Saturday, January 22, 2011
బడిచావిడీ హనుమాన్ జీ
నాకు ఏమైనా టెన్షన్ గా వున్నా , మనసు బాగున్నా బాగలేకపోయినా బడి చావిడీ లోని హనుమాంజీ ని దర్శించుకోవటము అలవాటు . ఈ రోజు వెళ్ళాలి అనిపించి , పొద్దున వెళ్ళి వచ్చాను . అసలు నాకు ఈ గుడికి వెళ్ళటము మా అత్తగారితో అలవాటు అయ్యింది . ప్రతి మంగళవారమూ వెళ్ళేవాళ్ళము . అప్పుడప్పుడు కాచిగూడా లోని హనుమంతుని గుడి కి వెళ్ళేవాళ్ళము .
ఈ దేవాలయము , బడిచావిడీ లో , పోలీస్ స్టేషన్ పక్కన వుంటుంది . చాలా చిన్న దేవాలయము . రావి చెట్టు చుట్టూ కట్టివుంటుంది . చెట్టు కి ఓ పక్కన దాదాపు కింద విగ్రహం వుంది . అన్ని దేవాలయాలలో లా కాకుండా చాలా చిన్న విగ్రహము . కొంచము కిందికి వంగే నమస్కరించుకోవలసి వుంటుంది . ప్రదక్షణ చేసేటప్పుడు వెనుకవైపు చిన్న సందులా వుంటుంది . ఒకొక్కరే వెళ్ళగలరు . ఈ దేవాలయము 100 సంవత్సరాల క్రితముది అన్నారు అక్కడున్న పూజారి . ఈ రోజు ఆయనకు మౌన వ్రతమట . చేతిలో రాసి చూపించారు . ఇంతకు మించి ఆ గుడి చరిత్ర తెలుసుకోలేక పోయాను . అదృష్టం ! నేను ఇంతకు ఎప్పుడూ కూర్చొని , కొద్ది సాఎపు ధ్యానం చేసుకొనే స్తలం ఖాళీగా వుంది . కాసేపు కూర్చొని వచ్చేసాను . మధ్యలో కొన్ని సంవత్సరాలు ఈ గుడిని మూసేసి వుంచారు . మళ్ళీ ఈ మధ్యనే తెరిచారట .
నాకు ఏదేవుడన్నా కాస్త భయమూ భక్తీ ఎక్కువే . మా ఇలవేలుపు వెంకటేశ్వరునీ పూజిస్తాను , శివపార్వతులు , సీతారాములూ , దుర్గా దేవీ ఎవరన్నా భక్తే కాని ఆంజనేయస్వామి అంటే కొంచం ఎక్కువ . ఆయన ఎప్పుడూ నన్నో కంట కనిపెడుతూవుంటాడని నా భావన . చాలా సంవత్సరాలుగా , అంటే పెళ్ళైన కొత్తలో బడి చావిడీ హనుమాన్ జీ దేవాలయానికి వెళ్ళటము అలవాటైనప్పటి నుంచి ప్రతి రోజూ ఆంజనేయస్వామి దేవాలయానికి వెళుతున్నాను . పిల్లలు కొంచం పెద్దవాళైనాక బడీ చావిడీ వరకు వెళ్ళే టైం లేక మా ఇంటి దగ్గరే వున్న హనుమంతుని గుడి రోజూ వెళ్ళే దానిని . అక్క డే ఒక పెద్దావిడ పరిచయము అయ్యారు . నలభై రోజుల పాటు , రోజూ 108 ప్రదక్షణలు చేస్తే మంచిదని చెప్పారు . అప్పటి నుంచి నాకు వీలున్నప్పుడల్లా చేస్తూ వుంటాను .
ఖైరతాబాద్ , నిలోఫర్ హాస్పెటల్ దగ్గర ఓ హనుమాన్ దేవాలయము వుంది . అది బహుషా మార్వాడిలు కట్టించారనుకుంటాను . చాలా పెద్ద ప్రాంగణము లో వుంది . గుడి కూడా కొంచము పెద్దదే . ఆ ప్రాంగణములోకి ప్రవేసిస్తునే మన్సంతా ప్రశాంతము గా అవుతుంది . ఈ దేవాలయములో ప్రతి గురువారము , ఆదివారము ఒక పూజారి , పిల్లలకు దిష్టి తీస్తాడు . పిల్లల కనే కాదు , పెద్దలకు కూడా తీస్తాడు . మా పిల్లల చిన్నప్పుడు , హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఓసారైనా తీసుకెళ్ళి దిష్టి తీయించేదానిని .
విద్యానగర్ కు మారాక , అక్కడి రామాలయము లో ఆంజనేయస్వామికి , డి . డి కాలనీకి మారాక అహోబిలమఠం లో వున్న మారుతికి ప్ర్దక్షణలు చేసేదానిని . ప్రస్తుతము మా ఇంటి కి దగ్గరలోనే వున్న హనుమంతుని గుడి వెళుతున్నాను . ఇంకా నేను రెగ్యులర్గా దర్శించే ది ఆర్. టి. సి క్రాస్ రోడ్ లో వున్న పంచముఖ ఆంజనేయస్వామిని . ఈ సారి అటు వైపు వెళ్ళినప్పుడు ఆ ఫొటోలు కూడా తీసి పెడుతాను .
Tuesday, January 18, 2011
సిద్ది గణపతి - రుద్రారం
హైద్రాబాద్ నుంచి మెదక్ వెళ్ళే దారిలో హైవే మీద పటాంచెరువు నుంచి ఇంచుమించు 16 కిలోమీటర్ల దూరములో వున్నది ఈ గణపతి ఆలయము . ఇది 300 సంవస్తరాల పురాతనమైన ఆలయము . ఒకొప్పుడు ఇక్కడ చింతల తోపు వుండేది . శివరామ భట్ అనే భక్తుడు అనంత చదుర్దశి నాడు వినయకుని పూజించేవాడు . ఒక సారి ఆయన తిరుపతి కి పాద యాత్ర చేస్తూ ఇక్కడ విశ్రమించాడు . ఆ రోజు అనంత చతుర్దశి అయ్యింది . అప్పుడు ఆయన పూజ చేసుకుందామని , అనుకోకుండా ఓ శిల ను ముట్టుకోగా అది వినాయకుని రూపం గా మారింది . దానిని ఇక్కడ ప్రతిష్టించి పూజించాడు . అలా ఆయనకు , ఆయన పర్యటనలలో ఏడు సార్లు వివిధ ప్రదేశాలలో జరిగింది .
అవి ;
1 . చింతలగిరి - కర్ణాటక
2. రేచింతల - జహీరాబాద్
3. రుద్రారం - మెదక్
4. అజ్ఞూర్ - మెదక్
5- మల్కంపాడు - మెదక్
6. చీకుర్తి - నారాయణపేట్
7 . అమీరాబాద్
ఈ వివరాలు శివరామభట్ వ్రాశిన ' లఘుభఖ్త విజయం ' అనే పుస్తకము లో వున్నాయి . ఆ గ్రంధము నాందేడ్ గ్రంధాలయము లో దొరికింది . ఎ దేవాలయపు ధర్మకర్త లలో ఒకరైన అల్లూరి గోపాల్ గారు , ఈ దేవాలయము మీద రీసర్చ్ చేసి , ఈ వివరాలన్నీ సేకరించారు .
శివరామభట్ తరువాత , ఓ సారి , నిజాం నవాబు దగ్గర మిలిటరీ కమాండర్ గా వున్న ' మక్కందాస్ ' అనే అతను , బీదర్ నుండి బలగాలను తీసుకొని నవాబుగారి దగ్గరకు వెళుతుండగా , ఆయన గుర్రము ఇక్కడ వెనుక అడుగు వేసి కదలకుండా వుండిపోయింది . ఎందుకు ఆగిపోయిందా అనుకొని ఆయన అక్కడే గూడారాలు వేసుకొని నిద్ర చేయగా , కలలో వినాయకుడు కనపడి పూజ చేసుకోమన్నాడు . అప్పుడు ఆయన నిద్ర లేచి ఆ ప్రదేశమనతా వెతికగా , శివరామభట్ స్తాపించిన వినాయక విగ్రహము కనిపించింది . ఆ విగ్రహమును పూర్తిగా రూపము వచ్చేట్లుగా చెక్కించి , గుడి కట్టించాడు . వుద్యోగ విరమణ చేసి ఆ స్వామిని పూజించుకోసాగాడు . ఆయన తరువాత ఆయన శిష్యురాలు దుర్గా బాయి ఈ ఆలయము భాద్యత తీసుకున్నారు .
మక్కందాస్ ఇక్కడే సజీవ సమాధి చెందారు . దుర్గాబాయి కూడా ఇక్కడే సమాధి చెందారు .
ఇప్పుడు ఎండోన్మెంట్ స్వాధీనములో వున్నది .
ఈ ఆలయము ప్రత్యేకత ఏమిటంటే , శివరామభట్ స్తాపించిన ఈ ఏడు ఆలయాలు కూడా ధక్షిణముఖం గా వుంటాయి . స్వామివారిని సింధూరము తో అలంకరిస్తారు .
ఈ స్వామి వారి దగ్గర ఏవైనా కోరికలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయంటారు . అందుకు ఉదాహరణలు చాలా నే చెప్పారు . తప్పక దర్శించవలసిన ఆలయము ఇది .
Sunday, January 16, 2011
6వ శతాబ్ధము నాటి భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానము






హైదరాబాద్ నుంచి , బి హెచ్ యల్ తరువాత , దగ్గర దగ్గర 8 కిలోమీటర్లు దాటిన తరువాత , కుడి వైపు " బీరంగూడ " అని చిన్న వూరు వస్తుంది . మేన్ రోడ్ కు కుడివైపు పెద్ద కమాన్ , " భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానము ' అని రాసిన ది కనిపిస్తుంది . ఆ కమాన్ నుండి లోపలికి వెళ్ళి , జంక్షన్ లో ఎడమవైపుకు తిరిగి కొద్ది దూరం వెళ్ళితే అంతా చిన్న చిన్న కొండలతో వున్న ఖాళీ మైదానములో వున్నది 6 వ లేక 7 వ శతాబ్ధము లో నిర్మించబడినట్లుగా చెప్పబడుతున్న , మల్లికార్జున స్వామి దేవాలయము .
భోగ మహర్షి , బృగు మహర్షి ఈ ప్రదేశములో తపస్సు చేసుకున్నారట. అక్కడే గుహ కింద నుండి శ్రీశైలం కు సొరంగ మారగము కూడా వుండేదట . మహర్షులు ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళేవారని , ఆ స్వామి నే ఇక్కడా ప్రతిష్టించారని , అందుకే ఇక్కడ శివుని కూడా మల్లికార్జున స్వామి అంటారట .
బాదామి చాళుక్యుల కాలం లో ఇక్కడ దేవాలయము కట్టించారని , రాష్ట్రకూటులు , కళ్యాణి చాణుక్యులు , కాకతీయులు ఈ మల్లికార్జునిని సేవించుకున్నారని చరిత్ర. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత , నవాబుల కాలం లో కొంత వైభవం తగ్గిందట . మొగలుల దాడులలో దేవాలయము కూలిపోయిందట.
సికింద్రాబాద్ మిలిట్రీ లో పని చేసే తిప్పర వెంకయ్య అనే అతను , సన్యసించటానికి వివేకానదుని వద్దకు వెళ్ళగా , వివేకానందుడు ముందు గృహస్తధర్మం నిర్వహించి రమ్మని తిప్పి పంపారట . వెంకయ్య తిరుగు ప్రయాణములో ఇక్కడ విశ్రమించిన సమయములో స్వామి కలలో కనిపించారట . అక్కడే దగ్గర వున్న నూతిలో శివలింగం దొరికిందట . దాని తో స్నేహితుల సహాయముతో చిన్న గుడి కట్టించాడట .
1898 లో గంగా రెడ్డి అనే భక్తుడు శిలా మండపం కట్టించాడు . ఆంజనేయస్వామిని కూడా ప్రతిష్ఠించారు . వెంకయ్య తరువాత ఆయన కుమారుడు భార్గవ ఈ దేవాలయ భాద్యతను తీసుకున్నారు .వెంకయ్య గారి కుమార్తె శ్రీమతి . అన్నపూర్ణ , ఆవిడ కుమారుని తో కలిసి ఇప్పుడు వున్న విధముగా నిర్మించారు . అంతే కాకుండా పక్కనే వెంకటేశ్వరాలయము కూడా నిర్మించారు .
భ్రమరాంబా మల్లికార్జున ఆలయము లో వున్న ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద శనీశ్వరుడు వుండటము ఇక్కడి ఇంకో ప్రత్యేకత .
ఈ ఆలయము వున్న ప్రదేశము చాలా ప్రశాంతము గా వుంటుంది . ఎంతసేపు వున్నా తనివి తీరలేదు
ఈ ఆలయము నుంచి మేన్ రోడ్ మీదకు వచ్చాక ముందుకు ఇంకో 16 కిలోమీటర్ లు వెళి, కుడి వైపు మట్టి రోడ్ వెంట లోపలికి ఇంకో రెండు కిలోమీటర్లు వెళితే ఇస్మాయిల్ ఖాన్ పేట్ అనే గ్రామము వస్తుంది . అక్కడ సప్తప్ర్రాకారాయుత శ్రీ దుర్గాభవానీ మహాక్షేత్రం వుంది . పెద్ద కోట లాంటి ప్రహారి లో ఈ దేవాలయము వుంది . ఈ ప్రాహారీ నిర్మించేటప్పుడు , అక్కడ కూలి గా చేస్తున్న సోదరుని కోసం భవానీ అనే అమ్మాయి భోజనం తేగా , కొందరు తుంటరి కూలీలు ఆ అమ్మాయిని ఏడిపించారట . దానితో ఆమె కలత చెంది ఆ ప్రాకారములో ఓ మూలకు వెళ్ళి శిలగా మారి పోయిందట .
ఎనిమిది సంవత్సరాల క్రితం శ్రీ మదానంద స్వామి , ఈ ప్రదేశము లో నిదురించగా అమ్మవారు స్వప్నము లో అగుపించి దేవాలయమును నిర్మించమని ఆదేశించిందట . వెను వెంటనే నిధులు కూడా సమకూరాయట . చక్కని దేవాలయమును నిర్మించారు . దుర్గాభవాని విగ్రహము నిలువెత్తు లో వుండి , చాలా కళగా వుంది .
మేన్ రోడ్ మీదకు రాగానే ఎడమవైపు , 300 సంవత్సరాల పురాతనమైన , రుద్రారం సిద్ది గణపతి ఆలయము వుంది . దాని గురించి రేపు చెపుతాను .
మొన్న 12 వ తారీకున , పుష్య శుద్ద అష్టమి బుధవారము రోజున పూజ చేస్తే లక్ష సార్లు ఫలితమిస్తుందట . ఆ రోజున అనుకోకుండా , నేను మా అమ్మ , లక్ష్మి గారు ఈ దేవాలయాలను దర్శించుకున్నాము .
Tuesday, December 28, 2010
హైదరాబాద్ లో పూరీజగన్నాథుడు










ఈ మద్య మావారు అలా అలా జూబిలీ హిల్స్ లో కార్ లో నన్ను షికారు తిప్పుతూ వుండగా దూరం నుంచి మట్టిరంగులో ఓ గుడి గోపురం కనిపించింది . అరే ఇదేదో ఒరిస్సా గుడి గోపురం లావుందే అనుకొని , మావారిని అడిగాను . ఆయన ఇంతకు ముందు గమనిచలేదుట . పోనీ ఇప్పుడు వెళుదామా అనుకుంటే రాత్రి పదైంది . ఆ సమయము లో గుడి తలుపులు తీసి వుండవులే అనుకొని , ఆ గుడి ఎక్కడుందో వెతకకుండానే వచ్చేసాము . అప్పటి నుంచి ఆ గుడి చూడాలి అనుకుంటూ వున్నాను . కాని కుదరలేదు . ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు . ఆమెను ఎక్కడికైన తీసుకెళ్ళాలి అనుకున్నాను . ఈ రోజు సాయంకాలం వరంగల్ కు , ఓ పెళ్ళి కి వెళుతున్నాను . అందుకని నిన్ననే , వేరే ఎక్కడికో ఎందుకు ఆ గుడికే వెళితే బాగుంటుంది అనుకున్నాను . మా డ్రైవర్ ను ఆ గుడి గురించి అడుగుతే , ఆ గుడి కడుతుండగా చూసాను మేడం .ఒరిస్సా వాళ్ళు కట్టరట అన్నాడు . అవునూ మన లక్ష్మిగారు వుండగా ఇలా ఎక్కడా ఎక్కడా అని వెతుకులాట ఎందుకు అనుకొని లక్ష్మి గారి కి ఫోన్ చేసాను . అంతే వివరాలు తెలిసిపోయాయి !
జూబిలీ హిల్స్ లో , బసవతారక రామ కాన్సర్ హాస్పెటల్ దగ్గర , ఒరిస్సా వారు , పూరీజగ్నాదుని గుడి కట్టించారు . అసలు కట్టించింది ఎవరో తెలుసుకుందామనుకున్నాను కాని ఒరిస్సావాళ్ళు అన్నారు కాని ఎవరో చెప్పలేకపోయారు . కృష్ణ , సుభద్ర , బలరామ విగ్రహాలు అచ్చం పూరీ లో వున్నట్లుగానే స్తాపించారు . గుడి గోపురము , గుడి అంతా పూరిలో వున్నట్లుగానే కట్టారు. పూజారులు కూడా ఎక్కువగా అక్కడి వారే . గుడి ప్రాంగణం మధ్యలో జగన్నాధుడు , నాలుగువైపులలో ఓ పక్క , మా విమల , ఓ పక్క మహాలక్ష్మి . జగన్నాధ గుడి ద్వారము పక్క మారుతి , వెనుక చివర వినాయకుడు వున్నారు . వినాయకుని ముందు మూషికుడు కూడా వున్నాడు .
ఆలయము గోడల మీద భక్తుల చరిత్రలు చిత్రించారు . ఆలయము లోపల పైనంతా బాంగారు రంగులో చక్కటి చిత్రాలు వున్నాయి . ఎత్తైన గోపురము , ద్వజస్తంభము కనులకింపుగా ఠీవిగా వున్నాయి . చాలా ప్రశాంతముగా వున్నది . మేము 12 గంటల వరకూ వుంటుంది అనుకొని కొంచము ఆలశ్యం గా వెళ్ళాము . మేము వెళ్ళేసరికి పావుదక్కువ పదకొండు అయ్యింది . అందువలన ఎక్కువ సేపు దర్శనం చేసుకోలేక పోయాము . కాని ఆలయప్రాంగణం లో చాలాసేపే కూర్చున్నాము .
తప్పక చూడవలసిన దేవాలయము ఇది .
అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు .
Monday, November 29, 2010
ఔరంగాబాద్ - ఎల్లోరా
మావారు పని వుంది నేను రాలేను , నువ్వే వెళ్ళి చూసిరా అన్నారు . ముందు ఒక్క దాన్నే తెలియని ప్లేస్ లో వెళ్ళేందుకు సంశయించాను . కాని ధైర్యే సాహసే లక్ష్మీ అనుకొని డ్రైవర్ బంటి గైడెన్స్ లో ఔరంగాబాద్ చూసేందుకు బయిలుదేరాను . ఔరంగాబాద్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ . కట్టడాలు అవి ఎక్కువగా నవాబుల కల్చర్లోనే వున్నాయి . ఇక్కడ ముఖ్యం గా చూడవలసినవి , ' పంచక్కి ' , ' బీబీ - కా - మక్బారా ' , ' ఔరంగాబాద్ కేవ్స్ ' . ' పంచక్కి ' , ' ఔరంగాబాద్ గుహలు ' చూడలేకపోయాను .
1679 లో , ఔరంగజీబ్ తన భార్య ' రబియా - ఉద్ - దుర్రానీ ' జ్ఞాపకార్ధము కట్టించిన , ఆమె సమాధి . దీని ని తన తండ్రి షాజహాన్ , ఆగ్రా లో కట్టించిన ' తాజ్ మహల్ ' నమూనా లో కట్టించాడు . కాని అంత బాగా ఐతే లేదు :) తాజ్ మహల్ తో పోల్చకుండా చూస్తే బాగానే వుంటుంది . లోపల హాల్ లో రబియా ఉద్ దుర్రాని సమాధి వుంటుంది . నాలుగు పక్కలా పాలరాతి మీద చెక్కిన శిల్పాలు వున్నాయి . పైన డోం కూడా చక్కని నగిషీ పనితో వుంది . (' రాజుల సొమ్ము రాళ్ళపాలు ' అని నానుడి . ఈ మొగలు చక్రవర్తుల పుణ్యమా అని సమాధుల పాలు అయ్యాయి .)
అందులోనే ఓ పక్క గా హైదరాబాద్ నవాబు , ' నమాజ్ ' చేసుకునేందుకు ఒక పెద్ద హాల్ కట్టించాడు .
పైన ఫొటో లో వున్నటువంటి దర్వాజా లు ఔరంగాబాద్ లో ఏడువున్నాయట.
ఆ కమాన్ దాటి ముందుకు వెళ్ళగానే , పెద్ద మజీద్ వుంది . ఆ రోజు రంజాన్ మూలము గా అక్కడ చాలా రష్ గా వుండింది .
మరునాడు ఎల్లోరా చూద్దామని వెళ్ళాము . ఎల్లోరా కు వెళ్ళే దారి లోనే ' దౌలతాబాద్ కోట ' వస్తుంది . అది ఎక్కాలంటే నడిచి వెళ్ళాలసిందే ! అంత ఎత్తు ఎక్క లేక కింద నుంచే చూసి తృప్తి చెందాము :) అక్కడ అమ్ము తున్న జామకాయలు బహు పసందుగా వున్నాయి . వానలు వచ్చి నప్పుడు , అప్పుడప్పుడు ఆ చుట్టు పక్కల దొరుకుతాయని , కొన్ని నాణాలు చూపించారు . అవి అమ్ముతారట కూడా .
కొంచము ముందుకు వెళ్ళి , వూరి లోపలికి వెళుతే ఔరంగజీబు సమాధి వుంది . భార్య సమాధి ఎంత ఆడంబరము గా కట్టించాడో , ఆయన సమాధి , ఆయన జీవన విధానములా అంత నిరాడంబరము గా వుంది !
ఎల్లోరా గుహలు అనగానే , గుహల లోపలి కి వెళ్ళాలేమో నని ముందు భయపడ్డాను :) బంటి ని , పక్కవాళ్ళను అడిగి , గుహలు అంటే అంతర్ భాగం ఏమీ కాదని , చాలా వరకు ఓపెన్ ప్లేసే నని నిర్ధారించుకొని ముందడుగు వేసాను . ఐనా అక్కడి కివెళ్ళేవరకు , గుండెలు పీచు పీచు మంటూనే వున్నాయి . మరి అంత భయపడుతూ వెళ్ళటమెందుకయ్యా అంటే , ఇంత దూరం వచ్చి చూడకుండా వెళ్ళేందుకు మనసు ఒప్పదు . పైగా చూడకుండా వచ్చాను అంటే అందరూ నవ్వరూ ?
ఎల్లోరా గుహలు 500 - 700 ఏ .డి లలో నిర్మించినవి . మొత్తం 34 గుహలు వున్నాయి . అందులో 1 నుండి , 12 వరకు బౌద్ద మతమునకు , ఆ తరువాతి 16 హిందూ మతమునకు , 30 నుంచి 34 వరకు జైన మతమునకు సంబంధించినవి . అవి వారి వారి నమ్మకము ప్రకారము నిర్మించుకున్నారు . అన్ని గుహలూ ఒకే రోజు చూడాలంటే నాలాంటి ఓపికలేనివారికి కష్టమే ! కారు ఆగగానే ముందుగా 16 వ నంబర్ గుహ కనిపించింది . అది కైలాసము లా గా నిర్మించారు . హిందూ మతమునకు సంబంధించిన వాటిలో అన్నీ శివ పార్వతుల వే వున్నాయి . బుధ్ధుని ప్రతిమ వున్న గుహలో ఓ భౌద్ధ సన్యాసి ధ్యానము లో కనిపించాడు . అన్ని గుహలూ చూడలేము అంటే , అక్కడి గైడ్ , 5 , 10 , 15 , 16 , 21, 29 , 32 చూడమని సలహా ఇచ్చాడు . అంతవరకే చూడగలిగాము . కొండలను తొలిచి , అంత పెద్ద పెద్ద రాళ్ళను , అద్భుతమైన శిల్పాలుగా మలిచారు అంటే , చూసి తీరాల్సిందేకాని వర్ణింప నా తరమా ?
ఔరంగాబాద్ లో నాకు భోజనాని కి ఇబ్బంది కాలేదు . మేము వున్న ' లాడ్ లీ ' హోటల్ లో శాఖాహారము , అదీను వెల్లులిపాయ , మసాల లేకుండా శుభ్రము గా , రుచి గా వున్నది . అది నాకు చాలా విచిత్రము గా , సంతోషం గా అనిపించింది . హోటల్ రూం కూడా శుభ్రం గా వుంది . ధర కూడా ఎక్కువ లేదు . అందుకే వారము రోజులు హాయిగా వుండగలిగాను . వంట పని లేదు . చక్కగా బాలకనీ లో కూర్చొని నవల చదువుకుంటూ, ఆకలేసినప్పుడు బెల్ కొట్టి ఏదో వకటి తెప్పించుకొని తింటూ అహా ఏమి నా భాగ్యమూ అనుకుంటూ హాపిగా వారం గడిపేసాను . ఎంత హాపీ ఐనా ఇంటి కి తిరిగి రాక తప్పదుకదా :)
Thursday, November 25, 2010
కార్తీకమాసము లో హరిహరుల దర్శనం - నల్లగొండ , పానగల్లు , పిల్లలమర్రి
కార్తీక మాసం లో శివుని దర్శించుకొని , గుడి ప్రాంగణము లో దీపాలు వెలిగిస్తే చాలా పుణ్యం అంటారు . ఆ పుణ్యమేదో కాస్త సంపాదించుకుందామనుకొని , psm .లక్ష్మి గారు , మా అమ్మ , నేను , నల్లగొండ జిల్లా లోని కొన్ని పురాతనమైన శివాలయాలు దర్శించుకుందామని ఓ శుభోదయాన బయిలు దేరాము . psm.లక్ష్మి గారు , వాటిని ఇంతకు ముందు చూసి వుండటము వలన మాకు వాటి ప్రాశస్త్యము గురించి వివరము గా చెప్పారు .
ముందుగా , నల్లగొండ లోని , రామగిరి రామాలయాని కి వెళ్ళాము . అక్కడ శ్రీరామచంద్రుడు , సీతాదేవి , లక్ష్మణ , భరత , శతృగ్నలు , ఆంజనేయ స్వామి సహితము గా పట్టాబిషక్తుడైన పట్టాభిరాముని గా వెలిసాడు . హైదరాబాద్ నవాబు గారి భార్యకు నయము కాని జబ్బు రాగా , నల్లగొండ లో నున్న వక ఆయుర్వేదవైద్యుడు , ఆవిడ ముంజేతి కి పురికొస కట్టించి , ఆ పురికొస రెండో చివర సహాయముతో , బేగం గారి నాడి పరీక్షించి మందు ఇచ్చి , ఆ జబ్బును నయం చేసారట. అప్పుడు నవాబు గారు సంతసించి , ఆ వైద్యుని ఏమి కావాలో కోరుకోమంటే , తనకు స్వప్న ములో కనిపించిన , పట్టాభిరాముని ఆలయ నిర్మాణము కొరకు భూమి అడిగాడట . నవాబు ఇచ్చిన స్తలము లో ,ఆలయమును నిర్మించి , కాపరాల గుట్ట కింద భూస్తాపితం ఐన విగ్రహాలను వెలికితీసి ఈ ఆలయము లో ప్రతిష్టించారట . ఇది 400 సంవత్సరాల పురాతనమైన ఆలయము అని అక్కడి పూజారులు చెప్పారు . శ్రీరామచంద్రుని దర్శించుకున్న తరువాత , గుడి వెనకవైపు వున్న ఉసిరిక చెట్టు కింద దీపాలను వెలిగించుకొన్నాము .
పచ్చలసోమేశ్వరుడు -పానగల్లు
నల్లగొండ కుదగ్గర లోనే వున్న , పానగల్లు లో పచ్చలసోమేశ్వరలయాము ను , కాకతీయ రాజులకు సామంతులైన కందూరు చోళ రాజులు క్రీ. శ. 11 - 12 శతాబ్దం లో నిర్మించారు . ఈ దేవాలయము కింద ఇంకోక శివాలయము వుందని , దానికి బంగారు తలుపులు వున్నాయని , కాని కాలక్రమములో భూమిలోపలికి వుండిపోయిందని , అక్కడి పూజారిణి చెప్పింది . శివుని ఎడమ వైపున రాజరాజేశ్వరీ దేవి , ఎదురుగా నందీసుడు , నందీసుని కి ఎదురుగా వినాయకుడు కొలువై వున్నారు . శివును ఎదురుగా దీపాలను వెలిగించాము . పూజారిణి వాటిని లింగము ఎదురుగా వుంచింది .
పక్కనే వున్న రాజరాజేశ్వరీ దేవి కి పసుపుకుంకుమ సమర్పించాము . అమ్మవారు పవళించివున్న శివుని మీద హాయిగా కూర్చొని వున్నారు . ఇలా ఏ దేవాలయము లోనూ చూడలేదు .
వినాయకుని దగ్గర కూడా దీపాలు వెలిగించుకున్నాము .
మండపము లోని నంది , స్తంబాలు చక్కని శిల్పకళ తో వున్నాయి . ఆలయము బయట కూడా విరగగొట్టి పడవేసిన శిల్పాలు చాలా వున్నాయి . వాటిని చూస్తుంటే ఎంత బాధ కలిగిందో చెప్పలేను .
చాయాసోమేశ్వరుడు
పచ్చలసోమేశ్వరుని దగ్గర నుండి , అక్కడికి దగ్గరలోనే పొలాలలో కొలువైన చాయాసోమేశ్వరుని దర్షించుకోవటానికి వెళ్ళాము . అక్కడ , శివలింగము వెనుక వైపు ఓ స్తంబము లా నీడ వుంటుంది . ఆ నీడ ఎక్కడినుంచి వస్తోందో ఇంతవరకు , ఎవరూ కనిపెట్టలేక పోయారట ! ఆ నీడ వుండటము వలననే చాయాసోమేశ్వరుడు అని పేరు వచ్చిందట . ఆ నీడ కెమేరాకు కూడా చిక్కలేదు !
మా నాన్నగారు , నల్లగొండ లోనే చదువుకున్నారు . నాగార్జునసాగర్ కెనాల్ లో పని చేసేటప్పుడు , దాని తో పాటే నల్లగొండ వరకూ వచ్చారు . ఆ సమయములో మా అమ్మ , నాన్నగారు , చాయాసోమేశుని చాలాసారులు దర్శించుకున్నారట . మా అమ్మ ఆ సంగతులన్నీ తలుచుకుంది .
చాయాసోశ్వర దేవాలయము లోని నీడ గురించి న సమాచారము ఇక్కడ వుంది . ఈ లింక్ ఇచ్చిన ఆవకాయ గారు థాంక్స్ అండి .
ఆ ఈశుని పూజించుకున్న తరువాత , అక్కడే కూర్చొని , మేము తెచ్చుకున్న పులిహోర , పెరుగన్నం తిన్నాము :)
ఉదయసముద్రము
పానగల్లుకు ఉత్తరాన , ఉదయ చోడుడు ప్రజల అవసరార్ధం 11 వ శతాబ్ధం లో చెరువును తవ్వించాదు . అది ఈ రోజు కూ ప్రజల అవసరాలను తీరుస్తూనే వుంది . కాసేపు ఆ చెరువు గట్టున , ఆ చెరువు అందాన్ని ఆస్వాదిస్తూ తిరిగాము .
పిల్లలమర్రి
నల్లగొండ నుండి హైద్రాబాద్ కు వచ్చే దారి లో , సూర్యాపేట కు దగ్గర లో వుంది , పిల్లలమర్రి . మేన్ రోడ్ నుండి పక్కకు వెళ్ళాలి . ఆ తిరిగే ముందు , మేన్ రోడ్ లో నున్న ధాభా లో వేడి వేడి అలూ బజ్జీలు , చిక్కని కాఫీ ఇప్పించారు లక్ష్మి గారు .
పిల్లలమర్రి లో నామేశ్వరాలయం , ముక్తేశ్వరాలయం , ఎరకేశ్వరాలయం అని మూడు శివాలయాలు , చెన్నకేశవస్వామి దేవాలయము వున్నాయి . ముందుగా వూరి మొదట్లో వున్న నామేశ్వరాలయము నకు వెళ్ళాము . సాయంకాలము ఆరు కూడా కాకుండానే పూజారి గుడి తలుపులు మూసివేసి వెళ్ళిపోయాడు . అక్కడే వున్న పిల్లలు వెళ్ళి ఆయనను పిలుచుకొని వచ్చారు ! శీతాకాలపు పొద్దు . త్వరగా చీకటి పడిపోయింది . గుడి లో సరైన దీపాలు కూడా లేవు . ఆలయమును కాకతీయ రాజులు నిర్మించారు అని మటుకే చెప్పగలిగారు పూజారి ! మండపము లోని స్తంబాలు అద్భుతమైన శిల్పకళ తో వున్నాయి . ప్రతి స్తంబమూ , మీటితే , సప్తరాగాలను పలికిస్తోంది . స్తంబాలను ఒక్కొక్క చోట కొట్టి చూపించాడు పూజారి , అదీనూ లక్ష్మి గారు అడుగుతే ! స్తంబాల మీద శిల్పాలు ఎంత నాజూకుగా వున్నాయంటే , వాటిలో నుంచి సన్నటి దారము దూర్చవచ్చు. అదీ లక్ష్మి గారు అడుగుతే చూపించారు !
చెన్నకేశవస్వామి దేవాలయము మూసివేసారు . లో చాలా చీకటి గా వుండింది . ముక్తేశ్వరాలయము లో దీపాలు సరిగ్గా లేవు . చాలా చీకటి గా వుండినది . స్వామి ని దర్శించుకొని వచ్చేసాము . ఎరకేశ్వరాలయము లో ఆ మాత్రము కూడా దీపాలు లేక పోవటము వలన చూడలేక పోయాము .పక్కగా బ్రహ్మ , సరస్వతి ల విగ్రహాలు వున్నాయట . కాని చీకటి మూలము గా చూడలేక పోయాము .
కవి పిల్లలమర్రి చినవీరభద్రుడు ఈ వూరి వాడే నా అన్నదానికి ఎవరూ సమాధానము చెప్పలేకపోయారు . చిన్న వూరు . వచ్చేవారు లేరు . ఇక శ్రద్ధ ఎవరికి వుంటుంది ? లక్ష్మి గారు , ఇదివరకు చూసి వున్నందువలన మమ్మలిని తీసుకెళ్ళ గలిగారు . ఆవిడ చెప్పేవరకూ అక్కడ సప్తరాగాలు పలికించే స్తంబాలు వున్నాయని నాకు తెలీదు . ఇప్పటి వరకూ ఒక హంపీ లోనే వున్నాయనుకున్నాను , ఇలా చిన్న చిన్న వూళ్ళ లో మనకు తెలియని అద్భుతాలు ఇంకెన్ని వున్నాయో కదా అనుకున్నాను .
మేము మా కార్ లోనే , పొద్దున 6 గంటలకు బయిలుదేరాము . లంచ్ , స్నాక్స్ , కాఫీ పాక్ చేసుకొని వెళ్ళాము . అన్నీ తిరిగి చూసుకొని వచ్చేసరికి , రాత్రి 11 అయ్యింది . మాకు ఆ రోజు పొద్దున సిటీ ఔట్ స్కర్ట్స్ లో ట్రాఫిక్ మూలంగా ఆలశ్యం అయ్యింది . అందుకే తిరిగి రావటాని కి ఆలశ్యం అయ్యింది .
నల్లగొండ రామాలయము ఉదయము 11 గంటలకే మూసేస్తారు . ఇక్కడ పూజారి వుంటాడు . మనకు కావలసిన పూజ చేయించుకోవచ్చు . అందువల్ల ఆ సమయానికల్లా అక్కడి కి చేరుకునేటట్లు ప్లాన్ చేసుకుంటే చాలు . చాయాసోమేశ్వరాలయము లో పూజారి వుండడు , తలుపులు వుండవు .పూజరి పొద్దున్నే వచ్చి వెళ్ళిపోతాడట. ఇక్కడ మనమే పూజ చేసుకోవచ్చు . పచ్చలసొమేశుని దగ్గర గుడి మూసినా , కట కటా లలో నుండి చూడవచ్చు . ఇహ పిల్లలమర్రి కే కొంచం పొద్దు వుండగా వెళితే మంచిది . అక్కడ ఈశ్వరాలయము లో స్తంబాలను పరిశీలనగా చూడవచ్చు .
. లక్ష్మి గారు , కార్తీకమాసము లో ఇంత మంచి శివాలయాలను చూపించినందుకు మీకు చాలా ధన్యవాదాలండి .
Friday, September 17, 2010
శివయ్య సన్నిధి లో మా వినాయకచవితి
శివ శివ మూర్తివి గణనాథా
నువు శివుని కొమరుడవు గణనాథా
ఈ మద్య హైదరాబాద్ లో కాలనీ లలో పెట్టిన వినాయకుని దగ్గర మనము పూజ చేసుకునేందుకు , పూజారిని, పూజ చేసుకొనే వీలు కల్పిస్తున్నారు . అలా ఔరంగాబాద్ లో ఏమైనా వీలుందా అని మావారు వెతికారు . కాని లేదట. సరే అనుకొని , ఔరంగాబాద్ కు 30 మైళ్ళ దూరము లో నున్న , ఎల్లోరా వద్ద , వేరూళ్ గ్రామం దగ్గర , శివాలయ్ అనే తీర్థ స్తానం లో ఘృష్ణేశ్వరుని దివ్య జ్యోతిర్లింగం వుంది . అక్కడకు వెళుదామనుకొని , వినాయకచవితి రోజు ఉదయమే 6.30 కు కార్ లో బయలు దేరి వెళ్ళాము .ఎల్లోరా దగ్గరకు వెళ్ళగానే అక్కడే మేన్ రోడ్ మీద " గరికపాటి రెస్టారెంట్ " తెలుగు వారిచే నడపబడుతున్నది కనిపించింది . అక్కడ ఆగి , ఘృష్ణేశ్వర స్వామి దగ్గర , సరిగ్గా పూజ చేయించేవారు , సరైన పూజారి వున్నారా అంటే సింగ్డే అని , ఒక పూజారి వున్నాడని , ఆయన శ్రద్దగా చేయిస్తాడని చెప్పారు . గుడి దగ్గర ఆయనను సంప్రదించాము . ' పూర్ణరుద్రాభిషేకం ' చేయిస్తాన్నారు . మావారికి కావలసింది అదే . 2001 రూపాయల తో అభిషేకం టికెట్ కొనుక్కొని , గుడి లోకి వెళ్ళాము . ఆ రోజు , శ్రావణమాసమంతా ధీక్ష చేసినవారు ఉద్యాపన చేసుకుంటున్నారు . అక్కడ ఉద్యాపనగా శివుడికి అభిషేకం చేయుంచుకున్నాక , ఇంట్లో వినాయకుని స్థాపిస్తారట. అందువలన గుడిలో రెష్ గా నేవుంది . మేము వేట్ చేస్తున్న సమయములో సింగ్డే , అక్కడి స్థల మహిమ ఇలా చెప్పారు
కైలాసం లో శివ పార్వతులు చదరంగం ఆడుతున్నారు . ఆటలో పార్వతి గెలిచింది . దాని తో శంకరునికి కోపం వచ్చి, ధక్షణానికి వెళ్ళి సహ్యాద్రి పర్వతాల మీద నివసించసాగాడు . శంకరుని వెతుకుతూ , పార్వతి కూడా అక్కడికి భిల్లురూపం లో వచ్చి శంకరుని మనసు దోచుకుంది . ఇద్దరూ ఆ ప్రదేశము లో వున్నారు . ఒకసారి పార్వతికి దాహం వేసిందిఅప్పుడు శంకరుడు భూమి లోకి త్రిశూలం గుచ్చి , పాతాళం నుండి భోగావతి నీటిని పైకి తప్పించాడు . దానికి శివ తీర్థంఅని , ఆ వనాన్ని కామ్యకవనం అని పరు వచ్చింది . ఒక రోజు పార్వతి , పాపిట లో అలంకరించుకునేందుకు , ఎడమచేతిలో కుంకుమ ,కేసరి లో శివాలయం నీరు కలిపింది . కలుపుతుండగా చేతిలో కుంకుమ తో శివలింగం తయారైంది . ఆలింగము నుండి దివ్య జ్యోతి ఉద్భవించింది . అప్పుడు , ఆశ్చర్యముతో చూస్తున్న పార్వతి తో శివుడు ఇలా అన్నాడు ,
" ఈ లింగం పాతాళపు అడుగున వుండేది . ఇది త్రిశూలం నుంచి వచ్చింది . అప్పుడు భూతలం ఒకసారి ఎగిసిపడింది , నీటి ఉడుకులాగా " ( కాశీ ఖండం )
పార్వతి ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని , ఒక రాతి లింగము లో వుంచి , విశ్వ కళ్యాణార్ధం లింగ మూర్తిని ఇక్కడ ప్రతిష్టించింది .
ఈ జ్యోతిర్లింగము ను కుంకుమేశ్వరుడు అని , ఘృష్ణేశ్వరుడు అని నామములతో పిలుస్తారు .
పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది చివరిది .
గుడి లోపలికి వెళ్ళగానే నాకు చాలా ఉక్కిరిబిక్కిరి గా అనిపించింది . అందులోనూ చాలా మంది వున్నారు . గుడిద్వారము కూడా చిన్నగా వుంది . నేను చూసినంతవరకు , శివాలయాల లో గర్భ గుడి లోని లింగానికే సొంతముగాఅభిషేకము చేయనిస్తారు . కాకపోతే ఇక్కడ దంపతుల తో చేయిస్తున్నారు . సంకల్పము కాగానే , నేను బయటకు వెళ్ళికూర్చుంటాను అని మావారి తో అన్నాను . నీ ఇష్టం , కావాలంటే ఇప్పుడైనా వెళ్ళిపో అన్నారు కాని , అందరూదంపతులు చేస్తుంటే , ఆయనను ఒక్కరిని వదిలి వెళ్ళాలనిపించలేదు . అలాగే మ వంతు వచ్చేవరకు నిలుచున్నాను . మేము పూజ మొదలు పెట్టాక బయటకు వెళ్దామనుకున్నది మర్చి పోయి పూజలో మునిగి పోయాను . విచిత్రముగా మా పూజ మొదలయ్యే సరికి దాదాపు అందరూ అభిషేకాలు ముగించుకొని వెళ్ళి పోయారు మహారుద్రాభిషేకము గంటపైనే పట్టింది . తరువాత , జ్యోతిర్లింగానికి ఎదురుగా వున్న పార్వతీ అమ్మవారి కి కుంకుమ పూజ చేసాము . అలా వినాయకచవితి రోజున , విఘ్నేషుని అమ్మా నాన్నలను పూజించాము . చాలా గొప్పగా ఐంది కదూ . చూశావా నిన్ను ఆయన బయటకువెళ్ళనీయలేదు అన్నారు మావారు . మరే ఆయన తన డైమండ్ నెక్లెస్ ను పంపి మరీ పిలిపించుకున్నాడు కదా అన్నానునేను .
ఆ తరువాత దగ్గర లోనే వున్న అష్టవినాయకుని గుడి కి వెళ్ళాము . ఆ గుడి విశేషము ;
" మొదట ఇక్కడ నాగజాతి ఆదివాసులుండేవారు . నాగుల స్థానం ' బాంబీ ' అంటే పాముల పుట్టలు . వీటిని ' వారుళ్ ' అంటారు . అదే కాలక్రమేనా ' వేరుళ్ ' గా మారింది . అది ' యేరుళ్ ' గ్రామం గా పేరు పొందింది . దీనిని ' యెల ' అనే రాజుపాలిస్తూ వుండేవాడు . ఒకసారి యెల రాజు వేటకు వెళ్ళి , వేటలో మునులుండే ఆశ్రమాలకు చెందిన జంతువులనుకూడా చంపివేసాడు . అది చూసి మునులు , రాజును సర్వాంగాలు పురుగులు పట్టాలని శపించారు .
ఈ విధం గా రాజు అడవుల వెంట తిరగ సాగాడు . దాహం తో గొంతు ఎండి పోసాగింది . ఎక్కడా నీరే లభించలేదు . చివరకు ఒక చోట ఆవు డెక్కల తో చేయ బడిన గుంట లలో కొద్దిగా నీరు కనిపించింది . ఆ నీరు రాజు నోట పోసుకోగానే , ఒక అద్భుతం జరిగింది . రాజు శరీరానికి పట్టిన పురుగులన్నీ మటు మాయం అయ్యాయి . అప్పుడు రాజు ఆ ప్రదేశం లోతపస్సు చేసాడు . బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు . అక్కడ అష్ట తీర్థాలను ప్రతిష్టాపించాడు . దగ్గర లోనే ఒక సువిశాలమూ , పవిత్రమూ అయిన సరోవరాన్ని నెలకొల్పాడు . ఇక్కడే అష్ట వినాయకులు వున్నారు .
అటు నుంచి , గరికపాటివారి హోటల్ లో భోజనము చేసి , ఎల్లోరా గుహలను చూసి ( ఎల్లోరా విశేషాలు ఇంకో పోస్ట్ లో ) , తిరుగు ప్రయాణము లో ఖుల్దాబాద్ దగ్గర ' బద్ర మారుతి ' ని దర్షించుకున్నాము . ఈ ఆలయము చాలా పురాతనమైనదికాకపోతే ఈ మద్యనే అందరి కీ ఎక్కువగా దీని గురించి తెలిసింది . ఇక్కడ హనుమంతుడు శయనించి వుంటాడు .
ఔరంగాబాద్ వచ్చేసరికి , సాయంకాలమైంది . మాకు ఊరి మొదట్లోనే వినాయకుడు రకరకాల రూపాలతో , కొలువైయేందుకు వెళుతూ దర్షనమిచ్చాడు .
13 వ తారీకున మావారి పుట్టిన రోజు . ఆ రోజు ఆయన పని నుండి వచ్చాక , ఒక ఆటో మాట్లాడుకొని , మీ వూరి లో ఏమిచూపిస్తావో చూపించు అన్నాము . అతను వినాయకులను చూపిస్తాను అని , చిన్న చిన్న సందుల లోకి తీసుకెళ్ళి మరీచూపించాడు . చాలా మటుకు పెద్ద పెద్ద విగ్రహాలే . అవన్ని ఎప్పటికీ అలాగే వుంటాయట . పక్కన చిన్న విగ్రహం వుందిదానిని నిమజ్జనము చేస్తారట. ఒక చోట , మేము హైద్రాబాద్ నుండి వచ్చామని తెలుసుకొని , అక్కడి నిర్వాహకులు ,ఆరోజు లోకల్ న్యూస్ లో ఖైరతాబాద్ వినాయకుని చూపించారని చెప్పారు . ఇంకో చోట రావి చెట్టు చుట్టూ హిమాలయాలలాగా ఏర్పరిచి , దాని మీద పన్నెండు జ్యోత్ర్లింగాలను పెడుతున్నామని చెప్పి మావారి దగ్గర చందా వసూలు చేసారు . చీకటిలో కనిపిస్తున్నాడే పాలరాతి వినాయకుడు , ఆయన ' వరద వినాయకుడు ' అట. వి . ఐ . పి వినాయకుడుట . పెద్దపెద్ద వాళ్ళు దర్షించుకుంటారుట . మేమెళ్ళేసరికి తలుపులు వేసేసారు . బయట నుండే దండం పెట్టు కొని వచ్చేసాము . ఇలా ఊళ్ళోని ముఖ్యమైన వినాయకులను చూపించి , ఊరి చివర హోటల్ లో భోజనము పెట్టించి , మా హోటల్ దగ్గరదింపి 450 రూపాయలు వసూలుచేసాడు ఆటో డ్రైవర్ గారు ! ఏ 100రూపాయలో అవుతుంది , పైనుంచి ఇంకో వంద భక్షీష్ఇద్దామనుకున్నారు మావారు పాపం . అక్కడికీ ఆటో డ్రైవర్ గారు మీటర్ ప్రకారమే చార్జ్ చేసారట. కాకపోతే అక్కడ , మీటర్ లో ఒక రూపాయైతే , పది రూపాయలట. పది రూపాయలైతే వందరూపాయలట . అదేమి లెక్కో నాకైతే అర్ధం కాలేదు . 45 రూపాయలు మీటరులో వుంటే 450 తీసుకున్నాడు !!!
ఈ సారి వెరైటీగా వినాయకునికి మహరాష్ట్ర ప్రసాదము ' మోదక్ ' చేద్దామనుకున్నాను . కాని మహరాష్ట్ర ప్రసాదమైతేచేయలేదు కాని , మహారాష్ట్రా లో ఇలా వినాయకచవితి చేసుకున్నాము .
చివర ఫొటో లో వున్న వినాయకుడు , మా మనవరాలు మేఘ చేసిన , మా ఇంటి వినాయకుడు .
Subscribe to:
Posts (Atom)