్ముని మన్సులోనే స్మరించుకున్నాను. ఆయనను ప్రత్యక్షముగా చూడలేకపొయినందుకు చాలా బాధ కలిగింది. లోనికి వెళుతుండగా నా చిన్నప్పుడు స్కూల్ లో పాడిన పాట "భలే తాత మన బాపూజీ ,బాలల తాతా బాపూజీ" పాట గుర్తుకువచ్చింది.గాంధీజీ ఇల్లు చాలా పెద్దగా వుంది.చిన్న చిన్న గదులు ,వాటికి చిన్న చిన్న కిటికీలు మొత్తము ఇల్లు చూడటానికి చాలా సమయము పట్టింది.ఆయన ఇంటికి ఎదురుగానే కస్తూరీబా ఇల్లు వుంది.ఈ పక్కన వున్నది గాంధీజీ ఇల్లు.వెనుకగా చిన్న చిన్న నల్ల కిటికీ లు కనిపిస్తున్న ఇల్లు కస్తూరిబా పుట్టిల్లు.హరికథ లో పిట్టకథలా ,కస్త్తూరీబా గది,గాంధీజీ గది ఎదురెదుగా వుండేవని ,వారి గది కిటికీలనుండి చూసుకుంటూ ఇద్దరూ ప్రేమించుకుని వివాహమాడారని గైడ్ గాంధీజీ ప్రేమకథ చెపాడు.

పోరుబందర్ నుండి దండి వెళ్ళాము.అది ఒక చిన్న పల్లె.అక్కడ సముద్రము నుండి నీరు తీసి మడులలో ఎండపెట్టి ఉప్పును తయారు చేస్తారు.దాని ని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.అక్కడి ప్రజలకు అదే జీవనాధారము.గాంధీజీ ఉప్పు సత్యాగ్రహమును ప్రారంభించింది ఇక్కడే.

పోరుబందర్ నుంచి తిరుగు ప్రయాణమయ్యాము.కొద్ది దూరము వెళ్ళగానే మాధవపురం అని బొర్డ్ కనిపించింది.దానిని చూడగానే పిల్లలు డాడీ నీపేరు మీద వూరుంది అన్నారు .మా వారిని ఇంట్లో పెద్దవాళ్ళు మాధవా అని పిలుస్తారు.వెంటనే కార్ ఆపి ఇక్కడ ఎమిటి ప్రత్యేకము ఈపేరుంది అనిదారి లో ఒకరిని అడిగాము. ఇక్కడ శ్రీకృష్ణుడు నిర్యాణము చెందారని ఆ ప్రదేశము చూపారు.పక్కన కనిపిస్తున్నది శ్రీకృష్ణుడు నది పక్కన , కూర్చొనివుండగా బోయవాడు ఆయన బొటనవేలిని పక్షి అని భ్రమపడి, భాణముతో కొట్టిన వృక్షమని స్తానికులు చెప్పారు.దానిని వాడి పోకుండా ఇన్ని సంవత్సరాలనుండీ ఇలా దడి కట్టి కాపాడుతున్నామని చెప్పారు. ఇంకా ఇక్కడ ఇలాటి ప్రత్యేకమైన వూరులు ఏమి వున్నాయి అని అడిగితే ఇంకొంచము ముందు సత్యభామ ,శ్రీకృష్ణుని తో నరకాసురుని మీదికి యుద్దానికి బయిలుదేరిన పల్లెని చూపారు.అక్కడ శ్రీకృష్ణుడు ,సత్యభామల దేవాలయము వుంది.అక్కడ చుట్టుపక్కల అన్ని పల్లెలూ ఎదోవిధముగా శ్రీకృష్ణుని గాధలతో ముడిపడి వున్నాయి.


ఆ పల్లెలన్నీ చూసుకుంటూ వెళుతుండగా మద్యాహ్నమైంది. భొజనము కోసము చూస్తే ఎక్కడా హొటల్స్ లేవు.మొతానికి ఒక ముసలామె సొజ్జరోటీ లు చేసిస్తుందని తెలిసి ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాము.అప్పటికి ఆమె దగ్గరకూడా అయిపొయాయి పైగా పిల్లలు మేము సొజ్జరోటీలు తినము అని గొడవ.మావారెమో మా నాయనమ్మ మాకు చిన్నప్పుడు జొన్న రొట్టెలు ,జొన్న అన్నము పెట్టేది నేనెప్పుడు సొజ్జరొట్టెలు తిన్లేదు తిందాము అని మొత్తానికి పిల్లలే గెలిచారు .ఆవిడ గోధుమ పిండి కొనుక్కొని వచ్చి గోధుమ రొటీలు,బటాఖా (ఆలూ)సబ్జీ చేసి ఇచ్చింది.అవి తీసుకొని రోడ్ పక్కన కార్ ఆపి తినపొయేంతలో ,పక్కన వున్న పొలము లోనుంచి రైతు వచ్చి వాళ్ళ పొలములో తినమని ఆహ్వానించాడు.లోపల రావి చెట్టుకింద నులక మంచాలు వేసి,నాలుగు సొజ్జరొట్టెలు.పచ్చడీ, మంచినీరూ తెచ్చి ఇచ్చాడు. అందరమూ తిని, హాయిగా ఆ చల్ల గాలికి పడుకున్నాము.మేము బయిలుదేరెసరికి పెద్ద,పెద్ద బంగారంలా మెరుస్తున్న ఇత్తడి గ్లాసుల నిండా చాస్ పీవో అంటూ మజ్జిగ ఇచ్చాడు.డబ్బులివ్వబోతే తీసుకోలేదు.ఆ రొజు ఆ అవ్వ ఇచ్చిన రొట్టెలు, ఆ రైతు ఆథిద్యమూ మరువలేనివి.సౌరాస్ట్ట్రీయులు సహృదయులు అనుకున్నాము.


ఇది జునాగడ్ లోని ప్రసిద్ద మసీదు.పూర్తిగా మొగలాయుల తరహాలో కట్టారు.చక్కని లతలు పూలతో చెక్కారు.దీని వెనుకనుంచి జునాగడ్ కోటకి దారి వుంది.కోట ఎక్కే సరదా లేకపోయింది,అంతే కాక చీకటి కూడా పడుతుండటముతో ముందుకు సాగాము. కొంచము దూరము వెళ్ళగానే చిన్న సిటీ కనిపించింది.అక్కడినుంచి బరోడా నాలుగైదు గంటలుంటుందని తెలియటములో ఆ రాత్రి అక్కడే బస చేద్దామనుకున్నాము.



సరైన ప్రదేశము కొరకు వెతుకుతుండగా దగ్గరలో జలారాం సత్రముందని చెప్పారు.జలారాం అక్కడి
పేరుపొందిన సాధువు.ఆయన దేవాలయములోనే ఉచిత సత్రము భోజన వసతులతో వుంది.అందరమూ హొటల్ కి వెళుదామని గొడవచేసినా మా వారు వినకుండా అక్కడే బస చేయించారు. ఆ రాత్రి అక్కడే వుండి వుదయము జలారాముని దర్షనము చేసుకొని ముందుకు సాగాము.ఆ రాత్రి మాకు నీడనిచ్చిన జలారాముడు ఈయననే.అక్కడినుంచి బరోడా నాలుగైదు గంటలే అన్నారు కా ని ఆరోజంతా పట్టింది.మావారు చాలా ఆందోళనగా కనిపించటముతో ఎమిటి అని అడిగితే పెట్రోల్ అయిపోతోంది అన్నారు. ఐతే దారి లో పోయించండి అన్నా !ఆ తెలివి లేకే వూరుకున్నానా పైసలుకూడా అయిపోయాయి అన్నారు.సగము అహ్మదాబాద్ లో నీ షాపింగ్ కే అయిపొయాయి.అందుకే రాత్రి సత్రములోవుంది.అన్నారు.బాగుంది ,యాత్ర మొదట్లో గెస్ట్ హవుస్ లో చివర సత్రములో.పొనీయండి నా గాజులన్నాయి,చెవి రింగులున్నాయి అన్నాను.వుంటే ఈ అడివిలో ఈ రాత్రివేళ ఎవరు కొంటారు అంగానే ఎట్లా డాడీ అని పిల్లలు ఏడుపు మొహం పెట్టారు .ఎంచేద్దాం జయ్ జలారాం,జై జై జలారాం అని భజన చేయండి థౌసండ్ టైమెస్ కాగానే బరోడా వచ్చేస్తుంది అన్నారు .అంతే భజన మహిమో ఇంకొటో కాని రాత్రి పదకొండుగంటలకి ఇంటికి క్షేమం గా చేరాము.జై జల్లారాం జయ్ జయ్ జలారాం .

ఈ ప్రయాణము 1983 డిసెంబర్ మొదటివారము లో చేసాము.అందువలన అన్ని ప్రదేశముల పేరులు గుర్తులేవు.కార్ లో ప్రయాణిచటము వలన చిన్న చిన్న ప్రదేశాలు కూడా చూడగలిగాము.ఇన్ని సంవత్సరాలు జరిగినయి ,ఇప్పుడు ఆప్రదేశములు మారివుండవచ్చు లేదా చారిత్రాత్మకము అయినవి కాబట్టి మారకపొనూవచ్చు.


చల్తే చల్తే మేరి ఏ బాత్ యాద్ రఖనా కభి అల్విదా నా కహనా

Wednesday, May 13, 2009

సోమనాథ్ ,ద్వారక

డిన్నర్ తరువాత సుధీర్ ధాండేకర్ వెలుతూ క్యారే ప్రభాత్ మీరు కూడా రావచ్చుకదా పిల్లలకి సెలవలెగా అన్నారు.

ఆయన సరే ఎలా వెల్దాము అని అడిగారు.మీరొస్తానంటే మా హెరాల్డ్ లో వెల్దాం అని ప్రోగ్రాం వేసేసారు.అంతే మా సౌరాస్ట్రా ట్రిప్ ప్లాన్ అయిపోయింది.మా ట్రిప్స్ అన్ని అంతే.ముందుగా పలానా చోటుకి,పలానావిధంగా అంటూ ఎప్పుడూ ప్లాన్ చేయము.ఉషా ధాండేకర్ రానంది. మేమిద్దరము,మా పిల్లలు సంజు,బిపు,మా చెల్లెలు జయ పొద్దున్నే బయలుదేరటము ఖాయమైంది.మేమంతా చాలా ఎక్షైటింగా సామానులు సర్ద్దేసాము.పొద్దున ఎనిమిదింటికి సుధీర్ హెరాల్డ్ కార్ తీసుకొని వచ్చేసారు.
మా మొదటి మజిలి అహ్మదాబాద్.షబర్మతి నదీ తీరాన వున్న గాంధిజీ షబర్మతి ఆశ్రమానికి వెళ్ళాము.ప్రశాంతమైన వాతావరణము లో చిన్న చిన్న కుటీరములతో ఎంతో ప్రశాంతముగా వుంది.ఒక కుటేరము గాంధీజీ ది అని,అందులో గాంధీజీ ఉపయోగించిన వస్తువులను ప్రదర్షన కోసము వుంచారు.అక్కడ వున్నంత సేపూ ఒక పవిత్రమైన ప్రదేశం లోవున్న భావన కలిగింది.నాకైతే అక్కడే వుండి పోవాలనిపించింది. భొజనం తరువాత టెక్ష్టైల్స్ మిల్ల్స్ షాప్స్ కి వెళ్ళాము.అహ్మదాబాద్ టెక్ష్టైల్ మిల్ల్స్ కి ప్రసిద్ది.బట్టల చిన్న చిన్న ముక్కలు చాలా చవుకగా అమ్ముతారు.సంజుకు బోలెడు డ్రెస్స్ లు కుట్టవచ్చని సంతోషపడిపోయాను. మవారి ని పట్టించుకోకుండా ఎన్ని పీసెస్ కొన్నానో.రాత్రి ఓపెన్ కార్ థియేటర్ లో సినిమా చూసాము. కార్ లో కూర్చొని భేల్పూరి తింటూ సినిమా చూడటము పిల్లలు ఎంజాయ్ చేసారు.
మరునాడంతా ప్రయాణము చేసి మరునాడు సాయంకాలానికి పోరుబందర్ చేరుకున్నాము.సుధీర్ వాళ్ళ గెస్ట్ హవుజ్ లో బస ఏర్పాటు చేసారు. అక్కడ రెండు రోజులు వున్నాము

సోమనాథ్ దేవాలయము


ఒకరోజు జ్యోతిర్లింగాలలో ఒకటైన సొమనాథ్ దేవాలయాని కి వెళ్ళాము.ఆ రొజు అంతగా రద్దీ లేదు.కార్తీక మాసములో శివదర్షనము కలగటము మా పుణ్యము అనుకున్నాను.అదీ అనుకోకుండా జ్యోతిర్లింగ దర్షనము.అప్పుడే ఒక పక్కగా రిపేరులు చేస్తున్నారు.దేశము లోని అన్ని దేవాలయాల లాగే ఈ దేవాలయమూ ముష్కరుల దాడికి గురైంది.అలాంటివి చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది.
అక్కడి నుంచే ద్వారక కి వెళ్ళవచ్చు.బోట్ లో ద్వారక కి బయిలుదేరాము.శ్రీ క్రిష్ణుని రాజధాని ద్వారకకు వెళుతున్నామనగానే యన్.టి.రామారావు గారి శ్రీక్రిష్ణ సినిమాలన్నీ గుర్తుకు వచ్చాయి.మనసంతా ఉద్వేగముతో నిండి పోయింది.ద్వారక దగ్గర పడుతుండగా మా వారు అదిగో ద్వారక ,ఆలమందలవిగో అంటూ పద్యమందుకున్నారు.పిల్లలు క్రిష్నుడి కథలు గుర్తు చేసుకున్నారు.జయ ఎదొ పాట చిన్నగా పాడుకుంటోంది. అందరి భావోద్వేగాల మద్య ద్వారక చేరాము.యాదవుల అంతము తరువాత ద్వారక సముద్రము లో మునిగిపోయింది.ఆ తరువాత ఆ ప్రదేశములో కొద్దిగా బయటకి వచ్చిన ద్వీపము లో కొత్తగా శ్రిక్రిష్ణుని ,సత్యభామ,రుక్మిణి ల భవనములను uఉహించి నమూనాలుగా కట్టారు.దీనిని బేట్ ద్వారక అంటారు.ఎంతో ఊహించుకొని వెళ్ళిన నాకు నిరుత్షాహముగా అనిపించింది.ఇది రుక్మిణి భవనము,ఇది సత్యభామ భవనము అంటూ రకరకాల రంగులు వేసిన చిన్న చిన్న ఇళ్ళు చూస్తే ద్వారక చూసిన అనుభూతి కలుగలేదు. అవే భవనాలు కొద్దిగా నైనా పురాతనముగా వుండేటట్టుగా కడితే బాగుండేది అనిపించింది.ఒకవైపు శ్రీక్రిష్ణుడు సంచరించి న పుణ్య ప్రదేశానికి వచ్చిన తృప్తి ,ఇంకోవైపు ఊహించినట్లుగా లేదన్న నిరుత్షాహము కలిగింది.

అక్కడ తిరగటానికి సుధీర్ అక్కడి ప్రదేశాలు తెలిసిన డ్రైవర్ తొ ఒక జీప్ అరేంజ్ చేసారు.అది ముందు డ్రైవర్ సీట్ పొడుగ్గా ,వెనకాల ఒక పొడుగు సీట్ ఆ వెనుక అడ్డముగా రెండుపక్కల రెండు సీట్ల తో విశాలంగా వుంది.మేము ద్వారక నుంచి వచ్చేసరికి డ్రైవర్ సముద్రము వడ్డున ఎదురుచూస్తున్నాడు.అప్పటికి రాత్రి ఎనిమిది అయ్యింది.అందరము అలసిపోయాము.డ్రైవర్ తో ముందువైపు మా వారు సంజు ,వెనుక నేను ,జయ,బిపు కూర్చున్నాము.డ్రైవర్ అక్కడి విషయాలు ఎవో చెబుతున్నాడు.నేను ,జయ ఎదొ మాట్లాడుకుంటున్నాము.ఇంతలో డ్రైవర్ జీప్ ని మేన్ రొడ్ మీదనుంచి పక్కకి తిప్పాడు. ఇప్పుడు ఇటెక్కడికి రేపు పోదాము పిల్లలు నిద్రకు వచ్చారు అని మావారి అందామని ముందుకు వంగాను. ఇంతలో నాభుజం మీద చేయి పడింది.ఎవరా అని వెనక కి చూసాను. ఒక అమ్మాయి బహుషా పదహారు ,పదిహేడు వయసు వుండవచ్చు,నా వెనుక సీట్లో కూర్చొని వుంది.నేను చూడగానే నవ్వింది.వెన్నెల వెలుగు లో ఎర్ర చీరా ,పసుపు జాకిట్టు వేసుకొని గుజరాతి రకముగా తల పైన కొంగు ముసుగు వేసుకొని,గుడ్రటి మొహము తో మెరిసి పోతూ కనిపించింది.మేము జీప్ ఎక్కిన్నప్పుడు లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని అర్ధము కాలేదు. మావారి అడుగుదామంటే నోట మాట రావటములేదు. వెనకకి ముందుకి చూస్తున్నాను.జీప్ ఒక చెరువు పక్కనుంచి చిన్న కొండ ఎక్కింది.అక్క్డద చెరువులో కొంతమంది ఆడవారు దీపాలు వదులుతున్నారు.చెరువు దాటగానే చిన్న గుడి దాని ముందు కొన్ని షాపులు కనిపించాయి. అక్కడ జీపు ని ఆపి మమ్మలిని దిగమన్నారు.వెనకకి చూద్దును కదా ఆ అమ్మయి లేదు.డ్రైవర్ ,మా వారు ఎమి మాట్లాడు తున్నారో వినటము లేదు.ఆయన వెనుకనే గుడి లోకి వెళ్ళాను.అక్కడ అమ్మవారి విగ్రహము చూడగానే అరె ఈ అమ్మాయి ఇప్పుడు మనతో వచ్చిందికదా అని నాకు తెలికుండానే గట్టిగా అరిచాను. మావారు జయ బిత్తర పోయారు.పుజారి ఎమిటి అని అడ్గ్గానే నేను జీపు లో చూసిన అమ్మాయి గురించి చెప్పాను.అప్పుడు ఆయన చెప్పింది ఇది: ఈ గుడి హరిసిద్దిమాతా ది.ఈ గుడి కింద నుంచి ఉజ్జయిని లోని హరిసిద్ది మాత గుడి కింది కి సొరంగ మార్గము వుంది.ఉజ్జయిని రాజు శత్రువుల నుంచి తప్పించుకొని ఆ దారి గుండా ఇక్కడికి వచ్చి తలదాచుకున్నాడు.ఆయన శత్రువులను జయించి తిరిగి పాలనలో కి వచ్చిన్నప్పుడు ఈ గుడి కట్టించాడు.ప్రతి కార్తీక పౌర్ణమి కి అమ్మవారు ఉజ్జయిని నుంచి ఇక్కడి కి వస్తుంది అని నమ్మకము.అలాగే ఆరొజు ఎవరోవకరి కి దర్షనము ఇస్తుంది.ఈ రొజు కార్తీక పౌర్ణమి మీకు దర్షనము ఇచ్చింది అని చెప్పారు.ఇది నమ్మలేని నిజం.అసలు హరిసిద్దిమాత పేరె నేను ఎప్పుడూ విన్లేదు.అప్పుడు ఆ గుడి కి వస్తున్నట్లు కూడా తెలీదు.చివరి నిమిషములో డ్రైవర్ జీప్ అటు తిప్పాడు.ఇప్పటి కీ గుర్తుకు వస్తే వళ్ళు గగుర్లు పొడుస్తుంది

అమ్మవారి ని మనసారా పూజించుకొని తిరిగి వెళుతుండగా డ్రైవర్ ,అశ్వథామ ఈ పరిసరాలలో తిరుగుతూవుంటాడు.అప్పుడప్పుడు కొంతమంది చూసామని చెబుతుంటారు అన్నాడు.గది కి చేరాకా ,పిల్లలని నిడ్రపుచ్చి నేను ,జయ బాల్కనీ లో అశ్వధామ కనిపిస్తాడేమొ చూద్దామనుకుంటూ కూర్చొని హరిసిద్దిమాత గురించి చెప్పుకునంటున్నాము.అశ్వధామ అయితే కనిపించలేదు కాని ,ఒక అపూర్వమైన ద్రుశ్యము కనిపించింది.కార్తీక పున్నమి సంధర్భముగా చాలా మంది ష్త్రీలు సముద్రము వడ్డున నిలబడి పాటలు పాడుతూ సముద్రములో దీపాలు వదులుతున్నారు.మా అథిధి గృహం సముద్రము వడ్డుకు దగ్గరలో వుండటము మూలముగా మాకు చూసే భాగ్యము కలిగింది.కొద్దిసేపు తరువాత అంతా వెళ్ళిపోయారు.ఆ నిశబ్ద ,వెన్నెల రాత్రి అలల పై తేలి పోతున్న దీపాలు ,ఒహ్ వర్ణిచటము నా తరము కాదు.

చల్తే చల్తే మేరి ఏ బాత్ యాద్ రఖనాఖభీ అల్విదా నా కహనా

Friday, April 10, 2009

పదనిసలు

కొత్తగా వచ్చిన అతిధి కళ్ళజోడు సరిగ్గా సహకరించకపోవటము తొ నావల్స్ చదవటము ఆగిపొయింది.టి వి అలవాటు

లేదు,చిన్న చిన్న అనారొగ్యాలు చిరాకు పుట్టిస్తున్నాయి.ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు

చీకటి అవుతుందా అని విసుగ్గా రోజులు గడుపుతున్న నాకు,బ్లాగ్ అనే కాలక్షేపము

చూపించాడు రవి.నీ ఓపెన్ డైరి రాసేయ్ ఆంటూ బ్లాగ్ ఓపెన్ చేసిచ్చాడు బిపు.

నీ మదురస్మ్రుతులతొ మొదలు పెట్టు అంది సంజు.

రాసిన ప్రతిదీ విని ,కొన్ని ఎడిట్ చేసి,సలహాలిచ్చి ప్రొత్సహించారు మావారు .

దాంతొ వూపొచ్చేసి ,తెగ అవాకులూ చవాకులూ రాసేసి బ్లాగ్ వక వ్యసన మైపోయింది.

వారాని కి వక వుత్తరము రాయటా నికి బద్దకించి అమ్మ తో శ్రీవారి తో చివాట్లు తిన్న నేను ఇప్పుడు ఎడా పెడా

రాసేస్తుంటే నా కే విన్తగావుంది.

ఆ వ్యసనాని కి సొగసులద్ది ,అందముగా తీర్చి దిద్ది,సలహాలు ఇచ్చిన జ్యొతి గారు,

మాలా తెలుగులొ రాయండి అని హెచ్చరిన్చట మే కాకుండా లెఖిని లింక్ ఇచ్చి అందులో ఎలా రాయాలో వివరించిన
కొత్త పాళి గారు,
పేరాలుగా రాయండి బాగుంటుంది అని సలహా ఇచ్చి రొజూ సాయంకాలము కాసేపు సరదా కబుర్లు చెపుతున్న సృజన
ఇంట్లో వాళ్ళే కాదు మేమూ చదువుతాము అని మొదటిసారి తన కామ్మెంట్ తొ తెలియ చెప్పిన దుర్వాసుల

పద్మనాభం గారూ,వాళ్ళ అమూల్య మైన అభిప్రాయాలు తెలిపిన భాస్కర రామిరెడ్డి గారు,రమ్య గారు,పరిమళం

గారు,ఫణి గారూ, మధురవాణిగారూ,నాయని ఆదిత్య మాధవ్ గారూ,చిలకమూరు విజయ మోహన్ గారూ

హర్సోదయం గారూ, అబ్బొ ఎంత మంది బ్లాగ్ ఫ్రెండ్సొ అందరికి వందనాలు,ధన్యవాదాలు
.
ఇక చూస్కోండి ఎంత ఉత్సాహము వచ్చేసిందో. నచ్చిన పాటల కోసము కమ్మటి కల ,ఆపై పదనిసలు.మా నాన్న గారి

వుద్యోగ రీత్యా ,మా వారి వుద్యోగ రీత్యా కొన్ని ప్రదేశాలకి వెళ్ళాను.వాటిలో కొన్ని నాకు నచ్చినవి,కొన్ని

అనుభూతులను పొందినవి వాటి సమాహారమే ఈ పదనిసలు.ఎన్ని చూసినా,

ఎంత తిరిగినా వక కోరిక వుంది ,అది కొన్ని రోజులు హిమాలయాలలో వుండాలని,ఎవరైనా మహాత్ములను

దర్షించుకొవాలని .ఎంత అత్యాసో.