చల్తే చల్తే మేరి యే బాత్ నహి భూల్నా ఖభీ అల్విదా నా కహెనా . . .

Thursday, October 25, 2012

నల్లపోచమ్మ - యూసుఫ్ గూడ









యూసుఫ్ గూడా బస్తీ కీ ముత్యాలమ్మ తల్లి గ్రామ దేవత అట .ఈ అమ్మవారు ఎప్పుడు ఎలా వెలిసిందో , ఈ చిన్న గుడి ఎవరు ఎప్పుడు కట్టించారో నేను అడిగినవాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు . మా కాలనీ లో వున్న సీతమ్మగారు 20 సంవత్సరాల క్రితము వాళ్ళు ఇక్కడి కి వచ్చేసరికే ఈ గుడి వుంది అన్నారు . ఇక్కడ ఆ రోజులలో ఎక్కువగా బలులు ఇచ్చేవారట.





13 సంవత్సరాల క్రితం యన్. జనార్ధన రెడ్డి గారు , ముత్యాలమ్మ గుడి కి పక్కనే ఓ గుడి కట్టించి అందులో నల్లపోచమ్మను స్థాపించారట. ఈ గుడి లో బలులు ఇవ్వరట. అమ్మవారు చాలా కళగా వుంటుంది . చాలా మహిమ కలది అని కూడా అంటారు . 11 సంవత్సరాల నుంచి సీతమ్మగారి ఆధ్వర్యం లో , మా కాలనీ ఆడవారు  ఇక్కడ రోజూ సాయంకాలము, లలితా సహస్రనామాలు పారాయణ చేస్తున్నారు .మధ్య మధ్య భారతము , భగవద్గీత , రామాయణము కూడా పారాయణ చేసారట . రామాయణము పారాయణ చేసి నంత కాలమూ ఓ కోతి అక్కడకు వచ్చి , పక్కనే గోడ మీద కూర్చునేదట . రామాయణ పారాయణము అయ్యాక రాలేదట !

అలాగే జయలక్ష్మి అనే ఆవిడ 9 సంవత్సరాల క్రితం ఇటువైపు ఇల్లు కట్టు కొని వచ్చారట . వకరోజు రాత్రి కలలో , ఏదో గుడి , అక్కడ అందరూ ఏదో చదువుతున్నట్లుగా కల వచ్చిందిట. ఆవిడ అంత పట్టించుకోలేదట. మరునాడు రాత్రి మళ్ళీ ఆ గుడి స్పష్టంగా కనిపించిందిట. అమ్మవారి ముందు ఏదో రాయిలాగా కూడా కనిపించిందట .  మరునాడు సాయంకాలం ఆ గుడి ఈ చుట్టుపక్కల ఏమైనా వుందా అని వెతుక్కుంటూ వస్తే ఈ గుడి కనిపించిందిట. అప్పుడే అక్కడ కొంతమంది ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారుట . ఆ గుడి , గుడి లోని అమ్మవారు , అమ్మవారి ముంది శిల అంతా కలలో కనిపించినట్లే వుందిట . ఆ రోజు నుంచి ఆవిడా ఆ బృదం లో చేరి రోజూ లలిత చదువుతున్నారట . ఇంచు మించు ఇలాంటి అనుభవమే నాకూ కలిగింది . పదిరోజుల క్రితం నేనూ ఏదో గుడిలో లలిత పారాయణ చేస్తునట్లుగా కల వచ్చింది . ఏ గుడా , ఎక్కడా అని నేనూ కొంచం ఆలోచనలో పడ్డాను . పొద్దున పూజ చేసుకొని , వచ్చి కూర్చోగానే , అక్కడే ఊడుస్తున్న మా పనమ్మాయి , అమ్మా దసరా పదిరోజులూ నల్లపోచమ్మ గుడి లో బాగా చేస్తారమ్మా . పక్కనే షెడ్ లో పెద్ద అమ్మవారి విగ్రహం పెడుతున్నారు . సీతమ్మ వాళ్ళు రోజూ వెళ్ళి ఏదో చదివి వస్తారు అన్నది . వెంటనే సీతమ్మగారి దగ్గర కు వెళ్ళి ఎన్నిటి కి వెళతారో తెలుసుకొని రమ్మని పంపించాను . రోజూ పది నిమిషాల తక్కువ ఐదుకు వెళుతారుట నిన్ను అప్పటికల్లా రమ్మన్నది తీసుకెళుతానన్నది అని చెప్పింది . ఆ విధం గా అమ్మవారు నన్నూ పిలిపించుకుంది . ఈ పది రోజులూ అమ్మవారి ముందు కూర్చొని లలితా పారాయణ చేయగానే ఎంతో మనశ్సాంతిగా , హృదయం తేలికపడ్డట్టుగా అనిపించింది .























ఈ పదిరోజులూ ఉత్సవాలు చాలా బాగా జరిగాయి . రోజూ ఉదయమూ , సాయంకాలమూ లలితా సహస్రనామపారాయణము జరిగింది . అందులో మా కాలనీ ఆడవారే  కాకుండా చుట్టు పక్కల బస్తీ వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధ గా చేసారు . ఆరో రోజు సుహాసినీ పూజ , ముగ్గురు ముత్తైదువులకు , ఓ బాల కు చేసారు . ఒక రోజు అన్నదానం జరిగింది . ఏడోరోజు హోమం చేసారు . నిన్న విజయదశమి రోజు లలిత పారాయణ అయ్యాక అమ్మవారి ని కదిలించారు . ఈ తొమ్మిదిరోజులూ అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజించారు.



7 comments:

తృష్ణ said...

బావున్నాయండి మీ శరన్నవరాత్రి పూజావిశేషాలు.మీకు కల రావటం విశేషం. మా ఇంటి దగ్గరలో ముత్యాలమ్మవారి గుడి ఒకటి ఉంది. చాలా బావుంది. ఆ గుడి తాలుకూ విశేషాలు కూడా రాద్దాం అనుకుంటున్నాను.

Lakshmi Raghava said...

గుడి విశేషాలు బాగున్నాయి. ఇన్ని రోజులు తెలీనే లేదు. మీ కు కల రావడం కూడా విశేషమే ..ఒక్కోసారి ఇలాటివి చాల అద్భుతంగా అని పిస్తుంది.దసరా శుభాకాంక్షలు.

శ్రీలలిత said...


మీకు అలాగ కల రావడమే చాలా విశేషం.
నవరాత్రులూ చక్కగా పారాయణ చేసినందుకు ఆ లలితాదేవి మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది.

పరిమళం said...

ఆహా...కన్నులపండుగగా ఉందండీ...అంటే మీరుఅంతలా కళ్ళకుకట్టినట్టు వివరించారుమరి!

రాజ్ కుమార్ said...

బాగున్నాయండీ.. విశెషాలు..
ఇలాంటిదే మా నాన్నగారికీ ఒక అనుభవం ఉంది ;)అది గుర్తొచ్చింది.

మాలా కుమార్ said...

తృష్ణ గారు ,
లక్ష్మీరాఘవ గారు ,
శ్రీలలిత గారు ,
పరిమళం గారు ,
రాజ్ .
అవునండి కొన్ని సార్లు మనము నమ్మలేని అనుభవాలు కలుగుతుంటాయి .తరువాత చాలా ఆశ్చర్యం , ఆనందం ఇంకా చెప్పలేని అనుభూతి కలుగుతుంది .
అందరి కీ థాంక్స్ అండి .

psm.lakshmi said...

బాగున్నాయి విశేషాలు మాలాగారూ. మొత్తానికి దసరా బాగా చేశారన్నమాట.
psmlakshmi